మెయన్ ఫీచర్

ఈవీఎంలపై అనుమానాల నీడలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలంటే భారత్‌లో పెద్ద సంబరమే. ప్రపంచం దృష్టంతా ఇక్కడే. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో రష్యా వెలుపెట్టిందనే ఆరోపణలు గుప్పుమనడంతో మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లోనూ అలాంటి విదేశీ హస్తం ప్రమేయం ఉందా? ఎన్నికలు ఇంకా స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎందుకు జరగడం లేదనేది సామాన్యుడి ప్రశ్న. వాస్తవానికి భారత్‌లో ఎన్నికలు ఒక్కో రూపాన్ని సంతరించుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు విస్తృత రూపం దాల్చాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞాన యుగంలో ఎన్నికలు ఆధునికతను సంతరించుకున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 121 కోట్లు కాగా, ‘వరల్డ్ పాపులేషన్ మీటర్’ ప్రకారం భారత్ జనాభా 132 కోట్లు, అందులో నమోదైన ఓటర్ల సంఖ్య 81 కోట్లు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుగాంచిన భారత్‌లో ఎన్నికలు అంతులేని కోలాహలం. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కొన్ని నెలల ముందు నుంచే ప్రచార హడావుడితో హోరెత్తే పరిస్థితి నుండి అనేక ఆంక్షలు, నిబంధనలు, నియమాల మధ్య వ్యవధి తగ్గినా ప్రచారం హోరు మాత్రం తగ్గడం లేదు. ప్రచారంతో పాటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని అవకాశాలనూ వినియోగించుకునే క్రమంలో రాజకీయ పార్టీలూ, అభ్యర్థులూ తమ పరిధి దాటి ఓటర్లను లోబరుచుకునే ప్రయత్నాలూ చేస్తున్నారు. మద్యం, బిర్యానీ ప్యాకెట్లుతో మొదలు పెట్టి ఆ తర్వాత నగదు పంపిణీ నుండి పలు రూపాలు దాల్చి టీవీలు, సెల్‌ఫోన్లు, చీరలు, బట్టల పంపిణీ వరకూ వెళ్లింది. అంగబలం, అర్థబలం బాగా ఉన్న రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించి తమకు నచ్చిన వారికి ఓట్లు వేసే విధానానికి తెరదించేలా ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు’ (ఈవీఎంలు) వచ్చాయి, ఈవీఎంలపైనా అనుమానాలు తలెత్తడంతో సరికొత్తగా వీవీప్యాట్‌లు వచ్చాయి. ఇపుడు వీవీప్యాట్‌లకూ, ఈవీఎంలకు మధ్య గణాంకాల గందరగోళం తలెత్తడంతో వ్యవహారం ముదిరి పాకాన పడి అది సుప్రీం కోర్టు తలుపులను తట్టింది.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అన్ని హంగులతో 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. స్వాతంత్య్రం రాకముందు 1920లో బ్రిటిష్ ఇండియాలో ఎన్నికలు జరిగినా, స్వాతంత్య్ర భారతంలో 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకూ తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 489 స్థానాలకు 53 పార్టీలు 1849 మంది అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఫలితాలను 1952 ఫిబ్రవరి 10న ప్రకటించారు. తొలి లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ మవలాంకర్ వ్యవహరించారు. తొలి లోక్‌సభ 1952 ఏప్రిల్ 17 నుండి 1957 ఏప్రిల్ 4 వరకూ పనిచేసింది.
17వ లోక్‌సభకు ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. బ్యాలెట్ పత్రాలతో జరిగిన ఎన్నికల స్థానే- ఈవీఎంల ద్వారా మీట నొక్కి తమ ఓటును వినియోగించుకునే విధానం అమలులోకి వచ్చి అపుడే 38 ఏళ్లు గడుస్తున్నాయి. తొలిసారి ఈవీఎంలను కేరళలో వినియోగించారు. 2004 నుండి దేశవ్యాప్తంగా ఈవీఎంల వినియోగం అమలులోకి వచ్చింది. 2013లో నాగాలాండ్ నోక్సిన్ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్‌లను తొలిసారి ప్రయోగాత్మకంగా వినియోగించారు. 2014 ఎన్నికల్లో వీవీప్యాట్‌లను దేశవ్యాప్తంగా అమలులోకి తెచ్చారు. వోటర్ల జాబితాలను ఎలాక్ట్రానిక్ రూపంలోకి తీసుకురావడం, ఓట్ల తొలగింపు, ఓట్ల చేర్పును సైతం ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చారు. నేషనల్ ఎలక్ట్రోరల్ డేటాబేస్‌ను రూపొందించారు. ఈవీఎంలలోనూ ‘నోటా’ పద్ధతిని తెచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ, సూక్ష్మపరిశీలకులు, శాంతి భద్రతల పరిశీలకులు, వ్యయ అంచనా పరిశీలకులు, జీఐఎస్ వినియోగం, గూగుల్ ఎర్త్ వినియోగం, శాటిలైట్ ఫోన్లు, ప్రత్యక్ష వెబ్ బ్రాడ్ కాస్టింగ్, బయోమెట్రిక్ వినియోగం, మీడియాలో పెయిడ్ ఆర్టికల్స్‌పై నియంత్రణ, పలు కమిటీలు, పార్టీ ఫిరాయింపులపై నిబంధనలు.. ఇలా ఎన్నో రకాల సంస్కరణలను తీసుకువచ్చారు.
లా కమిషన్ మార్చి 2015లో ఇచ్చిన 255వ నివేదిక, అంతకు ముందు ఇచ్చిన 244వ నివేదిక, 170వ నివేదిక , 1970లో గోస్వామి కమిటీ , 1993లో వోరా కమిటీ, 1998లో ఇంద్రజిత్ గుప్తా కమిటీ, 1999లో లా కమిషన్ నివేదిక, 2001లో రాజ్యాంగ సమీక్ష జాతీయ కమిషన్ ఇచ్చిన నివేదికలు ఎన్నికల సంస్కరణల్లో సమూల మార్పులకు ఎంతో సహకరించాయి. వీటికి తోడు 2013 డిసెంబర్ 16న సుప్రీం కోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుపీ సివిల్ 536/2011)లోనూ, 2014 సెప్టెంబర్ 8న యోగేష్ గుప్తా వెర్సస్ ఎన్నికల కమిషన్ (డబ్ల్యుపీ 422/2014) కేసులోనూ , ‘ఎంఏస్ గిల్ వెర్సస్ సీఈసీ ఎఐఆర్ 1978 సుప్రీం కోర్టు 851’ లోనూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు పెనుసంచలనానికి నాంది పలికాయి. వీటికితోడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(1), 324(6), 329(బీ), 324(5) ద్వారా దఖలు పడిన ప్రత్యేక అధికారాలు సైతం ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేసేందుకు, స్వీయ నిర్ణయాలు తీసుకునేందుకు కొంత మేర దోహదం చేశాయి. ఇంత జరిగినా ధన ప్రాబల్యాన్ని, హింసా రాజకీయాలను, ప్రభుత్వ యంత్రాంగం, నిధుల దుర్వినియోగం, కుల, మత రాజకీయాలు, మెజారిటీ పద్ధతిని, పార్టీ ఫిరాయింపులను, ఎన్నికల వాగ్దానాల్లో నియంత్రణను తీసుకురాలేకపోయారు. ఓటు హక్కు పొందే వయస్సుపై ఇంకా చర్చ జరుగుతునే ఉంది. నేరచరితుల అంశంపై కూడా అస్పష్టత ఉంది. ఎన్నికల సిబ్బంది కొరత, అనర్హత వేటు, చిహ్నాల వినియోగం, ఆషామాషీ అభ్యర్ధులను అదుపు చేయడం, కండబలం ఉన్న వారు ఆయుధాలను వినియోగించడం.. వంటివి నియంత్రించలేకపోయాం. ఇన్ని అంశాల మధ్య కూడా భారతీయ ఎన్నికలకు ప్రత్యేక విశిష్టత ఉండనే ఉంది. ఈ క్రమంలోనే ఈవీఎంలకు వీవీ ప్యాట్‌లు జతచేసి గత సారి ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈవీఎంలలో నమోదైన ఓట్ల సంఖ్యకు, వీవీప్యాట్‌లలో నమోదవుతున్న ఓట్ల సంఖ్యకు తేడా వస్తున్నట్టు అనుమానాలున్నాయి. ఈ అంశంపై ఎప్పటి నుండో రాజకీయ పార్టీలు పోరు సాగిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వారి మొర పట్టించుకోకపోవడంతో రాజకీయ పార్టీలు సుప్రీం కోర్టు తలుపుతట్టాయి.
న్నికల్లో వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపును ఎందుకు పెంచట్లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం మేర ఓటు రసీదు యంత్రాలను (వీవీప్యాట్) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈసీ తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఈవీఎంను మాత్రమే వీవీప్యాట్ స్లిప్‌లతో లెక్కించి సరిచూస్తున్నారు. ఈ స్లిప్‌ల లెక్కింపును ఎందుకు పెంచలేకపోతున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి ఈసీ తరఫున కోర్టుకు హాజరైన సుదీప్ జైన్ స్పందిస్తూ ప్రత్యేక కారణాల వల్లనే లెక్కింపు పెంచడం లేదని చెప్పారు. అదే సమాధానంతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపును పెంచాలనుకుంటున్నారా? ఒక వేళ పెంచకపోతే స్లిప్‌ల లెక్కింపులో ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ ఈనెల 28వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ప్రక్రియతో ఎన్నికల కమిషన్ సంతృప్తిగా ఉంటే అందుకు ఉన్న కారణాలు కూడా తెలియజేయాలని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రెకెత్తుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా 50 శాతం మేర వీవీప్యాట్‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలను తీసుకురావాలని 21 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ అజాద్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్సీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్ యాదవ్, సతీష్ చంద్ర మిశ్రాల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్ అశోక్ లవాసాలను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అయితే ఈసీ నుండి సంతృప్తికర సమాధానం లేకపోవడంతో వీరంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో ఎదురుచూడాలి. పౌరుల్లో నిజాయితీ లేనంతకాలం , ప్రలోభాలకు లోనయినపుడు ఎన్ని చట్టాలు తెచ్చినా, నిబంధనలు తెచ్చినా గణనీయమైన మార్పులను చూడలేమన్నది నిస్సందేహం. పౌరుల మద్దతు లేనిదే ఏ మార్పూ సాధ్యం కాదు.

-బీవీ ప్రసాద్ 98499 98090