మెయన్ ఫీచర్

‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్రం న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానించాలి. ప్రధానిగా రెండవసారి ఎన్నికైన తర్వాత మోదీ లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. ఇంత పెద్ద దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. తరచూ జరిగే ఎన్నికల ప్రక్రియ జాతీయ రాజకీయ పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘంపై పనిభారం పెరుగుతోంది. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఆర్థికంగా మోయలేని భారం పడుతోంది. ఇక ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఇటీవల జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దాదాపు 75 రోజుల పాటు ‘నియమావళి’ అమలులో ఉంది. దీని వల్ల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నాయి.
తెలంగాణ రాష్ట్రం గత ఏడాది డిసెంబర్‌లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం వల్ల సెప్టెంబర్ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కొంత విరామం తర్వాత మళ్లీ లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దాదాపు ఏడెనిమిది నెలల పాటు రకరకాల రూపాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిపాలన దాదాపు స్తంభించింది. దీనికి అధికారంలో ఏ పార్టీ ఉన్నా చేయగలిదేమీలేదు. ఒక పార్టీని ఐదేళ్లపాటు పాలించాలని ఎన్నుకుంటే, ఆరు నెలల పాటు వివిధ ఎన్నికల నెపంతో కోడ్ అమలులో ఉంటే, పాలనాపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు తలెత్తుతాయి.
ఎన్నికల వ్యయాన్ని అరికట్టాలంటే లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపడం ఉత్తమం. గతాన్ని ఒకసారి విశే్లషిస్తే 1951-52 పార్లమెంటు ఎన్నికల్లో 53 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. 1874 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా. అప్పుడు ఖర్చు కేవలం రూ.11 కోట్లు అయింది. 2019 ఎన్నికల నాటికి 610 రాజకీయ పార్టీలకు చెందిన 9వేల మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏడీఆర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం తాజా లోక్‌సభ ఎన్నికల్లో రూ.60వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. ప్రజాధనం కాపాడాలి. పరిపాలన సిబ్బందిపై భారం తగ్గాలి. భధ్రతా బలగాలపై అనవసర వత్తిడి తగ్గించాలి. అప్పుడే సాఫీగా ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు కూడా సరైన తీర్పు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. పాలనాపరమైన సంక్షోభాలు, సమస్యలు తలెత్తవు. 2024లో 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానా, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్నాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఐదేళ్లలో వివిధ సందర్భాల్లో ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకుంటాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగాలంటే ముందుగా రాజ్యాంగ సవరణ జరగాలి. 83, 85,172, 174, 356వ అధికరణలకు రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రజాప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు చేయాలి. కాని దేశంలోని అన్ని పార్టీలను ఇందుకు ఒప్పించడం అంత సులువైన పనికాదు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. లోక్‌సభకు, అసెంబ్లీలకు 1951-52 నుంచి 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాజకీయ అస్థిరత్వం, సంకీర్ణ ప్రభుత్వాలు తదితర కారణాల వల్ల కొన్ని అసెంబ్లీలు లేదా లోక్‌సభ రద్దు కావడం, మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగే పద్ధతి గాడి తప్పింది.
అమెరికాలో అధ్యక్ష తరహా విధానం అమలులో ఉంది. అమెరికాలో ఎన్నికల తేదీని ముందుగానే ఖరారు చేస్తారు. ప్రతి నాలుగు సంవత్సరాల తర్వాత నవంబర్ నెలలో మొదటి మంగళవారం ఎన్నికలను అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి నిర్వహిస్తారు. హౌస్ ఆఫ్ రిప్రెంజేటీవ్స్‌కు, సెనేట్‌కు ముందు అనుకున్నట్లుగా తేదీలు ఖరారవుతాయి. సాధారణంగా నవంబర్ 2, 8వ తేదీల్లో వీటికి ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి విధి విధానాలను, తేదీలను నిర్ణయించారు. ఎటువంటి విపత్కర పరిణామాలు తలెత్తినా ఆ రోజు ఎన్నికలు జరిగి తీరుతాయి. అదే భారతదేశంలో ఎన్నికలకు తేదీలను ముందుగా ఖరారు చేయడం సాధ్యం కాదు. ఇక్కడ పార్లమెంటరీ తరహా పాలన అమలులో ఉంది. లోక్‌సభ ఎన్నికల కంటే ఆరు నెలల ముందు లేదా ఆరు నెలల్లోపల ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే విధంగా రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 3/4వ వంతు మెజారిటీ పార్లమెంటులో లభించాలి. దేశంలో సగానికి రాష్ట్రాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. ఒక వేళ ఈ తీర్మానం నెగ్గినా, ఏ కారణాల వల్లనైనా ఒక అసెంబ్లీ నిర్ణీత కాలానికి ముందుగానే రద్దయి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే అందుకు తగిన పరిష్కారం గురించి ఆలోచించాలి. కొన్ని రాష్ట్రాల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి. ఈ ప్రభుత్వాలు కీచులాటల వల్ల కూలితే పరిస్థితి ఏమిటి? లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యం ఈ తరహా పరిస్థితుల వల్ల నెరవేరుతుందా?
1967 తర్వాత ఉత్తర భారతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడం వల్ల అనేక కారణాల వల్ల ఆ ప్రభుత్వాలు పతనమయ్యాయి. దీంతో మధ్యంతర ఎన్నికల పర్వం ప్రారంభమైంది. దీనికి తోడు 1970లో పార్లమెంటు కూడా రద్దయింది. 1971లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1980, 1991, 1998,1999లో లోక్‌సభకు మొత్తం ఐదుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1985లో ఎన్టీఆర్ అసెంబ్లీని ముందుగా రద్దు చేయాలని కోరడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 2004లో కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీని ఆరు నెలల కంటే ముందుగా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే తమకు కలిసి రాదని ప్రాంతీయ పార్టీలు భావిస్తుంటాయి. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలు కావాలంటే అధికారంలో ఉన్న పార్టీలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జాతీయ సమస్యలకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్థానిక సమస్యల ప్రాతిపదికన పార్టీలకు ఓట్లు వేస్తారు. ఉదాహరణకు తెలంగాణలో 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక సీటు, కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం రాజకీయ పరిస్థితులు మారాయి. నాలుగు చోట్ల బీజేపీ, మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయనుకున్న టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పలేదు. నాలుగు నెలల వ్యవధిలో ప్రజల్లో తెరాస ప్రభుత్వం పట్ల అసంతృప్తికి ఇది నిదర్శనమనుకోవాలా? లేక జాతీయ పార్టీలవైపు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మొగ్గుచూపారనుకోవాలా? ఇదే పరిస్థితి రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఎదురైంది. నాలుగు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఓటమి చెందింది. కాని ఆశ్చర్యకరంగా ఈ మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుని పోగా, బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలను ఏ కోణంతో విశే్లషించాలి?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రత్యేక హోదా కావాలని బలంగా కోరుకుంటున్నారు. కాని జాతీయ పార్టీ బీజేపీ రంగంలో ఉన్నా, ఓట్లు వేయలేదు. కనీసం ఒక్క సీటులో కూడా గెలిపించలేదు. ప్రాంతీయ పార్టీ వైకాపాకు 22 సీట్లు, టీడీపీకి మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. ప్రత్యేక హోదా కావాలంటే జాతీయ పార్టీకి ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తమను గెలిపిస్తే హోదా వెంటనే ఇస్తామని హామీ ఇచ్చినా జనం నమ్మలేదు. అంటే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీల నినాదంగా మారింది. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రాదనే విషయం ప్రజలకు తెలుసు. హోదా అనేది టీవీ చర్చలకు, ఎన్నికల నినాదాలకు మాత్రమే పరిమితం. లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఆంధ్రాలో ఒకేసారి ఎన్నికలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను విశే్లషిస్తే తెలంగాణలో జాతీయ శక్తులు బలంగా, ఆంధ్రాలో బలహీనంగా ఉన్నాయని విదితమవుతుంది.
అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం మంచి నిర్ణయమైనా అందుకు రాజ్యాంగ పరమైన సవరణలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనేది దేశ దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా మంచిది. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రతి ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనడం మంచిది కాదు. దీని వల్ల స్థానిక సమస్యల వల్ల ఓడినా, దాని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గత డిసెంబర్‌లో హిందీ బెల్ట్‌లో మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందిన వెంటనే రాజకీయంగా లెక్కలు మారిపోయాయి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీతో నెగ్గింది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒకే దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడానికి ముందుడుగు వేయాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097