మెయిన్ ఫీచర్

మృగాళ్లను ఆపేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయి. 2012లో ఏకంగా యావత్తు దేశం మహిళల పక్షాన నిలిచి అన్నాహజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్‌బేడీ సమక్షంలో మహోద్యమంగా జరిగి, దేశంలోని అన్ని రాష్ట్రాలనుండి అనేకమందిని పాల్గొనేలా చేసి, స్వాతంత్రోద్యమాన్ని గుర్తుకుతెచ్చేలా పలు నిరసనల కార్యక్రమాలను చేపట్టి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్భయ చట్టాన్ని చేయడానికి దారితీసింది. ఆ తర్వాత పలు రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మహిళల క్షేమం కోసం చట్టాలు చేయడం, తెలంగాణాలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమేర తగ్గినా అక్కడక్కడా వేధింపులు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు సైతం కొనసాగుతూనే వున్నాయి.
ఇదిలావుంటే ప్రస్తుత తరుణంలో దేశంలోని సంఘటనలు చూస్తే సగటు మానవున్ని తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నదనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. నేడు మహిళలతోపాటు చిన్నారులకు భద్రత కరువైంది. స్వతంత్ర అధ్యయన సంస్థ ఇండియా స్పెండ్ వెల్లడించిన ఫలితాలను పరిశీలిస్తే 2017తో పోలిస్తే 2018లో చిన్నారులపై 276 శాతం అఘాయిత్యాలు దాడులు అధికమయ్యాయి. హింసాత్మక ఘటనలు 2017లో 19 ఉంటే 2018లో 139కి చేరుకున్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలియకనే తెలుస్తున్నాయి.
పొద్దున లేవగానే ఏ దినపత్రిక చూసినా, సామాజిక మాధ్యమాలు పరిశీలించినా ఏదో ఒకచోట చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలు కన్పిస్తూనే ఉంటాయి. కూతురిని వేధిస్తున్న తండ్రి, పాఠశాలలో చిన్నారిపై ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. ఇలా బంధువులు, మిత్రులు, ప్రక్కింటివారు చిన్నారులపై ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారంటే, మన సమాజంలో ఏం జరుగుతోంది? ఎందుకు వారికి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి? తాత, తండ్రి స్థానంలో వుండి ఎందుకు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నారు? అంటే మానవత్వం మంటగలుస్తున్నదా? వీరికి బహిరగంగా ఎలాంటి శిక్షలు విధిస్తే సమాజంలో మార్పు వస్తుంది? చిన్నారులకు అండగా వుంటూ, నాలుగు మంచి విషయాలను చెబుతూ, వారిని సక్రమమైన మార్గంలో పయనింపజేయడానికి కృషి చేస్తూ, భవిష్యత్ తరానికి ఉత్తములుగా పరిచయం చేయాల్సిన మనుషులు మానవ మృగాలుగా తయారవుతున్నారంటే ఏమని సంబోధించాలి? మనమెలాంటి అభివృద్ధికి పరుగులెడుతున్నామో అర్థంగానీ పరిస్థితి నెలకొంది.
రెండు దశాబ్దాల క్రితం వరకట్న వేధింపులు, గృహహింసలు ఎక్కువగా ఉండేవి. వాటితో సమానత్వం లేకపోగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రభుత్వం సైతం ఆ విషయం ఆలోచించి పలు సంఘటనలను విశే్లషించి బాల్య వివాహాలను నిరోధించాయి. అక్షరాస్యత లేమి కారణంగా మహిళలు పలు సమస్యలకు గురవుతున్నారని విద్యాభివృద్ధికి కృషి చేశారు. 1993లో వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. ఐపిసి 498ఏ ప్రకారం గృహహింసకు పాల్పడితే పలు శిక్షలు సైతం ఏర్పాటుచేశారు. ఇన్ని చట్టాలున్నా అక్కడక్కడా పలువురు మహిళలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఇదిలా వుంటే దశాబ్ద కాలం క్రితం 2008 సంవత్సరంలో గిరిజన తండాలలో మగ సంతానం కోసం పలువురికి జన్మనిస్తూ, అమ్మాయిలు పుడితే భ్రూణహత్యలకు పాల్పడటం సంచలనం రేకెత్తించింది. జిల్లా అధికారులు ముందుకొచ్చి, మీ పిల్లలను చంపకూడదు, మీకొద్దనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉయ్యాలలు కట్టి అందులో ఉంచిపోవాలని పిలుపునిస్తే ఒక్క దేవరకొండలోనే ఎంతోమంది ఉయ్యాలలో పడుకోబెట్టిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మన రాష్ట్రంలో 100కిపై శిశువులు శిశుగృహాలకు చేరితే అందులో సగానికిపైగా నల్లగొండకు చెందినవారే కావడం విశేషం. రాష్ట్రంలో 23 శిశు గృహాలు, 2 శిశు విహార్లలో సగానికిపైగా ఆడశిశువులే ఉన్నారంటే నేటికీ బాలికలపట్ల మనమెంత గౌరవాన్నిస్తున్నామో తెలుస్తూనే వుంది. చిన్నారులపై, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చరమగీతం పాడాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపైనే ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని కఠిన చర్యలు తీసుకొని చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
సమాజానికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు కానీ కీడు చేసే దుశ్చర్యలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షిస్తూ చట్టాలను కఠినంగా అమలుపరిచినప్పుడే ఈ దాడులను కొంతమేరకు తగ్గించడానికి వీలవుతుంది. కావున ఆ దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా మానవ మృగాలలో ఒకింత మానవత్వం చేకూరి, సజావుగా ప్రవర్తించాలని కోరుకుందాం.

- డా.పోలం సైదులు