మెయన్ ఫీచర్

సమరమే సరైన పరిష్కారమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్రను అధ్యయనం చేసిన వారికి- ‘అన్నదమ్ముల మధ్య భూ తగాదా’ లాంటిది కశ్మీర్ సమస్య. భారత్, పాక్‌లు చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య ఇది అని ఉదారవాదులంటారు. మిలిటరీ కోణంలో యుద్ధమే పరిష్కారం. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో వోట్లు తెచ్చే అంశం ఇది. దుర్ఘటనలు జరిగినపుడల్లా ప్రజల్లో దేశభక్తిని రగిలించే విషయం ఇది. దాయాది దేశాల మధ్య దేశ విభజన సమయంలో అపరిష్కృతంగా మిగిలిపోయిన అంశం కాశ్మీర్. సున్నితమైన ఈ అంశంపై ఎవరికి తోచినట్లు వారు మాట్లాడితే కుదరదు. మన దేశ సమగ్రత, సార్వభౌమత్వం వంటి అంశాలన్నీ కశ్మీర్‌తో ముడిపడి ఉంటాయి.
కశ్మీర్ అంశాన్ని నిత్యం ఎగదోస్తూ పాకిస్తాన్ తన మిలిటరీ పాలకుల ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు దీన్ని ఒక తురుపుముక్కలా ఉపయోగించుకుంటోంది. 1947లో దేశ విభజన పరిణామాల నేపథ్యంలో 85,866 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న కాశ్మీర్ నుంచి- భారత్ పరిధిలోకి 39,127 చదరపుమైళ్లు, పాకిస్తాన్ పరిధిలోకి 33,145 చదరపు మైళ్ల ప్రాంతం వెళ్లింది. 1963 నాటి ఒప్పందం మేరకు చైనాకు పాకిస్తాన్ 14500 చదరపు మైళ్ల విస్తీర్ణం భూమి ప్రాంతానికి కట్టబెట్టింది. జమ్ము, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారత్‌కు, అక్సాయ్ చిన్, ట్రాన్‌స కారకోరం ప్రాంతం చైనాకు, ముజఫర్‌నగర్ తదితర ప్రాంతాలు పాక్ అధీనంలోకి వెళ్లాయి.
1947 నాటి పరిణామాలను విశే్లషిస్తే కాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగం. 1994 ఫిబ్రవరి 22న పార్లమెంటు చేసిన తీర్మానం ప్రకారం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం, ఈ ప్రాంతాన్ని భారత్ నుంచి విడదీసే ప్రయత్నం జరిగితే మనం గట్టిగా తిప్పిగొడతాం. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో పార్లమెంటులో ఈ చారిత్రాత్మక ఈ తీర్మానం జరిగింది. 1947-48, 1965, 1971, 1999లో పాకిస్తాన్- భారత్ మధ్య కాశ్మీర్ వివాదంపై యుద్ధాలు జరిగాయి. అన్ని యుద్ధాల్లోనూ పాక్ ఘోర పరాజయం పాలైంది.
యుద్ధంలో ఓటమి ఎదురవుతున్నందున పాకిస్తాన్ కొత్త ఎత్తుగడలకు దిగింది. కాశ్మీర్‌లో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి భారత్‌ను అస్థిర పరిచేందుకు కుట్రలు పన్నడం ప్రారంభించింది. 1984 నుంచి కాశ్మీర్‌లో అల్లకల్లోలం ప్రారంభమైంది. కాశ్మీర్ ఓ అపరిష్కృత సమస్యగా ఉండడంతో ఇరుదేశాలు గుర్తించిన అంతర్జాతీయ సరిహద్దు రేఖ లేదు. మనకు గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వద్ద పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఉంది. అక్కడ భూ వివాదాలు లేవు గనుక ఉద్రిక్తత పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో, మన ఆధీనంలో ఉన్న జమ్ము కాశ్మీర్‌కు మధ్య వాస్తవాధీన రేఖ ఉంది. ఈ రేఖను ఇరు దేశాలు దాటరాదు. కాని ఎప్పటికైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాకతప్పదనే పార్లమెంటు తీర్మానం ఉంది. పాక్‌పై యుద్ధం ప్రకటించేందుకు ఈ తీర్మానం చాలు.
