మెయన్ ఫీచర్

హైజాకర్లకు దడ పుట్టించే చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రుల హడావుడిలో మన దేశం నిమగ్నమైన వేళ సందట్లో సడేమియా అన్నట్టు తీవ్రవాద సంస్థలు పంజా విసిరాయి. దేశంలో నాలుగు చోట్ల ఏకకాలంలో విమానాల హైజాకింగ్‌కు హెచ్చరికలను జారీ చేశాయి. గతంలో హైజాకింగ్‌ను కళ్లారా చూసి, తీవ్రవాదుల డిమాండ్లకు మోకరిల్లిన భారత్ ఆ తర్వాత అప్రమత్తంగానే ఉంటూ, హైజాకర్లపై కఠిన చర్యలకు ‘హైజాకింగ్ వ్యతిరేక బిల్లు’ తీసుకువచ్చింది. ఈ బిల్లు కింద మొట్టమొదటి కేసును విచారించి నిందితులకు శిక్ష విధించింది. దేశంలో యాంటి హైజాకింగ్ చట్టం కింద విచారించిన మొట్టమొదటి కేసుగా అది చరిత్రలో మిగిలిపోతుంది. ఈ విషయం కూడా ప్రముఖంగా ఎక్కడా చర్చకు రాలేదు.
హైజాకింగ్ ఫోబియా ఎంత తీవ్రంగా ఉందంటే మొన్నటికి మొన్న ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు పొరపాటున హైజాక్ హెచ్చరికలను పంపించడంతో భద్రతా వ్యవస్థలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానాన్ని మధ్యలోనే అత్యవసరంగా దించేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన సమయంలో 175 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం బయలుదేరిన ఈ విమానంలో అరగంట తర్వాత ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అనుకోకుండా ‘హైజాకింగ్ కోడ్ 7500’ను ఎంటర్ చేశారు. హెచ్చరికలను అందుకున్న చండీగఢ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం పంపించడంతో సీఐఎస్‌ఎఫ్, ఢిల్లీ పోలీసులు, నేషనల్ గార్డ్సు సహా ఇతర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. చండీగఢ్ విమానాశ్రయంలోనే ఒక శ్లాట్ ఏర్పాటుచేసి అక్కడ విమానాన్ని దించేశారు.
గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం-814 నేపాల్ రాజధాని ఖట్మండ్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావల్సి ఉండగా, మార్గమధ్యంలో 1999 డిసెంబర్ 24న హైజాకింగ్‌కు గురైంది. ఇది తమపనేనని పాకిస్తాన్ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న హర్కతుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే విమానాన్ని సాయుధులైన ముష్కరులు హైజాగ్ చేశారు. అమృత్‌సర్‌లో తర్వాత లాహోర్‌లో, దుబాయిలో దిగిన తర్వాత ఎట్టకేలకు విమానాన్ని బలవంతంగా ఆఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌లో హైజాకర్లు దించేశారు. మొత్తం 176 మంది ప్రయాణీకుల్లో 27 మందిని దుబాయిలో దించేశారు. ఒకరిని కత్తులతో పొడిచారు, ఇంకొంత మందిని బాగా గాయపరిచారు. ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకపోవడంతో భారత అధికారులకు, హైజాకర్లకు మధ్య చర్చలకు అడ్డంకులు ఎదురయ్యాయి. చివరికి అనేక చర్చలు జరిపి ముగ్గురు ఖైదీలను విడిచిపెట్టి, డిసెంబర్ 31న ప్రత్యేక విమానంలో బందీలందరినీ భారత్‌కు తీసుకువచ్చారు. కాందహార్ సంఘటనను ఇంకా మరిచిపోలేదు, అమృత్‌సర్‌లో నిర్వహించిన ఆపరేషన్ అశ్వమేథ్ స్మృతిపథం నుండి చెరిగిపోలేదు.
ప్రపంచ వ్యాప్తంగా గగనతల వివాదాల పరిష్కారాలకు 1919 నుండే ఎంతో కసరత్తు జరుగుతోంది. 1919లో పారిస్‌లో తొలిసారి వైమానిక గమనాగమన సదస్సు (ఏరియల్ నేవిగేషన్ కనె్వన్షన్) జరిగింది. 1928లో హవానా సదస్సు, 1929లో వార్షా సదస్సు, 1944లో చికాగో గగనతల సదస్సులు జరిగాయి. అనంతరం అంతర్జాతీయ విమానయాన సంస్థ ఏర్పాటైంది. విమానాల హైజాకింగ్ ప్రారంభం కావడంతో 1963లో టోక్యో సదస్సులో యాంటీ హైజాకింగ్ నిబంధనలను రూపొందించారు. 1970లో హేగ్ సదస్సు, 1971లో మాంట్రియల్ సదస్సు నిర్వహించాక గగనతలంలో దేశాల అంతరిక్ష సరిహద్దులను నిర్ధారించడం జరిగింది. భౌగోళిక సరిహద్దులకు కొంచెం ఆవల అంతరిక్ష సరిహద్దులను, సముద్ర జలాల సరిహద్దులను నిర్ధారించారు. అంతరిక్షంలోకి పంపించే వ్యోమగాములు, వారి భద్రత, వ్యర్థ పదార్థాలకు సంబంధించి 1967లో జరిగిన అంతరిక్ష సదస్సులో స్పష్టతను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతరిక్షంలో వ్యర్థాలకు బాధ్యులైన దేశాలపై తీసుకోవల్సిన చర్యలపై 1971లోనే ఒడంబడిక కుదిరింది. అంతరిక్షంలోకి ఏ దేశం ఏ నౌకలను ప్రయోగిస్తోందో కూడా అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా నమోదు చేయాలని నిర్ణయించారు. చంద్రుడు ఇతర బాహ్య గ్రహాలపై ఏయే దేశాలు ఎలాంటి పరిశోధనలను చేపడుతున్నాయో కూడా నమోదు చేసేలా 1979 ఒడంబడికలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు సంతకాలు చేశాయి. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవడంపై వియన్నా సదస్సులో ఆమోదం తెలిపి 1992వ సంవత్సరాన్ని అంతర్జాతీయ అంతరిక్ష సంవత్సరంగా కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.
స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే అంతరిక్ష పరిశోధనపై భారత్ దృష్టి సారించింది. 1970 డిసెంబర్ 16న హేగ్‌లో జరిగిన ఒడంబడికకు అనుగుణంగా భారత్ యాంటీ హైజాకింగ్ అంతర్జాతీయ నిబంధనలతో కూడిన సమగ్ర చట్టాన్ని 1982 నవంబర్ 6న తీసుకువచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాలూ అదే సమయంలో యాంటీ హైజాకింగ్ చట్టాలను చేశాయి. 2010లో బీజింగ్ ప్రొటోకాల్‌ను అనుసరించి, తర్వాత దేశంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2016లో యాంటీ హైజాకింగ్ చట్టాన్ని సవరించింది. వ్యక్తిగతంగా విమానాల్లో కూర్చుని బెదిరింపులకు దిగి హైజాకింగ్ చేయడమేగాక, సుదూర ప్రాంతాల్లో కూర్చుని టెక్నాలజీ వినియోగించుకోవడం ద్వారా విమానాలను తమ అదుపులోకి తీసుకోవడం లేదా ప్రయాణీకులకు, ఆస్తులను హైజాక్ చేయడానికి చేసే అన్ని ప్రయత్నాలూ నేరంగా పరిగణిస్తూ 2016 యాంటీ హైజాకింగ్ చట్టాన్ని రూపొందించింది.
ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత తొలి కేసు ఒక వ్యాపారవేత్తదే. కఠినమైన హైజాకింగ్ వ్యతిరేక చట్టం -2016 అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి నమోదైన కేసులో దోషి బిర్జుకు అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు (ఎన్‌ఐఎ స్పెషల్ కేస్ 1/2018) శిక్షను ఖరారు చేసింది. విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఉత్తుత్తి బెదిరింపులకు పాల్పడిన ముంబయి పారిశ్రామిక వేత్త బిర్జు కే సల్లా అలియాస్ అమర్‌సోనికి జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు, ఐదు కోట్ల రూపాయల జరిమానా విధించింది. యాంటీ హైజాకింగ్ యాక్టు 2016లోని సెక్షన్ 3(1), 3(2)ఎ, 4(బి) నిబంధనల కింద శిక్షార్హుడని తేల్చింది. బిర్జు చర్యల వల్ల ఇబ్బంది పడ్డ విమాన సిబ్బందికి , ప్రయాణీకులకు నష్టపరిహారంగా ఆ సొమ్మును చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ కేఎం దవే ఆదేశించారు. పైలట్‌కు, కోపైలట్‌కు లక్ష రూపాయిలు చొప్పున, ఎయిర్ హోస్టెస్‌లకు 50వేలు చొప్పున, ప్రయాణీకులకు 25వేలు చొప్పున చెల్లించాలని ఆదేశించారు.
2017 అక్టోబర్ 30న ముంబయి- ఢిల్లీ జెట్ ఎయిర్‌వేస్ విమానం ఏడుగురు సిబ్బంది, 115మంది ప్రయాణీకులతో ముంబయి నుండి బయలుదేరింది. ఇందులో ప్రయాణించిన బిర్జు కే సల్లా తన ప్రియురాలి కోసం ఈ దుస్సాహసానికి పూనుకున్నాడు. వేకువ జామున 2.50 గంటలకు ముంబయి నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికి క్యాబిన్ క్రూ సభ్యురాలు శివానీ మల్హోత్రా టాయిలెట్‌లో ఉర్దూ భాషలో ఆంగ్లంలోనూ ఉన్న ఒక ప్రింటవుట్‌ను గమనించారు. ఆ విషయాన్ని సూపర్‌వైజర్ నిఖిత జొనేజాకు తెలియజేయడంతో ఉర్దూ వచ్చిన సిబ్బందితో చదివించారు. విమానం హైజాక్ చేస్తున్నట్టు పేర్కొన్న సందేశం అందులో ఉంది. విమానంలో 12 మంది హైజాకర్లు ఉన్నారని, బాంబులు కూడా అమర్చామని ఆంగ్లంలో, ఉర్దూలో టైప్ చేసిన కాగితాలను విమానం మరుగుదొడ్డిలోని టిష్యూ పేపర్ బాక్స్‌లో ఉంచాడు. ఆ లేఖల్లో చివర ‘అల్లాహో అక్బర్ ’ అని రాశాడు. ఆ కాగితాలను చూసిన విమాన సిబ్బంది భయపడిపోయారు. విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌లో దించేశారు. బిర్జును అరెస్టు చేసి, గత జనవరిలో అభియోగపత్రం దాఖలు చేశారు. విమానంలో ప్రయాణించడానికి ముందు అతడు ఈ బెదిరింపులేఖను ల్యాప్‌టాప్‌లో టైప్ చేసి, తన కార్యాలయంలో ప్రింట్ తీసుకున్నాడని, తర్విత గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయంతో ఉర్దూలోకి అనువదించాడని తేలింది. తన ప్రియురాలు ఢిల్లీలోని జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పనిచేస్తోంది. హైజాక్ బెదిరింపుల వల్ల ఆ విమానయాన సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేస్తుందని, ఫలితంగా తన ప్రియురాలు ముంబయికి వస్తుందనే భావనతో ఈ పనిచేసినట్టు బిర్జూ అంగీకరించాడు. దీంతో దేశంలోని ఏ విమానంలోనూ ప్రయాణించకుండా ఆయన పేరును బ్లాక్‌లిస్టులో పెట్టారు.
ఇలాంటి చర్యలను ఎదుర్కొన్న మొదటి వ్యక్తి కూడా బిర్జూ కావడం గమనార్హం. ఈ మేరకు ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానం 150 పేజీల తీర్పును వెలువరించింది. చట్టం అమలు చేయడంతోనే సరిపోదు, నిరంతర అప్రమత్తత అనివార్యం. ‘అదిగో పులి..’ అన్నట్టు ఉత్తుత్తి హెచ్చరికలే కదా! అని జాగురుకత లేకుంటే ఏదో ఒక రోజు నిజమైన పులి వచ్చినట్టే పెను సంచలనం జరిగే ముప్పు లేకపోలేదు.

-బీవీ ప్రసాద్ 98499 98090