మెయన్ ఫీచర్

ప్రియాంక.. ఓ రాజకీయ సంచలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేప ట్టడానికి మూడు, నాలుగేళ్లు వాయిదా వేస్తూ చివరకు అన్యమనస్కంగానే పార్టీ పగ్గాలు చేపట్టగా, ఆయన సోదరి ప్రియాంగా గాంధీ సహితం రాజకీయ ప్రవేశం గురించి దాటవేస్తూ చివరకు అక స్మాత్తుగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బాధ్య తలు చేపట్టారు. పైగా, పార్టీ చాలా బలహీనంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని ఒక భాగంలో పార్టీకి పునర్జీవనం కలిగించే గురుతరమైన బాధ్యతను ఆమెపై ఉంచారు. ఇప్పటి వరకు అమ్మ సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు నియో జకవర్గాలలో మంచి చెడులు చూడటం మినహా రాజకీయ ఎత్తుగడలలో గాని, పార్టీ సంస్థాగత వ్యవహారాలలో గాని ఆమెకు గల ప్రతిభ ఎక్కడా బయట పడలేదు.
తెరవెనుక అమ్మ, అన్నలకు తోడుగా ఉంటూ వచ్చిన ఆమె ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా రంగప్రవేశం చేశారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ ఘోర పరాజయాలు చవిచూసిన ప్రతి సందర్భంలోనూ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట కొందరు యు వకులు ప్రియాంక పార్టీ పగ్గాలు చేపట్టాలని నినాదాలు చేస్తూ ఉండడం చూశాము. ఆమె క్రియాశీలంగా రాజకీయాలలో పాల్గొంటే రాహుల్ ప్రాధాన్యత తగ్గి పోతుందని, అతడిని విఫలనేతగా అంగీకరించినట్లు అవుతుందనే భావనతో ప్రియాంక రాజకీయ ప్రవేశానికి సోనియా గాంధీ అడ్డుచెబుతూ వచ్చారు. అయితే, ఇటీవల మూడు ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కూడా కొంత నమ్మకం ఏర్పడింది. ఈ సమయంలో ప్రియాంకను రాజకీయ రంగంలోకి దింపారు. రాహుల్, ప్రియాంక మంచి అవగాహనతో వ్యవహరిస్తున్నట్లు వారి వ్యూహాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరి మద్దతుదారుల మధ్య వైరుధ్యాలు కనబడుతున్నా, వారి మధ్య మాత్రం కనబడటం లేదు. రాహుల్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఉన్నదనే ఆరోపణలు వచ్చినప్పుడు ప్రియాంక అన్నను గట్టిగా సమర్ధించడం తెలిసిందే. భాజపాపై చురుకైన వాగ్బాణాలు వదులుతూ నానమ్మ ఇందిరాజీని ఆమె గుర్తుకు తెస్తున్నారు.
వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక పోటీ చేసే అంశం కొంత ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీ చెప్పిన్నట్లు కొంత సస్పెన్స్ కలిగించి, ఆమె పోటీకి దూరం కావడం, గత ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తిని మోదీపై నిలబెట్టడం కొంత రాజకీయ చర్చకు దారితీసింది. ప్రియాంక పోటీ చేస్తారనే చర్చ రాజకీయ వర్గాలలో ఒక విధంగా సంచలనం కలిగించింది. ఆమె పోటీ చేసి ఉంటే మొత్తం ఎన్నికల జాతరలో అందరి దృష్టిని ఆమె ఆకర్షించి ఉండేవారని అనడంలో సందేహం లేదు. ప్రధాని మోదీపై ఆమె గెలుపొందే అవకాశాలు కనిపించక పోయినా భాజపాను ఆమె పోటీ ఆత్మరక్షణలో పడవేసి ఉండేవారు.