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 111. కాని 87 సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. 111 సీట్లలో 24 సీట్లను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌కు వదిలారు. ఎప్పటికైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం కాకతప్పదనే సంకల్పంతో మన ప్రభుత్వం ఉంది. జమ్ము ప్రాంతానికి 36 సీట్లు, కాశ్మీర్ లోయకు 46 సీట్లు, లడక్ ప్రాంతానికి 4 సీట్లు కేటాయించారు. లోయలో ముస్లింలు, జమ్ములో హిందువులు, లడక్‌లో బౌద్ధుల జనాభా ఎక్కువ. కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వాలు ఎన్నిక కావడంతో ఓర్వలేని పాకిస్తాన్ ఏదో విధంగా ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు సైన్యాన్ని అడ్డుపెట్టుకుని నిరంతరం కుయుక్తులకు పాల్పడుతుంటుంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్ వంటి లెక్కలేనన్ని ఉగ్రవాద సంస్థలకు ఆర్థికంగా అండదండలు ఇస్తూ ఆశ్రయం కల్పిస్తుంటుంది.
ఈ నెల 14న పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడిలో 40 మందికి పైగా మన జవాన్లు బలికావడం యావత్ భారతదేశాన్ని రగిలించింది. ఉగ్రవాదులు దుశ్చర్యలు గతంలోనూ జరిగాయి. భవిష్యత్తులో జరుగుతాయి. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎటూ లభించదు. దీనికి శాశ్వతంగా తెర దించాలంటే భారత్ ఎన్నిరోజులైనా, ఎంత నష్టం జరిగినా పట్టించుకోకుండా పాక్‌తో యుద్ధానికి సిద్ధం కావాలి. పాకిస్తాన్‌కు చైనా నుంచి ఆయుధ సాయం అందుతుందనేది వాస్తవం. ప్రపంచ దేశాల మద్దతు కోసం ఎదురుచూడకుండా, ఎవరో ఏదో అనుకుంటారనే భ్రమలను వీడి, ఇజ్రాయల్ తరహా లక్షణాలను భారత్ అలవర్చుకుంటే కాశ్మీర్ సమస్య చిటికెలో పరిష్కారమవుతుంది. పుల్వామా సంఘటనను విశే్లషిస్తే కాశ్మీరీ యువకుడికి ఉగ్రవాదంపై శిక్షణ ఇచ్చి జవాన్లపై ఉగ్రవాదులు ఉసిగొల్పారు. అంటే శత్రుదేశం వలలో చిక్కుకున్న ఒక భారతీయ పౌరుడు తన దేశ జవాన్లపై దాడి చేసిన ఘటన ఇది. ఇలా తన చేతికి మట్టి అంటుకోకుండా పాకిస్తాన్ పబ్బం గడుపుకుంటోంది. మతపరమైన ఉన్మాదాన్ని పెంచుకుంటూ, ఆయుధాలను సమకూర్చుకుంటూ, మిలిటరీ పెత్తనాన్ని కొనసాగించుకుంటూ పాకిస్తాన్ బతికేస్తోంది. భారత్‌లో జవాబుదారీతనం ఎక్కువ. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఘటన జరిగిన వెంటనే ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు మిలిటరీకి స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. కాశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్తాన్‌తో చర్చలు జరపాలి. చర్చల వల్ల ప్రయోజనం లేదని గత చరిత్ర రుజువు చేసింది. అయినా చర్చల ప్రక్రియను అటకెక్కించరాదు. ఇపుడు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గత ప్రభుత్వాలు కూడా అమలు చేశాయి. పాక్‌తో క్రికెట్ ఆడరు. పాక్ కళాకారులకు సినిమా చాన్స్‌లు ఇవ్వరు. ఆ దేశ గాయకుల పాటలను వినరు. వ్యాపారం చేయరు. హైకమిషనర్‌ను పిలిపించి మందలించి దేశం వదిలి వెళ్లమంటారు. ఇలాంటి ముతక చర్యల వల్ల, ఉద్రేకపూరితమైన ప్రసంగాల వల్ల పని జరగదు. మంచో చెడో- ఒక ఫలితాన్ని ఇచ్చే గట్టి చర్యలు కావాలి.
