మెయన్ ఫీచర్

‘వాయనాడ్ ఎంపిక’పై వామపక్షాల గుర్రు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చిరకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించడంలో ఆంతర్యం ఏమిటి? గతంలో రాహుల్ నాయనమ్మ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కర్నాటకలోని చిక్‌మగళూర్ నుంచి 1978లో జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. దక్షిణ భారతం నుంచి పోటీ చేసిన ఉత్తరాదికి చెందిన తొలి నేత, తొలి మాజీ ప్రధాని ఇందిర కావడం విశేషం. 1977లో ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి జనతాపార్టీ అభ్యర్థి రాజ్‌నారాయణ్ చేతిలో ఆమె ఓటమి చెందారు. 32 సంవత్సరాల తర్వాత మళ్లీ తన నాయనమ్మ ఇందిరాగాంధీ, 20 ఏళ్ల తర్వాత తల్లి సోనియాగాంధీ బాటను రాహుల్ ఎంచుకున్నారు.
ఎమర్జన్సీ వ్యతిరేక ప్రభంజనంలో 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరమ్మ ఓటమి చెందడంతో చిక్‌మగళూరు ఉపఎన్నికలో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1980 ఎన్నికల్లో రాయ్‌బరేలీతో పాటు మెదక్ నుంచి పోటీ చేసిన ఆమె రెండు చోట్లా గెలుపొందారు. రెండు స్థానాల నుంచి పోటీచేయడం అగ్రనేతలకు కొత్త కాదు. 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసితో పాటు సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర నుంచి పోటీ చేసి రెండు చోట్లా విజేతగా నిలిచారు. అనంతరం వడోదర స్థానాన్ని వదులుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన వారిలో మోదీ, అటల్ బిహారీ వాజపేయి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ము లాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఉన్నారు.
1957 లోక్‌సభ ఎన్నికల్లో వాజపేయి మూడు స్థానాల నుంచి పోటీ చేశారు. బలరాంపూర్, లక్నో, మథుర నుంచి పోటీ చేసి, బలరాంపూర్‌లో ఆయన గెలిచారు. లక్నోలో రెండవ స్థానంలో నిలిచి, మథురలో డిపాజిట్‌ను కోల్పోయారు. 1991 ఎన్నికల్లో వాజపేయి మధ్యప్రదేశ్‌లోని విదిష, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. 1996 ఎన్నికల్లో వాజపేయి గుజరాత్‌లోని గాంధీనగర్, యూపీలోని లక్నో నుంచి పోటీ చేసి గెలిచారు. 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ రాయ్‌బరేలీలో విజయరాజె సింధియాను, మెదక్‌లో జనతాపార్టీ అభ్యర్థి జైపాల్ రెడ్డిని ఓడించారు. 1999లో సోనియా గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఆమె ఆ ఎన్నికల్లో కర్నాటకలోని బళ్లారి నుంచి కూడా పోటీ చేసి ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్‌ను ఓడించారు. 1999 వరకు బళ్లారి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండగా, 2004 నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. 1999 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యూపీలోని చంబల్, కనోజ్ సీట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆయన మెయిన్‌పురి, అజాంగఢ్ సీట్ల నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 71 సీట్లను గెలుచుకుంది. బీజేపీ గాలిని తట్టుకుని గెలిచిన నేత ములాయం మాత్రమే. రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ 2004 ఎన్నికల్లో చాప్రా, మథేపుర సీట్ల నుంచి గెలిచారు. 2009లో లాలూ సరాన్, పాటలీపుత్ర సీట్ల నుంచి పోటీ చేశారు. సరన్‌లో మాత్రమే గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ములాయం తనయుడు అఖిలేశ్ యాదవ్ కనోజ్, ఫిరోజాబాద్‌ల్లో గెలిచారు. ఉత్తరాదికి చెందిన ఇందిరా గాంధీ, సోనియా గాంధీ దక్షిణ భారతానికి చెందిన చిక్‌మగళూరు, మెదక్, బళ్లారి స్థానాల నుంచి గెలిచిన విషయం విదితమే.
