మెయన్ ఫీచర్

జాతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నవాడిని ఎప్పుడూ హత్య చేసేందుకు ప్రయత్నించకు..’ అని రాజనీతిజ్ఞుడు, అమెరికా 28వ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ చెప్పిన రాజకీయ సిద్ధాంతం అక్షరాలా మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి అతికినట్లు సరిపోతుంది. చరిత్రలోకి వెళితే దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచినపుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 80 శాతం సీట్లు కాంగ్రెస్‌కే దక్కేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఉడ్రో విల్సన్ సిద్ధాంతం నిజమన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్యకు సిద్ధపడింది. ఇంత జరిగిన తర్వాత ఆ పార్టీ జోలికి వెళ్లాల్సిన అవసరం టీఆర్‌ఎస్‌కు లేదు. ఆత్మహత్యకు సిద్ధమైన పార్టీని హత్య చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలుండవు.
తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో హైదరాబాద్ మినహాయించి మిగిలిన 16 చోట్ల రెండు, మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్‌ఎస్ పోటీని ఎదుర్కొనడం ఖాయంగా కనపడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి వోట్లు పోలయ్యే అవకాశం ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా ప్రజల్లో ఎన్నికల పట్ల ఆసక్తి లేదు. టీఆర్‌ఎస్ పార్టీ 16 సీట్లు గెలిచే అవకాశం ఉన్నా, ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యేందుకు శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బంది తప్పదు. సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ స్థానాల్లో బీజేపీ, నల్లగొండలో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చినా, చివరి నిమిషం వరకు ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకోవచ్చు. తాజా పరిణామాలను విశే్లషిస్తే కాంగ్రెస్ దిగ్గజం, ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ కాంగ్రెస్‌ను వీడి మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ తరఫున రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. చివరి నిమిషంలో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ బాట పట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా ప్రజాసంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న కేసీఆర్ లాంటి బలమైన నేతను వచ్చే ఐదేళ్లు తట్టుకుని నిలబడే సత్తా కాంగ్రెస్, బీజేపీలకు ఉంటుందని ప్రజలు విశ్వసించడం లేదు.
కర్ణుడి చావుకు వెయ్యి కారణాలన్నట్లు తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి ఆ పార్టీ హైకమాండ్ అనుసరించిన తీరు, స్థానికంగా బలమైన నేతలు లేకపోవడం కారణమని చెప్పవచ్చు. 2014లో అధికారంలోకి రావడం తథ్యమనుకున్న కాంగ్రెస్ తెరాస ప్రభంజనానికి తట్టుకోలేక ఓటమి చవి చూసింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ బలోపేతం కాలేకపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు బలమైన పునాదులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును కాదని కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించినంత మాత్రాన- ఆ పార్టీ తుడిచిపెట్టుకుని పోయిందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. రాబోయే కాలంలో ఆ పార్టీని కాపాడేందుకు సరైన నేతలు రారని అనుకోవడం సరికాదు. 1956 నుంచి 2014 వరకు పరిణామాలను విశే్లషిస్తే- తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. ఆ కల సాకారమయ్యేందుకు కేసీఆర్ అనే బలమైన నేతను కాలం సృష్టించింది. గత ఐదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం లేకుండా పోయింది. పొత్తుల పేరిట సమయాన్ని వృథా చేసి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు చేదు ఫలితాలను చవిచూశారు. దిగువ స్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేసుకుని ముందడుగు వేసే పరిస్థితి ఉన్నా, ఆ దిశగా సరైన ప్రయత్నం చేసే నేతలు లేరు. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు ఉమ్మడి ఆంధ్రాలో పవర్ పాలిటిక్స్‌కు బాగా అలవాటుపడ్డవాళ్లు. వారికి జనంలోకి వెళ్లి కష్టపడేంత ఓపిక లేదు. టీడీపీతో పొత్తు వల్ల ఉన్న ఓటుబ్యాంకును కోల్పోయి 18 సీట్లకు దిగజారి, ఈ రోజు ఎంపీ సీట్లకు సరైన అభ్యర్థులు లేక విలవిలలాడుతున్నారు. ప్రజలు తమ హృదయాల్లోంచి కాంగ్రెస్‌ను పూర్తిగా తొలగించలేదు. తమను మెప్పించే నేత కనుచూపు మేరలో లేకపోవడంతో కాంగ్రెస్ రాజకీయాలంటే వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. జనం నాడి పట్టుకునే నేత కాంగ్రెస్‌కు కావాలి. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల సంఖ్య రానున్న రోజుల్లో పంచపాండవుల స్థాయికి దిగజారినా ఆ పార్టీ అధినేతలు కలవరపడాల్సిన పనిలేదు. టీఆర్‌ఎస్ కనికరిస్తే తప్ప కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మిగలకపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్లక్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైతే ఫలానా నాయకుడికి టిక్కెట్ వచ్చిందా? లేదా? జనం ఆతృతతో ఎదురుచూసేశారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు కాంగ్రెస్ జాబితా ప్రకటిస్తే జనంలో ఎలాంటి స్పందన లేదు. ఇక ఎంపీ సీట్ల సంగతి చెప్పనక్కర్లేదు. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగితే, తెలుగురాష్ట్రాల ప్రజలు సహిస్తారా? అందుకే చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ముందు జాగ్రత్తగా దూరం పెట్టారు.
