మెయన్ ఫీచర్

నరేంద్రుడి నిర్ణయాత్మక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షాల నేతృత్వంలో కమల దళం లోక్‌సభ ఎన్నికలలో నిర్ణయాత్మక విజయం సాధించింది. మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీ సొంతంగా పూర్తి ఆధిక్యత సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా 2014లో రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ- ఇప్పుడు తన రికార్డును తానే అధిగ మించారు. 35 ఏళ్ళ తర్వాత ఒక రాజకీయ పార్టీ సొంతంగా 300కు పైబడి ఎంపీ సీట్లు గెల్చుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. మరోవంక ప్రతిపక్షాలు దాదాపుగా అన్ని కుప్పకూలి పోయాయి.
వందేళ్లకు పైబడిన చరిత్రగల, ప్రపంచంలోనే పురాతనమైన, సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా పొందలేక పోయింది. 17 రాష్ట్రాలలో అసలు ఆ పార్టీకి ఉనికి లేకుండా పోయింది. దక్షిణాదిన రెండు, మూడు రాష్ట్రాలలో తప్ప అన్ని చోట్లా భాజపా ఘన విజయాలే సాధించింది. భాజపా లేకుండా కేవలం డీఎంకే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ట్, బిజూ జనతాదళ్ మాత్రమే ఆధిక్యతను తమ తమ రాష్ట్రాలలో సాధించ గలిగాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఒక స్థానానికే పరిమితమైనప్పటికీ నాలుగు సీట్లు గెల్చుకోవడం ద్వారా అక్కడున్న అధికార పార్టీకి భాజపా నేతలు పెను సవాల్ విసిరారు.
తిరుగులేని ఒక బలమైన నాయకుడిని నరేంద్ర మోదీ రూపంలో దేశ ప్రజలు చూడటం కారణంగానే ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారని చెప్పవచ్చు. పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు గల ప్రతిపక్షాలు ప్రజల ముందు బలమైన ప్రత్యామ్నాయాన్ని ఉంచడంలో విఫలం అయ్యాయి. పైగా ప్రజల మనోభావాలను అవి అర్థం చేసుకోలేక పోయాయి. ఒక వ్యక్తికి వ్యతిరేకంగా తమ రాజకీయాలు సాగుతున్నాయనే అభిప్రాయాన్ని ప్రజలలో విపక్షాలు కలిగించాయి. చిన్నాభిన్నంగా కనిపించిన ప్రతిపక్ష శిబిరం ప్రజలను ఆకట్టుకోలేక పోయింది. గత ఏడాది కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రద ర్శించిన సమైక్యత ఆ తర్వాత ఛిద్రమైపోయింది. ప్రధాన మంత్రిగా మీ అభ్యర్థి ఎవరు? అని అమిత్ షా వంటి వారు ప్రశ్నిస్తుంటే ప్రతిపక్షాలు తడుముకోవలసి వచ్చింది. ఈ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒకటి, రెండు పార్టీలు తప్ప మిగతా విపక్షాలు ఆమోదం తెలపలేదు. మాయావతి, మమతా బెనర్జీ, శరద్ పవార్, దేవెగౌడ ... ఎవరికి వారుగా రెండు పదుల సీట్లు గెల్చుకొనే అవకాశం లేని వారు కూడా ప్రధాని పదవికి ఎత్తుగడలు వేశారు.
ఢిల్లీలో అక్కడక్కడా వేదికలపై ఉమ్మడిగా కనిపించే ప్రతిపక్షాలకు రాష్ట్రాలలో ఎవరి దారి వారిదిగా మారింది. దేశంలో పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వదిలి వేసి సమాజ్‌వాద్ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలసి కాంగ్రెస్‌ను మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా బలహీన పరచే ప్రయత్నం చేశాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కలివిడిగా తిరిగే సీపీఎం పశ్చిమ బెంగాల్, కేరళలో మాత్రం మిత్రులకు ప్రత్యర్థిగా మారి పోయింది. ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడే మమతా బెనర్జీ తన రాష్ట్రంలో మాత్రం ఎవరికీ స్థానం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పడిన ఎన్సీపీ గుజరాత్‌లో మాత్రం వ్యతిరేకంగా పోటీ చేసింది. అందుకనే ప్రతిపక్షాల ఐక్యతను మహా కల్తీ కూటమిగా ప్రధాన మంత్రి మోదీ అభివర్ణించడాన్ని ప్రజలు ఆమోదించినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వివరించే బదులు ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులకు దిగడం ద్వారా ప్రతిపక్షాలు చేపట్టిన ప్రతికూల రాజకీయాలకు ప్రజల ఆమోదం తెలపలేదు. పైగా చౌకీదార్ చోర్ హై... అంటూ రాహుల్ గాంధీ ప్రధానిని నిందించడాన్ని కూడా ప్రజలు ఆమోదించలేదు. ప్రతిపక్షాలకు నిర్దుష్టంగా ఒక విధానం గాని, ఒక నాయకత్వం గాని, ఒక నినాదం గాని లేకుండా పోయింది. రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ పథకాన్ని చాలా ఆలస్యంగా చేపట్టిన్నట్లు కనిపిస్తున్నది. దాని గురించి ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేసినట్లు లేదు. ఆ పథకం ప్రజల దృష్టిని ఆకట్టుకొనే వ్యవధి లేకుండా పోయింది.
