మెయిన్ ఫీచర్

టాలీవుడ్‌పై గంధపు గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ ఇండస్ట్రీని -క్రమంగా గంధపు పరిమళాలు కమ్ముతున్నాయి.
చూపు తిప్పడానికి చాన్సివ్వకుండా -శే్వత సుగంథాలు పల్లపర్చుకుంటున్నాయి.
ఔనన్నా కాదన్నా కన్నడ అందాలదే రాజ్యం, భోగం.
తెలుగు చిత్ర సీమలో తేటతెనుగు అందాలకు ఎప్పుడో కాలంచెల్లింది. నటనకే అగ్రతాంబూలం అన్నన్నీ రోజులూ -తెలు’గంథాలు తెర తివాచీపై పల్లపర్చుకున్నాయి. ఎప్పుడైతే -ఆకృతికీ, అందానికి ప్రాధాన్యత పెరిగిందో అప్పటినుంచీ తెలుగు భాషా హీరోయిన్లకు తెరపడింది. కాలానుగుణంగా సంప్రదాయం చెదిరిపోయి.. కట్టూబొట్టూ కదిలిపోయి.. వేషధారణలో వేగం పెరగడంతో -నాటినుంచీ తెలుగు హీరోయిన్లు దాదాపుగా తెరమరుగయ్యారన్నది కాదనలేని కారణం. ఇలాంటివి ఎన్ని కోణాలు వెతుక్కున్నా -ఈ కారణం పరిధిలోనే ఉంటాయన్నది ఔననాల్సిన నిజం.
సో, పైన ప్రస్తావించిన కారణాల రీత్యా -తెలుగు సినిమా వాతావరణం మారింది. స్వభావం మారుతోంది. పరభాషా అందాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. వాళ్ల హవా కొనసాగుతోంది. ఎక్కడినుంచో ఎగిరొచ్చిన సీతాకోక చిలుకలు -పరిశ్రమలో ఫలితాలు అందుకోకున్నా, ప్రాధాన్యత సంపాదిస్తున్నాయి. ఒక్క సినిమా హిట్టుకొట్టినా, పుంజీడు సినిమాలు ఫ్లాపులైనా -పాపులార్టీని మాత్రం మూటగట్టుకొంటున్నాయి. టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలకు పరభాషా హీరోయిన్లు -ఓ క్రేజ్. అందుకే ఎప్పటికప్పుడు తమిళ పొన్నులనో.. మలబారు వయ్యారాలనో.. ముంబై ముద్దుగుమ్మలనో ఏరికోరి తెచ్చి -తెరపై చూపిస్తున్నారు. స్టార్‌హీరోల సరసన పర భాషా హీరోయిన్లను ఒప్పించేందుకు నెలల తరబడి ప్రాజెక్టుల్ని పోస్ట్‌పోన్ చేస్తున్నారు. భారీ పరిహారాన్ని వెదజల్లుతున్నారు. ఇతర సౌకర్యాల కల్పనకూ వెనుకాడటం లేదు.
**
మనకెప్పుడూ పొరిగింటి పుల్లకూరు రుచి -అన్నది సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో నిర్థారణైంది. ఆ కారణంగానే పక్క రాష్ట్రాల హీరోయిన్లను దిగుమతి చేసుకోవడం అలవాటైంది. తెలుగు సినిమా చరిత్రను క్లుప్తంగా పరిశీలిస్తే -ఒకప్పుడు బాలీవుడ్ బ్యూటీలను ఎరువు తెచ్చుకోవడం ఒక ట్రెండ్. హిందీలో ఏ కొత్త హీరోయిన్ వచ్చినా -రెమ్యూనరేషన్‌తో సంబంధం లేకుండా ఆమెను తెలుగు తెరకు తెచ్చేందుకు నిర్మాతలు రిస్కే చేసేవారు. అదొక ప్రెస్టీజ్‌లా ఫీలయ్యేవారు కూడా. బాలీవుడ్ భామల కొరత రావడంతో -మనవాళ్ల కన్ను మాలీవుడ్‌పై పడింది. దాంతో అప్పటికే ఒకటీ అరా సినిమాల కోసం టాలీవుడ్‌కు వచ్చే మాలీవుడ్ హీరోయిన్ల సంఖ్య పెరుగుతూ, బలపడుతూ వచ్చింది. అలా వచ్చిన అందమైన మల్లూ బేబీలు టాలీవుడ్‌లో దశబ్దాలపాటు తిష్టవేసిన సందర్భాలూ లేకపోలేదు. అందాల కోసం మరింత అనే్వషణ కొనసాగించిన టాలీవుడ్ -గంధపు పరిమళాలవైపు పరుగులు తీసింది. తరువాత -ఒక్కో సీజన్‌లో ఒక్కో పొరుగు రాష్ట్రం నుంచి లేదా బాలీవుడ్ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకునే సంప్రదాయం పూర్తి అలవాటుగా మారింది. దీంతో -తెలుగు పిల్లలు తెరపై కనిపించే రోజులే కరవయ్యాయి. ఉనికి చాటుకోడానికి అన్నట్టు ఏళ్లకేళ్ల తరువాత ఏ ఒక్కరో.. ఇద్దరో ఒకట్రెండ్ సినిమాలు చేయడం తప్ప -తెలుగు తెరపై తెలు’గంథపు పరిమళాలు అస్సలు లేవన్నది ఎవ్వరూ కాదనలేని నిజం.
