మెయన్ ఫీచర్

కర్షకులకు కష్టాలు, కన్నీళ్లేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి తుపాను విరుచుకు పడడం.. వరి, మామిడి, అరటి, బొప్పాయి, కొబ్బరి, ఉద్యాన పంటలు తీవ్రస్థాయిలో ధ్వంసం కావడం.. కర్షకులు కడగండ్లపాలు కావడం ఆనవాయితీగా మారింది. తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసి, పండిన పంట నోటికి అందడం లేదు. ఫలితంగా రైతుకు రుణభారం పెరుగుతోంది. పంట దిగుబడులు తగ్గడంతో నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్నాయి. వ్యవసాయం నష్టదాయకం కావడంతో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా కన్పడుతున్నట్లు అనధికార గణాంకాలు తెలుపుతున్నాయి.
కాగా, శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వరకు సీమాంధ్రులకు సువిశాలమైన సాగరతీరం ఉంది. దీనివల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్, మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఏదో ఒక తుపాను రావడంతో ఉత్తరాంధ్ర, కోనసీమ, బందరు, నెల్లూరు ప్రాంతాలను ముంచెత్తటం జరుగుతుంది. ఉప్పెన వచ్చి ఊళ్లు కొట్టుకొని పోయాయని తెలుగులో సామెత ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి? తుపాను హెచ్చరిక కేంద్రం తప్పులేదు. తప్పంతా మన ప్రణాళికలోనే ఉంది.
సాగర తీరానికి ఆనుకొని వేలాది గృహ నిర్మాణాలు, పంట పొలాలు ఉండడం శ్రేయస్కరం కాదు. లోగడ నూరేండ్లకు పూర్వం దాదాపు బందరు నగరం దీపావళి నాడు సముద్రంలో కలిసిపోయిందట! ఇలాంటి వైపరీత్యాలు గతంలో ఎనె్నన్నో మన కళ్లెదుటే జరిగినా సముద్ర తీరం వెంబడి గృహ నిర్మాణాలు ఆగటం లేదు. తుపానులను ఎవరూ ఆపలేకపోవచ్చు కాని వాటి తాకిడికి అందుబాటులో లేనిచోట్ల మాత్రమే వ్యవసాయం లాభసాటి అవుతుంది. తడిసిన ధాన్యాన్ని నిలువచేసే గిడ్డంగులకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన కొరత ఉంది. మార్కెట్ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి రక్షణ లేదు. కోతకు వచ్చిన మామిడిని కోయకుండా అత్యాశతో ఆగేసరికి మొదటికే మోసం వచ్చింది. వ్యవసాయం లాభసాటి కాకపోవడంతో కర్షకుల పిల్లలు పొలం పనులకు స్వస్తివాక్యం పలికి పట్టణాలకు వలస పోతున్నారు. కొందరు వ్యాపారాల్లో, రాజకీయాల్లో కాలక్షేపం చేస్తున్నారు. చదువుకున్న వారైతే భారీ సంపాదన ఆశించి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు వ్యవసాయం చేసే వారే కనిపించకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుందేమో? వ్యవసాయ ఉత్పత్తులను మనం విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అమెరికాలోను, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ తుపానులు వస్తున్నాయి. మరి వారు ఎలా వ్యవసాయం చేస్తున్నారు. మన పాలకులు గానీ, అధికారులు గానీ అక్కడి పరిస్థితులను ఎప్పుడైనా అధ్యయనం చేశారా?
తాజాగా ఉత్తరాంధ్రకు ‘్ఫణి’ తుపాను వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో సహాయక చర్యలూ తీసుకోకూడదంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావం ఏర్పడిన నాలుగు జిల్లాలను ‘కోడ్’ నుంచి విముక్తి చేసినట్టు ఎట్టకేలకు ఎన్నికల సంఘం ప్రకటించింది. తుపాను వంటి విపత్కర సమయాల్లో ఎన్నికల నియమావళి వంటి అర్థం పర్థం లేని ఆంక్షలుంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇంగిత జ్ఞానం లేని నియమాలు అనర్థక హేతువులు.
ప్రాకృతికమైన ఆపదలు అంటే- తుపానులు, భూకంపాలు, వరదలు, సునామీలు ఇత్యాదులు. ప్రస్తుతం ఉగ్రవాదం కూడా ఒక ప్రాకృతికమైన ఆపదగా మారిపోయింది. జపాన్‌లో నిరంతరం భూకంపాలు వస్తుంటాయి. సుమిత్ర దీవుల్లో అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. అందుకు అనుగుణంగా అక్కడి వారు జాగ్రత్తలు తీసికొని గృహనిర్మాణాలు చేసుకున్నారు. పెద్ద దేశమైన భారత్‌లో మాత్రం ఇప్పటికీ అలాంటి పరిస్థితులు లేవు. గతంలో భూకంపాలు వచ్చినప్పుడు, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చినపుడు భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇక వేళాంగిని సునామీలో వందలాది క్రైస్తవులు క్రిస్ట్‌మస్ రోజున కొట్టుకొనిపోయారు. ముంబయిలో 100 సెంటీమీటర్ల వాన పడ్డప్పుడు నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇదే పరిస్థితి మొన్న చెన్నైలో, నిన్న కేరళలో చూశాము. హైదరాబాదులో నాలుగు చినుకులు పడితే చిత్తడి చిత్తడి తప్పదు. ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లుతాయి. ఒకప్పుడు మూడు లక్షల మంది కోసం రూపొందించిన నగరంలో నేడు కోటి మంది నివసిస్తున్నారు. ఇదే ప్రధాన కారణం.
మన దేశంలో ప్రాకృతిక విపత్తులకు సంబంధించిన ఒక విభాగం ఉంది. అయినప్పటికీ ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకు కారణం సాంకేతిక పరిజ్ఞానం లోపం కాదు. ప్రజలు క్రమశిక్షణతో జీవించకపోవటమే. విశాఖ నగరంలో చినవాల్తేరు, పెద్దవాల్తేరు తదితర ప్రాంతాల్లో సాగరతీరానికి అతి చేరువలో ఇళ్లు కట్టుకున్నారు. ముంబయి నగరం ఎప్పుడైనా అదృశ్యం కావచ్చునని శాస్తవ్రేత్తలు జోస్యం చెప్పారు. లోగడ గుజరాత్‌లోని ద్వారకా పట్టణం సముద్రంలో కలిసిపోయింది.
***
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ బిడ్డలకు ‘ఆంధ్రోళ్ళు’ అన్యాయం చేశారని ఉద్యమకాలంలో నినాదాలు మిన్నంటాయి. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బంగారు తెలంగాణ సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నది. నిజమే..! కానీ- ఇదేమిటి? బంగారు తెలంగాణకు బదులు ‘శ్మశాన తెలంగాణ’ ఎలా వచ్చింది? సుమారు 4,500 మంది రైతులు ఈమధ్య కాలంలో ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? తాజాగా పాతికమంది ఇంటర్ విద్యార్థులు ఎందుకు చనిపోయారు? 9వ తరగతి విద్యార్థిని భూపాలపల్లి జిల్లాలో అత్యాచారం చేసి, హత్యచేసి కామాంధులు బావిలో పడేశారు. ఇలా ఎందుకు జరిగింది?
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు తన బాధ్యత లేదని తెగేసి చెప్పారు విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి. పేపర్ల నిర్వహణ బాధ్యత స్వీకరించిన గ్లోబరీనా సంస్థతో తనకెలాంటి సంబంధం లేదని తెరాస నేత కేటీఆర్ ప్రకటించారు. కంప్యూటర్ యంత్రం తప్పులు చూపించిందని సెలవిచ్చారు ఇంటర్ బోర్డు కార్యదర్శి. ఇవన్నీ కొంతవరకూ నిజాలే కావచ్చు. 99 అనే అంకెలను రెండు సున్నాలుగా ముద్రించారు. అంటే టాపర్ ఫెయిల్ అయినాడు. ఈ వ్యవహారమంతా చూస్తే సామర్థ్య లోపం, బాధ్యతారాహిత్యం ప్రతిచోటా అడుగడుగునా కన్పడుతున్నది. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన భా జపా, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనలు మొదలుపెట్టాయి. ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ చేసేందుకు ఈ పార్టీలకు అధికారం ఉంది. కాని కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకూ ఎందుకు యుద్ధం ప్రకటించటం లేదు? ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు దురాశ గల తల్లిదండ్రులు కూడా కొంతవరకూ కారకులే. మానసిక ఒత్తిడి తట్టుకోలేక చిన్నారులు మొగ్గలుగానే రాలిపోతున్నారు.
***
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ విమానాశ్రయంలో కూర్చున్నాడు. విమానం ఎక్కాడు, హైదరాబాదు చేరాడు. ఈ వార్తను ఒక తెలుగు టీవీ చానల్ రోజంతా అదేపనిగా చూపించింది. ఉప్పులూరి మల్లికార్జున శర్మ స్వాతంత్య్ర సమరయోధుడు, మంచి గాయకుడు. ఖద్దరు దుస్తులు ధరించిన గాంధేయవాది. ఆయన మరణించినపుడు ఆ వార్త చాలా టీవీ చానళ్లలో ప్రసారం కాలేదు. ప్రఖ్యాత కళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్ర్తీ ఈ లోకాన్ని వీడిపోతే ‘అయ్యో..’ అని అనుకున్నవాడు లేడు. ప్రొఫెసర్ మొదలి నాగభూషణ శర్మ తెనాలిలో కన్నుమూస్తే సంతాప సభ పెట్టినవారు లేరు. హైదరాబాద్ పాతబస్తీలోని హిందువులకు అనునిత్యం అండగా నిలిచిన రాజకీయ నేత బద్దం బాల్‌రెడ్డి మరణిస్తే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదు. తెలుగుకవి, విమర్శకుడు ద్వానాశాస్ర్తీ చనిపోతే పట్టించుకున్నవాడు లేడు. ఇదేనా? మనం కవులకు, కళాకారులకు ఇచ్చే గౌరవం?? యద్దనపూడి సులోచనారాణి, వింజమూరి అనసూయ అమెరికాలో మరణిస్తే మీడియాలో ఇచ్చిన ‘కవరేజీ’ ఎంత? వింజమూరి అనసూయ ఎవరో మాకేం తెలుసు? అంటున్నారు ఈతరం జర్నలిస్టులు, కాలమిస్టులు. సీత, అనసూయ లేకుంటే దేవులపల్లి కృష్ణశాస్ర్తీ భావ కవిత్వోద్యమం లేదు. ‘ఆకులో ఆకునై..’ అంటూ ఊరూరా తిరిగి పాతికేళ్లు పాటలు పాడింది వీరే కదా!
***
శాంతాశ్రీ ఒక మహిళా జర్నలిస్టు. బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ సరళిని రికార్డు చేసే నిమిత్తం ఇటీవల కెమెరామెన్‌తో వెళ్లింది. అక్కడ తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌లలో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీన్ని బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నించిన శాంతాశ్రీపై ఆ కార్యకర్తలు భౌతిక దాడి చేశారు. కెమెరా పగలగొట్టారు. ఈ దుర్మార్గానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే- తృణమూల్ కార్యకర్తలు విచిత్రమైన సమాధానం చెప్పారు. ‘లోగడ సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు వారు ఇలాగే రిగ్గింగ్ చేశారు. కెమెరాలు పగలగొట్టారు. కాంగ్రెస్, భాజపా కార్యకర్తలను చంపారు. అందుకని ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం..’ అని వారన్నారు. దీనికి తృణమూల్ పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం సమాధానం చెబుతారు? ఎన్నికల కమిషన్ అధికారులు మమతపై చర్యలు తీసుకోగలరా? మీడియా సిబ్బందిపై రాజకీయ గూండాలు దాడి చేస్తూ రిగ్గింగుకు పాల్పడితే- ప్రజాస్వామ్యం ఎలా అంటాం? ఈ అంశంపై ఓ టీవీ చర్చాగోష్టిలో విశే్లషకుల మధ్య వాదన జరిగింది. అందులో వారు- ‘ఇది అసన్‌సోల్‌కు మాత్రమే పరిమితం కాదు, మొత్తం బెంగాల్‌లో పరిస్థితి ఇలాగే ఉంది’ అన్నారు. అలాంటప్పుడు అక్కడ ఎన్నికలు రద్దు చేసి రాష్టప్రతి పాలన పెట్టవచ్చు కదా?

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్