ఏపీ ఎన్నికల్లో ప్రచారం హోరు ఊపందుకొంది. ఎంపీ సీట్లలో వైకాపా బాపట్ల (ఎస్సీ) సీటును పేద కుటుంబానికి చెందిన నందిగం సురేష్‌కు, రెడ్డి సామాజిక వర్గం కోటలుగా ఉన్న కర్నూలు, అనంతపురం, హిందూపూర్ సీట్లను బీసీ వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌కు ఇవ్వడాన్ని అభినందించాలి. ఇదేమీ సామాన్య విషయం కాదు. గెలిస్తే గెలుస్తారు, ఓడితే ఓడుతారు.. అనుకునేందుకు ఎమ్మెల్యే సీట్లు కాదు. సాహసోపేత నిర్ణయాన్ని జగన్ అమలు చేశారు. అనంతపురం జిల్లాలో గతంలో టీడీపీ ఎంపీగా కాల్వ శ్రీనివాసులు గెలిచి సత్తా చాటారు. ఆదినుంచీ బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్న ఘనత టీడీపీకి ఉంది. విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం ఎంపీ స్థానాల్లో సిద్ధాంతాలను పక్కనపెట్టి సంపన్నులు, పారిశ్రామికవేత్తలకు రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చాయి. కారణాలేమైనా టీడీపీ ఈసారి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో తడబాటుకు గురైంది. చాలా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ జాప్యం చేసింది. అభ్యర్థుల ఎంపిక సాధారణ ప్రక్రియ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తుంటారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని వైకాపా దృష్టిని సారించింది. ప్రశాంత్ కిశోర్ సేవలతో వైకాపా తగిన వ్యూహాలను రూపొందించుకుంది. చంద్రబాబు తన స్వభావానికి విరుద్ధంగా శత్రువుల సంఖ్యను పెంచుకున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న బీజేపీకి దూరమయ్యారు. టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని ఏర్పాటు చేసి వామపక్ష పార్టీలు, బీఎస్పీలతో జతకట్టి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపితే కుప్పకూలుతామన్న ఆందోళనతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒంటరిగా టీడీపీ బరిలోకి దిగింది.
ఆంధ్రా ఎన్నికలపై ఒక స్పష్టత రావడానికి మరో వారం, పది రోజుల సమయం పడుతుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచముఖ పోటీ జరుగుతోంది. ఎన్నికల బరిలో టీడీపీ, వైకాపా, జనసేన-సీపీఐ-సీపీఎం-బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులున్నారు. టీడీపీ, వైకాపా, జనసేన కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. చంద్రబాబు, వైఎస్ జగన్ పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ పెద్దఎత్తున ప్రచారం చేపట్టే అవకాశం ఉంది. సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నేతలతో ఉమ్మడి సభలను కూడా నిర్వహించనున్నారు.
సీబీఐలో ఉన్నతాధికారిగా పనిచేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీనారాయణ ఎట్టకేలకు తన భావాలకు నచ్చినట్లు జనసేనను ఎంపిక చేసుకుని విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. అంతకుముందు లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ తమతో కలిసిపనిచేసేందుకు రావాలని లక్ష్మీనారాయణను ఆహ్వానించిన విషయం విదితమే. రాజకీయాలు చర్చించుకోవడానికి బాగుంటాయి. ఆ గోదాలో దిగితే ఎంతటివారైనా కష్టనష్టాలను ఎదుర్కొనక తప్పదు. గెలుపుకోసం ఏ దారినైనా తొక్కే తెగువ ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు సీట్లు దక్కే అవకాశం ఉందా? అంటే అనుమానమే. కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతుండగా, బీజేపీ తన ఉనికిని కోల్పోతోంది. రైల్వే జోన్ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా విశాఖలో బీజేపీ గెలుపు సులువు కాదు. సికింద్రాబాద్‌లో కూడా ‘కమలనాథుల’కు ఇదే పరిస్థితి. తెలంగాణలో టీఆర్‌ఎస్, ఆంధ్రాలో టీడీపీ, వైకాపాలే మెజార్టీ సీట్లను గెలుచుకుని లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉంది. కాంగ్రెస్, భాజపాలు తెలుగు రాష్ట్రాల్లో ఖాతాను తెరుస్తాయా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

-కె.విజయ శైలేంద్ర 98499 98097