***
ఇప్పటి వాతావరణాన్ని, ఈ కొద్దికాలంలో వచ్చిన కొన్ని సినిమాలను పరిశీలిస్తే -ఓ నాలుగైదేళ్లపాటు టాలీవుడ్‌పై గంథపు పరిమళాలు గుభాళించనున్నాయన్న విషయం అర్థమవుతుంది. నాలుగైదేళ్లు ఒక ఊపు ఊపేసిన మాలీవుడ్ బ్యూటీలు కాస్త వెనకడుగు వేయడంతో -శాండిల్‌వుడ్ బ్యూటీలు దూకుడు చూపిస్తున్నారు. నిజానికి టాలీవుడ్‌కు కన్నడ అందాల పరుగులు ఇప్పటివేం కాదు. అలనాటి బి సరోజాదేవి నుంచి జయంతి, జమున (కన్నడ మూలం), జయలలిత (కన్నడ మూలం), భారతి, సౌందర్య, కన్నడ మంజుల, అనుష్క శెట్టి.. ఇలా కన్నడ నుంచి ఎగిరొచ్చిన అందాలు ఎనె్నన్నో. వీళ్లంతా ప్రతిభను చూపించినోళ్లే. తెలుగు తెరపై ప్రాధాన్యత సంపాదించినోళ్లే. పాపులార్టీతో ఒక వెలుగు వెలిగినోళ్లే.
***
స్టార్ హీరోలు ప్రభాస్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూ. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లే కాదు, సీనియర్ హీరోలు, ఇప్పుడిప్పుడే స్టార్ హోదాకు దగ్గరవుతున్న హీరోలు.. అప్‌కమింగ్ హీరోలు సైతం కొత్త అందాల కోసం పక్క రాష్ట్రాలవైపు చూస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ప్రూవ్ చేసుకున్న బెంగళూరు బ్యూటీలకే ఓటేస్తున్నారు.
గీత గీసేసింది
ఛలో సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి అడుగుపెట్టింది రష్మిక మండన్న. గీత గోవిందం సినిమాతో హీరోలు, నిర్మాతలు, దర్శకుల మెదళ్లలో పెద్ద గీత గీసేసింది. అనూహ్యంగా దూసుకొచ్చిన ఈ కొత్తందం -రెండు బ్లాక్‌బస్టర్ హిట్లతో దాదాపుగా తిష్టవేసేసింది. ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు దగ్గరవుతుండటంతో విజయ్ దేవరకొండతో సమానంగా రష్మిక క్రేజ్ పెరుగుతోందంటే ఆమె ప్రభావాన్ని అంచనా వేసుకోవచ్చు. ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను విపరీతంగా పెంచుకున్న రష్మిక -ఒక్కసారిగా స్టార్‌హీరోల హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టుతో యువత గుండెల్లో వాలిపోయిన ఈ బ్యూటీ కెరీర్ -టాలీవుడ్‌లో బ్రేకుల్లేకుండా పరుగులు తీస్తోందంటే అతిశయోక్తి కాదు. అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటు సూపర్ స్టార్ మహేష్‌బాబు సైతం ఆమెను హీరోయిన్‌గా తమ ప్రాజెక్టుల్లో ఓకే చేసుకున్నారంటే -రష్మిక క్రేజ్ ఎక్కడికి పెరిగిందో అంచనా వేయొచ్చు. నితిన్ ‘్భష్మ’, అఖిల్ తరువాతి ప్రాజెక్టుల్లో సైతం రష్మికకు చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క తమిళ, కన్నడ చిత్రాల్లోనూ రష్మికకు తక్కువ పాపులార్టీ లేదు. సో, అటు స్టార్ హీరోలు, ఇటు అప్‌కమింగ్ హీరోలతో -బ్యూటిఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తోంది రష్మిక.
