మెయన్ ఫీచర్

ప్రభం‘జనం’ ఎటు వైపు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకొంది. శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ లభిస్తుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈసారి వైకాపా గెలుపు తథ్యమని, ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ‘్ఫ్యన్’ గాలి బాగా వీస్తోందని కొంతమంది విశే్లషకులంటున్నారు. రాజకీయాలు జూదంలా పరిణమించిన ప్రస్తుత తరుణంలో ఆంధ్రా ఓటర్ల మనసును అంచనా వేయడం సులువుకాదు. అధికార తెదేపా క్యాడర్ చెక్కుచెదరలేదని, ‘సైకిల్’ చివరి క్షణంలోనైనా స్పీడ్ అందుకుంటుందని ఆ పార్టీల నేతలు వాదిస్తున్నారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఓట్లను చీల్చే పరిస్థితి ఉన్నందున తెదేపా లాభపడుతుందనే వాదన ఉంది. జనసేనను తక్కువగా అంచనా వేయరాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పవన్ కల్యాణ్ కీలక పాత్ర వహిస్తారన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఆంధ్రాలో కర్నాటక రాజకీయాలు పునరావృతమైనా ఆశ్చర్యం చెందనక్కర్లేదని, ఎన్నికల్లో ఏమైనా జరగవచ్చునని మరో వాదన వినిపిస్తోంది.
ఆంధ్రాలో ప్రధానంగా పంచముఖ పోటీ జరుగుతోంది. తెదేపా, వైకాపా, భాజపా, జనసేన-వామపక్ష పా ర్టీల కూటమి, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. ఇక ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెదేపా, వైకాపా, జనసేనల మధ్య ముక్కోణపు పోటీ తీవ్రస్థాయిలో ఉన్నందున కనీసం 25 చోట్ల ఫలితాలు తారుమారవుతాయి. వైకాపా ప్రభంజనం నిజమే అయితే ఓట్ల చీలిక ప్రభావం ఉండదని, వోటర్లు ఏకపక్షంగా తీర్పు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. తెదేపా తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో గెలిచి నాల్గవసారి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. విపక్ష పార్టీల బలహీనతలను అస్త్రాలుగా చేసుకుని తెదేపా సమరం సాగిస్తోంది.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. సీఎం పదవిని ఎలాగైనా దక్కించుకోవాలన్న తపనతో ఆయన రణరంగంలో దూసుకుపోతున్నారు. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోటీపడుతున్న వివిధ పార్టీల అభ్యర్థుల గురించి చెప్పుకునేందుకు ఏమీ లేదు. దివాలాకోరు రాజకీయ సిద్ధాంతాలకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. తెదేపా, వైకాపా, జనసేన పార్టీలు ఫిరాయింపుదార్లకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చి, ప్రజాస్వామ్యానికి పాతర వేశాయి. అంతవరకూ పదవులను ఇచ్చిన పార్టీలను వీడి ప్రత్యర్థి పార్టీలకు వెళ్లి నిర్లజ్జగా కండువాలు కప్పుకొంటున్నారు. ప్రజలు సైతం ఈ ఫిరాయింపుదార్లను ఏవగించుకోవడం లేదు.
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్నది వాస్తవం. చంద్రబాబు తన మహేంద్రజాల విద్యలతో పార్టీని సునాయాసంగా గట్టెక్కిస్తారని తెదేపా శ్రేణులు నమ్ముతున్నాయి. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి, చిరంజీవి ప్రజారాజ్యం, టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్షపార్టీలు, బీజేపీ మధ్య పోటీ జరిగింది. వైఎస్‌ఆర్ ప్రజాకర్షక విధానాలు, ప్రజల్లో అసంతృప్తి లేకపోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల, ఒక నాయకుడి పట్ల మక్కువ ఉంటే- ఎన్ని ఆటంకాలు ఎదురైనా జనం గెలిపించుకుంటారనేందుకు 2009 ఎన్నికలు నిదర్శనం. ప్రస్తుత ఎన్నికల్లోనూ అవే పరిస్థితులు ఆంధ్రాలో నెలకొన్నాయి. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల ప్రజలకు ఉన్న మోజు వల్ల కాంగ్రెస్ గట్టెక్కితే, ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటే టీడీపీ గట్టెక్కుతుందా? 2014లో బీజేపీతో పొత్తు, పవన్ కల్యాణ్ ప్రచారంతో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి.
ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో కచ్చితంగా చెప్పలేకపోయినా, గాలి ఎటుందో చెప్పేందుకు అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 44.9 శాతం ఓట్లతో 102 సీట్లను, వైకాపా 44.6 శాతం ఓట్లతో 67 సీట్లను సాధించాయి. బీజేపీ 2.2 శాతం ఓట్లతో 4 సీట్లను తెచ్చుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 40.8 శాతం ఓట్లతో 15 సీట్లను, 45.7 శాతం ఓట్లతో వైకాపా 8 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 7.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల శాతాలను కలిపితే ఎన్డీఏ కూటమికి 47.1 శాతం ఓట్లతో 17 పార్లమెంటు సీట్లు, 44.6 శాతం ఓట్లతో వైకాపాకు ఎనిమిది సీట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 78.9 శాతం ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి వైకాపా కంటే ఐదు లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో 75 నుంచి 80 శాతం మధ్య ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. అన్ని పార్టీల సభలకు జనం హాజరవుతున్న తీరు చూస్తుంటే, ప్రజలు ఈసారి కసిగా ఓటు వేస్తారనిపిస్తోంది. గత ఎన్నికల్లో పాజిటివ్ ఓటుతో టీడీపీ గట్టెక్కింది.
కాగా, ఇటీవల హిందీబెల్ట్‌లోని ఛత్తీస్‌గఢ్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి పరాజయం తప్పదనుకున్నా, ఘోరంగా ఓడిపోతుందని పరిశీలకులు కూడా అంచనా వేయలేకపోయారు. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే బొటాబొటి మెజార్టీతోనైనా మార్చేస్తారు. మధ్యప్రదేశ్‌లో అతికష్టంపై కాంగ్రెస్ 14 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవదని సర్వేలు చెప్పాయి. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేశాయి. ఊహించని రీతిలో బీజేపీ 325 సీట్లను గెలుచుకుంది. ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టాలనుకొంటే ప్రభంజనమే వస్తుంది. కానీ, ఎక్కువ పార్టీలు పోటీలో ఉంటే ప్రభంజనం ఉన్నా కనిపెట్టడం కష్టం. ఏపీలో ప్రస్తుతం వైకాపా ప్రభంజనం ఉందనే మాట నిజమే అయితే కచ్చితంగా ఆ పార్టీకి పెద్ద మెజార్టీ లభించే అవకాశం ఉంది. ఆ ప్రభంజనం పోలింగ్ తేదీ వరకూ కొనసాగాలి. జనసేన,కాంగ్రెస్ తదితర పార్టీలు స్పీడ్ బ్రేకర్లుగా మారితే అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఫలితాలు తెదేపాకి అనుకూలంగా పరిణమించవచ్చు. జనసేన, కాంగ్రెస్ పా ర్టీలు వైకాపా మెజార్టీని నియంత్రిస్తాయా? ఓట్ల చీలిక టీడీపీకి అనుకూలిస్తుందా? అనేది అంతు చిక్కని ప్రశ్న. ప్రతి సామాజిక వర్గం ఓట్లు, తటస్థ ఓటర్ల తీర్పు ఇక్కడ కీలకం. కేడర్ బలం, బూత్ మేనేజిమెంట్, ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు ఓపికగా తీసుకెళ్లే ప్రయత్నం వంటివి చివరి రకు కొనసాగించడంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం అవసరం. ఐదువందల నుంచి వెయ్యి ఓట్లులోపే గెలుపుఓటములను ప్రభావితం చేసే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప- వైకాపాకు ఎలాంటి ప్రభంజనం రాదు. ప్రభంజనాలు ఎన్నికల సభలకే పరిమితమైతే ఉపయోగం ఉండదు. పోలింగ్ బూత్‌లకు జనం కదలాలి.
టీడీపీకి చెక్కుచెదని కేడర్, పోలింగ్ బూత్‌ల వారీగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. పైగా చంద్రబాబు పలు సంక్షేమ పథకాలను చివరి ఆరు నెలల్లో బాగా అమలు చేశారని, ఆయనకు మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చంద్రబాబు లేదా జగన్‌లో ఎవరు గెలిచినా నెగిటివ్ ఓటుతోనే అధికారంలోకి వస్తారు. వైకాపాకు అవకాశం ఇవ్వరాదన్న నెగిటివ్ ఓటుతో చంద్రబాబు లాభపడతారు. చంద్రబాబుకు మరో చాన్స్ ఇవ్వకూడదన్న నిర్ణయంతో జనం ఉంటే నెగిటివ్ ఓటు వైకాపాను గెలిపించవచ్చు. వౌలిక సదుపాయాల కంటే సంక్షేమ పథకాలకు టీడీపీ, వైకాపా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. సంక్షేమ పథకాలపై వైకాపా, టీడీపీ ఎడాపెడా వరాలు ఇచ్చేస్తున్నాయి. ఇది ప్రమాదకరమైన పరిణామం. దీని వల్ల ప్రభుత్వ ఖజానా దివాలా తీసే అవకాశం ఉంది.
కాగా, ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిణామాలు ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలేమీ కావు. 2009 ఎన్నికల్లో అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్ ఆనాటి సీఎం వైఎస్‌ఆర్‌ను ప్రశంసించినందుకు వేటు పడింది. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజశేఖరరెడ్డి యాదవ్‌ను మళ్లీ డీజీపీగా నియమించారు. ఎన్నికల సమయంలో ఇలా బదిలీ వేటుకు గురయ్యే అధికారులపై మీడియా ఒకటి రెండు రోజులు చర్చ చేస్తుందే తప్ప, వీటిని పట్టించుకోవాల్సిన పనిలేదు. అధికారులను సొంత ప్రయోజనాలకు వాడుకునే పార్టీలు కూడా వీరిని వదిలిపెట్టేస్తాయి. ఎన్నికల్లో వ్యూహ ప్రతి వ్యూహాలకు తగిన వ్యవధి ఉండదు. అందుకే అధికారులు రాజకీయ పార్టీలకు గులాం గిరీ చేయకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే మంచిది. ఇంటెలిజెన్స్ చీఫ్, ఇద్దరు ఎస్పీలను విధులను తప్పించడంపై ఫిర్యాదులు రావడంతో, ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు విచారణలో ఉంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097