మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మానాయన! మా తండ్రి!’ యనుచు, ఆత్రముతో బిడ్డనికడ కేగి వాని నెత్తుకొనును.’’
630. ఎవని పరితాపము తీవ్రమై యుండునో, ఏకాగ్రత గాఢమై యుండునో, ఆతడు త్వరితముగా భగవంతుని గాంచగల్గును.
631. భగవంతుని గాంచనైతినని మూడు దినములు తీవ్ర పరితాపము పొందనిండు. నరు డీ కలియుగమున భగవదనుగ్రహము పొందగల్గును.
632. చందమామ అందఱకును మామయే. అటులనే భగవంతుడు ఎల్లర యొక్కయు సొమ్ము. భగవంతుని ప్రార్థించుటకు ఎల్లరకును హక్కు కలదు. మనఃపూర్వకముగా భగవంతు నెవ్వడు ప్రార్థించునో వాడు సాక్షాత్కార భాగ్యమునొందగలడు. వానిని ప్రార్థించినచో, నీవును ఆ మహాభాగ్యమును పొందగలవు.
633. నిజముగా, నిశ్చయముగా జెప్పుచున్నాను వినుడు: భగవంతునికై పరితపించువాడు వానిని కనుగొనును. ఇందలి సత్యమును స్వయముగా మీ జీవితముననే పరీక్షించుకొనుడు. పోయి త్రికరణశుద్ధిగా మూడు దినములు ప్రయత్నింపుడు, తప్పక విజయము నందుదురు.
634. చలింపని భక్తిని తిరుగులేని శ్రద్ధను ఒసగుమని జగజ్జననని వేడుకొనుము.
635. భక్తుని బలమెందున్నది? ఆతడు భగవానుని బిడ్డడు, అశ్రువులే వాని బ్రహ్మాస్తమ్రు, మారాముపట్టి యేడ్చు బిడ్డని కోర్కెను తల్లి తీర్చు చందమున విలపించుచున్న తన బిడ్డని కోర్కె యెట్టిదైనను భగవానుడు తప్పక తీర్చును.
636. శ్రీగురుదేవునితో నొకడిట్లు పల్కెను: ‘‘నాకిప్పుడు ఏబదియైదేండ్లు నిండినవి. పదునాలుగేండ్లుగా భగవంతుని వెదకుచున్నాను. అనేక గురువుల యుపదేశములననుసరించినాను; సమస్త పుణ్యస్థలములను దర్శించినాను, అనేక మహాత్ములను సందర్శించినాను, కాని నాకేమియు లభ్యముకాలేదు.’’ శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘నిజముగా, నిశ్చయముగా జెప్పుచున్నాను వినుము: భగవంతునికై పరితపించువాడు వానిని కనుగొని తీరును. నన్ను జూచి ధైర్యము పూనుము.’’
637. ‘‘అమ్మా! నాకాకలి యగునప్పుడు నన్ను లేపుము’’అని బిడ్డ పలుక. ‘‘నాయనా! నీయాకలియే నిన్ను లేపును!’’అని తల్లి సమాధానము చెప్పెను.
638. బొమ్మలకోసమో, డబ్బుకోసమో పోరుపెట్టి యేడ్చుచు, తల్లిని పీడించు బిడ్డవలె నెవ్వడు భగవానుడు తనకు ఆప్తుడని తెలిసికొని వానిని గాంచుటకై లోలోన వెక్కివెక్కి యేడ్చునో వానికి భగవానుడు సాక్షాత్కరించును. నిష్కపటముగా అట్లు బతిమాలుకొనువానికి- తనకై వెదకులాడు భక్తునిగా- గాన్పింపకుండ భగవానుడు దాగియుండ జాలడు.
639. వీధి నాటకములను జూచితిరి కదా? అందు కృష్ణలీలా నాటకము తాళ మృదంగాదులతో పాటకాండ్రు ఎలుగెత్తి, ‘‘రావయ్య, యోకృష్ణ! ఇమ్ము దర్శనము!’’అని పాడుచుండునంత కాలము కృష్ణవేషధారి వారి ఘోషను కొంచెమైనను ఆలకింపడు. చుట్టకాల్చుకొనుచు తెరచాటున వేషములు వేయుచోట గూర్చుండి దగ్గఱవారితో ప్రగల్భములు గొట్టుచుండును. వారి రొద యణగి నారదమహర్షి, మార్దవము, మనోహరమునగు కంఠస్వరముతో, ‘‘శరణం తవచరణం భవహరణం మమ గోవింద!’’ అని గానమారంభింపగనే శ్రీకృష్ణుడిక విలంబముచేయక వెంటనే రంగమున ప్రత్యక్షమగును. సాధకుడు, ‘‘ప్రభూ! అనుగ్రహింపుము, నాకు దర్శనమిమ్ము’’అని యూరక అఱచుచుండునంతవఱకు జగత్ప్రభువు దర్శనమీయడు, భగవంతుడు సాక్షాత్కరించునపుడు భక్తుని హృదయము ప్రేమసాగరమున లీనమైయుండును.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి