మెయిన్ ఫీచర్

స్థైర్యమే ఆమె సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధైర్యమే సంపద..
స్థైర్యమే రక్ష..
మీలో ధైర్యం, స్థైర్యం ఉంటే..
అదృష్టం వరిస్తుంది..
ఎవరి విజయాన్ని తరచి చూసినా అంతర్లీనంగా ఇవే కనిపిస్తాయి. ఆమె జీవితాన్ని తరచిచూసినా ఇదే విషయం బోధపడుతుంది. అతి సామాన్యురాలిగా ఉన్న ఆమె.. నేడు వందలకోట్ల విలువైన కంపెనీకి అధిపతి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక దశలో కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతాయి. వాటిని చూసి భయపడి దూరంగా పారిపోతే.. విజయమే ఉండదు. అదే వాటిని ఎదుర్కొని ముందుకు సాగితే అనూహ్య స్థానం అందుకోవచ్చు అని నిరూపించింది కల్పనా సరోజ్.. వివరాల్లోకి వెళితే..
ఆమె పేరు కల్పనా సరోజ్. మహారాష్టల్రోని చిన్న గ్రామమైన అకోలాలో పుట్టింది. వారిది అత్యంత నిరుపేద కుటుంబం. తండ్రి గారాలపట్టిగా ఉన్న కల్పనకు పనె్నండు సంవత్సరాలు నిండగానే పెళ్లి చేసెయ్యమని ఒత్తిడి మొదలైంది. పెళ్లి చేయకుండా కూతుర్ని ఇంకెంతకాలం ఇంట్లో ఉంచుకుంటావంటూ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్లు దెప్పి పొడవడంతో ఆ తండ్రి తలవంచక తప్పలేదు. కానీ పనె్నండేళ్ల పిల్లకు పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా సమాజ ఒత్తిడికి తలొగ్గాడు. కల్పనకన్నా పదేళ్లు పెద్దవాడైన ఒక అబ్బాయికిచ్చి పెళ్లి చేశాడు. వారిది ముంబయి. అలా కల్పన చిన్నగ్రామం నుండి మహా నగరానికి చేరింది. ముంబయిలోని ఓ మురికివాడలో వారి ఇల్లు. ఒక్కటే గది. అందులోనే అన్నీ.. అందరూ.. పైగా భర్త ఏ పనీ చేయడు. ఖాళీగా ఉంటాడు. కల్పన భర్తకు, అత్తమామలకు, ఇతర కుటుంబీకులకు అందరికీ కల్పనే సేవకురాలు. ఇంటిపని, వంటపని.. అన్నీ తనే చేయాలి. కూరలో ఉప్పు ఎక్కువైనా, చిన్న పొరపాటు జరిగినా అత్తామామలు ఆమెను గొడ్డును బాదినట్టు బాదేవారు. అలా ఆరునెలలు గడిచిపోయాయి. ఒకరోజు కల్పన తండ్రి వారిని చూడటానికి ముంబయికి వచ్చాడు. అక్కడ కూతుర్ని చూసి షాక్ తిన్నాడు. ఆమె ఎవరో తెలియనట్టుగా, ఎక్కడో చూసినట్టుగా, అమ్మాయిని గుర్తుపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కొన్ని క్షణాలపాటు కల్పనను తదేకంగా చూశాడు. తరువాత బోరుమని ఏడుస్తూ కల్పనను ఎత్తుకున్నాడు. బంగారుబొమ్మలా ఉన్న తన కూతురు.. ఇప్పుడు ఇలా చిరిగిన దుస్తులతో, పీక్కుపోయిన మొహంతో, బక్కచిక్కిన దేహంతో, రూపురేఖలు మారిపోయిన ఆ పాపను చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. వెంటనే కల్పన అత్తమామలతో గొడవపడి తన బిడ్డను ఇంటికి తెచ్చేసుకున్నాడు. అలా కల్పన మళ్లీ పుట్టింటికి చేరింది. అత్తింటి నుంచి కూతుర్ని అలా తీసుకురావడం అప్పట్లో సంచలనమే.. చుట్టాలు, చుట్టుపక్కల వాళ్లు రాద్దాంతం చేశారు. అయినా కల్పన తండ్రి లెక్క చేయలేదు. ఆరునెలల క్రితం ఆ తండ్రిని భయపెట్టింది సమాజం.. నేడు ఆ తండ్రి సమాజాన్ని భయపెట్టాడు. కానీ అతని నిర్ణయాన్ని సమాజం అంగీకరించలేదు కానీ ఆయన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయింది. కానీ కల్పనను మాత్రం నానామాటలనేవారు. అనాచారానికి వడిగట్టి భర్తను వదిలేశావు అంటూ అడుగడుగునా అవమానించేవారు. ఈ మాటల తూటాలను తట్టుకోలేక ఒకరోజు ఆత్మహత్య చేసుకోబోయింది కల్పన. అయినా అవమానాలు ఆగలేదు. ఇక కల్పన తట్టులేకపోయింది. ఆమెకున్నవి రెండే మార్గాలు. ఒకటి చనిపోవడం, రెండోది సమాజానికి దూరంగా బతకడం..
కల్పన మాత్రం రెండో మార్గాన్ని ఎంచుకుంది. తిరిగి ముంబయి వెళ్లడానికి తండ్రిని ఒప్పించింది. అత్తవారింటికి కాదు.. బతకడానికి.. కల్పనకు టైలరింగ్ వచ్చు. ముంబయిలో ఎక్కడో ఒకచోట టైలర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని తండ్రికి చెప్పి ముంబయి మహానగరంలో అడుగుపెట్టింది. అలా ఓ టైలర్‌గా జీవితాన్ని ప్రారంభించింది కల్పన. మొట్టమొదటిసారి టైలర్‌గా వంద రూపాయలు సంపాదించినప్పుడు ఆమె ఆనందం వర్ణనాతీతం. ఆమె చీకటి జీవితంలోకి చిరుకాంతి వచ్చినట్టయిందట.. అలా కొన్నినెలల పాటు పనిచేసింది కల్పన. టైలర్ అనుభవంతో, సంపాదించిన డబ్బుతో ముంబయిలోని కళ్యాణ్ అనే ప్రాంతంలో చిన్న టైలరింగ్ షాప్ పెట్టింది. అందులో త్వరగానే నిలదొక్కుకుంది కల్పన. ఇలా ఇంకొన్ని నెలలు గడిచాయి. ఆర్థికంగా కూడా స్థిరపడింది. ఇదే సమయంలో కల్పన చెల్లెలికి ఏదో అంతుపట్టని వ్యాధి సోకింది. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. చెల్లిని బతికించుకునేంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో.. నేను ఇంకాస్త ఆర్థికంగా స్థిరపడాలి అని ఆలోచించిందట కల్పన. అలా రోజుకు పదహారు గంటల పాటు టైలరింగ్ చేసిందట. ఫలితంగా సంపాదన పెంచుకుంది. ఇది సరిపోదు.. ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఆమె మస్తిష్కంలో కదలాడుతూనే ఉండేదట. ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆమె చుట్టుపక్కల ఎక్కడా ఫర్నిచర్ షాపు లేకపోవడంతో ఆమే ఓ ఫర్నిచర్ షాప్ పెట్టాలని నిర్ణయించుకుందట. షాపంటే పెట్టుబడి కావాలి. ఎక్కడి నుండి తేవాలి? అని ఆలోచించి ప్రభుత్వం నుండి సాయం పొందింది. ప్రభుత్వం ఇచ్చిన లోన్‌తో ఫర్నిచర్ షాపు మొదలుపెట్టింది. అలా ఆర్థికంగా మరో మెట్టు ఎక్కింది. షాపుకోసం నాణ్యమైన, ఖరీదైనవిగా కనిపించే ఫర్నిచర్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చి తక్కువ లాభంతో అమ్మేది కల్పన. దాంతో అందరూ ఇంత తక్కువ ధరకు, క్వాలిటీ ఫర్నిచర్ ఇంక ఎక్కడా దొరకదు అనుకోవడంతో వ్యాపారం పుంజుకుంది. తెచ్చిన సరుకు తెచ్చినట్టుగా అమ్ముడుపోవడంతో కల్పనకు లాభాలు బాగానే ఉండేవి. అలా నిత్యానుభవాలే పాఠాలుగా, ఎదురైన ఆటుపోట్లే గుణపాఠాలుగా నేర్చుకుంది. అవే తనకు వ్యాపార సూత్రాలు గా మారాయి. ఇందుకోసం ఆమె ఏ మేనేజ్‌మెంట్ కోర్సులు, డిగ్రీలు చేయలేదు. ఇదే విషయాన్ని కల్పనా సరోజ్‌ను అడిగితే ఇలా చెప్పింది..
‘ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మాత్రం మరిచిపోకూడదు. నా పేదరికం, బాల్యవివాహం, నరకంలాంటి వైవాహిక జీవితం, అడుగడుగునా అవమానాలు, ఆత్మహత్యాయత్నం, జీవనపోరాటం.. వీటన్నింటినీ నేను నిత్యం గుర్తుచేసుకుంటాను. ఎందుకంటే నా చుట్టుపక్కల అనేకమంది జీవన స్థితిగతులు, అనుభవాలు అచ్చం నాలాగే ఉన్నాయి. పూట గడవడం కోసం వారు పడుతున్న కష్టాలు నన్ను కదిలించేవి. నాలా వారు కూడా ఆర్థికంగా బాగుండాలని, సంతోషంగా ఉండాలని వారికోసం చేతనైనంత చేయాలనుకున్నాను. వారిని కలిసి మాట్లాడాను. కొందరికి ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించాను. స్వయం ఉపాధి సాధనకు తోడ్పాటునందించాను. వారికి ఇంకా ఏదో చేయాలనే తపన-శ్రమ ఫలితంగా ఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవో) ఉద్భవించింది. దీని ద్వారా చాలామందికి సాయం చేశాను. ఇది నాకెంతో సంతోషాన్ని, ఆత్మ సంతృప్తినీ ఇస్తోంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్కదానే్న.. తరువాత నాకు తోడుగా కుటుంబం వచ్చింది. ఇప్పుడు నా కుటుంబం విస్తరించింది. నా సహాయ సహకారాలు పొందినవాళ్లంతా నేడు నా కుటుంబసభ్యులే.. నా నిస్వార్థ సేవకు, నా సంస్థకు మంచి గుర్తింపు లభించింది.’2 అంటుంది కల్పన.
కొన్నిసార్లు కాలం పరీక్ష పెడుతుంది. అప్పుడు పాసైతే జీవితం ఎక్కడికో వెళ్లిపోతుంది. అలాంటి పరీక్షే కల్పనకు కూడా ఎదురైంది. ముంబయిలోని ఓ మురికివాడలో దాదాపు ఐదు వందల నిరుపేద కుటుంబాలు ఉంటాయి. వారంతా స్థానిక కమానీ ట్యూబ్స్ కంపెనీలో కార్మికులు. ఒకరోజు వారంతా కలిసి కల్పన దగ్గరకు వచ్చారు. తమ కంపెనీ త్వరలో మూత పడబోతోందని, తామంతా కట్టుబట్టలతో, ఆకలిదప్పులతో వీధుల్లో నిలబడాల్సిన పరిస్థితులు రానున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు కల్పన తనదైన ఆలోచన చేశారు. అసలు ఈ కంపెనీ ఎందుకు మూతపడుతోంది. కామాని ట్యూబ్స్ చాల పెద్దకంపెనీ. దాని వ్యవస్థాపకుడైన రాంజీభాయ్ కామాని బాగా పేరొందిన పారిశ్రామికవేత్త. ఆయన చనిపోయేవరకు ఆ కంపెనీ మంచి లాభాల్లో ఉంది. ఆయన తదనంతరం.. యాజమాన్య హక్కులపై ఆయన ఇద్దరు కుమారులు గొడవలు పడటంతో కంపెనీకి అనేక సమస్యలు వచ్చాయి. ఒకవైపు 140 లిటిగేషన్ కేసులు.. ఇంకోవైపు బ్యాంకుల్లో 116 కోట్ల అప్పులు.. చివరికి కార్మికుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి.. ఇదంతా తెలుసుకున్న కల్పన అడుగు ముందుకేసింది. కొందరు కార్మికులు, శ్రేయోభిలాషులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటుచేసింది. ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రిని కలిసి అప్పులు కొంతవరకు తగ్గేలా చేసింది. తరువాత బ్యాంకర్ల వద్దకు వెళ్లింది. అప్పుల కింద కంపెనీని స్వాధీనపర్చుకోవద్దని వేడుకుని, కార్మికులే భాగస్వాములుగా ఉండి కంపెనీ నడిపిస్తారని చెప్పి వారిని ఒప్పించింది కల్పన. అప్పులు చెల్లించేందుకు ఎనిమిది సంవత్సరాల గడువు తీసుకుంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు కూడా ఇందుకు అంగీకరించారు, కంపెనీని కల్పన అండ్ టీమ్‌కు అప్పగించారు.
అతి సాధారణ ఫర్నిచర్ షాపు యజమానురాలైన కల్పన ఇప్పుడు వందల కోట్ల రూపాయల విలువైన కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు తీసుకుంది. కల్పన ప్రధానంగా నాలుగు లక్ష్యాలను ఎంచుకుంది. ఒకటి: కంపెనీని నష్టాల నుండి బయటపడేయాలి.., రెండు: కేసులన్నీ పరిష్కరించాలి.., మూడు: కార్మికులకు మెరుగైన జీతభత్యాలివ్వాలి.., నాలుగు: కంపెనీని లాభాలబాట పట్టించాలి.. అని. ఈ లక్ష్యాలను సాధించేందుకు కల్పన జీవితానుభవాలే మార్గం చూపాయి. సమస్య ఎదురైనప్పుడు పారిపోకుండా ధైర్యంగా నిలబడాలని, ఎదుర్కోవాలని తను చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న విషయాన్ని కార్మికులకు చెప్పేది. కంపెనీకి కొత్త మిషనరీ తెప్పించింది. తరువాత ఒకటొక్కటిగా లిటిగేషన్ కేసులన్నింటనీ కోర్టులో పరిష్కరించుకున్నారు. ఆరేళ్లలోనే అప్పునంతా తీర్చేసింది. ఇప్పుడు ఆ కంపెనీకి అప్పుల్లేవు. కోర్టు కేసుల్లేవు. కార్మికులు మెరుగైన జీతభత్యాలను అందుకుంటున్నారు. ఇదంతా కేవలం ఏడెనిమిదేళ్లలో జరిగింది. ఇప్పుడు కంపెనీ వందశాతం లాభాల్లోకి వచ్చేసింది.
ఒకప్పుడు వంద నోటు చూసి సంతసించిన కల్పన.. నేడు.. వందల కోట్ల రూపాయల కంపెనీకి అధిపతి. ఈ సుదీర్ఘప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు, సుడిగుండాలు.. ఎన్నో.. దేనికీ తలవంచలేదు. అన్నింటినీ తట్టుకుని, దాటుకుని ముందడుగే వేసింది. ఈమె విజయగాథను గుర్తించిన కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’2తో గౌరవించింది. ఇటీవలే కల్పన ‘నారీశక్తి’ అవార్డు కూడా 3అందుకుంది. ‘ ధైర్యే సాహసే లక్ష్మి’ అనే నానుడిని సొంతం చేసుకుని విజయతీరాలకు చేరిన ఆమె ప్రతి ఒక్కరికీ ఇచ్చే సందేశం కూడా ఇదే.. ధైర్యే సాహసే లక్ష్మి.. *