మెయిన్ ఫీచర్

భవన నిర్మాణ పనులను నేర్పిస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువత అందం, ఫ్యాషన్, ట్రావెల్, హోటల్స్ వంటి రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి విభాగాల్లో టిప్స్‌ను ఇవ్వడం ద్వారా యూట్యూబ్, సోషల్ మీడియా వంటి వాటిల్లో ప్రత్యేక గుర్తింపును కూడా పొందుతోంది. ఇలాగే గుర్తింపును పొందాలని కలలు కనింది పాలోమా సిప్రియానో.. కానీ ఈమెకు స్మాల్ స్క్రీన్‌పై ఎలా కనిపించాలో తెలియదు. ఈమె బ్రెజిల్లోని సీట్ లాగోస్ పట్టణంలో నివసిస్తుంది. ఆ పట్టణం దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. అదీకాక సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ఎప్పుడూ లిప్‌స్టిక్‌ల గురించో, వంటల గురించో అప్‌లోడ్ చేస్తున్నారు అలాగే తను కూడా ఫ్యాషన్ విభాగాల్లో టిప్స్ ఇవ్వాలనుకుంది. కానీ అందరులానే నేనూ ఎందుకు? అనుకుందో ఏమో.. తన ప్రయత్నాన్ని విరమించుకుంది. బాగా ఆలోచించి తరువాత తల్లి సూచనతో భవన నిర్మాణంపై యూట్యూబ్‌లో సూచనలివ్వడం మొదలుపెట్టింది. ఈ అంశంపై బ్రెజిల్లో ఓ వేదికను ఏర్పాటుచేసి మాట్లాడే ఏకైక మహిళ ఈమె ఒక్కరే. ముందు అనుకున్న ప్రణాళికను కాదని తన తల్లి ఇవోన్ సూచనతో ఈ రంగంలోకి ప్రవేశించింది పాలోమా సిప్రియానో.. వివరాల్లోకి వెళితే..
భవన నిర్మాణ రంగం గురించి ఆడవారికేం తెలుసు? ఆడవారు నిర్మాణ రంగం గురించి ఏం చెబుతారు? అసలు వారు అంత కష్టమైన పనులు ఎలా చేస్తారు? అని యజమానులు ఆలోచించే... నిర్మాణ రంగంలో పనిచేసే ఆడవారికి మగవారి కంటే తక్కువ వేతనం ఇస్తారు. మన భారతదేశంలో కూడా ఇలాగే జరుగుతుంది. కానీ పాలోమా సిప్రియానో మాత్రం భవన రంగం గురించి ఏకంగా వీడియోలు చేసి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తోంది. గోడకు ప్లాస్టరింగ్ ఎలా చేయాలో వివరించే వీడియోలే ఇప్పటివరకూ ఆమె రూపొందించిన వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. వీటికి దాదాపు 73 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇలాంటి అంశాలపై వీడియోలు చేసే ఇతర యూట్యూబ్ చానళ్లకన్నా పాలోమాకు ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 45 వేలమంది ఫాలోయర్లున్నారు. నేలపై టైల్స్ ఎలా వెయ్యాలి, ట్యాప్ ఎలా ఫిటింగ్ చేయాలి, గోడ ఎలా కట్టాలి వంటి ‘డూ ఇట్ యువర్‌సెల్ఫ్’ విభాగంలో రూపొందించిన వీడియోలు కూడా ఈ చానల్లో ఉన్నాయి. ఈ వీడియోలన్నీ సులభమైన పద్ధతిలో సూచనలిస్తూ సాగుతాయి. కేవలం అవసరంతోనే పాలోమా భవన నిర్మాణ రంగం గురించి తెలుసుకున్నారు. వాళ్లు నివసించే ఇంటిని కొద్దిగా, పెద్దదిగా నిర్మించాలనుకున్న పాలోమా, ఆమె తల్లి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తామే ఆ పనిచేయడానికి సిద్ధపడ్డారు. తల్లికున్న స్నేహితులు కొందరు ఈ పనిలో వారికి చాలా సాయం చేశారు. ఇలా ఇంటి నిర్మాణ పనులను తామే చేసుకోవడం వల్ల దాదాపు ఏడు వేల డాలర్లు ఆదా చేయగలిగామని పాలోమా చెప్పింది. అలా నిర్మాణ పనిపై ఆమెకు ఇష్టం పెరిగింది. దీంతో 2013లో ఓ యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. కానీ యూట్యూబ్ చానల్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మొదటి సెమిస్టర్‌లోనే కోర్సు నుంచి వైదొలిగింది. ఇప్పుడు ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్‌కు 6.25 లక్షలమంది సబ్‌స్రైబర్లున్నారు. పురుషాధిక్యత ఉన్న నిర్మాణ రంగంలోకి దిగడానికి తల్లి ఇవోన్‌నే పాలోమాకు స్ఫూర్తి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్కల ప్రకారం బ్రెజిల్‌లో నిర్మాణ రంగ ఉద్యోగుల్లో కేవలం 3.2 శాతం మాత్రమే మహిళలున్నారు. దీనిగురించి, తన సూచనల గురించి పాలోమా ఇలా మాట్లాడింది.
‘మొదట నేను ఫ్యాషన్‌కు సంబంధించిన వీడియో చేద్దామనుకున్నాను. కానీ ఇలాంటి వీడియోలు రోజుకు వేల సంఖ్యలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో నా వీడియో కూడా ఒకటి అయిపోతుంది అనిపించింది. ఈ విషయం గురించి అమ్మని అడిగాను. ఫ్లోర్ టైల్స్‌ను వేస్తూ ఓ వీడియో తీసి అప్‌లోడ్ చేయమని మా అమ్మ సలహా ఇచ్చింది. ఈ ఆలోచన అద్భుతంగా ఉంది అని నేనేమీ అనుకోలేదు అప్పుడు. కానీ ఆమె మాటను తీసేయలేక వీడియో తీసి పోస్ట్ చేశాను. నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. నన్ను, తమ్ముడిని పెంచి పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది. మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఆమె ఉదయం ఐదు గంటలకే లేచి డబ్బులు సంపాదించడానికి పనుల్లోకి వెళ్లేది. ఆమె స్థైర్యమే నాకు శక్తినిచ్చింది. అందుకే ఇప్పుడు ఇంతలా ఈ రంగంలో సెటిలయ్యాను. ఇంజనీరింగ్ డిప్లొమా లేకుండానే నేనో కాంక్రీట్ స్తంభాన్ని నిర్మించగలిగానున. అలాగే మిగిలిన మహిళలు కూడా నాలాగే అన్ని రంగాల్లోనూ ముందుండాలి. ఒకవేళ మహిళలు ఇలాంటి పనులు చేయలేకపోయినా అన్ని పనులూ నేర్చుకోవడం వల్ల నష్టం లేదు కదా.. అన్ని విషయాల పట్ల పరిజ్ఞానం ఉండటం వల్ల వారినెవరూ ఆ పనుల విషయంలో తప్పుదోవ పట్టించలేరు. అబ్బాయిలపై వాళ్లు అనుకున్నంత ఎక్కువగా మనం ఆధారపడి లేమనే విషయాన్ని వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది’ అని చెబుతోంది పాలోమా.
పాలోమా చేసిన వీడియోలను చూసి చాలామంది ఇవన్నీ మగవాళ్లు చేసినవని విమర్శించినప్పుడు ఆమెకు చాలా బాధ కలిగిందట. తరువాత కొద్దిరోజులకు పాలోమాకు కామెంట్ల ద్వారా వేధింపులు, ప్రత్యేకించి అదే రంగంలో పనిచేస్తున్న పురుషుల నుంచి తీవ్రమైన, అసభ్యకరమైన కామెంట్లు వచ్చేవి. పాలోమా ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లను పట్టించుకోవడం మానేసింది. కానీ ఇప్పటికీ అలాంటి కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే చానల్ ఫాలోయర్లలో 60 శాతం మంది మగవారే. అయితే పాలోమాకి మహిళా ఫాలోయర్లు కూడా పెరుగుతున్నారు. వారు చాలా ప్రోత్సాహకరమైన ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారట. వ్యాపార విస్తరణకు సంబంధించి పాలోమాకు కొన్ని వ్యూహాలున్నాయి. వాటినే అమలుపరచాలనుకుంటోంది. ప్రొఫెషనల్ యూట్యూబర్‌గా పాలోమా నడుపుతున్న చానల్‌లో 150కి పైగా వీడియోలున్నాయి. ఒకప్పుడు ఫ్యాషన్ రంగంపై టిప్స్ ఇవ్వాలనుకున్న అమ్మాయి ఇప్పుడు నిర్మాణ రంగానికి సంబంధించి డీఐవై వీడియోలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

-మహి