మెయన్ ఫీచర్

శాంతికి రాచబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతి కావాలంటే యుద్ధం చేయాల్సిందే అనే సుప్రసిద్ధ యుద్ధం సామెత నిజమైంది. ఎట్టకేలకు శతాబ్దాల తరబడి దాచుకున్న బలహీనతలను త్యజించి భారత్ దాయాది దేశంలో ఉగ్రవాద శిబిరాలపై రెండున్నరేళ్ల వ్యవధిలో రెండవ సారి భీకర దాడి చేసింది. దశాబ్దాల తరబడి భారత్ ఉపఖండాన్ని అతలాకుతలం చేస్తూ హింసను ప్రజ్వరిల్లింపచేస్తున్న కాశ్మీర్ సమస్యకు ద్వైపాక్షిక చర్చలు, శాంతి భేటీలు పనికిరావని తేలిపోయింది. వాణిజ్య కార్యకలాపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇరుదేశాల ప్రజల మధ్య సౌహార్ద్ర సంబంధాలు పెంపొందించుకుంటే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న కుహనా లౌకికమేధావుల పనికిమాలిన ఆలోచనలు, ప్రచారాలు ఫలితాలివ్వవని పుల్వామా దాడి ఘటన నిరూపించింది. యుద్ధ వీరుడు నెపోలియన్ బోనాపార్టీ ఒకానొక సందర్భంలో యుద్ధంపై ఇలా అన్నారు ‘మీ శత్రువుతో తరచుగా యుద్ధం చేయవద్దు దాని బదులు యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తే సరిపోతుంది అనే వాక్యాలను రక్షణ రంగ నిపుణులు తరచుగా చెబుతుంటారు. భారత్ జడత్వాన్ని విడనాడి 2019 ఫిబ్రవరి 26వ తేదీ మంగళవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుకు 80 కి.మీ దూరంలో కొండలపై ఉన్న బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేయడం శుభ పరిణామం. 80 దశకంలో కాశ్మీర్‌లో పరిస్థితులు చేజారిన సమయంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. ఇంతవరకు భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి. 1947లో అక్టోబర్‌లో, 1965 ఆగస్టు నెలలో, 1971 డిసెంబర్ నెలలో, 1999 మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఈ నాలుగు యుద్ధాల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓటమి చెందింది. భారత్ సైన్యానికి గెలుపు మిగిలింది. కాని ఆక్రమించిన భూమిని స్వాధీనం ఆ నాటి పాలకులు స్వాధీనం చేసుకోలేకపోయారు. యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లో ఉంటుంది. ముగింపు మన చేతిలో ఉండదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అనే కిరాయి మూకల తండాపై భారత్ వైమానిక దళం అగ్గి పిడుగుల వర్షం కురిపించింది.
భారత్ ఎప్పటిలాగానే ప్రకటనలతో సరిపెట్టుకుంటుందని, స్పందించదని పాకిస్తాన్ ఊహించింది. అదే సమయంలో పాకిస్తాన్ స్పందించకపోవచ్చనే ఆలోచనలు మాని, ఎటూ జవాబు ఇస్తుందనే వాస్తవంలో కేంద్రం ఉండడం మంచిది. కేంద్రం చెప్పినట్లు ఇది మిలిటరీయేతర దాడి. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌కు చొరబాట్ల ద్వారా పంపించి దాడులు చేయిస్తోంది. ఆధారాలు చూపించినా మాకు సంబంధం లేదని ఎప్పటికప్పుడు బుకాయిస్తోంది. భారత్‌లో దేశ వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టి తన పబ్బాన్ని గడుపుకుంటున్న పాక్‌కు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ధీటైన సమాధానం చెప్పడం కొత్త తరహా యుద్ధ తంత్రం. 