మెయిన్ ఫీచర్

‘అబార్షన్’లో అతివకు స్వేచ్ఛ లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండూ అబార్షన్ల రద్దును కోరుకుంటూనే ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలోని
పురుషులు తమ పాపాల్ని కడిగేసుకునేదానికి అబార్షన్లని ఉపయోగించుకుంటుంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టే
పిల్లలకి బాధ్యత వహించడం తప్పుతుందని భావిస్తోంది.

అబార్షన్లను రద్దు చేయాలా? వద్దా? అనే చర్చ గత రెండు దశాబ్దాల కాలంగా ఉధృతంగా జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.6 రెట్ల మంది మహిళలు అబార్షన్లను ఆశ్రయిస్తున్నారు. అందులో 45 శాతం అబార్షన్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. భారతదేశం వంటి దేశాల్లో అయితే సగం అబార్షన్లు ప్రమాదకరమే.. అబార్షన్ చట్టంపై అవగాహన లేకపోవడంతో అవి మరిన్ని సమస్యలను తీసుకొస్తున్నాయి.

సాధారణంగా పెళ్లికాని యువతులు అబార్షన్ గురించి వైద్యులను సంప్రదించడానికి వెనకాడుతారు. అందుకే భారతదేశంలో అబార్షన్ చట్టాల్లో మార్పు తేవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. పార్లమెంటులో దీనిపై సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. పెళ్లయినా, కాకపోయినా మహిళలు అబార్షన్‌ను ఆశ్రయించవచ్చు. మహిళల వ్యక్తిగత గోప్యతకు కూడా ఈ బిల్లు ప్రాధాన్యమిస్తుంది. వైద్యులు మహిళలను అనుచిత ప్రశ్నలు అడగడానికి కూడా వీల్లేదు. 18 సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరి అనుమతి తీసుకునే అవసరం కూడా లేదు. గర్భం దాల్చిన 12 నుండి 20 వారాలలోపు అబార్షన్ చేయించుకోవడం భారతదేశంలో చట్టబద్ధమే.
అమెరికాలో..
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబార్షన్‌పై కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు చేసిన నేపథ్యం అందరికీ తెలిసిందే.. అలబామా రాష్ట్రంలో వివాదాస్పదమైన ఈ బిల్లును అనేక చర్చల అనంతరం అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. తల్లి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే తప్ప, మిగిలిన అన్ని రకాల అబార్షన్లను నిషేధించింది. అబార్షన్లు చేయడం ఇక నుంచి చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి 99 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 1973లో అమెరికన్ సుప్రీంకోర్టు అబార్షన్లను దేశవ్యాప్తంగా చట్టబద్దం చేసింది. అయితే కోర్టు తీర్పును సమీక్షించిన సెనెట్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. అత్యాచారం, వావి వరుసలు లేని సంబంధాలు, తల్లికి ప్రాణాపాయం ఉన్నప్పుడు మినహా మిగతా సందర్భాల్లో అబార్షన్‌కు తాను వ్యతిరేకమని ట్రంప్ చెప్పాడు. అబార్షన్ చట్టాలు, నియమ నిబంధనలు ఇప్పుడు అమెరికాలో ఎన్నికల అంశంగా మారింది. దీనిపై ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎటువంటి ఉదంతంలోనైనా అబార్షన్‌ను నిషేధిస్తూ అలబామా రాష్ట్రం కఠిన చట్టం చేసిన కొద్దిరోజులకు ట్రంప్ తన వైఖరిని వెల్లడించారు. ‘అలబామా చట్టాన్ని కోర్టుల్లో అడ్డుకునే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని, అయితే అప్పీళ్ల ద్వారా ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు వస్తుందని ఆశిస్తున్నాం. 1973లో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తుతం మితవాదులు మెజారిటీగా ఉన్న సుప్రీంకోర్టు తిరగరాయాలని కూడా కోరుకుంటున్నాం’ అని ప్రజలతో పాటు మరో పదహారు రాష్ట్రాలు కూడా భావిస్తున్నాయి.