1999లో ఉగ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసినపుడు- జైషే మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను వదిలిపెట్టకుండా- భారత్ మరోలా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. వేల ఏళ్లుగా భారత్‌ను పట్టిపీడిస్తున్న బలహీనత ఇక్కడే ఉంది. చారిత్రక తప్పిదాలను చేయడం భారత్ అలవాటుగా మారింది. ఈ తప్పిదాలు పునరావృతం కాకుండా మనపాలకులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
పుల్వామా ఘటనను చూస్తే మన దేశంలో మావోయిస్టులు పోలీసులపై దాడి చేసిన పాత పద్ధతులు గుర్తుకు వస్తాయి. ఆంధ్ర, తెలంగాణల్లో గ్రేహౌండ్స్ బలగాలు ఎంతో నష్టపోయి, చివరకు మావోలపై పైచేయి సాధించాయి. దండకారణ్యంలో జవాన్లు కొన్నిసార్లు చేసిన తప్పిదాల వల్ల మందుపాతర్లకు బలైన ఘటనలు చాలా ఉన్నాయి. ఒక్కోసారి కొన్ని నెలల పాటు ఇక్కడ జవాన్లు ఏరియా డామినేషన్ కోసం గాలింపు చర్యలు చేస్తుంటారు. దట్టమైన అడవుల్లో శత్రువు ఎక్కడ ఏ మందుపాతర అమర్చాడో తెలియదు. పోలీసులకు స్థానిక ప్రజల సహకారం తక్కువ. ఉమ్మడి ఆంధ్రాలో బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ పోలీసులు అనుకోకుండా జరిగిన కొన్ని తప్పిదాలకు పెద్ద సంఖ్యలో అమరులయ్యారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చేతిలో ఆయుధాలు ఉండి కూడా కాల్పులు చేయలేని విచిత్రమైన స్థితిని గ్రేహౌండ్స్ దళాలు ఎదుర్కొన్నాయి. పుల్వామా వద్ద జాతీయ రహదారిపై 2,500 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను ఒక్కసారి కాకుండా దశలవారీగా తరలించి ఉండాలి. జవాన్లు వస్తున్న మార్గంలో కొన్ని రోజుల నుంచి అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేయించాలి. దీని వల్ల ఉగ్రవాది ఆత్మహుతికి సిద్ధమైన కారులో బాంబులు పెట్టుకుని వచ్చినా, ఎక్కడో ఒకచోట దాడికి కచ్చితంగా పాల్పడతాడని గ్రహించాలి. కాని తనిఖీలు ఎక్కువుంటే తక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది. సరిహద్దుల్లో సైన్యమైనా, అడవుల్లో పోలీసులైనా ఏమరుపాటున తప్పిదాలకు పాల్పడితే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పదు. ఒక్కోసారి ప్రతిదాడి చేసే అవకాశం లేని పరిస్థితులు తలెత్తుత్తాయి.
పాకిస్తాన్‌తో యుద్ధం చేసి కాశ్మీర్‌కు శాశ్వత పరిష్కారాన్ని సాధించాలా ? సర్జికల్ స్ట్రైక్స్‌కు పరిమితమై పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులకు సిద్ధపడాలా? పరిమిత యుద్ధానికి సన్నద్ధం కావాలా? అనే విధానాలపై నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వమే. మోదీ సర్కార్‌కు ప్రజలు అయిదేళ్లు పరిపాలించాలని తీర్పు ఇచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విముక్తికి పార్లమెంటు తీర్మానమే ఒక పచ్చజెండా. భారత్ సమగ్రతకు కాశ్మీర్ ఒక పరీక్ష. ఈ విషయంలో ఇంకా తాత్సారం చేస్తే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097