2016 సెప్టెంబర్ 29వ తేదీన భారత్ వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో దాడులు సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో పాక్ పౌరులు మరణించలేదు. పాక్ మిలిటరీపై ఎటువంటి ప్రభావం చూపలేదు. సాధారణంగా ఏ దేశమైనా తన మిలిటరీ, పౌరులు, వౌలిక సదుపాయాల వ్యవస్ధలపైన దాడి జరిగితే చూస్తూ ఊరికే ఉండదు. కచ్చితంగా యుద్ధం చేసి తీరుతుంది. 1980 నుంచి 2019 వరకు అంటే దాదాపు 40 ఏళ్ల పాటు పాక్ ఉగ్రవాదులను ఉసిగొల్పి భారత్‌లో మారణకాండ సృష్టించింది. ప్రత్యక్షంగా యుద్ధం చేద్దామంటే, పాక్ సైనికులు సరిహద్దుల్లోనే ఉంటారు. సరిహద్దు రేఖ దాటి ముందుకు రారు. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా యుద్ధం ఎవరూ చేయరు. ప్రపంచానికి పాక్ దుష్టపన్నాగం 2001లో అర్థమైంది. అమెరికాపై జరిగిన విమాన దాడుల్లో పాక్‌కు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు. ఆ తర్వాత కూడా అనేక ఐరోపాదేశాలు, కొన్ని సార్లు అమెరికా కూడా పాక్‌కు వత్తాసుగా సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాది దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్‌లో కనపడడంతో చైనా మినహా ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ఏకాకిగా మారింది.
ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారిన పాకిస్తాన్ తనంతట తాను యుద్ధం చేస్తే తప్ప దాడి చేసేందుకు తగిన మార్గాలు భారత్‌కు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదం నిర్మూలనకు సర్జికల్ స్ట్రైక్స్ పేరిట కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇదొక ఆధునిక యుద్ధ తంత్రం. ఈ యుద్ధంలో లక్ష్యం ఉగ్రవాద శిబిరాలు, అందులో ఉండే ముష్కరులు. తాజాగా చేపట్టిన వైమానిక దాడుల్లో దాదాపు 350కు పైగా హతమయ్యారు. ఈ సంఖ్య ఒకటి రెండు రోజుల్లో జరిగే దాడుల్లో మరింతగా పెరగవచ్చు.
2001 అక్టోబర్‌లో కాశ్మీర్ అసెంబ్లీ ఎదుట జరిగిన దాడిలో 38 మంది పౌరులు మరణించారు. 2008లో ముంబాయి తాజ్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడులు చేయడం వల్ల 166 మంది మరణించారు. 2016 జనవరిలో పఠాన్‌కోట ఎయిర్‌బస్‌పై దాడి ఘటనలో ఏడుగురు భారత సైనికులు అమరులయ్యారు. 2016 సెప్టెంబర్ 18వ తేదీన యూరి సెక్టార్‌లో భారత సైన్యంపై పాక్ సైనికులు జరిపిన అకారణ దాడి ఘటనలో 19 మంది జవానులు అమరులయ్యారు. ఇన్నాళ్లూ పాక్ దొంగచాటున భారత్‌ను దెబ్బతీసేందుకు సరిహద్దుల వెంట ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, భారత్‌లో దారి తప్పిన యువతకు గాలం వేసి వారిని తీసుకెళ్లి ఉగ్రవాద సంస్థల్లో శిక్షణ ఇవ్వడం చేస్తూ వస్తోంది. పాక్ దుర్నీతి ఎప్పటికప్పుడు భారత్ అంతర్జాతీయంగా ఎండగట్టినా పాకిస్తాన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. దీంతో భారత్‌లో కూడా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాక్‌కు ఏ విధంగానైనా బుద్ధి చెప్పని పక్షంలో పార్లమెంటు తీర్మానాలు ఎందుకనే నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో 2016లో భారత్ సర్జికల్స్ స్ట్రైక్స్‌ను చేపట్టడంతో మిలిటరీకి కొత్త తరహా జోష్ వచ్చింది. మిలిటరీకి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగిన పరిణామం. రాజకీయ జోక్యం వల్ల మిలిటరీ సాహసోపేతమైన దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను నిర్వీర్యం చేయలేకపోయింది. దేనికైనా రాజకీయ సంకల్పం ఉండాలి. మావో జెడుంగ్ చెప్పినట్లు ‘రాజకీయాలు రక్తపాతం లేని యుద్ధం, యుద్ధం రక్తపాతంతో కూడిన రాజకీయాలు’ అనే సామెత భారత్‌కు అతికినట్లు సరిపోతుంది. భారత్ రాజకీయాల్లో రక్తపాతం ఉండదు. యుద్ధమంటే రక్తపాతం తప్పదు. మన రాజకీయనేతల రక్తపాతం ఎందుకనే నిర్లిప్తత ధోరణి వల్ల దశాబ్దాల తరబడి కాశ్మీర్ సమస్యను నాన్చుతూ వచ్చారు. యుద్ధం విజేతను నిర్ణయించదు. మనకు యుద్ధం నుంచి ఎవరు నిష్క్రమించారో తెలుస్తుంది. 