చాలా శ్రద్ధగా..
నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది శ్రద్ధ శ్రీనాథ్. కంటెంట్‌వున్న సినిమాలో నేచురల్ స్టార్ నానిని డామినేట్ చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో -సారాకు ఫ్యాన్ అయిపోయింది టాలీవుడ్. అందం, అభినయం, ఒకవిధమైన తెంపరితనం చూపించే పాత్రతో మెప్పించిన శ్రద్ధకు తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే అన్ని సినిమాలనూ ఒకే గాటన కట్టలేమంటూ జాగ్రత్త వహిస్తోన్న శ్రద్ధ -తన కెరీర్‌ను మరింత మలుపుతిప్పే కథల కోసం ఎదురు చూస్తోందట.
గురిచూసి మరీ..
టాలీవుడ్‌ను గురి చూసి మరీ కొట్టింది ముంబయి మోడల్ నిధి అగర్వాల్. కన్నడ మూలాలున్న నిధి తొలి తెలుగు సినిమా ‘సవ్యసాచి’తో టాలీవుడ్‌ను మెప్పించింది. అక్కినేని కాంపౌండ్‌లోకి అడుగుపెట్టి నాగచైతన్యతో సినిమా చేసింది. తరువాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా, రెండో ప్రాజక్టునూ అక్కినేని కాంపౌండ్‌లోనే పూర్తి చేసింది. చైతూ తమ్ముడు అఖిల్‌ను ‘మిస్టర్ మజ్ను’ అని పలకరించిన నిధి, తరువాత ఎదురు చూడాల్సిన పని లేకుండానే ప్రాజెక్టులు అందుకుంటోంది. తాజాగా ఎనర్జిటిక్ రామ్‌తో జోడీకట్టి ‘ఇస్మార్ట్ శంకర్’తో బిజీగా ఉంది. పూరిలాంటి స్టార్ డైరెక్టర్‌తో పని చేసే అవకాశం కెరీర్ తొలినాళ్లలోనే కొట్టేసిన నిధి, సినిమా సక్సెస్ అయితే మాత్రం మరో రెండేళ్లు తిష్టవేసినట్టే. తరువాత ఆమె చూపించే ప్రతిభపై టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ఏమిటన్నది తేలుతుంది.
ఆమధ్య ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగు పెట్టిన నభానటేష్ -అందానికీ టాలీవుడ్ ఫిదా అవుతోంది. ఇప్పుడు పూరి తెరకెక్కిస్తోన్న ఇస్మార్ట్ శంకర్‌లో తళుక్కుమంటోన్న నభాకు బలమైన భవిష్యత్ ఉందన్న అంచనాలు లేకపోలేదు. అందం, ఆహార్యం, చలాకీతనం.. అన్నీ కలబోసిన నభాను తమ ప్రాజెక్టుల్లో తీసుకునేందుకు కుర్ర హీరోలు, దర్శకులు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో తెలుగు తెరపైకి అడుగు పెట్టబోతున్న మరో కన్నడ అందం -కృతి శెట్టి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త హీరో, సాయితేజ్ సోదరుడు వైష్టవ్‌తేజ్‌తో ఈ బ్యూటీ జోడీ కడుతోంది. ‘ఉప్పెన’ టైటిల్‌తో వస్తోన్న చిత్రంలో కృతిశెట్టి బలమైన పాత్ర పోషిస్తోందని వినికిడి. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే కృతికి ఉప్పెన తరువాత మంచి చాన్స్‌లే రావొచ్చు. గత దశాబ్దకాలంలో కన్నడ నుంచి ఎగిరొచ్చిన కృతి కర్బందా, ప్రణీత సుభాష్, సంజన్న, నిక్కీ గాల్రాని, హరిప్రియ, సంచితా శెట్టి, నందితా శే్వత, పార్వతీ నాయర్‌నూ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సో.. పరిస్థితి చూస్తుంటే టాలీవుడ్‌ను కొద్దికాలం పాటు గంధపు పరిమళాలు అల్లుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

చిత్రాలు.. రష్మిక మండన్న
*ప్రణీత సుభాష్
*కృతి శెట్టి
*శ్రద్ధ శ్రీనాథ్
*కృతి కర్బందా
*నషానటేష్

-‘వి’