ప్రధాని మోదీ సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి అనేక అంశాలు కలసి వచ్చాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికినట్లు స్పష్టం అవుతున్నది. పెద్దనోట్ల రద్దు కారణంగా అనేక ఇబ్బందులకు గురైన ప్రజలు సహితం మూకుమ్మడిగా, కులాలు, ప్రాంతాలకు అతీతంగా భాజపాకు వోటు వేయడం గమనార్హం. స్వచ్ఛ్ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి వసతి కల్పించడం, ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ పొయ్యిలను అందించడం వంటి అతి సాధారణమైన పథకాలు అసాధారణమైన ఫలితాలు ఇచ్చాయి. మహిళలను మూకుమ్మడిగా ప్రధాని వైపు మళ్లించాయి. మరోవంక ముస్లిం మహిళలను విడాకుల ఊబి నుండి కాపాడటం కోసం చేసిన ప్రయత్నం కొంతమేరకు ఫలించింది.
కశ్మీర్‌లోని ఫుల్వమా వద్ద పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిలో 40 మంది మన సిపాయిలు అమరులైన తర్వాత ప్రతిగా ఫిబ్రవరి 26న బాలాకోట్ వద్ద పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి- భారత వాయుసేన జరిపిన దాడులు దేశ సమగ్రత, జాతీయ భద్రత, దేశ రక్షణ వంటి భావాత్మక అంశాలు రేకెత్తించి ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఈ అంశాలను తేలికపరచే ప్రతిపక్షాల ప్రయత్నాలు వికటించాయి. కేవలం ఇటువంటి భావాత్మక అంశాలపై మోదీ ఈ అసాధారణ విజయం సాధించారని అనుకొంటే పొరపాటు కాగలదు. పలు అభివృద్ధి అంశాలను ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రజల ముందుంచారు. ముద్రా రుణాల నుండి ఆయుష్మాన్ భారత్ వరకు, జనధన్ నుండి జాతీయ రహదారుల నిర్మాణం వరకు అనేక పథకాలు ప్రజల దృష్టిని ఆకట్టుకున్నాయి.
భాజపా ఇటువంటి విజయం సాధించడానికి మరో బలమైన కారణం ఏమిటంటే- తన మిత్రులతో బలమైన పొత్తులను ఏర్పాటు చేసుకోగలిగింది. మిత్ర పక్షాలతో గల అంతరాలను తగ్గించుకొని, కొన్ని సందర్భాలలో ఒక మెట్టు వెనుకకు దిగి మరీ వారికి కొంత చోటు కలిగించే ప్రయత్నం చేసింది. కాగా, పొత్తుల విషయంలో ప్రతిపక్షాలు మాటలకే పరిమితమై, ఆచరణలో ముందడుగు వేయలేక పోయాయ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పొత్తు ఏర్పాటు కోసం విఫల యత్నం చేయడం, చివరిలో పరస్పరం దూషణలకు దిగడం ఒక విధంగా భాజపాకే ప్రయోజనం కలిగించింది.
బిహార్‌లో గత ఎన్నికలలో తాను గెలుపొందిన సీట్లకన్నా తక్కువ సీట్లకు పరిమితమై న భాజపా నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్ లతో సీట్లు పంచుకుంది. నిత్యం ప్రధాని పై విమర్శలు కురిపించే శివసేనతో సహితం మహారాష్టల్రో బలమైన పొత్తు ఏర్పాటు చేసుకోవడంతో పాటు క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలూ భుజం భుజం కలిపి పనిచేశారు. ఈ విధమైన వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రతిపక్షాలలో అస్సలు కనిపించనే లేదు. ఉత్తరాదిన హిందీ రాష్ట్రాలలో కొన్ని సీట్లు కోల్పోయినా- పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో భర్తీ చేసుకొనే విధంగా భాజపా వ్యూహాత్మకంగా ముందునుండే అడుగులు వేస్తూ వచ్చింది. అటువంటి దీర్ఘకాల రాజకీయ ఎత్తుగడలు ప్రతిపక్షాలలో కనిపించనే లేదు.
ఈ ఘన విజయాన్ని హిందుత్వ విజయంగా భాజపా నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. హిందుత్వ అంశాలతో నేరుగా ప్రచారం చేయక పోయినా హిందుత్వ పట్ల దోష భావనను వ్యక్తం చేయకుండా ఒక విధంగా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు చెప్పవచ్చు. ప్రజల మనోభావాలను గెలుచుకొనే విధంగా వ్యవహరించారు. నామినేషన్ వేసే ముందు వారణాసిలో గంగా హారతి ఇవ్వడం, ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత కేదారనాథ్, బదరీనాథ్‌లలో గడపడం వంటి పలు అంశాలు ప్రజలపై ప్రభావం చూపాయి.
వాస్తవానికి దేశ ఆర్థిక పరిస్థితులు అంత సంతృప్తికరంగా లేవు. నిరుద్యోగం, కుంటుపడుతున్న పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయరంగ సంక్షోభం, జీఎస్టీ అమలులో అపశ్రుతులు వంటి అనేక అంశాలకు ప్రజలు ప్రధాని మోదీని బాధ్యుడిగా భావించలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా 60 ఏళ్ళ పాటు సాగిన దుష్పరిపాలన భారాన్ని తాను మోస్తున్నట్లు ప్రజలను ఆయన నమ్మించగలిగారు. 2014లో నాటి యూపీఏ పరిపాలన పట్ల ఆగ్రహంతో ప్రజల మద్దతు పొందగలిగిన మోదీ ఈ సారి కేవలం తన అసాధారణమైన నాయకత్వ లక్షణాలతో వారి విశ్వాసాలను మరోసారి పొందగలిగారు. నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారు.

-చలసాని నరేంద్ర 98495 69050