ట్రంప్ ట్వీట్
అలబామా అబార్షన్ చట్టం గురించి ట్రంప్ ఇప్పటివరకూ మాట్లాడలేదు. కానీ ఇటీవల ఆయన ట్విట్టర్‌లో కొన్ని పోస్టులు పెట్టాడు. ‘నేను ఒక ప్రాణం ఎలాగైనా నిలబెట్టాలి అనే వాదనను బలంగా సమర్థిస్తాను. అయితే అందుకు మూడు మినహాయింపులు ఉన్నాయి. అత్యాచారం, వావివరుసలేని సంబంధాలు, తల్లి ప్రాణాలను రక్షించడం.. ఆ మినహాయింపులు. ఇది రొనాల్డ్ రీగన్ అనుసరించిన వైఖరి’ అని పేర్కొన్నాడు ట్రంప్. మితవాద సుప్రీంకోర్టు జడ్జిలు నీల్ గోరుచ్, బ్రెట్ కవన్నా వంటి వారిని తాను నియమించడం, వివిధ రాష్ట్రాల్లో అబార్షన్ చట్టాలు మరింత కఠినతరం కావడానికి దోహదపడిందని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘గత రెండేళ్లలో 105 మంది అద్భుతమైన కొత్త ఫెడరల్ జడ్జిలతోపాటు ఇద్దరు గొప్ప సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో మనం చాలాముందుకు వచ్చాం. జీవన హక్కుకు సంబంధించిన పూర్తిగా కొత్త సానుకూల దృక్పథం వచ్చింది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అబార్షన్ అనేది వివాదాస్పద అంశంగానే కొనసాగుతోంది. ప్రత్యేకించి ఎవలాంజికల్ క్రిస్టియన్లు అబార్షన్‌పై కఠిన ఆంక్షలు విధించడం కానీ, పూర్తిగా నిషేధించడం కానీ చేయాలని కోరుతున్నారు. అమెరికా ఓటర్లలో వీరు చాలా కీలకమైన భాగం. ఇందుకు ట్రంప్ ‘మనం సమైక్యంగా ఉండాలి.. ప్రాణం కోసం 2020లో గెలవాలి’ అని ట్వీట్ చేశాడు.
2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అబార్షన్ అంశం ముఖ్యమైన అంశంగా ఉంటుందని సీనియర్ డెమొక్రాట్స్ కూడా సూచిస్తున్నారు. మసాచుసెట్స్ సెనెటర్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్ వారెన్.. అలబామా అబార్షన్ నిషేధంపై స్పందిస్తూ.. ‘ఈ నిషేధం ప్రమాదకరం.. అత్యంత క్రూరమైనది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిప్పికొట్టడం ఈ బిల్లు రచయితల కోరిక’ అని పేర్కొంది.
పోప్ సంచలన నిర్ణయం
పోప్ ఫ్రాన్సిస్ అబార్షన్లపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గర్భస్రావం చేసుకున్న మహిళలకు క్షమాభిక్ష కల్పించాలని నిర్ణయించారు. అబార్షన్ చేయించుకున్న మహిళకు ప్రతి చర్చిలోనూ క్రైస్తవ పూజారులు క్షమాభిక్ష కల్పించే అధికారాలిస్తూ క్యాథలిక్ మత పెద్ద తాజా నిర్ణయాన్ని వెల్లడించారు. వాటికన్ సిటీ రిలీజ్ చేసిన ఓ ఉత్తరంలో పోప్ ఈ అంశంపై ప్రస్తావించారు. గత ఏడాది ఇదే అంశంపై తాత్కాలికంగా ఉపశమనం కల్పించిన పోప్ ఈసారి తన నిర్ణయాన్ని శాశ్వతం చేసేశారు. దేవుడు దయచూపలేని పాపం అంటూ ఏదీ లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అబార్షన్ వంటి వివాదాస్పద అంశంపై క్యాథలిక్ చర్చ తన కఠినమైన వైఖరిని సడలించడం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహిళ తన దేహంతో ఏం చేయాలో? ఏం చేసుకోవాలో? అనే అంశాన్ని పురుషుడు నిర్ణయించడాన్ని లేదా పురుషాధిక్య సమాజం నిర్ణయించడాన్ని ఆమె వ్యతిరేకిస్తోంది. లింగ సమానత్వానికి, అబార్షన్ చేసుకునే హక్కు ఉపయోగపడుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఆమె జీవితంలో లైంగికపరమైన అంశాలు కొంతభాగం మాత్రమే.. కానీ అవే ఆమె జీవితాన్ని శాసించడాన్ని ఆధునిక మహిళ వ్యతిరేకిస్తోంది. అబార్షన్లు, లింగనిర్ధారణలు చేయకూడదనే చట్టం వల్ల అక్రమ పద్ధతుల్లో అబార్షన్లు చేయడం ప్రైవేటు ఆసుపత్రులకు పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెడుతోంది. మహిళలను గర్భాలను మోసే యంత్రాలుగా గుర్తించడం వల్ల, ఆమె ఏ పద్ధతిలో గర్భాన్ని ధరించినా, అది నిలవాలని మతోన్మాద శక్తులు, ఫ్యూడల్ వ్యవస్థ బలంగా కోరుకుంటాయి. ఈ చట్రంలోనే అతి పెద్ద ప్రజా స్వామ్యయుత వ్యవస్థగా చెప్పుకుంటున్న భారతదేశ పాలకులు ఆలోచించడం, చట్టాలు చేయడం భావజాల దారిద్య్రాన్ని సూచిస్తోంది. పుట్టబోయే బిడ్డలకు ప్రాణం ఉంటుందని, వారికి హక్కులుంటాయని, పురిటి బిడ్డలను హత్యలు చేసే సంస్కారం మనది కాదని సమాజం నినదిస్తోంది. ఆ పిల్లల్ని కంటోన్న మహిళల హక్కుల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గర్భానికి కారణమైన పురుషుడ్ని ఏ మాత్రం ప్రశ్నించని సమాజం, ప్రేమ ముసుగులో మోసగించబడిన మహిళను మాత్రం ఛీత్కారానికి గురిచేస్తోంది. మహిళ పరువు హత్యలకు సరుకుగా మారిపోతోంది. మహిళలు గర్భం ధరించడానికి ప్రధాన కారణం ఎక్కువగా పురుషుల మోసాల వల్లే జరుగుతోంది. ఏ మహిళ కూడా అక్రమమైన పద్ధతుల్లో గర్భాన్ని దాల్చడానికి ఇష్టపడదు. అనివార్య కారణాలు, ఆధిపత్య లైంగిక హింసలకు బలైన మహిళలకు అక్రమ పద్ధతుల్లోనే అబార్షన్‌ను, ఆమెపై ఆధిపత్య లైంగిక హింసకు పాల్పడ్డ పురుషులే చేయిస్తారు. ఇక్కడ పుట్టబోయే బిడ్డ ప్రాణం పోయిందని మాట్లాడే సోకాల్డ్ సంఘాలు, మొదటగా ఆ మహిళ హక్కుల గురించి ఆలోచించడం లేదు. అలాగే మతం, కులం, జెండర్ కూడా ఆమెకు అబార్షన్ చేసుకునే హక్కు లేదంటోంది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న సున్నితమైన, క్లిష్టమైన అంశాలను చర్చించడానికి, మతగ్రంథాలను ఆధారంగా నిర్మించుకున్న నైతిక విలువలు ఆ వ్యవస్థను బుద్ధిమాంద్యం చేస్తాయి. ఫ్యూడల్ భావజాలంతో అబార్షన్ల రద్దు చట్టాన్ని చేయడాన్ని సామ్రాజ్యవాదం ప్రోత్సహిస్తోంది. సామ్రాజ్యవాదం వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్టు రూపంలో కనిపిస్తుంది కానీ అసమాన వ్యవస్థను సృష్టించడంలోనూ, మూఢనమ్మకాలను, ఫ్యూడల్ భావజాలాన్ని బలంగా మోయడంలోనూ అది బలంగా పనిచేస్తోంది.
మహిళల జీవితాన్ని గర్భం శాసిస్తోంది. అందుకే ఉద్యోగులైన మహిళలకు కనీసం మూడు సంవత్సరాలైనా వేతనం కూడిన సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. చదువుకునే విద్యార్థిని గర్భం ధరిస్తే, ఇక ఆ చదువుకు, తద్వారా ఆమె భవిష్యత్తుకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం పురుషుడిపై ఆధారపడి పరాన్నజీవిగా ఆధారపడవలసిందే.. అంతేకాకుండా ఆమె కుటుంబాన్ని సైతం అవాంచిత గర్భాలు తీవ్ర ఒడిదుడుకులను లోనుచేస్తాయి. పిండం మొదలైనప్పటినుంచే ఆ పిండానికి హక్కుంటుందా..? లేదా..? భూమిపై పుట్టినప్పటినుండే ఆ బిడ్డకు హక్కుంటుందా? అనే చర్చను అమెరికాలాంటి దేశాల్లో విసృతంగా చర్చించారు. గుడ్డు శాఖాహారంగా పరిగణిస్తున్నప్పుడు దానికి ప్రాణం లేనట్లే పిండం ఒక రూపంలోకి రానంతకాలం దానికీ హక్కుండదని అమెరికన్ డాక్టర్లు పేర్కొంటున్నారు. వాళ్లంతా అబార్షన్లు చేయించుకోవడం తప్పుకాదని భావించడం వల్ల ఆ వాదనను ముందుకు తీసుకుని వచ్చి ఉండొచ్చు.
ప్రతి మనిషి మానవత్వాన్ని, విలువలను, వ్యక్తిత్వాన్ని బాహ్య ప్రపంచం నుండే పొందుతాడు. మనిషి లోపలే ఇవి తయారవుతాయి. పిల్లవాడు జ్ఞానాన్ని పొంది వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి, తప్పనిసరిగా అతనికి బాహ్య ప్రపంచంలోని విషయాలు, సంబంధాలలోకి రావాల్సి ఉంటుంది. తల్లికి-బిడ్డకి మధ్య ఉన్న సామాజిక సంబంధంపై ఆధారపడి మాత్రమే పిండం మనుగడ ఆధారపడి ఉంటుంది. పిండానికి మానవత్వం రావడానికి ఆ పిండాన్ని, తల్లి చూసే సంబంధంపై ఆధారపడి ఉంటుంది. గర్భాన్ని దాల్చి, తాను బిడ్డకు జన్మనివ్వాలని, అతన్ని మానవుడిగా తీర్చిదిద్దాలని సంపూర్ణంగా భావించినప్పుడే పుట్టుక సంభవిస్తుంది. దీనికి భిన్నంగా తల్లి ఆలోచిస్తూ తనకు బిడ్డ అవసరం లేదు అనుకున్నప్పుడు పరిస్థితులు మారిపోతాయి. జీవప్రక్రియలో సైతం హఠాత్తుగా ఏ వస్తువు తనకదే నైతిక విలువలను రూపొందించుకోలేదు. మానవ, ఆర్థిక, సామాజిక, రాజకీయ సంబంధాలు మాత్రమే నైతిక విలువలను సృష్టించడానికి తోడ్పడతాయి. శాస్తవ్రేత అల్బ్రీ ప్రకారం భౌతిక పరిస్థితులు మారుతున్న క్రమంలోనే నైతిక విలువలు మారుతాయి. పుట్టని బిడ్డను మానవుడిగా గుర్తించడం అసాధ్యం. ఒకవేళ అట్లా అనుకున్నా తల్లికి కలలో అతను ప్రత్యక్షమైనప్పటికీ తల్లి, బిడ్డ అవసరం లేదని భావించినప్పుడు అకస్మాత్తుగా బిడ్డ సైతం అదృశ్యమవ్వవలసిందే.. మానవుడికి ముందు దశ పిండమే అయినప్పటికీ, దానికి మానవత్వం ఆపాదించడం కుదరదు. బిడ్డ పుట్టిన తర్వాతే మానవుడిగా రూపాంతరం చెందుతాడు.
స్ర్తి తన గర్భాన్ని ఉంచుకోవాలో లేదా తీసెయ్యాలో నిర్ణయించే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటుంది. అబార్షన్ చేసుకునే హక్కు స్ర్తికి లేకపోతే, అది మొత్తంగా ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సమానత్వాన్ని సాధించడానికి అప్పటివరకు ఆమెకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ ఒక్కసారిగా తృణీకారానికి లోనవుతాయి. భావప్రకటనా స్వేచ్ఛతో పాటు హుందాగా, గౌరవంగా బతికే హక్కును సైతం ఆమె కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ స్ర్తి గర్భంలోని పిండం హక్కు గురించి మాట్లాడాల్సి వస్తే స్ర్తి ఆ పిండానే్న వద్దనుకున్న పక్షంలో ఆ పిండానికి హక్కు అనే ప్రశే్న తలెత్తదు. ఇదే అంశాలను అమెరికా సుప్రీంకోర్టు సైతం పలు తీర్పుల్లో ఉదహరించింది. పెట్టుబడిదారీ దేశాల్లో ఆధునిక మహిళ ఉద్యమిస్తున్న తరుణంలోనే ఇటువంటి తీర్పులను న్యాయవ్యవస్థ చేయాల్సి వచ్చింది. తన శరీరాన్ని తన ఇష్టమొచ్చినట్లు మలచుకునే హక్కు ప్రతి మానవుడికీ ఉంటుంది. అలాగే గర్భాన్ని ధరించాలా? వద్దా? అనే అంశం పూర్తిగా స్ర్తికి సంబంధించిన విషయంగా ఉంటుంది. ఒకవేళ పెళ్లైన స్ర్తి విషయంలో, కుటుంబ బాధ్యతగా వ్యవహరించగలిగితే ఆమెకు నచ్చజెప్పే విధంగా భర్త, కుటుంబ సభ్యులు ప్రవర్తించవచ్చు. గర్భం అనేది స్ర్తి శరీరంలో ఒక భాగంగా చూసినప్పుడే ఆమెకు అబార్షన్ చేసుకునే అధికారం ఉంటుందని భావించవచ్చు. అబార్షన్ చేయించుకోలేకపోతే, అది మహిళ హక్కుని కాలరాసినట్టే అవుతుంది. అమెరికా రాజ్యాంగంలో 14వ అమెండ్‌మెంట్ ద్వారా మహిళకు అబార్షన్ చేసుకునే హక్కు కల్పించబడుతుంది. అయితే ఇథనేషియా(మెర్సీ కిల్లింగ్) సందర్భంలో అదే అమెరికా రాజ్యాంగం, ఒక వ్యక్తి తన దేహాన్ని ఆత్మహత్యకు గురిచేసుకుంటానంటే ఒప్పుకోదు. పౌరుడికి తన దేహంపై పూర్తి హక్కు ఉన్నప్పుడు దానిని ఏమైనా చేసుకునే అధికారం ఇవాల్సి ఉన్నప్పటికీ తన దేహానికి నష్టం చేసుకునే అధికారం తనకు లేదని అమెరికా రాజ్యాంగం పేర్కొంటోంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మెర్సీకిల్లింగ్‌కు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదించిన సందర్భాలున్నాయి. నిజానికి పునరుత్పత్తి హక్కు కలిగి ఉన్న స్ర్తి, అదే హక్కుతో తన గర్భాన్ని తనే చేధించుకోదు. సమాజం తనకు, తన బిడ్డకు సరైన గౌరవం, సౌకర్యాలు కల్పించగలిగితే అబార్షన్ జోలికి వెళ్లదు.
