మెయిన్ ఫీచర్

చైతన్య గీతిక గేయ కవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమొక తీరని దాహం’ అని అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆ దాహానికి అరదండం వేయకపోతే అనితరసాధ్యమైన కవిత్వాన్ని ఏ కవి అయినా స్పృశించగలడు మరియు సృజియించగలడు. కవిత్వము నిరంతరమూ ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించేదై ఉండాలి. కవిత్వమంటే అచేతనంగా ఉండే మనసులను కదిలించేదిగా ఉండాలి. నిజాన్ని రాయడం, ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేదిగా కవిత్వం ఉండాలి. కేవలం అందమైన అక్షరాలను పేర్చడం, కఠినమైన పదాలు, పదబంధాలు ఉపయోగించడం మాత్రమే కాదు, ఆ పదాలను మాటిమాటికి నిఘంటులో వెతుక్కోవడం మాత్రమే కాదు, కవిత్వం పాఠకుని హృదయాన్ని నేరుగా తట్టేదై ఉండాలి. అణగారిన, బలహీన వర్గాలకు విజయబావుటాను ఎగరవేసే ఆయుధంగా ఉండాలి. వారి సమస్యా పరిష్కార నేర్పరి అయి ఉండాలి. మనసుకు ఉత్ప్రేరకం కావాలి. అది ఎల్లప్పుడూ హృదయాన్ని రగిలించేదిగా ఉండాలి. మానవీయ కోణాలను స్పృశించేదిగా ఉండాలి. కవి తన అనుభవాలను, అనుభూతులను స్పష్టంగా చెప్పగలిగినట్లు ఉండాలి. అది సూటిగా పాఠకుని హృదయాన్ని తాకాలి. కవి కనీసం జనాల గుండె లోతులను దగ్గరనుండి చూడగలగాలి. అలాంటి అనుభవాల నేపథ్యంలో కవిత్వాన్ని కవి రాయగలిగితే అది పదికాలాలపాటు లోకంలో మన్నన పొందగలదు. అంతేకాని గతిలేని వాదం, మతిలేని వేదంతో రాసే కవితలు ఎన్నాళ్ళూ ఈ సమాజంలో నిలువలేవు. కేవలం గతితార్కిక భౌతికవాదం, హేతువాదం, శాస్ర్తియ దృక్పథం, ప్రగతిశీల భావాలతో రాసే కవితలు మాత్రమే కలకాలం నిలబడతాయని చెప్పగలం. దీనికి ఉదాహరణగా వేమన, గురజాడ, శ్రీశ్రీ లాంటి మహాకవుల సారస్వతాన్ని పేర్కొనవచ్చు. కానీ నేడు చాలామంది కవులు తమ కవిత్వాన్ని ఏ ఉద్దేశ్యంతో, ఏ లక్ష్యంతో ఆశించి రాస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి హెచ్చు స్థాయిలో విరాజిల్లుతున్న వచన కవిత్వంలో నేడు ఎక్కువగా కనబడుతున్నది. ఆ కవి తన భావనను వ్యాఖ్యానం చేస్తేగాని పాఠకులు అర్థం చేసుకోవడంలేదు. తన ఆలోచనను భాష్యంగా చెప్తేగాని పాఠకులు అవగాహన చేసుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు ఆ కవిత్వం ప్రయోజనం ఏముంటుంది?
తెలుగు సాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో పద్య కవిత్వం, గద్య కవిత్వం అనే రెండు ముఖ్యమైన ప్రక్రియలు ఉన్నాయి. ఈ రెండింటిలో గద్య సాహిత్యాన్ని పరిశీలించగా, కథ, కథానిక, నవల, నాటిక, నాటకం మొదలగు సాహితీ ప్రక్రియలు ఉన్నాయి. అయితే ఈ వచన కవిత్వంలో భాగంగా వచ్చే గేయ కవితా ప్రక్రియ మాత్రమే నేరుగా జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయే గుణముందని మనం గుర్తించాలి. ఏ భాషలో అయినా భాషతో సంబంధం లేకుండా ఒక భాష నుండి వేరొక భాషకు ఈ గేయ కవిత అంతరాలను దాటి జన బాహుళ్యంలోకి పోగలదు. కేవలం గేయ కవితకు మాత్రమే ఆ శక్తి ఉన్నదని చెప్పవచ్చు. బాలగేయాలు, భక్తిగీతాలు మాత్రమే అన్న ధోరణి ఉంది. అయితే గేయ కవితలకు ఆదరణ కరువు అవుతున్న నేపథ్యంలో ఈ గేయ కవితలు రాయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. కానీ గతంలో వాగ్రూపంలో వున్న గేయ కవిత సుమారు వెయ్యి సంవత్సరాల పద్య సాహిత్య పద ఘట్టనల క్రింద నలిగిపోయి ఉండిపోయింది. ఆ తర్వాత గేయ కవిత లిఖితరూపంలోకి వచ్చిన వెంబడి సుమారు అర శతాబ్దంపాటు ఈ గేయ కవితాప్రస్థానం ఉజ్జ్వలంగా సాగింది అని చెప్పవచ్చు. గతంలో తెలుగు నేలపై గేయాన్ని పరుగు పెట్టించింది మాత్రం ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి.
ప్రముఖ వాగ్గేయకారులు భక్తిగీతాలు రచన చేసి, గానం చేశారు. క్షేత్రయ్య, అన్నమయ్య, వీరబ్రహ్మంగార్లు రాసిన కీర్తనలు, తత్వాలు కూడా గేయ రూపాలే. వీరి పదాలలో, కీర్తనలలో పాటలలో ఎక్కువగా వాడుక భాషనే ఉపయోగించారు. వాటి ద్వారా వర్గ వైషమ్యాలు నిరసిస్తూ సమాజోద్ధరణకు పాటుపడ్డారు. అయితే వారు ఒకప్రక్క భక్తి ఉద్యమంతోపాటు మరో ప్రక్క సమసమాజ స్థాపనకు ఎంతగానో కృషి చేశారు. వీరు కుల మతాలను నిరసించారు. అలాగే రాజాశ్రయాలను తిరస్కరించారు. కర్మకాండలకు ఏ మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. స్ర్తిలపై కూడా వీరికి ద్వేషంలేదు. కానీ వీళ్ళు దైవత్వాన్ని నమ్మారు. అంటే వీరిది భావోద్వేగ దృక్పథం అన్నమాట. అయితే ఈ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజానుకూల దృక్పథంతో సాగిన చార్వాకం, లోకాయత వారి భౌతికవాదంతో మరియు ప్రాపంచిన దృక్పథంతో రాసే కవితలు, గేయ కవితలు నిత్యమూ ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాయని చెప్పవచ్చు.
అలాగే స్వాతంత్య్రోద్యమకాలంలో అనేక దేశభక్తి గేయాలు స్వతంత్రకాంక్షతో వలస సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా వచ్చాయి. ఉదాహరణకు గరిమెళ్ళ సత్యనారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనం’ లాంటి దీర్ఘగేయం. అలాగే సుద్దాల హనుమంతుగారి చైతన్య గేయాలు వంటివి. ఆనాటి స్వాతంత్య్రకాంక్షకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. అలాగే వర్గ పోరాటాల నేపథ్యంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా అభ్యుదయ విప్లవ గేయాలుకూడా ఆ రోజుల్లో బహుళ ప్రజాదరణ పొందాయి. అయితే ఇపుడు మాత్రం ఆనాటి గేయ కవితా వైభవాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఏ కవి సాహసించడం లేదని చెప్పవచ్చు. చేసినా చాలా తక్కువమంది కవులు, రచయితలు మాత్రమే చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కథలు, కవితలు, విమర్శనాత్మక వ్యాసాలు (సమకాలీన సమస్యలపై వచ్చేవి) మాత్రమే ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి.
ఈ నేపథ్యంలో కవులకు, రచయితలకు గేయ కవితలను రాసే సామర్థ్యం ఉన్నప్పటికీ వాటిని రాసేందుకు ఆసక్తి చూపలేకపోతున్నారు. అయితే కథకు ఉత్తరాంధ్ర, విమర్శకు రాయలసీమ, పాటకు తెలంగాణలో కవులు పట్టం కడుతున్నారు. సామాజిక అంశాలను, వర్గ పోరాటాలను, వివిధ ప్రాంతాలలో వస్తున్న అస్తిత్వ వాదాలను తమ కవితావస్తువులుగా చేసి గేయ కవితలు, పాటలు రాయడంలో తెలంగాణ ముందుందని చెప్పవచ్చు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్ వంటి పేరొందిన కవులు, రచయితలు సామాజిక స్పృహతో రాసే గేయాలు, పాటలు నేరుగా ప్రజాబాహుళ్యంలోకి చేరాయి.
తెలంగాణ తర్వాత పాటకు స్థానాన్ని కల్పించింది మాత్రం ఉత్తరాంధ్ర అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్రలో పాటకు ప్రాణాన్ని పోసింది మాత్రం సుబ్బారావు ప్రాణిగ్రాహి. ఆయన ఒరవడిని అందిపుచ్చుకుని వంగపండు ప్రసాదరావు, గంటేడ గౌరునాయుడు, రౌతు వాసుదేవరావు లాంటి ఉద్దండులు గేయకవితలు రాసి జనాన్ని చైతన్యవంతం చేశారు. అలాగే సన్నశెట్టి రాజశేఖర్, నల్లి ధర్మారావు, మల్లిపురం జగదీష్, సిరికి స్వామినాయుడు, ఆల్తి మోహన్, నగరి కరుణాకర్, తిరుపతిరావు లాంటి వర్థమాన గేయ కవులు వివిధ సామాజిక అంశాలపై గేయాలను రాయగలుగుతున్నారు. వీరు సామాజిక వాగ్గేయకారులుగా, గాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందియున్నారు. అంటే వెనుకబడిన అణగారిన వర్గాల చైతన్యం కోసం ఆయా కవులు ముందుండడం ముదావహం. ప్రపంచీకరణలో భాగంగా విధ్వంసకర అభివృద్ధి మన దేశంలో ఎక్కువగా జరుగుతోంది. అందునా ఉత్తరాంధ్ర గేయ కవితలను ఈ ప్రాంత కవులు, రచయితలు ప్రజా చైతన్యం కోసం ఉద్యమ నిర్మాణం కోసం రాస్తున్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్రలో కవులు, రచయితలు తమ వంతు ప్రయత్నాలు చేయగలుగుతున్నారు. ఆ గేయాలను ఆలపించి ప్రజలలో చైతన్యం నింపి ఈ విధంగా విధ్వంసకర అభివృద్ధిలో దాగున్న కుట్రను తేటతెల్లం చేయడంలో ఉత్తరాంధ్ర కవులు నిరంతరమూ కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ సామాజిక బాధ్యతను ఆయా కవులు నెత్తిన పెట్టుకోవడం చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చు. కాకపోతే తెలంగాణా కవులు, రచయితలు విరివిగా తమ గేయ కవితలను మరియు పాటలను వివిధ సామాజిక మాధ్యమాలలో నిక్షిప్తం చేస్తున్నట్లు ఉత్తరాంధ్ర కవులు చేయలేకపోతున్నారు. వీరు అధునాతన సాంకేతికతను ఉపయోగించడంలో ఇంకా వెనుకబడి ఉన్నారని మనం చెప్పగలం. కవిత్వం కేవలం సన్మానాలకు, అవార్డులకు మాత్రమే పరిమితం కాకూడదు. దాని అంతిమ లక్ష్యం అది కాదు. ఆ కవి రాసే కవిత ప్రజల నాల్కలపై నర్తించి, ప్రజల కాలిగజ్జెలపై నడయాడాలంటే అది కేవలం గేయ కవితలకు మాత్రమే అవకాశం వుంది. అలాంటి గేయ కవితలను రాసే కవులకు వేరే సన్మానాలు ఎందుకు? వేరే అవార్డులు ఎందుకు?
గతంలో జరిగిన మందస జమీందారీ వ్యతిరేక పోరాటం, శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాల మరియు పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర వీరులు ఎంతో తెగువను చూపించారు. ఆయా పోరాటాలు గోచీకట్టుకోవడం రాని జనాల చేత విల్లంబులు పట్టినట్లు చేసాయి. అందుకే అక్కడ పారే నదులలో ఇసుక తీసేకొద్దీ నీరుకాదు విప్లవం ఊట తరగలు తరగలుగా పెల్లుబుకుతుందని ఓ ఉత్తరాంధ్ర కవి చెప్పగలిగాడు. ఆ రకంగా సామాజిక కోణంలోకి చొచ్చుకుపోయి ఎక్కువ కాలాలపటు నిల్తుందని చెప్పవచ్చు. పాట ప్రశ్నించేది కావాలి, పాట తొడగొట్టేది కావాలి, పాట విమర్శించేది కావాలి, మొత్తంగా చూస్తే పాట ప్రజాపక్షం కావాలి. అలాంటి పాట జన హృదయాలను దోచుకుంటుంది అని చెప్పగలం. సామాజిక అంశాలను ప్రధాన వస్తువుగా తీసుకుని గేయ కవితలను కొంతమంది కవులు, రచయితలు రాస్తూ, రాస్తూ ఉండడం మంచి కవిత్వాన్ని అందించే పరిణామంగా మనం భావించవచ్చు.
గతంలో భూమికోసం, భుక్తికోసం, భక్తికోసం సామాన్య ప్రజల నోట వెంబడి గేయం పుట్టింది. గ్రామీణ ప్రాంతాలలో నివసించే సామాన్య జనాలు పంట పొలాల్లో శ్రమ మరిచిపోవడానికి పాడిందే పాట అయింది. ఆనాటి కథలన్నీ ముందుగా గేయ రూపాన్ని సంతరించుకున్నాయి. అవి ఒక తరం నుండి ఒకతరానికి, ఒక ప్రాంతంనుండి ఒక ప్రాంతానికి ప్రయాణించాయి. ఒక భాష నుండి వేరే భాషలకి తర్జుమా కాబడ్డాయి కూడా. తద్వారా పాటకు, గేయానికి విశ్వవ్యాప్తమైన శక్తి ఉందన్నమాట. గేయానికి, పాటకు సమానార్థమున్నప్పటికీ ఈ రెంటిమధ్య స్పష్టమైన తండా మాత్రం ఉంది. కేవలం మాత్రా ఛందస్సులో రాసినదే గేయం అవుతుంది. పాట మాత్రం రాగ, తాళయుక్తంపై ఆధారపడి ఉంటుంది. అంటే పాట సంగీత ప్రధానమైనది. అదే గేయానికైతే మాత్రాసరళివల్ల ఒక నడక, ఒక పరుగు సంతరిస్తుంది. దానివల్ల గేయం లయాంత్మకం అవుతుంది. అంటే గద్య సాహిత్య వివిధ ప్రక్రియలు అన్నింటికంటే గేయ కవిత, పాట మాత్రమే జన హృదయాలను నేరుగా తాకుతుందని మనం గ్రహించవచ్చు. అసలు పాట పేరు చెపితే కృష్ణశాస్ర్తీగారే గుర్తొస్తారు. ఆయన పాటకు ప్రాణాన్ని పోశారు. అతని భావనాఝరిలో ఉద్భవించిన భావగీతాలు ఎన్నో ఎనె్నన్నో. అయితే ఈ భావకవిత్వం సామాజిక శ్రేయస్సుకు ఎంతవరకు తోడ్పాటునందించిందో కొలబద్ద వేయవలసిందే.
అలాగే సినారె గజల్స్ ద్వారా పాఠకుల, గాయకుల హృదయాలను కొల్లగొట్టారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉర్దూ సాహిత్య ప్రక్రియలో గేయ రూపంలో వున్న గజల్స్ గేయ సాహిత్య ప్రక్రియను తెలుగులో ఉత్కృష్ట స్థానానికి తీసుకుపోయింది మాత్రం సినారెనే. తన గజల్ గేయ సాహిత్యంలో మానవీయ కోణాలను, సామాజిక అంశాలను కూడా సినారె తరచూ స్పృశించేవారు. శ్రీశ్రీ, దాశరథి, దేవేంద్ర, సినారె, సీరపాణి లాంటి అభ్యుదయ, విప్లవ కవులు సమాజాన్ని జాగృతం చేయడానికి గేయాన్ని బలమైన సాధనంగా వాడారు. శ్రీశ్రీగారి మహాప్రస్థానం వచనకవి అయినప్పటికి ఆ కవితలకు గేయాలకున్న నడక, పరుగులు ఉన్నాయి. ఆ కవితలు అంతర్లీనంగా లయాత్మకం. అందుకే ఆ మహాప్రస్థానంలో కవితలు గీతికలుగా ఆనాటినుండి నేటివరకు బహుళ ప్రజాదరణ పొందుతున్నాయి. గురజాడ వారి దేశభక్తి గేయం, పూర్ణమ్మ కథ, కన్యక మొదలైన గేయ కవితలు మాత్రాఛందస్సుతో లయాత్మకంగా పరుగు తీశాయి. అవి ఆనాటి దురాచారాలపై గొడ్డలిపెట్టుగా నిలిచాయి. అందుకే గురజాడ, నాటి కవులు నుండి నేటి కవులు అందరికీ గురజాడ అడుగుజాడగా నిలిచారు. ఆ కవులను ఆదర్శంగా తీసుకొని ఈనాటి వర్థమాన కవులు గేయ కవితా ప్రస్థానంలో పాల్గొని ప్రజాచైతన్యానికి బాటలు వేయవలసిందిగా మనం కోరుకోవచ్చు.

- పిల్లా తిరుపతిరావు, 7095184846