ప్రియాంక సైతం పోటీ పట్ల ఆసక్తి చూపినట్లు ఆమె మాటల ధోరణి వెల్లడి చేసింది. ముందుగా రాయబరేలీ నుండి ఆమె పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు కోరితే- వారణాసి నుండి చేయకూడదా?- అంటూ ప్రియాంక ఎదురు ప్రశ్న వేసి సంచలనానికి దారి తీశారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయిస్తే పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయానికి వదిలి వేసినట్టు చెప్పారు. చివరకు మరో అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఆమె పోటీ చేయడం లేదని సంకేతం ఇచ్చారు. మొదటి సారే ఘోరంగా ఓటమి చెందితే ఆమె రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందికరం కాగలదని లేదా ఒక్క నియోజకవర్గానికి పరిమితమైతే మిగతా నియోజకవర్గాలలో ప్రచారానికి అవకాశం ఉండదనే ఆమెను పోటీ చేయవద్దన్నారని తెలుస్తున్నది. పోటీ చేయరాదన్నది ఆమె సొంత నిర్ణయమని రాహుల్ గాంధీ సన్నిహితుడు శామ్ పిట్రోడా చెబితే, అది సమష్టి నిర్ణయమని ఆమె చెప్పడం గమనార్హం. ఆమె పోటీ చేస్తే దేశం దృష్టి ఆమెపై పడి రాహుల్ ప్రాధాన్యత తగ్గుతుందనే భయం కూడా కారణమని కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా గెలుపోటములతో సంబంధం లేకుండా ఆమె పోటీ చేసి ఉంటే జాతీయ రాజకీయాలలో కీలకమైన కాంగ్రెస్ నేతగా ఎదిగి ఉండేవారనడంలో సందేహం లేదు.
2003లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేసి ఓటమి చెందిన శివరాజ్ సింగ్ చౌహాన్ రెండేళ్ల వ్యవధిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై, 15 ఏళ్లపాటు తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రస్తుత ఎన్నికల్లో భాజపాకు పూర్తి స్థాయిలో ఆధిక్యత దక్కని పక్షంలో ప్రధాన మంత్రి పదవికి ఆ పార్టీ నుండి ముందుండే వారి లో చౌహాన్ ఒక్కరిని చెప్పవచ్చు. కాగా, ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవడాన్ని భయంతో పారి పోవడంగా భాజపా అభివర్ణించింది. మరోవంక రాహుల్ గాంధీ సమర్ధకులు ప్రియాంకకు తగు ప్రచారం రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనబడుతోంది. ఆమె ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నా పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఆమె ప్రచారంపై సంబంధించి ఒక్క ట్వీట్ కూడా రాకపోవడం గమనార్హం. చివరకు ఆమె ప్రచారానికి ముందుగా- మూడు రోజుల పాటు ప్రయోగ నుండి వారణాసి వరకు చేపట్టిన గంగా యాత్ర గురించి కూడా పార్టీ అధికార ట్విట్టర్‌లో ప్రస్తావించనే లేదు.
ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా ప్రచారం చేయడం కారణంగా భాజపా ఓట్లను భారీగా చీలుస్తారనే భయం ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కనిపిస్తున్నది. అందుకనే భాజపాకు ప్రయోజనం కలిగించడం కోసం బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా భాజపా, కాంగ్రెస్ ఒకేవిధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వారి విమర్శల పట్ల రాహుల్ వౌనం వహిస్తూ ఉండగా, ప్రియాంక దీటుగా జవాబు ఇచ్చారు. ఎంతో పరిశోధన చేసి అభ్యర్థులను నిలబెట్టామని చెబుతూ, తమ అభ్యర్థులు బిజెపి ఓట్లనే చీలుస్తారని ప్రియాంక స్పష్టం చేశారు. పైగా భాజపా కు ప్రయోజనం కలిగించడం కన్నా చనిపోవడానికి సిద్ధపడతానంటూ ఆమె ఉద్వేగంతో జవాబు ఇచ్చారు. పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తున్నట్లు కూడా భరోసా వ్యక్తం చేశారు.
తన భర్త రాబర్ట్ వాద్రాపై గల అవినీతి కేసులే ఒక విధంగా ప్రియాంక రాజకీయ యాత్రకు ప్రతిబంధకంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ రాజకీయాలకు తన బావ రాబర్ట్‌ను వీలైనంత దూరంగా రాహుల్ ఉంచుతున్నారు. అయితే, క్రియాశీల రాజకీయ ప్రవేశానికి ముందే ఈడీ విచారణకు హాజరైన భర్తకు సంఘీభావం తెలపడమే కాకుండా, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చ ర్యగా విమర్శించడం ద్వారా ప్రియాంక తన భర్తకు భరోసాగా నిలబడ్డారు. ఆమె అండ చూసుకొని తాను కూడా కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర వహించాలని రాబర్ట్ వాద్రా ప్రయత్నం చేశారు. తాను రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి, ఎన్నికల ప్రచారం చేయ బోతున్నట్లు వెల్లడించారు. భార్యను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్‌లో పెత్తనం చేయాలనే బావగారి ప్రయత్నాన్ని మొగ్గులోనే తుంచివేసే ప్రయత్నం రాహుల్ చేసిన్నట్లు కనిపిస్తున్నది.