లోక్‌సభ ఎన్నికల్లో కొందరు నేతలు రెండు సీట్ల నుంచి పోటీ చేయడం కొత్త కాదు. కానీ, మారిన పరిస్థితుల్లో ప్రతి అంశం రాజకీయం కావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ రెండు చోట్ల పోటీ చేసినప్పుడు లేని అభ్యంతరం రాహుల్ విషయంలో ఎందుకు? కేరళలో ప్రస్తుతం వామపక్ష కూటమి అధికారంలో ఉంది. 2004లో వామపక్ష పార్టీల సహకారంతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మతతత్వ శక్తులను ఓడించేందుకు గత ఐదేళ్లుగా కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలసి కృషి చేస్తున్నాయి. తమకు బలం ఉన్న కేరళలో తమపైన రాహుల్ పోటీ చేయడం ఎందుకనే ఆక్రోశంతో వామపక్షపార్టీలు ఉన్నాయి. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణం అధికారంలో ఉన్నందున అక్కడి నుంచి రాహుల్ పోటీచేస్తే బాగుండేదని, భాజపాపై పోరాటానికి విఘాతం కలిగించేలా కాంగ్రెస్ అధ్యక్షుడు వాయనాడ్ నుంచి పోటీ చేయడం తగదని వామపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి.
తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న నియోజకవర్గం వాయనాడ్. ఇక్కడి నుంచి రాహుల్ పోటీ చేస్తే మూడు దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. 2009లో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐపై తక్కువ మెజార్టీతో గెలిచింది. వాయనాడ్ కాంగ్రెస్‌కు కంచుకోట కాదు. ఇక్కడ మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. రాహుల్‌ను ఓడించేందుకు వామపక్షపార్టీలు సిద్ధమవుతున్నాయి. తమను రాజకీయంగా అణగదొక్కేందుకు కేరళను రాహుల్ ఎంచుకోవడంపై వామపక్ష పార్టీలతోపాటు లౌకిక వాద శక్తులు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
దక్షిణ భారతదేశంలో మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. రాహుల్ వాయనాడ్‌లో పోటీ చేయడం వల్ల ఈ నియోజకవర్గాలపై సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల భావిస్తున్న అంచనాలు నిజం కాకపోవచ్చు. ఇప్పటికే ఆంధ్రాలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో దాని బలం గణనీయంగా తగ్గింది. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేసినా తుమ్మితే ఊడిపోయే ముక్కులా అక్కడి ప్రభుత్వం కొనసాగుతోంది. తమిళనాడులో డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయి నాలుగు దశాబ్దాలు గడిచాయి.
2014 ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ బీజేపీ ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని గెలిచారు. ప్రధాని మోదీ హిందువులకు అత్యంత పవిత్రమైన వారణాసి నుంచి గెలిచారు. వారణాసి లాగా వాయనాడ్‌కు చెప్పకోదగిన ప్రాధాన్యత ఏమీ లేదు. వరుసగా రెండు ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతోనే వాయనాడ్‌లో కాంగ్రెస్ గెలిచింది. ఇటీవల కాంగ్రెస్ గెలిచిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సురక్షిత స్థానాన్ని రాహుల్ ఎంపిక చేసుకుని ఉంటే బాగుండేదని విశే్లషకుల అంచనా. బీజేపీపై పోరాటం చేస్తున్న తమకు రాహుల్ ఇలా అడ్డుతగలడం పట్ల వామపక్ష నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది.
బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలను కలుపుకుని పోతామంటూ ప్రకటనలు చేస్తున్న రాహుల్ వాయనాడ్‌లో గెలవడం అసాధ్యం కాదు. కానీ, ఎంపిక చేసుకున్న నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే, టీడీపీ తదితర పార్టీలను కలుపుకుని బీజేపీపై పోరాడుతానంటున్న రాహుల్ వాయనాడ్‌లో పోటీ చేస్తాననడం విమర్శలపాలవుతోంది. ఆయన నిర్ణయం రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదమేనన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వామపక్ష పార్టీల ఆకాంక్షలను దెబ్బతీసేలా కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై మాత్రం ప్రజాతంత్ర, లౌకికవాద శక్తుల్లో చర్చ జరుగుతోంది. కేరళలో బీజేపీ ఏమైనా బలంగా ఉందా? అంటే అదేమీ లేదు. శబరిమల అంశంపై బీజేపీ ఉద్యమం చేసినా, అది ఓట్లను రాల్చేందుకు ఉపయోగపడదు. అందుకే ఈ అంశాన్ని బీజేపీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. కేం ద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ విషయంలో తీసుకున్న నిర్ణయం ద్వారా వామపక్షపార్టీలను దూరం చేసుకున్నట్లే. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, టీడీపీ, ఎన్సీపీ తదితర పార్టీలకు సిద్ధాంతం అంటూ ఏమీ ఉండదు. అవసరమైతే బీజేపీకి ఏదో పేరుతో మద్దతు ఇచ్చేందుకు ఈ పార్టీలు వెనకాడవు. అమేథీ, వాయనాడ్‌ల్లో రాహుల్ గెలవవచ్చు. కాని బీజేపీపై పోరు సాగించేందుకు ముందుకొచ్చే మంచి స్నేహితుడిని కాంగ్రెస్ దూరం చేసుకుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097