మెయిన్ ఫీచర్

భారతీయ ప్రతిభకు అద్దం ‘కమలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లాంటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ‘కమలి’..
అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలో ‘కమలి’కి దర్శకత్వం వహించిన సాషాకు ఉత్తమ దర్శకురాలుగా అవార్డు..
అంతేకాదు..
2020 ఆస్కార్ ‘ఉత్తమ డాక్యుమెంటరీ’ పురస్కారం కోసం ‘కమలి’ షార్ట్ లిస్ట్ అయ్యింది..
ఇవన్నీ సాషా మలచిన ‘కమలి’ డాక్యుమెంటరీ సాధించిన విజయాలు. ఇందులో ఓ తల్లి.. తన కూతురు ప్రతిభ వెలికి తీయడంలో పడిన కష్టం దాగుంది. ఈ డాక్యుమెంటరీలో నటించిన చిట్టితల్లి కథే ‘కమలి’.. వివరాల్లోకి వెళితే..
తమిళనాడు మహాబలిపురానికి చెందిన మహిళ సుగంతి. ఆమె బాల్యం అంతా నాలుగు గోడల మధ్యే గడిచింది. చిన్నతనంలో చిన్న చిన్న కోరికలు తీర్చుకునే స్వేచ్ఛ ‘ఆడపిల్ల’ అనే నెపం దూరం చేసింది. సుగంతికి అందరి ఆడపిల్లల్లా గట్ల వెంబడి గెంతాలని, నీళ్లల్లో చేపపిల్లలా ఈదాలని, చెట్టెక్కి మామిడికాయలను కోసుకుని తినాలని.. ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆమెవి. కానీ అవేవీ చేయడానికి సుగంతికి స్వేచ్ఛ ఉండేది కాదు. తల్లిదండ్రుల అదుపాజ్ఞలు, సమాజంలోని కట్టుబాట్లు ఆమెకి బంధనాలుగా మారాయి. ‘స్వేచ్ఛ’ అంటే పరిచయమే లేని ఆమెకి పదిహేడు సంవత్సరాలకే వివాహం చేశారు తల్లిదండ్రులు. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత పెద్ద తేడా తెలియలేదు ఆమెకి. కారణం పెళ్లికి ముందు కంటే పెళ్ళైన తరువాత మరిన్ని ఆంక్షలు వచ్చి పడ్డాయి. అర్థం చేసుకునే భర్త దొరకలేదు. అలాగని ఆ వివాహబంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. భర్త దూరమయ్యాడు. ఆ సమయానికి ఆమెకు ఒక కొడుకు, కూతురు. తొమ్మిది సంవత్సరాల ‘కమలి’తో పాటు, చిన్న కొడుకు హరీషే ఆమె లోకం. సముద్రం ఒడ్డున మసాలా చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది సుగంతి. చిన్నప్పుడు బాల్యంలోని స్వేచ్ఛను కోల్పోయింది కాబట్టి ఆమెకు దాని విలువ సుగంతికి బాగా తెలుసు. అందుకే తన పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వారికి చదువు నేర్పిస్తూనే కూతురికి స్కేట్ బోర్డుపై ఉన్న ఆసక్తిని గమనించి వెన్ను తట్టింది.
‘ఆడపిల్లలకు అలాంటి ఆటలెందుకు? కిందపడి కాళ్లూ, చేతులూ విరిగితే ఇబ్బంది కదా..’ అంటూ చుట్టుపక్కల వాళ్లు అంటున్న మాటలను పెడచెవిన పెట్టింది సుగంతి. కమలి మామయ్య సంతోష్‌మూర్తి మంచి స్కేటర్. అతని స్నేహితుడు కమలికి చిన్నతనంలో ఆటవిడుపుగా ఆమెకి స్కేట్‌బోర్డ్ కొనిచ్చాడు. దాంతో స్కేట్‌బోర్డ్‌పై కమలికి ఆసక్తి కలిగింది. అప్పటినుంచి కమలి రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకలా స్కేట్‌బోర్డుతో స్కేటింగ్ చేయడం మొదలెట్టింది. ఏ గురువూ లేకుండానే తనంతట తానే అనేక విన్యాసాలు నేర్చుకుంది. మేనమామ నుండి కొన్ని సలహాలు తీసుకున్నా రోడ్లపై తనంతట తాను కుందేలు పిల్లలా పరుగులు తీసేది. స్కేట్‌బోర్డుపై ఆమె చేసిన విన్యాసం చూసిన ఓ స్కేటర్ ఆమె విన్యాసాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది కాస్త ప్రపంచ స్కేట్ బోర్డింగ్ నిపుణుడు టోనీహాక్‌ను చేరింది. దాన్ని అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కమలి ఫొటోను కూడా షేర్ చేశాడు. అంతే.. ఒక్కసారి ప్రపంచమంతా కమలి వైపు చూడటం మొదలుపెట్టింది. ఎంతగా అంటే ప్రముఖ న్యూజిలాండ్ దర్శకురాలు ‘సాషా రెయిన్‌బో’నే స్వయంగా వచ్చి కమలి, సుగంతిలపై ఒక అంతర్జాతీయ డాక్యుమెంటరీ తీసేంతగా..
