మెయన్ ఫీచర్

అంచనాలు తారుమారు అవుతున్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడుదశలలో ఇప్పటికే మూడు దశల పోలింగ్ ముగిసింది. 300కు పైగా అం టే సుమారు 60 శాతం ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. దేశంలో చాలాప్రాంతాలలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. భాజపాకు కీలకమైన ఉత్తరాది-హిందీ రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ జరగవలసి ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఫలితాలపై ఉన్న అంచనాలు క్రమంగా తారుమారవుతున్న సంకేతాలు వెలువ డుతున్నాయి. ఈ ఎన్నికలలో మిగిలిన అన్ని పక్షాలు స్పష్టమైన వ్యూహాలతో కొంతకాలంగా ముందుకు వెడుతున్నాయి. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మాత్రమే ఎన్నికలపై కొంత గందరగోళంలో ఉన్నట్లు కనపడుతున్నది. సాధారణంగా అధికార పక్షం ఐదేళ్లలో తన పనితీరు గురించి, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి చెప్పి ఓట్ల కోసం ప్రయత్నం చేయాలి. అయితే తొలి నుండి బీజేపీలో అటువంటి విశ్వాసం కనబడటం లేదు. ఒకొక్క సారి ఒకొక్క అంశం చేబట్టడం కనిపిస్తున్నది.
ప్రతిపక్షాల అనైక్యతను తన ప్రధాన అస్త్రంగా భాజపా భావిస్తున్నది. ప్రతిపక్షాలు చెప్పుకోదగిన రీతిలో పొత్తులు కుదుర్చుకోలేక పోవడం, పలు చోట్ల ఒకరిపై మరొకరు పోటీ పడుతూ ఉండటం ఒక విధంగా భాజపాకు అను కూల అంశాలే. 350 సీట్లను సొంతంగా గెలవడం తమ లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా రెండేళ్ల క్రితమే చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు సొంతంగా మెజారిటీ సాధిస్తామని మాత్రమే ఆయన చెబుతున్నారు. అంతర్గత అంచనాల ప్రకారం కూడా సొంతంగా 220 సీట్లకు మించి గెలుపొందలేమని ఆయన గ్రహించిన్నట్లు ఉన్నారు. అయితే, ఏ విధంగా చూసినా అతి పెద్ద పార్టీగా ఆవి ర్భవించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే వెసులుబాటు మొదటగా భాజపాకే కలుగుతుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఇతర ప్రతిపక్షాల మద్దతు కోసం ఇప్పటికే భాజపా సంకేతాలు పంపుతున్నట్లు కనబడుతున్నది. జేడీయూ, అన్నాడీఎంకే వంటి పార్టీలతో భాజపా పొత్తు కుదుర్చుకున్నా వారు చెప్పుకోదగిన విజయాలు సాధించే అవకాశాలు కనబడటం లేదు. అందుకనే ప్రత్యామ్నాయ వ్యూహాలు తప్పడం లేదు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో- భాజపా వ్యతిరేక శిబిరంలో కీలకనేతగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సోదరి వంటిదని , తమ మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడం ఎన్నికల అనంతరం అవసరాల కోసం పంపిన సంకేతంగా పలువురు భావిస్తున్నారు. భాజపా, కాంగ్రెస్‌ల తర్వాత 30కి పైగా సీట్లు గెలుపొందే అవకాశం ఉన్న ఏకైక పార్టీ మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కావడం గమనార్హం. ఎన్డీఏ ఐదేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలుగా భావిస్తున్న- విదేశాల నుండి నల్లధనం తీసుకురాలేక పోవడం, పెద్దనోట్ల రద్దు దేశఆర్ధిక వ్యవస్థపై ముఖ్యంగా ఉపాధి అవకాశాలపై కలిగించిన దుష్ప్ర భావాలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న దుష్ప రిణామాలు, ఉద్యోగాల కల్పనలో ఘోర వైఫల్యం వంటి అంశాల నుండి ప్రజల దృష్టి మళ్లించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు విజయం సాధించారని చెప్పవచ్చు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్ భూభాగంలో మన వాయుసేన జరిపిన మెరుపు దాడిని ప్రధాన ఎన్నికల అస్త్రంగా మార్చుకోవడంలో ప్రధాని విజయం సాధించారు. ఈ విషయంలో ఒక విధంగా అసంబద్ధమైన వాఖ్యలు చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి. భాజపాను ప్రశ్నించే వారిని పాకి స్తాన్‌కు అనుకూలురుగా, ఉగ్రవాదులకు మద్దతు దారులుగా చిత్రీకరించడంలో మోదీ విజయం సా ధించారు. మొదటి మూడుదశల పోలింగ్‌లో భాజపాకు ఈ అంశం సహకరించినా ఇప్పటి వరకూ పోలింగ్ జరిగిన ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణాది, తూర్పు ప్రాంతాలలో ఈ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుచేత ఓట్ల రూపంలో పెద్దగా ప్రయోజనం కలిగే అవకాశం లేదు. రాబోయే నాలుగు దశల పోలింగ్‌లో ఈ అంశం అంతగా ప్రాధాన్యత కలిగించక పోవచ్చు. ఇతర అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
కీలకమైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాలలో భాజపా గత లోక్‌సభ ఎన్నికలలో 80 శాతం సీట్లను గెల్చుకొంది. అందుకనే ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల వ్యూహాలు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉంది. అత్యధిక రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలు ఉండటాన్ని భాజపా నేతలు ఇప్పటి వరకు మంచి అవకాశంగా భావిస్తూ వచ్చారు. అయితే ఈ ప్రభుత్వాలు లేకుండానే 2014లో ఘన విజయం సాధించిన ఆ పార్టీకి ఇప్పుడు పలు చోట్ల ప్రభుత్వాలు గుదిబండలుగా తయారవుతున్నాయా? అనే అను మానాలు కలుగుతున్నాయి.
మోదీ తిరిగి అధికారం చేపట్టలేని పక్షంలో అందుకు ప్రధాన కారణం ప్రతిపక్షాల బలం కన్నా, వివిధ రాష్ట్రాలలో భాజపా ప్రభుత్వాలే కారణమన్న అంశాన్ని మరచిపోలేము. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహు జన సమాజ్ పార్టీలు పొత్తు కుదుర్చుకుని, కాంగ్రెస్‌ను బైట పెట్టడంతో సంబర పడిన భాజపాకు మొదటి మూడు దశల పోలింగ్ సరళి ఆశాభంగం కలిగిస్తున్నట్లు చెప్పవచ్చు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పొత్తు ఏర్పర్చుకున్నప్పటికీ, ఒక పార్టీ వోటు మరో పార్టీకి బదిలీ కాకపోవడంతో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందనే ఊహాగానాలు వమ్మయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ, బీఎస్పీ మద్దతుదారులు పెద్ద ఎత్తున అఖిలేశ్ యాదవ్, మాయావతిల ఉమ్మడి బహిరంగ సభలకు హాజరు కావడంతో పాటు ఒక పార్టీ ఓటర్లు మరో పార్టీకి ఓటు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిణామాన్ని చివరకు ఆయా పార్టీల నేతలు సహితం ఊహించనే లేదు. ఏ మేరకు ఓట్ల బదలాయంపు జరిగిందన్నది ఓట్ల లెక్కింపు తర్వాత గాని వెల్లడి కాబోదు.
కాగా, ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ పలు చోట్ల బలమైన అభ్యర్థులను నిలబెట్టడంలో భాజపా తికమక పడటం కనిపించింది. అప్పటికప్పుడు పార్టీలో చేరిన సినీ, క్రీడా, వినోద రంగాలకు చెందిన వారికి సీట్లు ఇవ్వడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉదయం పార్టీలో చేరిన అనేకమంది సాయంత్రం కల్లా సీట్లు పొందారు. ఇదే పరిస్థితి ఇతర పార్టీలలో కూడా నెలకొన్నది. నిర్దిష్టమైన రాజకీయ విధానాలు, పార్టీల పట్ల అంకిత భావం గల వారిని కాకుండా గాలిపటం వలే అధికారం వైపు పరిగెత్తే అవకాశవాదులకు దాదాపు అన్ని పార్టీలు అవకాశం కల్పించాయి. ఇందుకు శత్రుఘ్న సిన్హా గొప్ప ఉదాహరణ. వరుసగా మూడు సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడంతో పాటు, కొంతకాలం పాటు కేంద్ర మంత్రిగా ఉండే అవకాశం ఇచ్చినప్పటికీ భాజపా పట్ల శత్రుఘ్న సిన్హా వ్యవహరించిన తీరు నేడు మన దేశంలో అధ్వానంగా మారుతున్న రాజకీయ విలువలకు నిదర్శనం. పార్టీలో ఉంటూనే ప్రభుత్వాన్ని ఆయన తూర్పార బట్టేవారు. చివరకు టిక్కెట్ రాదని గ్రహించి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధపడ్డారు. పోనీ, ఆ పార్టీకైనా కట్టుబడి ఉన్నారా? లక్నో నుండి భార్య పూనమ్ సిన్హాను ఎస్పీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా పోటీ పెట్టారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నా, భార్య తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఒక వంక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడం కోసం ఎత్తుగడలు వేస్తుంటే- ప్రధాన మంత్రి పదవికి సీఎంలుగా పనిచేసిన అఖిలేశ్ యాదవ్, మాయావతి, నితీష్ కుమార్ ఆ పదవికి అర్హులని అంటూ శత్రుఘ్న సిన్హా ప్రకటనలు చేస్తారు. గతంలో సీఎంగా ఉంటూ ప్రధానిగా వచ్చిన మోదీ సంగతి వేరు అంటారు. ఇటువంటి అవకాశవాద రాజకీయ నేతలు నేడు అన్ని పార్టీలలో ఉన్నారు.
ఎన్నికలకు కొద్ది నెలల ముందు రైతుల సమస్యలు ప్రధాన అంశంగా మారే సంకేతాలు వెలువడ్డాయి. అయితే నేడు ఎన్నికల ప్రచారంలో దాదాపు ఏ పార్టీ కూడా వ్యవసాయ సంక్షోభం గురించి ఆసక్తి కనబరచడం లేదు. పేద రైతు కుటుంబాలకు సాలీనా రూ. 6,000 ఇవ్వడం గొప్ప పరిష్కారంగా ప్రధాని మోదీ చెబుతుండగా, పేదలకు సాలీనా రూ. 72,000 ఆదాయం వచ్చేలా చేయడం ఏకైక పరిష్కారంగా రాహుల్ గాంధీ పేర్కొంటున్నారు. వీరంతా రైతులను బిచ్చగాళ్లుగా మార్చే పెద్ద కుట్ర చేస్తున్నారు. అభిమానవంతులైన రైతులను నిర్వీర్యపరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుందనే నిజాన్ని వారు మరచి పోతున్నారు. దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగం వ్యవసాయం. ప్రభుత్వం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా పెత్తనం చేస్తున్న రంగం ఇది. వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికేటట్లు చేస్తున్నది. వ్యవసాయాన్ని నియంత్రించడం కోసం ఎన్నో చట్టాలు, ఆంక్షలు ఉన్నాయ. రైతులను ఈ సంకెళ్ళ నుండి విముక్తి చేస్తే చాలు. తమ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు అమ్ముకోనిస్తే చాలు. వ్యవసాయ ఉత్పతుల రవాణాపై ఆంక్షలు తొలగిస్తే చాలు. వ్యవసాయ మార్కెట్‌లో దళారులు రాకుండా అడ్డుకొంటే చాలు. వారికి బిచ్చం వేయనవసరం లేదు. అటువంటి ధైర్యం ఏ పార్టీకైనా ఉందా ?
రైతు బీమా పేరుతో బీమా కంపెనీలను, విత్తనాల సరఫరా పేరుతో విత్తనాల కంపెనీలను, వ్యవసాయ మార్కెట్‌ల పేరుతో దళారీలను సంపన్నం చేసే ప్రయత్నం పాలకులు చేస్తున్నారు. కానీ రైతాంగ వౌలిక సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. 2014 ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు పరుస్తామని, ఉత్పత్తి ఖర్చుకు మరో 50 శాతం జోడించి వ్యవసాయ ఉత్పత్తులకు ధర వచ్చేటట్లు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. కానీ 2019 ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమిషన్ పేరునే ప్రస్తావించక పోవడం గమనార్హం. కాశ్మీర్‌లోయలో 15 శాతం కన్నా తక్కువ పోలింగ్ జరగడం చాలా ఆందోళన కలిగించే అంశం. అక్కడ ఉగ్రవాదం తీవ్రరూపంలో ఉన్న సమయంలో కూడా 55 నుండి 60 శాతం పోలింగ్ జరిగింది. ఇప్పుడు అక్కడి ప్రజలు ఎందుకు ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరంగా జరుగుతున్నారో రాజకీయ పార్టీలు సింహా వలోకనం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం పొందడం ముఖ్యం. కానీ వారిని ప్రలోభాలతో కట్టడి చేసే ప్రయత్నం నిరంకుశ పాలనకే దారితీస్తుంది.

-చలసాని నరేంద్ర 98495 69050