1947, 1965, 1971, 1991 యుద్ధాల్లో పాకిస్తాన్ యుద్ధ భూమి నుంచి నిష్క్రమించింది. భారత్‌ను యుద్ధంలో ఓడించడం తన తరం కాదని తెలుసుకున్న పాకిస్తాన్ మతోన్మాదాన్ని ఆయుధంగా ప్రయోగించి భారత్‌లో అస్థిరత్వాన్ని పెంచాలని కుటిల ప్రయత్నాలను చేసింది. ప్రపంచ దేశాలు కూడా సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నాయి. చైనా కూనిరాగాలు తీసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఈ సారి అదును చూసి దాడికి ఏ క్షణమైనా దిగే అవకాశం ఉంది. కానీ గతంలో చేసిన తప్పిదాలను భారత్ చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయమిది. ఉగ్రవాదంతో కుదేలైనా పాకిస్తాన్ ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రపంచ దేశాలు కూడా పాక్‌కు సహాయం చేసేందుకు నిరాకరిస్తున్నాయి.
మతం పేరుతో గల్ఫ్‌దేశాలను తనవైపు తిప్పుకోవాలన్న పాక్ ఎత్తుగడలు కూడా ఫలించడం లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను సంపూర్ణంగా ఆధీనంలో తెచ్చుకునేందుకు కేంద్రం కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో భారీ నష్టాలు ఎదురైనా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుని భారత్‌లో విలీనం చేయడం మినహా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లేదు. పూర్తి స్థాయి యుద్ధమంటూ ప్రారంభమైతే, ఇరుదేశాలు వౌలిక సదుపాయాల వ్యవస్థలపైన దాడులు చేసుకోవడం యుద్ధంలో రివాజే. 1971లో ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్‌ను రెండుగా విడగొట్టింది. దీని వల్ల ఆనాటి తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఆ నాటి ప్రతిపక్షనేత, దివంగత మాజీ ప్రధాని వాజపేయి ప్రధాని ఇందిరాగాంధీని అపరదుర్గగా అభివర్ణించారు. యుద్ధంపై ప్రతిపక్ష పార్టీలు కూడా అనవసర సిద్ధాంతాలు, రాద్ధాంతాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. చోటామోటా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా వొళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. జాతీయ స్థాయి పార్టీలు కూడా విబేధాలకు స్వస్తి చెప్పి ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులకు అండగా నిలవాలి. ఏడు దశాబ్దాలుగా నలుగుతూ, భారత్ సమగ్రతకు అడ్డుగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను విముక్తి చేసేందుకు కేంద్రం ముందుకు కదలాలి. ఇప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోతే మరెన్నో దశాబ్దాలు ఎదురుచూడాల్సి ఉంటుంది. దక్షిణాసియాలో, ప్రధానంగా భారత్ ఉపఖండంలో శాంతి కావాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు విముక్తి కల్పించేందుకు, సర్జికల్ స్ట్రైక్స్ ముమ్మరం చేసి, యుద్ధం చేయడమే పరిష్కారం.

- కె. విజయశైలేంద్ర 9849998097