మెయిన్ ఫీచర్

శిల్పినే కబళించబోయిన శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను రూపొందిస్తున్న కళాఖండమే తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయింది కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. జీవ ఆవిర్భావంపై రూపొందిస్తున్న కళాఖండమే ఇందుకు కారణమైంది. దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు గిలియన్ పదిహేనుళ్లుగా కృషి చేస్తోంది. ఈ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉంది. కానీ సమస్య ఏమిటో తెలియక ఆమె తికమకపడిపోయింది. వైద్యుల దగ్గరికి వెళ్లింది. వారికీ ఆమె వ్యాధి ఏమిటో అంతుచిక్కలేదు. పదిహేనేళ్ల తర్వాత ఆమె తను అనుకున్న శిల్పాన్ని పూర్తిచేసినా కూడా ఆమె ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. అయితే ఆమెకు వచ్చిన జబ్బు శిల్పం తయారీ కారణంగానే అని చివరికి వైద్యులు గుర్తించడంతో గిలియన్ ప్రాణాపాయం నుంచి బయటపడింది.
గిలియన్ స్వస్థలం కెనడాలోని టొరంటో.. 1991 నుంచి ఆమె ఆల్చిప్పలు, పగడాలు, ఎండిపోయిన మొక్కలు, జంతువుల ఎముకలు వంటి సహజ పదార్థాలను ఉపయోగించి శిల్పాలను రూపొందిస్తున్నారు. యూదుల జానపద కథల ప్రకారం మొదటి మహిళ అయిన ‘లిలిత్’ శిల్పాన్ని గిలియన్ 1998లో తయారుచేశారు. అప్పుడే ఆల్చిప్పలతో ‘ ఆడమ్’ను రూపొందించాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది. కెనడాలోని అట్లాంటిక్ తీరంలో దొరికే ఆల్చిప్పలను టొరంటోలోని చైనాటౌన్‌లో పెద్ద మొత్తంలో ఆమె కొనుగోలు చేసేవారు. వేల ఆల్చిప్పలను జల్లెడపట్టి తనకు అవసరమైన ఆకృతుల్లో ఉన్నవాటిని ఎంచుకునేవారు. ఆడమ్ శరీరానికి తగినట్లుగా ఆల్చిప్పలను సానబెట్టేందుకు, అరగదీసేందుకే రోజులో పనె్నండు గంటలు ఆమె శ్రమించేది. కండరాల్లో ఉండే గీతలు వీటివల్ల బాగా కనిపించేవట. ఆడమ్‌పై పనిచేయడం ప్రారంభించిన కొన్ని నెలలకే గిలియన్ అనారోగ్యం బారినపడింది. కారణంగా ఆమెకు విపరీతమైన కోపం, తలనొప్పి అనిపించేదట. వాంతులు అయ్యేవట. వీటన్నింటికీ కారణం మాత్రం ఆమెకు తెలియలేదు. న్యూరాలజిస్టులు, రుమటాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు.. ఇలా ఆమె సమస్యను పరిష్కరించడం కోసం లెక్కలేనంతమంది స్పెషలిస్టులను కలిసింది. వాళ్లు కనిపెట్టలేకపోయారు. అయితే రోజులు గడిచేకొద్దీ గిలియన్ సమస్య మరింత తీవ్రమైంది. ఆల్చిప్పలను సానబెట్టిన తర్వాత ఆమె కదల్లేని పరిస్థితికి వచ్చేసేది. కండరాలు బిగుతుగా మారిపోయి, చేతులు పట్టేసేవట. ఆమెకు పరిస్థితి అర్థం కాలేదు. వైద్యులూ తేల్చలేకపోయారు. దాంతో గిలియన్ ప్రాణం పోయేలోపు ఆడమ్‌ను పూర్తిచేస్తే చాలనుకుందట.. అలా ఆమెకు డిమెన్షియా లక్షణాలన్నీ వచ్చేశాయి. ఏకాగ్రత ఉండేది కాదు. తికమకపడుతుండేది. ఏది ఎక్కడ అమర్చాలో కూడా తెలియనంత తికమకలో ఉండేది. వీటికి తోడు కోపం, చిరాకు, ఆందోళన, నిస్పృహ, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భావనలు ఆమెను ఆవహించేవట. సమస్య తీవ్రస్థితికి చేరుకున్నాక ఆమె హిస్టీరియా వచ్చినట్లు ప్రవర్తించేదట. వీధి చివర వరకూ వెళ్లి అక్కడ ఎవరూ లేకున్నా కూడా గట్టిగట్టిగా తిట్టేదట.. ఇవన్నీ గమనించిన తర్వాత తను ఓ సైకాలజిస్టును కూడా కలిసిందట. చివరకు ఆమెకు కూడా గిలియన్ ఎందుకు అలా ప్రవర్తిస్తోందో తెలియలేదు. వివిధ రకాల ఔషధాలను ప్రయత్నించినా గిలియన్ ఎందుకు అలా ఉందో విషయం తెలియలేదు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాత ఓ వైద్యురాలు అసలు విషయాన్ని గమనించింది. ఎముకలు, ఆల్చిప్పలు వాతావరణంలో ఉండే విషపదార్థాలను ఆకర్షించి పోగుచేసుకుంటాయి అనే విషయాన్ని తెలుసుకుని గిలియన్‌కు చెప్పింది. అప్పుడు కానీ అందరికీ అసలు విషయం అర్థం కాలేదు.
విషపూరితమైన భారీ లోహపదార్థాలు గిలియన్ దేహంలో ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు తర్వాత వైద్యపరీక్షల్లో వెల్లడైంది. ఆమె శరీరంలో ఆర్సెనిక్, లెడ్ ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఆడమ్ కోసం గిలియన్ నానబెట్టిన వేల ఆల్చిప్ప నుంచి వెలువడే పొడే ఆమె అసలు సమస్యకు కారణమైంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల్లో ప్రమాదకర లోహాలు ఉంటాయి. నీటిలో కలిసిన వీటిని ఆల్చిప్పలు పెరిగే క్రమంలో పోగు చేసుకుంటాయి. గిలియర్ ఆల్చిప్పలను సానబెట్టేటప్పుడు ఈ విషపదార్థ రేణువులు గాల్లో కలిసేవి. వాటిని ఆమె పీల్చడం ద్వారా శరీరంలోకి చేరేవి. ప్రకృతితో మనుషులకు చెదిరిన బంధం గురించి సహజ పదార్థాలతోనే రూపొందించిన కళాఖండం ద్వారా చెప్పాలనునకుంది గిలియన్. కానీ విచిత్రం ఆ ప్రయత్నంలోనే ఆమె శరీరం నెమ్మదిగా విషపూరితమైంది.
ఎట్టకేలకు గిలియన్ ఆడమ్ శిల్పాన్ని పూర్తిచేసింది. ఆ పని పూర్తిచేయలేకపోతే తన జీవన ప్రయాణం అసంపూర్తిగా మిగిలిపోయేదని ఆమె అంటుంది. ఈ ఆల్చిప్పల వల్ల నాడీకణ సంబంధమైన నష్టం తీవ్రంగా జరిగింది. ఆమె వినికిడి సమస్యలు ఎదుర్కొంటోంది. శాశ్వతమైన మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడింది. భవిష్యత్తులో గిలియన్‌కు అల్జీమర్స్ లేదా పార్కిన్సన్ వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఉందట. శరీరం మరింత విషపూరితం కాకుండా చూసుకుంటూ తన పనిని కొనసాగించేందుకు గిలియన్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంత బాధలో కూడా ఆమె తయారుచేసిన ఆడమ్‌ను చూసినప్పుడు ఆమె మనసులో ఈ భూమి గురించి బాధ ఉప్పొంగుతుందట. ఆ ఆడమ్‌ను చూసి ‘నా అందమైన మరణం’ అని ఆ కళాఖండాన్ని పిలుచుకుంటుందట గిలియన్. *