మెయిన్ ఫీచర్

వరుడి మెడలో... తాళికట్టు శుభవేళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి కుమారుడికి తాళి కట్టే పెళ్లికూతురు..!
అప్పుడే ఆశ్చర్యపడిపోకండి.. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి..
వధూవరులిద్దరిదీ ఒకటే ఊరు..
మూడు సంవత్సరాలకు ఒకసారి సామూహిక వివాహాలు..
ఏడాది సరుకులే కట్నకానుకలు..
అతిథులకు చుట్ట, బీడీ, పాన్‌పరాగ్‌లతో స్వాగత సత్కారాలు..
ఏది పెళ్లి ఇల్లో, ఏది విడిదిల్లో తెలియనంతగా ఊరంతా సందడి..
అందరికీ ఒకే ముహూర్తంలో తొలిరాత్రి..
ఇదీ అక్కడి సాంప్రదాయం. పెళ్లంటే పందిళ్లు, సందళ్లు.. తప్పెట్లు, తాళాలు.. మొత్తం కలిపి నూరేళ్లు.. అనే గీతంలా ఉంటుంది ఈ ఊరి సాంప్రదాయం. వివాహాల్లో ఎన్నో రకాలు.. మరెన్నో సాంప్రదాయాలు.. భిన్న రీతుల కలయికే భారతావని. జీవితంలో వివాహమనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అలా అని భావించే వివాహాలు ఆయా సాంప్రదాయాల ప్రకారంగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో మనం ఓ విచిత్రమైన సాంప్రదాయాల వివాహాలకు వేదికైన ఊరి గురించి తెలుసుకుందాం..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని సముద్ర తీర గ్రామం 3నువ్వలరేవు2. ఇక్కడి ఆచారాలు, సాంప్రదాయాలు వింటే అవాక్కవ్వని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒకటి కాదు, రెండు కాదు.. గత యాభై సంవత్సరాలుగా ఈ ఊరి అబ్బాయిలుకానీ, అమ్మాయిలు కానీ మరో ఊరి వారిని పెళ్లి చేసుకోలేదు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటివి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇక్కడ పెళ్లిళ్లు చేస్తారు. అదీ వివాహం నిశ్చయమైన జంటలన్నింటికీ ఒకేసారి, ఒకే ముహూర్తంలోనే వివాహాలు జరిపిస్తారు. అలా నేటి రాత్రి 11.01 గంటల ముహూర్తానికి 63 జంటలు ఒక్కటి కానున్నాయి. విచిత్రం ఏమంటే వీరందరి తొలిరాత్రి ముహూర్తం కూడా ఒక్కటే కావడం..
ఇలాంటి ఎన్నో వింతలకు కారణమైన ఈ ఊరి జనాభా వేలల్లోనే ఉంటుంది. నువ్వలరేవు మేజరు పంచాయితీ. ఈ గ్రామానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. లక్ష్మీదేవిపేటగా పేరొందినా నువ్వలరేవుగానే ఈ ఊరు ప్రసిద్ధి. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటివరకూ ఇక్కడ సర్పంచి పదవికి ఎన్నికలు జరగలేదు. సర్పంచిని ఇక్కడి ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఈ గ్రామం మత్స్యకార గ్రామం. చేపలను పట్టడం ఇక్కడివారి ప్రధాన జీవనాధారం. బ్రిటీషుకాలంనాటి శిథిల జ్ఞాపకాలు ఇక్కడ ఎన్నో.. బృందావతి అమ్మవారు ఇక్కడి గ్రామదేవత. తులసిమాతగా ఈమెను పూజిస్తారు. శ్రీరాముడు వీరి ఆరాధ్య దైవం. ఈ ఊరందరిదీ ఒకేమాట, ఒకే బాట. నలుగురైదుగురు పెద్దలు కూర్చుని నిర్ణయించిన మాటకు ఎదురుండదు. అయితే పెద్దలు కూడా అందరి ఆమోదం ఉండేలానే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ అందరూ కేవిటి సామాజిక వర్గానికి చెందినవారే. ఇది మత్స్యకారుల్లోని ఒక తెగ. అప్పట్లో ఒడిశాలోని సుమండి, సున్నాపురం, సుర్ణ తదితర ప్రాంతాల నుంచి వీరు వలస వచ్చారు. అప్పటి నుంచే ఈ పెళ్లిళ్ల ఆచారం అమలవుతోంది. ఇక్కడి మగవారు చేపల వేటకు వెళతారు. మహిళలు చేపలను విక్రయిస్తారు. ఆ ఊరిలో మూడే ఇంటిపేర్లు ఉంటాయి. బైనపల్లి, బెహర, మువ్వల. ఒక ఇంటి పేరువారు మిగిలిన రెండు ఇంటిపేర్ల పిల్లల్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అన్నాచెల్లెల్ల వరుస కలిస్తే నిషిద్ధం.
ఊర్లో ఏ అమ్మాయినైనా అబ్బాయి ఇష్టపడితే.. నేరుగా వెళ్లి తల్లిదండ్రులతో చెబుతాడు. ఆ తల్లిదండ్రులు ఈ విషయాన్ని పెద్దల ముందు ఉంచుతాడు. వరుసలు అన్నీ కలిసి వారు అంగీకారం తెలిపితే పెళ్లి నిశ్చయం అయినట్లే. ఊర్లో చాలామంది చదువుకున్న వారు ఉన్నా కూడా ఈ సాంప్రదాయాన్ని అనుసరించే పెళ్లిళ్లు చేసుకుంటారు. గ్రామంలోని అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నా ఈ ఊరి అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకుంటారు. ఈ పెళ్లిళ్లన్నీ ఒకే వేదికపై జరగవు. ఎవరింటి పెళ్లి వారి గుమ్మంలోనే జరుగుతుంది. కానీ పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికే అన్ని పెళ్లిళ్లు జరుగుతాయి. పెళ్లి ముహూర్తమప్పుడే గర్భాదాన ముహూర్తం కూడా పెద్దలు నిర్ణయిస్తారు. పెళ్లి జంటలన్నీ ఆ ముహూర్తాన్ని అంగీకరిస్తాయి. ఇలాంటి ఆచారాలున్నా కూడా ఇక్కడ మద్యనిషేధం అమల్లో ఉంటుంది. ఎవరైనా తాగినట్లు గ్రామ పెద్దలకు తెలిస్తే వారిపై కుల కట్టుబాట్లు విధిస్తారు. గ్రామంలో మద్యం గొలుసు దుకాణం పెట్టేందుకు మద్యం లాబీ విఫలయత్నం చేసింది. పెళ్లి సమయంలో మాత్రం మద్యం తాగడానికి అనుమతినిస్తారు. అదీ నెలరోజులు మాత్రమేనట.
కట్నకానుకలు
ఈ పెళ్లిళ్లలో కట్నకానుకల కింద నగదు ఇవ్వకుండా ఏడాదికి సరిపడా బియ్యం, ఇతర ఆహార దినుసులను పెళ్లి కుమార్తె అత్తారింటికి తీసుకెళ్తుంది. ఊరేగింపులో కూడా పెళ్లి కుమారుడికి నోట్లతో కూడిన కిరీటాన్ని ఏర్పాటుచేసి తలపై ఉంచుతారు. అలాగే మెడలో కూడా కరెన్సీ నోట్లతో చేసిన మాలను వేయడం ఇక్కడి సాంప్రదాయం. అతిథులకు పళ్లెంలో చుట్ట, బీడీ, పాన్‌పరాగ్ వంటివి ఇచ్చి స్వాగతం పలుకుతారు. వధువు ఇంట వివాహాలు చేయడం ఇక్కడి సాంప్రదాయం. పెళ్లి కుమారుడు తన సొంత ఇంటికి వెళ్లిన తరువాత 18 రోజుల పాటు ఎలాంటి పరిస్థితుల్లోనూ గ్రామ సరిహద్దులు దాటకూడదు. వివాహం నిశ్చయించిన రోజు రాత్రంతా పెళ్లిళ్లతో ఊరు మారుమోగిపోతుంది. గ్రామమంతా పెళ్లిపందిళ్లు, విద్యుత్ అలంకరణలతో మిరుమిట్లు గొలుపుతాయి.
తాళి
అబ్బాయి మెడలో అమ్మాయి తాళి కట్టడం ఇక్కడి ఆచారం. ధాన్యపు గింజ ఆకారంలో ఉండే 3్ధన్యరచన2 అనే ఆభరణం వంటి తాళిని అబ్బాయి మెడలో కడుతుంది అమ్మాయి. పెళ్లైన మూడు మాసాలలోపు ఆ ఆభరణాన్ని కరిగించి మంగళసూత్రాల్లో కలిపేసి అమ్మాయిలు ధరిస్తారు.
అసలు కథ
సామూహిక వివాహాల వెనుక ఓ కథ ఉంది. వజ్రపుకొత్తూరు మండలంలో తీరప్రాంతం ఎక్కువగా ఉండటం, ఇక్కడి ప్రజలు చేపల వేటలపై ఆధారపడి జీవిస్తుండటంతో అక్షరాస్యతకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా సంపాదన కూడా నామమాత్రమే.. దీంతో దశాబ్దాల కిందట నువ్వలరేవు గ్రామంలో పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది. ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుందని, అంత మొత్తం భరించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరని భావించి ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి విజయం సాధించారు. అప్పటినుంచి గ్రామమంతా ఇదే విధానాన్ని పాటిస్తూ వారి కుల పెద్దల ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో అధిక జనాభా ఉండటంతో సామూహిక వివాహాలకు అనువైన వేదికగా మారింది. మునుపు మూడేళ్లకు ఒకసారి కావడంతో చాలా ఎక్కువ పెళ్లిళ్లు జరిగేవి. బాల్య వివాహాలను కూడా చేసేవారు. కానీ పోలీసువారు కల్పించుకుని పెద్దలకు కౌనె్సలింగ్ చేసి బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా నేడు నువ్వలరేవు గ్రామంలో ఏ వీధిలో చూసినా వివాహ సంబరమే..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి