మెయిన్ ఫీచర్

నోటువిడుపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపన్న రోజుకు రూపాయి దాచుకో. ఈ మాట -పెద్దలిచ్చిన చద్దిమూట. ఆచరించిన వాళ్లకు ఆనందం. కొట్టిపారేసినోళ్లకు కొండంత కష్టం.
***
రూపాయి విషయంలో-
పెద్దలిచ్చిన చద్దిమూటను ఈతరం సినీ స్టార్లు బాగానే ఒంటబట్టించుకుంటున్నారు. పైగా స్వర్ణయుగం కాలంనాటి ఆనవాళ్లు, అనుభవాలు చాలానే ఉన్నాయి కనుక -ఆర్థిక శాస్త్రాన్ని ఆధునికతకు అన్వయిస్తూ ‘ఆటవిడుపు’ సంపాదనపై దృష్టి పెడుతున్నారు.
చిరంజీవి ‘చాలెంజ్’ను ఇక్కడ ప్రస్తావించుకుందాం. క్లైమాక్స్‌లో విలన్ గ్యాంగ్‌ను ఎదుర్కొని -ఫైట్లూ గట్రా అంతా అయిపోయిన తరువాత చిరంజీవి హీరోనాదం చేస్తాడు బిగ్గరగా.. ‘రామ్మోహన్‌ర్రావ్.. నేనే గెలిచాను’ అంటూ. నిజానికి ఎన్నో తెలివితేటలున్న హీరోకి -సంపాదన విషయంలో గోల్ ఫిక్సయ్యింది ఇగోకు దెబ్బ తగిలిన తరువాతే. డబ్బు సంపాదించాలి.. ఎలా? ఖాళీ చేతుల్తో.. బుర్రనిండా ఆలోచన్లతో -గుడిమెట్లమీద దీనంగా కూర్చున్న హీరో చేతిలో బిచ్చగత్తె ఓ నాణెం వేసి కన్నుమూస్తుంది. నిజానికి పోతూపోతూ ఆమె ఇచ్చింది పది పైసలే. కానీ -అదే హీరో లక్ష్యమైన 50 కోట్ల సంపాదనకు సంకల్ప పెట్టుబడి. రెండు గంటల సినిమాలో హీరో అష్టకష్టాలు పడి 50 కోట్లు సంపాదించేస్తాడు. విలన్‌పై గెలిచానన్న ఇగోను సంతృప్తిపర్చుకుంటూ -వీరావేశంతో సంపాదించిన 50 కోట్ల సూట్‌కేస్ గాల్లోకి విసిరేస్తాడు. ఇంత కష్టపడి సంపాదించింది.. అలా విసిరేయడానికా? అని అప్పట్లో చాలామందికే సందేహం వచ్చింది. విమర్శించిన వాళ్లూ ఉన్నారు. కానీ -ఆ సన్నివేశంలో ఓ విషయాన్ని గుర్తించాలి. ఎలా సంపాదించాలి? ఎంత సంపాదించాలి? అన్నది తెలిసిపోయిన తరువాత మళ్లీ సంపాదించడం పెద్దకష్టం కాదు. అంతర్లీనంగా హీరో ఇచ్చే సందేశమదే. సినిమా హిట్టయ్యింది. లైఫ్‌లో చిరంజీవి కూడా ‘గాంధీ’ క్యారెక్టర్ నుంచి ‘బెంజ్’ రేంజ్‌కి ఎదిగిపోయాడు. ఇది -రీల్ పాత్రకి.. రియల్ లైఫ్‌కి చిన్న అన్వయింపు అంతే!
***
ఎప్పుడో అరిగిపోయిన చాలెంజ్ సన్నివేశాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోడానికి ఓ సందర్భం లేకపోలేదు. అది -తెలుగు సినిమా స్టార్లు వృత్తి, ప్రవృత్తికి ప్రత్యామ్నాయంగా చేస్తోన్న వ్యాపారాలు. అంటే -డబ్బు గడించడం. రేపన్న రోజును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తపడటం. కెరీర్ పరుగులో పొరబాటున కిందపడితే తిరిగి పైకి లేవడానికి -బలమైన ప్రత్యామ్నాయ వేదిక సిద్ధం చేసుకోవడం. అందరూ చేస్తున్నారా? అంటే ‘యస్’ అనలేకపోవచ్చు. కానీ -చాలామంది తెలివైన స్టార్లు మాత్రం స్క్రీన్ సంపాదనను మరో సీన్‌కు తరలిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే కాకపోవచ్చు.. ఇదొక ఆటవిడుపుగానూ ఫీలవుతున్నారు.
***
నిజానికి సినిమా స్వర్ణయుగం టైంలో -చాలామంది స్టార్లు చాలానే సంపాదించారు. ఎప్పుడూ అదే లైఫ్ ఉంటుందన్న భ్రమలో ఉండిపోయారు. సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెట్టేసినోళ్లు కొందరు. ఎంత సంపాదిస్తున్నామో తెలుసుకోలేక, సంపాదించింది ఎవరు జాగ్రత్త చేస్తున్నారో గ్రహించలేక నష్టపోయింది ఇంకొందరు. జాలి, కరుణ ప్రభావాలకు గురై -శక్తికి మించి దానధర్మాలు చేసి సర్వం కోల్పోయినోళ్లు ఇంకొందరు. పాడుచేసుకున్నది కొందరు. పాడైపోయినోళ్లు మరికొందరు. ఇలా -పాత సినిమా తరాన్ని తడిమి చూస్తే ప్రతి ఒక్క స్టార్ లైఫూ ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ పరిస్థితిని ముందే గ్రహించి బాగుపడినోళ్లు లేకపోలేదు. ఆ బాగు ఎంత బలమైన బాగంటే -ఆర్థిక బలం సమకూర్చుకుని పరిశ్రమ మొత్తాన్ని గుప్పిట పట్టేంత. సినిమాపై సంపాదించిన సొమ్మును పరిశ్రమలోనో, పరిశ్రమపైనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పెట్టుబడులు పెట్టి సంపాదించినోళ్లు ఎందరో. రూపాయిపట్ల దక్షత కలిగివున్నారనడానికి వాళ్ల ఎదుగుదలే ఒక ఉదాహరణ.
***
కాలం మారింది. ఆధునికత అలవాటైంది. కానీ -రూపాయి విషయంలో ఆలోచనల స్వరూపం మారినా మూలం మాత్రం ఈతరంలోనూ చాలామందిలో అదే కనిపిస్తోంది. కథలూ, కాల్షీట్లతో విసిగిపోతున్న లైఫ్‌కు -వ్యాపారం ఓ ఆటవిడుపు అవుతోంది. అదే కాస్త రిలాక్సేషన్‌గానూ ఫీలవుతున్నారు.
వ్యాపారంలో లాభానికి ఎన్ని మార్గాలుంటాయో, నష్టాలకూ అనే్న దార్లుంటాయి. అందుకే -సంపాదించిన దాన్ని ఒకేచోట కేంద్రీకృతం చేసేకంటే -పలుమార్గాల్లోకి సంపాదనను మళ్లిస్తే భవిష్యత్‌కు భరోసా ఉంటుందన్న ఆలోచన ఇప్పటి తరంలో కాస్త మిన్నగానే కనిపిస్తోంది. అందుకే -సరదాగా వ్యాపారం అన్న ఆటవిడుపునూ ‘నోటు’విడుపు చేయగలుగుతున్నారు.
**
తెలుగు సినీ పరిశ్రమ ఆర్థికంగా ఎప్పుడో ఎదిగిపోయింది. స్టార్‌డమ్‌కు చేరుకున్న తారలకు కోట్లలో పారితోషికాలు చెల్లించుకుంటోంది. పైగా సినిమా వసూళ్లలో వాటాలూ ముట్టచెబుతోంది. అంటే -్భరీ బడ్జెట్ సినిమా ఒక్కటి హిట్టయ్యిందంటే నాలుగైదు నెలల కాలంలో కోట్లొచ్చి ఒళ్లో వాలినట్టే. మరి ఈ సంపాదనను దాచుకోవడమేనా? లేదా తిరిగి పెట్టుబడులు పెట్టాలా? ఆ ఆలోచన నుంచే ‘సరదాకి వ్యాపారం’ పుట్టుకొస్తోంది. స్టార్‌డమ్‌కు పీరియాడికల్ గ్యారంటీ లేదు కనుక -గ్యారంటీగా ఓ మార్గాన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఆలోచనలే వ్యాపారాలవైపు మళ్లిస్తున్నాయి. ఒకప్పుడు సినిమా స్టార్లు చాలామంది రియల్టర్ల అవతారం ఎత్తినోళ్లే. ముఖ్యంగా హీరో శోభన్‌బాబులాంటి స్టార్లు -ఏళ్ల క్రితమే భూమిపై పెట్టుబడులు పెట్టి కోట్లకు అధిపతులయ్యారు. ఇప్పుడు వ్యాపారాలకు అనేక మార్గాలు. పెట్టుబడులు పెట్టేందుకు లెక్కలేనన్ని దారులు. రూపాయితోపాటు, ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టే రంగాల్లో తారలు పెట్టుబడులు పెడుతున్నారు.
***
తాజాగా -బాహుబలి ఫేం రానా దగ్గుబాటి సొంతంగా ఓ ఆటవిడుపు బిజినెస్ మొదలుపెట్టాడు. అదే -టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ. ముంబయి కేంద్రంగా నడిస్తోన్న ఓ ఏజెన్సీతో టై-అప్‌గా ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. ట్విన్సిల్ ప్రపంచంలో నటన లేదా సాంకేతిక రంగంలోకి నేరుగా అడుగుపెడుతున్న వాళ్ల సంఖ్య పెరిగింది. అలాంటివాళ్ల ప్రతిభకు అవకాశాలు కల్పించే సంస్థను రాణా ప్రారంభించాడు. సినిమా వాళ్లకు కావాల్సిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలు పొందుపర్చి, అవకాశాలు కల్పిస్తాడన్నమాట. సెనే్సషనల్ ఫిల్మ్‌మేకర్ రామ్‌గోపాల్ వర్మ సహాయ సహకారాలూ రాణాకు అందుతున్నట్టు వినికిడి. నిజానికి ఈ ఆలోచన ఇప్పుడే మొదలైంది కాదు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో విలనిజాన్ని పండించి స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకున్న జగపతిబాబూ (క్లిక్ సినీ కార్ట్) ముందుగానే ఈ తరహా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. నటనను కెరియర్‌గా సాగిస్తూనే -వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన హీరోల జాబితాలో మెగా క్యాంప్ హీరో రామ్‌చరణ్‌ను ప్రస్తావించొచ్చు. ఓ విమానయాన సంస్థలో భాగస్వామి కావడంతో పాటు, హైదరాబాద్‌లో ఓ పోలో టీంని కొనుగోలు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక స్టార్ హీరో అల్లు అర్జున్, ఇప్పుడిపుడే రేంజ్ పెంచుకుంటున్న శర్వానంద్ లాంటివాళ్లు -రెస్టారెంట్, కాఫీ షాప్స్ బిజినెస్సుల్లోకి అడుగుపెట్టారు. సీనియర్ హీరో నాగార్జున స్టూడియో, రియల్ ఎస్టేట్ రెస్టారెంట్ బిజినెస్‌లతోపాటు, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ సత్తా చాటుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం. కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టి నిలదొక్కుకుంటున్న చిన్న హీరోలు -సన్నిహితులు నడుపుతున్న వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటూ వ్యాపారం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు వెలుగువెలిగి -కొత్త దర్శకులతో పోటీ పడలేని సీనియర్ దర్శకులు చాలామంది పరిశ్రమేతర వ్యాపారాలకు మళ్లిపోయారు. రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల బిజినెస్సులో బిజీ అయిపోయారు.
కథానాయికలూ తక్కువేం తినలేదు. కోట్లలో వచ్చిపడుతున్న పారితోషికాలను -ఏదోకరంకంగా వ్యాపార కార్యకలాపాలకు మళ్లిస్తున్నారు. కాకపోతే వ్యాపార వృద్ధి కోసం ప్రచారం చేసుకునేది కొందరు. ప్రచారం అవసరం లేనివాళ్లు చడీచప్పుడు లేకుండా -స్నేహితులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్న వాళ్లు ఇంకొందరు. ఈతరహాలో చెప్పుకోవాలంటే హీరోయిన్లుగా అవకాశాలు తగ్గిన తరువాత -సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే యోచనలో కొందరు కథానాయికలుంటే. పరిశ్రమలోని పరిచయాలను ఉపయోగించుకుని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరిశ్రమతో సంబంధమున్న వ్యాపారాలకు మళ్లుతోన్న వాళ్లూ లేకపోలేదు. అలాంటి కోవలో చార్మి, స్నేహలను ప్రస్తావించుకోవచ్చు. ప్రస్తుత హీరోయిన్లలో -తాప్సీ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ నడుపుతుంటే, కాజల్ అగర్వాల్ తన చెల్లి నిషా అగర్వాల్‌తో కలిసి నగల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తమన్నా ఆన్‌లైన్ జ్యువెలరీ రంగంలోకి కాలుపెడితే, రకుల్‌ప్రీత్ సింగ్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిట్‌నెస్ హబ్‌ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇటీవలే -ఐ ఫేం అమీజాక్సన్ శిరోజాల ఎగుమతి కంపెనీలో భాగస్వామిగా మారిందని సమాచారం. మంచు లక్ష్మీప్రసన్న రెస్టారెంట్ ప్రాంచైజ్‌లో భాగస్వామిగా ఉంది. ఏదో కంపెనీకి అందమైన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేబదులు, తమ గ్లామర్‌ను తమ వ్యాపారాలకే ఎందుకు వినియోగించుకోకూడదన్న ఆలోచనల్లో హీరోయిన్లు కనిపిస్తున్నారు. సొంతంగా వ్యాపారంవుంటే, ఇండస్ట్రీలో దక్కే గౌరవం కూడా వేరు.
సో -ఈతరం స్టార్లలో వ్యాపారాలపై దృష్టి పెడుతోన్న వాళ్లే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇలా సినిమా వ్యాపకాలతోపాటు, సినిమా నిర్మాణ, వ్యాపార రంగాల్లో మునిగితేలుతున్న వారిలో శృతిహాసన్, స్మిత, శిల్పాషెట్టి, ప్రియాంకా చోప్రా, ప్రభుదేవా, పవన్ కల్యాణ్, ఆర్య, విజయ్, ధనుష్, ప్రశాంత్ ఇలా చాలామందినే ప్రస్తావించుకోవాలి.

-రాణీప్రసాద్