ఫ్యూడల్ భావజాలాన్ని మోసే శక్తులు స్ర్తిని హింసించడానికి, అవమానపరచడానికి అత్యాచారాలను ఒక ఆయుధంగా మలచుకుంటున్నాయి. అలాంటి వీరు కూడా స్ర్తికి అబార్షన్ చేసుకునే హక్కు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే తాము చేసిన అత్యాచార తప్పును గర్భదశలోనే తుంచేసుకునే సదవకాశం వారికి ఎల్లవేళలా ఉండటమే.. అయినప్పటికీ ఈ ప్రక్రియ అక్రమ పద్ధతుల్లో జరిగిపోతూనే ఉంది.
ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండూ అబార్షన్ల రద్దును కోరుకుంటూనే ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలోని పురుషులు తమ పాపాల్ని కడిగేసుకునేదానికి అబార్షన్లని ఉపయోగించుకుంటుంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టే పిల్లలకి బాధ్యత వహించడం తప్పుతుందని భావిస్తోంది. ఎందుకంటే శ్రమదోపిడీని కొనసాగించడానికి కావాలసిన దానికన్నా ఎక్కువగా శ్రామిక రిజర్వుడు సైన్యం ఇప్పటికే ఉంది. అందుకే పెట్టుబడిదారీ దేశాలన్నీ అబార్షన్ చేయించుకునే హక్కుని స్ర్తికి ఇస్తూ, ఆ గర్భానికి కారణమైన పురుషుడి శిక్షను రద్దుచేసుకునే అవకాశాన్ని ఇస్తోంది. స్ర్తి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా బలవంతపు అత్యాచారాలకు పాల్పడ్డ పురుషులను కాపాడుకోవడానికి ఈ చట్టాలను పయోగించుకుంటున్నారు.

అరక్షిత మార్గాలు వద్దు

ప్రపంచంలో నమోదయ్యే ప్రతీ రెండు అబార్షన్లలో ఒకటి కచ్చితంగా అరక్షిత మార్గంలో చేయించుకునే అబార్షనే అయి ఉంటుందని ‘ద లానె్సట్’ అనే మెడికల్ జర్నల్ చేసిన తాజా సర్వే తెలియజేస్తోంది. దాదాపు 5.57 కోట్ల అబార్షన్ల డేటాను (2010-2014 మధ్య) నమోదు చేసిన ఈ సర్వే అందులో 3.6 కోట్ల అబార్షన్లు సురక్షిత మార్గాల ద్వారా చేయించుకున్నట్లు వెల్లడించగా, 2.51 కోట్ల అబార్షన్లు మాత్రం అరక్షిత మార్గాల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఐపీ ఏ ఎస్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అనే ఒక భారత ఎన్జీవో చేసిన పరిశోధనల ప్రకారం భారతదేశంలో ప్రతిరోజూ అరక్షిత అబార్షన్ల వల్ల పదిమంది మహిళలు చనిపోతున్నారని తెలుస్తోంది. అనగా సంవత్సరానికి ఈ మరణాల సంఖ్య దాదాపు మూడు వేలు దాటడం విషాదకరం. ఈ గణాంకాలు ఇలా ఉంటే, మరో గణాంకాల రిపోర్టు ప్రకారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం అబార్షన్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగి దాదాపు 68 లక్షలకు చేరుకోవడం గమనార్హం. అందులో బడుగు, బలహీనవర్గాల మహిళల నుండి ఈ అబార్షన్ల శాతం 21.8 శాతం నమోదైతే, మధ్యతరగతి మహిళలు మాత్రం దాదాపు 42 శాతం ఈ అబార్షన్ల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం సురక్షిత మార్గాల ద్వారా అబార్షన్ చేయించుకోవాలనుకునే మహిళలు కచ్చితంగా చట్టబద్ధమైన మెడికల్ అబార్షన్‌వైపే మొగ్గుచూపాలి. వాక్యూమ్ ఆస్పిరేషన్ మరియు డిలటేషన్, ఇవాక్యుయేషన్ మొదలైన ప్రక్రియల్లో నిష్ణాతులైన వైద్యులు లేదా మెడికల్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఈ అబార్షన్లను చేయాలి. గర్భం ధరించాక ఎంత సమయంలో అబార్షన్ చేయించే అవకాశం ఉందనేది మెడికల్ కాలిక్యులేషన్ ఆధారంగా డాక్టర్ సూచనల మేరకే తెలుసుకుని ముందుకు వెళ్లాలి. అంతేకానీ అరక్షిత మార్గాల ద్వారా, వైద్యంపై అవగాహనలేని మంత్రసానులు లేదా ఆర్ ఎంపీ డాక్టర్ల చేత అబార్షన్లు చేయించుకోవడం కొన్నిసార్లు మరణానికి దారితీయవచ్చు. ఇలాంటివి చట్టరీత్యా నేరం కూడా..