తన మద్దతుదారుడైన ఓ నేతకు లోక్‌సభ టిక్కెట్ ఇప్పించి రాబర్ట్ బోర్లా పడ్డారు. బలమైన గుజ్జర్ సా మాజికవర్గం నేత, నాలుగుసార్లు ఎంపీగా గెలిచి భాజపా నుండి ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన అవతార్ సింగ్ బాదనాకు ఫరీదాబాద్ సీటు వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే హర్యానా ఎమ్యెల్యే లలిత్ నగర్ ను ఎంపిక చేశారు. అతని సోదరుడు మహేష్ రాబర్ట్ వాద్రాకు హర్యానా, రాజస్థాన్‌లలో భూముల సేకరణలో సహకరించారని గతంలో జస్టిస్ ధింగ్య్రా కమిషన్ తప్పుబట్టింది. వాద్రా సన్నిహితుడని మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా లలిత్ నగర్‌నే ఎంపిక చేశారు. ఇది తెలియగానే రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అభ్యర్థిని పక్కన పెట్టి భాజపా నుండి వచ్చిన బాదనాకే బీ ఫారం ఇచ్చారు. దాటతో అలిగిన వాద్రా అప్పటి నుండి ఎన్నికల ప్రచారంలో భార్య పక్కన కూడా ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం. ఆ తర్వాత వాద్రా రాజకీయ ప్రకటనలు కనిపించడం లేదు.
ఒక విధంగా ప్రియాంక ఎన్నికలలో పోటీచేయక పోవడం ఆమె మద్దతు దారులకు అసంతృప్తిగానే కనిపిస్తున్నది. రాహుల్ పోటీ చేస్తున్న రెండు నియో జకవర్గాల నుండి గెలుపొందింతే, అమేథీ నియో జకవర్గానికి రాజీనామా చేస్తారని, అక్కడి నుండి ప్రియాంక పోటీ చేస్తారని పార్టీ వర్గాలు ఇప్పుడు భావి స్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలినట్టు కనిపిస్తున్నా రాహుల్, ప్రియాంక మాత్రం మంచి అవగాహనతో, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉన్నా, రాబోయే రోజులలో ఆమె జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో కీలక పాత్ర వహించడం తథ్యం. ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు ఆమె చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఇప్పటి వరకు రాజకీయ విమర్శలకు పరి మితమై, నానమ్మ తరహాలో ప్రజలతో కలసి పోయే ప్రయత్నం చేస్తున్న ప్రియాంక ఒక రాజకీయ నాయకురాలిగా సమస్యలపై ప్రజలను సమీకరించగల శక్తి సామర్ధ్యాలను నిరూపించుకోవాల్సి ఉంది. ఆ విషయంలో ఇంకా భారీ కసరత్తు చేయవలసి ఉంది. ముఖ్యంగా దేశంలో మూడొంతుల సీట్లలో కాంగ్రెస్ ప్రధాన రాజకీయ పక్షంగా లేదు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్, భాజపా వ్యతిరేక పార్టీలలో నిర్ణయాత్మక పాత్ర వహించేటట్లు వ్యవహరించడం రాహుల్, ప్రియాంకలకు పెను సవాల్ గా మారగలదు. రాహుల్‌తో కలసి వేదిక పంచుకోవడానికి మమతా బెనెర్జీ, మాయావతి, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు ఇష్టపడటం లేదు. ఇక ప్రియాంకా గాంధీతో వేదికను పంచుకోవడానికి వారు సుముఖంగా ఉండే అవకాశాలు లేవు. ప్రస్తుతం ప్రి యాంక బాధ్యత వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో- అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న 2022 నాటికి కాంగ్రెస్‌ను అధికార పక్షంగా తీసుకు రావడం ఆమె ముందున్న కర్తవ్యంగా రాహుల్ చెప్పారు. కార్యకర్తలలో ఉత్తేజం కోసం ఆ విధంగా చెప్పినా క్షేత్రస్థాయి రాజకీయాలలో కాంగ్రెస్‌కు ప్రాధాన్యత కల్పించడం అంత తేలిక కాబోదు.

-చలసాని నరేంద్ర 98495 69050