మెయిన్ ఫీచర్

సోషల్ మీడియా.. స్మార్ట్ మర్డర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ మీడియా మనసుపడితే
-ఎక్కడో మారుమూల గ్రామంలో టీ అమ్ముకునేవాడు సైతం
ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయిపోవచ్చు.
సోషల్ మీడియా పగబడితే
-గౌరవంగా బతుకుతున్న సెలబ్రిటీ సైతం గంటల్లో శవమైపోవచ్చు.
సోషల్ మీడియా ఓ వైరస్. భయంకరంగా విస్తరిస్తోన్న ఈ వైరస్‌తో మంచీ జరగొచ్చు. చెడూ జరగొచ్చు. లేదు, రెండూ ఓకేసారి జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకు అనేక ఉదంతాలు -ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి.
కారణాలు ఏమైనా కావొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. కానీ -అనేక ఫలితాలకు, అంతకుమించిన అనర్థాలకు మూలం మాత్రం సోషల్ మీడియా. అదుపు చేయలేనంతగా టెక్నాలజీ విస్తరిస్తుండటంతో -అంతర్జాలం అన్నది అరచేతికి ఎప్పుడో వచ్చేసింది. అంటే -అధికశాతం జనాభాతో సోషల్ మీడియా కనెక్టైవుంది. ఇక్కడినుంచే మొదలైంది చిక్కంతా. విస్తృతమవుతోన్న సాంకేతికత ఉద్దేశాలు మంచికే అయినా -దానికి భిన్నమైన సమస్యలూ ఇక్కడినుంచే మొదలయ్యాయి. సింపుల్‌గా చెప్పాలంటే -ట్రాప్‌లు, మోసాలు, బ్లాక్‌మెయిల్స్, ఆత్మహత్యలు.. ఒక్కటేమిటి? చెప్పలేనన్ని దుర్ఘటనలకూ సోషల్ మీడియా కారణం అంటే -కాదనలేం.
పచ్చని సంసారాలు కూలుతున్నాయి. వెచ్చని బంధాలు తెగుతున్నాయి. చదువులు చట్టుబండలవుతున్నాయి. వ్యసనాలు తీవ్రమవుతున్నాయి. సోషల్ మీడియాలో మంచి ఎంతుందో- మించిన చెడూ ఉంది అన్నది నిపుణుల మాటే.
అలాంటి సోషల్ మీడియా -తాజాగా మర్డర్లూ చేస్తోంది. సెలబ్రిటీలను చంపేస్తోంది. ‘మేం బతికేవున్నాం మహాప్రభో’ అంటూ సోషల్ మీడియాలో చచ్చిపోయినవాళ్లే గొంతు చించుకుని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఫలానా బాలీవుడ్ సెలబ్రిటీ కొద్దిగంటల క్రితమే కన్నుమూసిందంటూ -సోషల్ మీడియాలో కథనాలు గంటల్లో ప్రపంచాన్ని కమ్మేసిన సంఘటనలెన్నో. ఫలానా హాలీవుడ్ నటుడు భయంకరమైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిన ఎదుర్కొంటున్నాడంటూ -గుప్పుమన్న కథనాలు సోషల్ మీడియాలో లెక్కకు మించి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారి కథనాలు సోషల్ మీడియాకు ఎక్కుతుండటంతో -ఆ కథనాలు వైరల్ అవుతోన్న సంఘటనలు కోకొల్లలు. ‘నేను బతికే ఉన్నానంటూ’ ఆ సెలబ్రిటీ పెట్టే పోస్టుగాని, ఆవేదనాభరిత వ్యాఖ్యగాని రెండు రోజులకుగాని అందని పరిస్థితి.
సోషల్ మీడియాలో విస్తృతమవుతోన్న ఈ వదంతులు ఆయా కుటుంబాలను దారుణ పరిస్తితుల్లోకి నెడుతోన్న వైనం చూస్తూనే ఉన్నాం. కొద్దిరోజుల క్రితం పరిస్థితినే చూస్తే -బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్ సోదరి సునైనా ప్రాణాపాయ స్థితిలో ఉందంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, సోషల్ మీడియాలో తనపై వచ్చినదంతా వదంతులేనని సునైనా స్వయంగా మీడియాకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఉదంతాన్ని ఎదుర్కొన్న, ఎదుర్కొంటోన్న సెలబ్రిటీలు ఎంతోమంది. చనిపోయారనో, భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారనో, కంపాగోడూ అమ్ముకుని రోడ్డున పడ్డారనో -సెలబ్రిటీలపై వార్తలు వెలువడటం, అది వైరల్‌గా మారటం.. ఆనోటా ఈనోటా బాధిత సెలబ్రిటీల దృష్టికి చేరితే -అదంతా వదంతులేనని ప్రకటనలు ఇచ్చుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. టాలీవుడ్‌కు సంబంధించి ఆమధ్య టాప్ కమెడియన్ ఒకరు చనిపోయారంటూ వార్తలొచ్చాయి. ‘నేనింకా బతికే ఉన్నాను’ అంటూ ఆ కమెడియన్ మీడియాకు చెప్పుకున్న కొద్దిరోజులకే ‘ఆ కమెడియన్‌కు క్యాన్సర్ సోకిందని, అందుకే చచ్చిన శవం మాదిరి తయారయ్యాడు’ అంటూ వదంతులు గుప్పుమన్నాయి. ఇక ఆ కమెడియన్ పరిస్థితి చూడాలి. ‘దీనివల్ల తన కెరీర్ మొత్తం దెబ్బతిందంటూ’ భోరుమన్న సందర్భాలూ సోషల్ మీడియాలో కనిపించటం మరీ దారుణం.
కొనే్నళ్ళ క్రితం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సోషల్ మీడియాలో వదంతులు గుప్పుమన్నాయి. అమితాబ్, జయాబచ్చన్‌తో వ్యాపార కోణంలో వచ్చిన వివాదాలే ఇందుకు కారణమనే భయంకరమైన కథనాన్ని అల్లారు. అమితాబ్ కుటుంబంలో అలాంటి ఇబ్బందులేవీ లేవన్నది తరువాత తేలిన విషయం. మాధురీ దీక్షిత్ హార్ట్‌అటాక్‌తో మరణించిందన్న వార్తల్నీ సోషల్ మీడియా విస్తృతం చేసింది. కొనేళ్ల క్రితమే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌నూ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. ఆయనకు వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సోషల్ మీడియా కథనాన్ని అల్లింది. పరిస్థితి విషమించటంతో మృతి చెందారన్న వార్త వరకూ అది నడిచింది. షారూఖ్‌ఖాన్, కత్రినాకైఫ్, నానాపటేకర్, హనీసింగ్, శక్తికపూర్, బప్పీలహరి వీళ్లంతా సోషల్ మీడియా బారినపడి వదంతులను ఎదుర్కొన్నవాళ్లే. వారం క్రితం -మణిరత్నంను టార్గెట్ చేస్తూ వందతులు అల్లడం తెలిసిందే. ఇప్పటికి మూడుసార్లు గుండెపోటును ఎదుర్కొన్న మణిరత్నం -మరోసారి గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలొచ్చాయి. అనేక నిజాల మాదిరిగానే ఇలాంటి వార్తలూ నిజమన్న భ్రమలో ఇవే వార్తలు ఒక్కోసారి సాధారణ మీడియాకూ వచ్చేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణమవుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. మణిరత్నం విషయంలో అదే జరిగింది. గుండెపోటుకు గురైనట్టుగా సాధారణ మీడియాలోనూ వార్తలు రావడంతో -ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు స్పందించాల్సి వచ్చింది. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారు తప్ప, గుండెపోటు కాదన్న ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.
**
తెలుగు హీరోయిన్ పూనమ్‌కౌర్ కెరీర్‌పరంగా పెద్దగా సినిమాలు చేయకున్నా, కొద్దికాలం క్రితం ఏదోక విషయంలో పూనమ్ పేరు సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడం తెలిసిందే. పవన్‌కళ్యాణ్ వర్సెస్ కత్తి మహేష్ విమర్శల సమయంలో పూనమ్‌కౌర్ పేరును సోషల్ మీడియా ప్రస్తావించటంతో అది వైరల్‌గా మారింది. అలా -పూనమ్‌కౌర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం గుర్తుండే ఉంటుంది. ఇదిలావుంటే కొద్ది నెలల క్రితమే -పూనమ్ హైదారాబాద్‌లోని సైబర్ క్రైమ్ సెల్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఈ దుష్ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారని వార్తలొచ్చాయి. ఉద్దేశపూర్వకంగానే అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, దీనివల్ల తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నానంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టిన వీడియో లింకులనూ ఆమె పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు విషయం నిజమేనా? అబద్ధమా? అన్న విషయన్ని పక్కనపెడితే సెలబ్రిటీపై ఇలాంటి పోస్టులు ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తాయో అంచనా వేయొచ్చు.
ప్రస్తుతం మనం ఆధునిక టెక్నాలజీని అనుభవిస్తున్నాం. ఎక్కడో జరిగిన సంఘటనను క్షణాల్లో మరో దిక్కునున్న వాళ్లు వీడియోతో సహా చూడగలిగే సాంకేతిక యుగంలో ఉన్నాం. మనిషి తన టాలెంట్‌తో తనకు కావాల్సిన అవసరాల కోసం అనే్వషణ ఇంకా జరుపుతూనే ఉన్నాడు. రాతియుగం నుంచి స్మార్ట్‌యుగం వరకూ సాగిన మనిషి జీవింతంలో -మనిషి మనిషిగా మసలుకోవడం మాత్రం మర్చిపోతున్నాడు. ముఖ్యంగా టెక్నాలజీని స్వార్థంకోసం, వెర్రి ఆనందం కోసమో వినియోగిస్తూ -నానా రచ్చ చేస్తోన్న సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. ట్రెండింగ్ కోసం ఎంతకైనా దిగజారుతోన్న వైనాలు ఒకటో రెండో కాదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే -పైన పేర్కొన్న వదంతుల అంశాలు. ఏదైనా విషయాన్ని క్షణాల్లో ప్రపంచానికి చెప్పడానికి అందుబాటులోవున్న ఏకైక మార్గం -సోషల్ మీడియా.
దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని సోషల్ మీడియా ఎంత దారుణంగా టార్గెట్ చేసిందన్నది తెలీంది కాదు. పూనమ్ కౌర్ ఆవేదనకు సోషల్ మీడియా కారణమనడాన్ని కాదనలేం. తమను టార్గెట్ చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు సెలబ్రిటీల నుంచి అందుతోన్న ఫిర్యాదులు తక్కువేం కాదు. అన్నీ బయటకు రాకపోవచ్చుగానీ, సోషల్ మీడియా ట్రెండింగ్ టార్గెట్‌కు బలైన సెలబ్రిటీల మానసిక వ్యధ మాత్రం కామన్.
ఈ ఫిర్యాదులు, వందతుల గోల ఇప్పుడే మొదలైంది కాదు. సోషల్ మీడియా బలపడుతున్నకొద్దీ పెరుగుతున్నదే. అప్పట్లో అసభ్యకర వీడియోలు నియంత్రిస్తామని చెప్పిన సోషల్ మీడియా సంస్థలు -తరువాత తమ రేటింగ్ ఎక్కడ పడిపోతుందోనని ఆలోచనలో పడ్డాయి. వ్యూస్ కోసం దారుణాలు ప్రచారం చేస్తున్నాయి.

-మహాదేవ