మెయన్ ఫీచర్

కాలం చెల్లిన ఫిరాయంపుల చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్‌లో తిరుగులేని ఆధిక్యత ఉన్నంత మాత్రాన రాజకీయ సుస్థిరత ఆశింపలేమని, ప్రభుత్వం అభద్రతకు గురికాకుండా అడ్డుకో లేమని గతంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం వెల్లడి చేస్తోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో 400కు పైగా సీట్లు గెలుపొందినా అభద్రతకు గురికావడంతో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకు వచ్చారు. ఈ చట్టం తీసుకు వచ్చిన 34 ఏళ్లకు- తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది సభ్యులు అధికార పక్షంలో శాసనసభా పక్షాన్ని విలీనం చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తే, ఫిరాయింపుల చట్టాన్ని తీసుకు వచ్చిన పార్టీకి చెందిన నేతలు గగ్గోలు పెట్టారు.
ఇటీవల రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులలో నలుగురు సభ్యులు కలసి తాము చీలిక బృందం అని, భాజపాలో చేరుతున్నామని చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ అందిస్తే ఆయన క్షణాలమీద వారిని అధికార పక్షంలో విలీనం చేశారు. ఇవి కేవలం తాజా ఉదాహరణలు మాత్రమే. ఫిరాయంపుల నిరోధక చట్టం రాజకీయ నాయ కులకు అడ్డుకట్ట వేస్తుందని అనుకొంటే విచ్చలవిడిగా ప్రోత్సహించడం కోసం, మూకుమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చేయడం కోసం ఏ విధంగా ఉపయోగ పడుతుందో వెల్లడి అవుతోంది.
గత ఏడాది జేడీయూకు చెందిన సభ్యుడు శరద్ యా దవ్ పార్టీ విధానాలతో విభేదించి, పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తూ మరో రాజకీయ సభలో పాల్గొన్నారనే ఆరోప ణపై రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు ఆయన సభ్యత్వాన్ని ఏకంగా రద్దు చేశారు. ఈ విధంగా సభాపతులు అధికార పార్టీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగం, చట్టం స్ఫూర్తికి భిన్నంగా తమకు ఆ పద వులు కట్టబెట్టిన పార్టీల ఆదేశాలను అమలు పరుస్తూ ఈ చట్టాన్ని నిర్వీర్యం కావిస్తున్నారు.
రాజకీయాలలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఆయారాం, గయారాంల సంస్కృతిని అడ్డుకట్ట వేయడం కోసం రాజీవ్‌గాంధీ పార్టీ ఫిరాయిపుల చట్టంను తీసుకు వస్తే, ఇప్పుడు అటువంటి సంస్కృతిని మరింతగా బరితెగించి వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. 1995లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుపై చంద్ర బాబు నాయుడు తిరుగుబాటు చేసిన సందర్భంగా ఒక పార్టీ నుండి మరో పార్టీకి శాసనసభ్యులు యథేచ్ఛగా మారుతూ వచ్చారు. ఈ విషయమై నోటీసు ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి సహితం ఆ తర్వాత పార్టీ మారారు. ఇటువంటి అనైతిక చర్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నాటి స్పీకర్ యనమల రామ కృష్ణుడును అడిగితే ఆ విధంగా చర్య తీసుకొంటే వంద మందికి పైగా సభ్యుల సభ్యత్వాలను రద్దు చేయవలసి వస్తుందని, అందుకే చర్య తీసుకోవడం లేదన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిఆర్‌ఎస్‌కు చెందిన సభ్యులు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తే, వారి సభ్యత్వకాలం పూర్తయ్యే దాకా చర్య తీసుకోకుండా కాలయాపన చేశారు. చివరకు ఎన్నికల ముందు వారిలో కొందరు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయగా, కొందరి సభ్యత్వాలను రద్దు చేశారు. పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోమని కోరినప్పుడు వాటిపై ఎప్పటి లోగా చర్య తీసుకోవాలనే విషయమై చట్టంలో గడువంటూ లేదు. ఒకటి రెండు సందర్భాలలో హైకోర్ట్‌లు మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోమని స్పీకర్‌లను ఆదేశించిన సందర్భాలు ఉత్తరాదిన ఉన్నాయి. కానీ మిగిలిన హై కోర్ట్‌లు ఆ విధమైన ఆదేశాలు ఎక్కడా ఇవ్వలేదు.
తిరుగులేని ఆధిక్యత ఉన్న రాజకీయ పక్షాలు- ప్ర స్తుతం కేంద్రంలో భాజపా, తెలంగాణాలో తెరాస వంటివి ఈ విధమైన రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉంటే, సభాపతులు ఆయా పక్షాలు చెప్పిన్నట్లు వ్యవ హరిస్తూ ఉంటే - ఇక రాజ్యాంగ స్ఫూర్తి కాపాడే అవకాశం లేదు. 2014 ఎన్నికలలో నంద్యాల నుండి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన వైసిపి రెడ్డి పా ర్లమెంట్‌లో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తెలుగు దేశంలోకి ఫిరాయించారు. ఆయన పదవీకాలం ముగిసేవరకు లోక్‌సభ స్పీకర్ ఎటువంటి చర్య తీసుకోలేదు. 2014లో తెలుగు దేశం సభ్యునిగా గెలుపొందిన తలసాని శ్రీనివాస యాదవ్‌ను కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురిని చంద్రబాబు తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ విధంగా నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తుంటే గవ ర్నర్ ప్రేక్షక పాత్ర వహిం చారు. హెకోర్ట్‌కు వెళ్లి నా ఎటువంటి పరిష్కారం లభించనే లేదు. హడా వుడిగా తెలుగు దేశం సభ్యు లను రాజ్యసభలో భాజపా సభ్యులుగా వెబ్ సైట్‌లో చూపించిన వెంకయ్య నాయుడు ఈ ఫిరాయిం పుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు దేశం సభ్యులు ఇచ్చిన లేఖకు మాత్రం స్పందించక పోవడం గమనార్హం.
గతంలో ఎవరికి వారుగా పార్టీలు మారుతూ ఉండేవారు. ఫిరాయింపుల చట్టం అమలులోకి వచ్చిన తర్వాత గుంపుగా మారుతున్నారు. తమ ఫిరాయింపులకు పార్టీలో చీలికగా అందమైన పేరు పెట్టుకొంటున్నారు. వీరెవరూ విధానాలు, రాజకీయ అంశాలపై తమ పార్టీలతో విభేదించి అధికార పక్షంలో చేరుతున్నారంటే అదేమీ లేదు. కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం, తమపై ఉన్న అక్రమాలకు సంబంధించిన లేదా ఇతర నేరాలకు సంబంధించిన కేసులు పురోగతి సాధించకుండా కట్టడి చేసుకోవడం మాత్రమే పార్టీలు మారుతున్నారు. ఇటువంటి అనైతిక పార్టీ ఫిరాయింపులకు ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు వంత పడుతున్నాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉననప్పుడు మరో విధంగా స్పందిస్తూ ఉంటున్నాయి.
దేశం మొత్తం మీద పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన వైఖరి తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే కావడం గమనార్హం. ఇతర పార్టీలకు చెందిన ఎన్నికైన సభ్యులు ఎవ్వరైనా తమ పార్టీలో చేరాలంటే వారు ముందుగా- పదవులకు రాజీనామా చేసి రావాలని స్ఫష్టం చేస్తున్నారు. పార్టీ ప్రారంభించినప్పటి నుండి అటువంటి వైఖరినే జగన్ అవలంబిస్తున్నారు. గతంలో ఎన్టీ రామారావు కూడా ఇటువంటి వైఖరి అనుసరించారు. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నలు గురు రాజ్యసభ సభ్యులు తాము భాజపాలో చేరు తున్నామని చెబుతూ వెంకయ్యనాయుడుకు లేఖ ఇస్తున్న సమయంలో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా కూడా ఉండటం గమనార్హం.
భాజపాకి బలం లేని రాష్ట్రాలలో బలం పెంచుకోవడం కోసం ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గత నాలుగైదు ఏళ్లుగా విశేషంగా కృషి చేస్తున్నారు. కొత్తవారిని రాజకీ యాలలో ప్రోత్సహించడం, తమ పార్టీ నేతలలో నాయకత్వ సామర్ధ్యం పెంచే ప్రయత్నం చేయకుండా ఇతర పార్టీల నుండి మూకుమ్మడిగా, ముఖ్యంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన చరిత్ర ఉన్నవారిని ఏరికోరి మరి ఫిర్యాయింపులకు ప్రోత్సహించి, తమ పార్టీలో చేర్చుకొంటున్నారు. అప్పటి వరకు ఐటీ, ఈడీ దాడులకు గురైన నేతలు భాజపాలో చేరగానే ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. కర్ణాటకలో తరచూ ఇటువంటి దాడులకు గురవుతున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను దాడులు జరిపిన అధికారులే- మీరు భాజపాలో చేరితే ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా... అంటూ సానుభూతి వ్యక్తం చేయడం గమనార్హం.
పార్టీ ఫిరాయింపుల చట్టం దుర్వినియోగమవడం పట్ల కలత చెందిన మాజీ ప్రధాని వాజపేయి 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టంలో సవరణ తీసు కువచ్చారు. అంతకు ముం దు మూడోవంతు మంది సభ్యులు పార్టీ మారితో ఆ పార్టీలో- విలీనంగా పరిగ ణించేవారు. ఆ సంఖ్యను మూడింట రెండు వంతు లుగా చేశారు. పైగా, ఈ రాజ్యాంగ సవరణ పార్టీ మారే వారు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని స్పష్టం చేస్తున్నది. పార్టీలలో చీలిక అంటే మొత్తం పార్టీ వ్యవస్థలో చీలిక ఏర్పడినప్పుడు, ఆ పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలలో మూడింట రెండు వంతుల మంది కూడా చీలి మరో పార్టీలో చేరినా, మిగిలిన వారిని సభ్యులుగా గుర్తించే అవకాశం ఈ సవరణ కల్పిస్తుంది.
పార్టీలో చీలిక రాకుండా సభ్యులంతా పార్టీ మారినా వారు పార్టీ ఫిరాయింపు చట్టం పరిధిలో అనర్హతకు గురి కావలసిందే. ఇదే రాజ్యాంగ సవరణ కీలక సందేశం. అయితే వాజపేయి వారసులంగా చెప్పుకొనే ప్రభుత్వమే నేడు ఈ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తుంది. చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి, చట్టాన్ని మరింత పటిష్టం కావించే ప్రయత్నం చేయకుండా, చట్టాన్ని నిర్వీర్యం కావించే ప్రయత్నాన్ని నేడు దేశంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దానితో ఈ చట్టం కాలం చెల్లినదిగా చెప్పవచ్చు. 52వ రాజ్యాంగ సవరణలో 10వ షెడ్యూల్ ప్రకారం రెండు సందర్భాలలో సభ్యులను అనర్హులుగా సభాపతులు ప్రకటించవచ్చు. ఒకటి వారు స్వచ్ఛందంగా తమ పార్టీకి రాజీనామా చేస్తే లేదా పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసినా లేదా ఓటింగ్‌లో పాల్గొనక పోయినా సభ్యత్వం కోల్పోవలసి ఉంటుంది. కానీ శరద్ యాదవ్‌ను సభ్యుడిగా ఉండడానికి అనర్హుడని వెంకయ్యనాయుడు ప్రకటించిన సందర్భంలో ఈ రెండింటిలో ఏమీ జరగానే లేదు. అయితే 1994లో రవి నాయక్ కేసులో ఒక సభ్యుడు తన పార్టీకి రాజీనామా చేయకపోయినా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రాజీనామా చేసిన్నట్లు పరిగణింపవచ్చని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఈ చట్టం వౌలిక ఉద్దేశాలకు గండి కొట్టేందుకే తోడ్పడుతుంది. వెంకయ్యనాయుడు ఇటువంటి లొసుగును ఆసరాగా చేసుకొని అసాధారణంగా వ్యవహరించారు. కానీ, ఒక పార్టీ నుండి సస్పెన్షన్ లేదా బహిష్కరణకు గురైన సభ్యులకు మాత్రం వారి సభ్యత్వం కొనసాగుతుంది. అయితే పార్టీ విప్ వారికి వర్తిస్తుంది. 1996లో తమిళనాడు స్పీకర్‌కు వ్యతిరేకంగా జి.విశ్వనాథం వేసిన కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నది. మన దేశంలో రాజకీయ పార్టీలలో ఆంతరంగిక ప్రజాస్వామ్యం, విధానపరమైన చర్చలకు అవకాశం లేకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు వ్యక్తుల కనుసన్నలలో నడుస్తూ ఉండడానికి పార్టీ ఫిరాయింపుల చట్టమే కారణమని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల నిరంకుశ ధోరణులకు ఈ చట్టం ప్రాణం పోస్తున్నది.
10వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలు ఒక విధంగా రాజ్యాంగంలోని 105, 194 అధికారణాలను ధిక్క రించడమే అవుతుంది. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులకు ఈ అధికారణాలు చట్టసభలలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం కల్పిస్తున్నది. కానీ, ఫిరాయింపుల చట్టం ఇటువంటి అవకాశాన్ని హరించి వేస్తున్నది. పార్టీ నాయకత్వం (ప్రస్తుతం ఒక కుటుంబం లేదా ఒకరిద్దరు వ్యక్తులు) చెప్పిన్నట్లు వారు నడచుకోవలసి వస్తున్నది. నేడు కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీలో కూడా కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోబోయే ముందు అంతర్గతంగా విస్తృతంగా చర్చలు జరుపుతున్న దాఖలాలు కనబడటం లేదు. నోట్ల రద్దు వంటి నిర్ణయాలను మంత్రివర్గం ప్రమేయం కూడా లేకుండా తీసుకోవడాన్ని చూసాము. ఈ సందర్భంగా 1991లో కీహోతో హాలోహన్- జాచిల్లు, ఇతరుల కేసులో తాను ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్ మరోసారి పరిశీలించ వలసి ఉంది. ఈ కేసులో రాజకీయయ, వ్యక్తిగత ప్రవర్తనలను కొన్ని సైద్ధాంతిక ఆలోచనలకు అతీతంగా ఉంచవలసిన ఆచరణాత్మక అవసరాన్ని ఫిరాయింపుల వ్యతిరేక చట్టం గుర్తింస్తుందని అంటూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఒక విధంగా మనదేశంలో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఈ తీర్పు దారితీసిందని చెప్పవచ్చు. ఈ చట్టం రాజకీయ ఫిరాయింపుల సమస్యను పరిష్కరించ వలసింది పోయి మరిన్ని సమస్యలకు దారితీస్తున్నది. సాధారణ రాజకీయ ప్రక్రియకు అంతరం కలిగిస్తున్నది.
సభాపతులు నిస్పక్షపాతంగా వ్యవహరించడం చాలా అరుదుగా జరుగుతున్నది. అందుకనే 1990లో ఎన్నికల సంస్కరణలపై ఏర్పడిన దినేష్ గోస్వామి కమిటీ, 1999లో 170వ లా కమిషన్ నివేదిక సహితం పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిని అవిశ్వాస తీర్మానం సందర్భానికి పరిమితం చేయాలని సూచించాయి. 2002లో జస్టిస్ ఎంఎన్ వెంకటాచలమయ్య నాయకత్వంలోని రాజ్యాంగ సవరణ కమిషన్ చేసిన సిఫార్సు మేరకు ఈ చట్టం అమలు బాధ్యతను సభాపతులు కాకుండా కేంద్రంలో రాష్టప్రతికి, రాష్ట్రంలో గవర్నర్‌లకు అప్పచెప్పాలి. లేదా వెంక య్యనాయుడు సూచించినట్లు సభాపతులు కోర్ట్ లో నిర్ణీత కాల వ్యవధిలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలి.

-చలసాని నరేంద్ర 98495 69050