అసలు ముందు సాషా ‘ ఆల్ఫా ఫీమేల్’ అనే పాటను తీయడానికి భారతదేశానికి వచ్చింది. దీన్ని స్కేట్ బోర్డింగ్ చేసే బాలికలపై చిత్రించాలనుకుంది. అప్పుడే కమలి, సుగంతిల గురించి సాషా పూర్తిగా తెలుసుకుంది. ముఖ్యంగా కూతురికోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం ఆమెను కదిలించింది. అందుకే పాట పూర్తిచేసి న్యూజిలాండ్ వెళ్లిపోయిన సాషా మళ్లీ తిరిగి భారతదేశానికి వచ్చి డాక్యుమెంటరీని మొదలుపెట్టింది. డాక్యుమెంటరీ గురించి సాషా అడిగితే ఆమె ఇలా చెబుతోంది..
‘కమలి కథలో భారతదేశ గొప్పతనం ప్రతిబింబిస్తోంది. ఒకే ఒక వ్యక్తి ఎంతటి మహత్తర మార్పు తీసుకురాగలదో తెలుపుతుంది. నా దృష్టిలో మాత్రం సుగంతి చాలా పెద్ద హీరో. ఇలాంటి తల్లులు ఉన్నంతకాలం ఆడపిల్లలకు ఎలాంటి లోటూ ఉండదు. వారి ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. స్కేట్ బోర్డ్ ఆట అంటేనే పరిస్థితులకు ఎదురొడ్డి వెళ్లగలగడం.., సమాజం ముందు ధైర్యంగా నిలబడగలగడం.., మనల్ని మనం నియంత్రించుకోవడం.. మరి అలాంటి విజయవంతురాలైన, ధైర్యశాలి కమలి గురించి ప్రపంచానికి తెలియకపోతే ఎలా? అందుకే నేను ఈ డాక్యుమెంటరీని తీశాను’ అని చెబుతోంది సాషా. దీని గురించి కమలి తల్లి సుగంతి మాట్లాడుతూ ‘ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చిన్నప్పటినుంచీ ఆడపిల్ల అయినందువల్ల ‘స్వేచ్ఛ’ అంటే ఏమిటో తెలియకుండా నాలుగు గోడల మధ్యా పెరిగాను. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆడపిల్లలకు కూడా స్వేచ్ఛ ఉండాలని నా కూతురు కమలికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాను. తను ఏం చేయాలనుకున్నా చేయనిచ్చాను. ఇక ముందు కూడా ఆ పాప ఏం చేయాలన్నా చేయిస్తాను. ఇరుగు పొరుగు మాటలను విని వెనుకడుగు వేయను. నా కూతురు ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్లొచ్చింది. కమలిపై సినిమా కూడా వచ్చింది.. ఒక తల్లిగా నాకు ఇంతకంటే ఏం కావాలి? ఈ సంతోషంలో నేను పడిన కష్టం, శ్రమ అన్నీ మర్చిపోయాను’ అని ఎంతో సంతోషంతో చెబుతోంది సుగంతి.
ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న కమలి భవిష్యత్తులో ప్రో స్కేటర్, ప్రో సర్ఫర్‌గా మారడంతో పాటు వెటర్నరీ డాక్టర్ కావాలనుకుంటోంది. తమ ఊర్లో వాళ్లు అంటున్న మాటలను ఏమాత్రం లెక్కచేయకుండా సుగంతి చెన్నైలోని పారిశ్రామికవేత్త ‘అనీ ఎడ్వర్డ్స్’ సహాయంతో తొమ్మిదేళ్ల కమలిని తీసుకుని విదేశాలకు వెళ్లింది. అతనే కమలిని ప్రముఖ అంతర్జాతీయ స్కేట్ బోర్డర్ జెమీ థామస్‌కి పరిచయం చేశాడు. కమలి ప్రతిభకు మెచ్చిన థామస్ ఆమెకి ఒక స్కేట్ బోర్డ్‌ను కూడా బహుమతిగా ఇచ్చాడు. అలా కమలి ఇప్పటికే పలు అంతర్జాతీయ స్కేటర్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా స్కేట్ బోర్డింగ్ క్రీడకు ప్రచారం చేయబోతోంది. అంతేకాదు.. సాషా తీసిన ‘కమలి’ అనే డాక్యుమెంటరీకి అట్లాంటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు వచ్చింది. అలాగే అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ పోటీలో సాషాకు ఉత్తమ దర్శకురాలుగా అవార్డు వచ్చింది. 2020 ఆస్కార్ ‘ఉత్తమ డాక్యుమెంటరీ’ పురస్కారం కోసం ‘కమలి’ షార్ట్‌లిస్ట్ కూడా అయ్యింది. త్వరలోనే ‘కమలి’ మనకి ఆస్కార్ పురస్కారాన్ని కూడా తెచ్చిపెడుతుందేమో చూద్దాం.. ఏదేమైనా ఆల్ ది బెస్ట్ కమలి..