మెయిన్ ఫీచర్

ప్రయత్నాలే విజయానికి మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యం, పట్టుదల, దీక్ష లేకపోవడంవల్ల చాలామంది పూర్తిగా అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. కొంతకాలంపాటు అర్ధమనసుతో, ఈసురోమంటూ ప్రయత్నాలు చేసిన తర్వాత నిరాశకు లోనవుతున్నారు.
కొండ శిఖరాన్ని చేరలేక అనేకసార్లు విఫలమైన తర్వాత టెన్సింగ్ నార్వే ప్రపంచంలో మిక్కిలి ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. చివరికి విజయం లభించింది. దీనికి శారీరక, మానసిక క్రమశిక్షణ, లక్ష్యాన్ని విడవకుండా ఉండటం, దీక్ష, ఆత్మత్యాగం, క్రమబద్ధత వుండాలి.
మనసున్నచోట మార్గం ఉంటుంది. ఇదొక సామాన్య సూక్తి మాత్రమే కాదు, నిత్య జీవితంలో విజయానికి ఆచరణయోగ్యమైన కిటుకు. మనం చేపట్టే ప్రతి పని కూడా శ్రమకు ఓర్చి ఉద్యమించవలసిందే. మాటలతో సరిపెట్టక, అత్యధికంగా శక్తి సామర్థ్యాల్ని వినియోగించి పని ముగించాలి. ప్రతిరోజూ ఎంతో కొంత పనిచేస్తుంటే బాధపడకుండా, నీ పని నీవు చేయడానికి, అభ్యాసపడటానికి వీలవుతుంది. ఎన్ని కష్టాలనైనా,, ఎంత దారిద్య్రంలోనైనా, ఎంత దురదృష్టంలోనైనా ధైర్యోత్సాహాలతో ముందుకు ఉద్యమించడానికి సంసిద్ధుడై ఉండాలి.
ఒక వ్యక్తికి అసాధారణమైన స్వాభావిక ప్రతిభ వుంటే అది దీక్ష, పట్టుదల, ఓర్పువల్ల అభివృద్ధి పొందుతుంది. ఆత్మవిశ్వాసంవల్లే జీవితం అభిలషణీయంగా జీవించగలుగుతాము. జీవితంలో ప్రతిరోజూ, ప్రతి ఘడియా శుభశకునంగా భావిద్దాం. ప్రతిదినం మనం చేసే ఏ చిన్న పనినైనా తృప్తికరంగా, అభినివేశంతో మనసారా పూర్తిచేద్దాం. చేయవలసినదానిని సక్రమంగా కొనసాగించాలి.
ప్రతిరోజూ పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు, జయాపజయాలు ఒకదాని తరువాత మరొకటి వస్తుంటాయి. మన జీవిత లక్ష్యం సాధించడంలో విజయం అనేదానికి సంతృప్తి ఎలా ఏర్పడుందో, అలాగే అపజయాలు ఏర్పడినపుడు అధైర్యంతో నిరాశపడిపోకూడదు. సానబెట్టని వజ్రం మెరవదు. కష్టాలు అనుభవించకుండా మానవుడు జీవితంలో పరిపూర్ణతను పొందలేడు. పెద్దల జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. వారి ఆశాభంగాలే వారి ఉన్నతికి సాధనాలు.
విజయం, అపజయం అనేవి రెండు సాపేక్ష భావాలు. కాబట్టి జయాపజయాల ఫలితం మనం అంగీకరించే విధానాన్ని బట్టి వుంటుంది. జయం పొందినపుడు సంతోషంతో ఉబ్బిపోవడం, అపజయం కలిగినపుడు విచారంతో కృంగిపోవడమనేది మన మానసిక అసమర్థత. వివేకంతో మనసు స్థిమితం కలిగించుకుంటే జీవితంలో ఒడిదుడుకులను తట్టుకోగలుగుతాం.
పరాజయం విజయానికి మెట్టు అనేది ఉదాసీనతవల్ల కలిగిన నిరుత్సాహం లేక నిరాశ అనుకోకూడదు. సోమరితనంవల్ల విజయం లభించదు. నీవు ఉపక్రమించి ఉద్యమించాలి. నీలో నీవు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. నేను గెలుస్తాను.. నేను విజయం పొందుతాను అని అనుకోవాలి. అననుకూల పరిస్థితుల్లో చిక్కుకున్నపుడు నిరాశ చెందకూడదు. అదే క్షణంలో జీవితంలో అమోఘమైన మార్పు వస్తుంది. చీకట్లో వెలుగు కనిపిస్తుంది. అపజయమనేది తుది ఫలితం కాదు. విజయమనేది తథ్యం కాదు కాబట్టి ప్రయత్నమే ముఖ్యం. ప్రయత్నంతోనే విజయం సాధ్యమవుతుంది.
ప్రపంచంలో చాలాకొద్దిమందికి మాత్రమే ప్రస్తుతానికి తగినట్లుగా జీవించడం తెలుసు. చాలామంది గంటకి 59 నిమిషాలు గతంలో జీవిస్తారు. జారవిడుచుకున్న అవకాశాలకు దుఃఖిస్తారు. పొందిన అపజయాలకు తలలు వంచుకుంటారు. లేకపోతే ముందు జరగబోయే అపజయాన్ని తలచుకుని తికమకలు పడుతుంటారు. ఎక్కువమంది గతంలో చిక్కుకుపోయి, భయంకరమైన భవిష్యత్తుకై యోచిస్తూ నిరాశతో నిర్వీర్యులైపోతుంటారు.
ఈ సమస్యను అధిగమించడానికి మార్గం ఉంది. గతాన్ని సమీక్షించుకుంటూ, భవిష్యత్తుకి పథకాలు వేసుకుంటూ ప్రస్తుతం జీవించడమే మంచి మార్గం. జరిగినదాన్ని గురించి దిగులు చెందకుండా వాస్తవాలతో ముందడుగు వేసుకుంటూ ప్రగతిపథంలో నడుస్తుండాలి. రోజూ సక్రమంగా జీవించడమే సన్మార్గ జీవితం. మిగిలిన మన జీవితానికి ఈరోజే ప్రారంభం! అనే సూత్రాన్ని మరచిపోవద్దు.

- పి.ఎం. సుందరరావు 94906 57416