చట్టాలను చేసి లాభమేమి..?

మహిళల ప్రత్యుత్పత్తి హక్కులో కూడా పురుషుల జోక్యం పెరిగిపోయి విచ్చలవిడి అబార్షన్లు పెరిగిపోయాయి. భ్రూణ హత్యలను నివారించడానికి పిఎస్‌డిటి చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. కానీ బలవంతపు అబార్షన్లు ఆగలేదు. ముఖ్యంగా ఆడపిల్లలను పురిట్లోనే చంపడం ఆగడం లేదు. చట్టాలు వచ్చినంత మాత్రాన పురిటి బిడ్డలు చావులు ఆగవని తేలిపోయింది. ఆడపిల్లలకు పురుషులతో సమానంగా అవకాశాలను, సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను సెక్స్‌సింబల్స్‌గా, కనే యంత్రాలుగా చూసే ఫ్యూడల్ భావజాలం తగ్గాల్సి ఉంది. పెట్టుబడిదారీ సంబంధాలు పెరుగుతోన్న కొద్దీ, నూతన సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మహిళలు కొత్తరూపాల్లో లైంగిక హింసలను ఎదుర్కోవలసి వస్తోంది. గ్రామీణ లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 947 మంది ఆడపిల్లలుంటే, పట్టణ ప్రాంతాల్లో 926గా ఉంది. దేశమొత్తంమీద సగటు నిష్పత్తిలో ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 940 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. 2011లో ఈ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 866 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండేవారు. 2012లో 940 మంది ఆడపిల్లలు, 2013లో ప్రతి వెయ్యిమందికి 895 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండేవారు. 2014లో 942 మంది ఆడపిల్లలు, 2015లో 943 మంది ఆడపిల్లలు, 2016లో 940 మంది ఆడపిల్లలుగా ఉంది. అంటే- చట్టం వల్ల ఆడపిల్లలను పురిట్లోనే చంపడం ఆగడం లేదు.

చట్ట సవరణ
ఐర్లాండ్‌లో ఉండే భారతీమ మహిళ సవితా హలన్నరవాక్ 17 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు తనకు గర్భస్రావం జరుగుతుందని తెలియడంతో అబార్షన్ చేసి పిండాన్ని తొలగించమని వైద్యుల్ని కోరింది. కానీ గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోంది కాబట్టి అబార్షన్ చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. తరువాత కొద్దిరోజులకే గర్భస్రావం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో సవిత చనిపోయింది. ఈమె మరణం దేశవ్యాప్తంగా వైద్యులకు, రాజకీయ నేతలకు, అబార్షన్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలనే ఆందోళనలు ఊపందుకున్నాయి. తల్లి ప్రాణాలకు ముప్పు వచ్చిందని వైద్యులు భావించినప్పుడు అబార్షన్ చేసేందుకు అనుమతినిస్తూ అబార్షన్ చట్టాన్ని సవరణ చేశారు. 2017లో ఎట్టకేలకు అబార్షన్‌కి ఆంక్షలు లేని అనుమతి ఇవ్వాలన్న సిఫార్సును పౌరసభ ఆమోదించింది. 2018లో చట్ట సవరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని ఐర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. 2018లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపగా 62 శాతం అనుకూలంగా ఓటు వేశారు. ప్రస్తుత చట్టం ప్రకారం.. గర్భిణీ స్ర్తి ఆరోగ్యం విషమించినప్పుడు మాత్రం ప్రభుత్వం అబార్షన్‌కు అంగీకరిస్తుంది.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి