మెయన్ ఫీచర్

చట్టం ఘనం-అమలు తీరు ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడితో దేశం ఇంకా కోలుకోలేదు. ఈ దుశ్చర్యకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించేందుకు అన్ని దర్యాప్తు సంస్థలూ ఎడతెగని కృషి చేస్తున్నాయి. ఇది యుద్ధక్షేత్రంలో శత్రువులతో జరుగుతున్న పోరు. అయితే- ఇంటింటికీ చేరుతున్న ఉగ్రవాదం- ‘సైబర్ ఉగ్రవాదం’. ప్రతి ఇంట్లో సైబర్ రూపంలో చేరుతున్న అశ్లీలం మానవ జీవిన సౌందర్యాన్ని వికృతం చేస్తోంది. మానవ సంబంధాలను పరమ నీచంగా చిత్రీకరిస్తూ డబ్బుకోసం ఎంతకైనా దిగజారుతున్న కొంతమంది చేస్తున్న నిర్వాకానికి సాక్ష్యంగా నిలుస్తోంది. రకరకాల పేర్లతో ఏర్పాటవుతున్న ఇంటర్నెట్ చానళ్లు కోటాను కోట్ల అశ్లీల వీడియోలతో నిం డిపోతున్నాయి. 66 ఏళ్ల నాటి సినిమాటోగ్రఫీ చట్టం-1952, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లో పకడ్బందీ నిబంధనలున్నా, వాటి అమలులో సాచివేత కారణంగా ఎవరి ఇష్టారాజ్యంగా వారు ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్‌ను రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ పేరుతో దుర్వినియోగం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అశ్లీల వీడియోలు చూస్తున్నవారు 459 కోట్ల గంటలు గడిపేస్తున్నారంట! అంటే అది 5246 శతాబ్దాలకు సమానం. నీలిచిత్రాల వెబ్‌సైట్లను రోజుకు 64 మిలియన్ల మంది వీక్షిస్తున్నారట! ఇంతవరకూ ఆ సైట్లను చూసిన వారి సంఖ్య 23 బిలియన్లు, ప్రతి సెకెనుకు 729 మంది వాటిని వీక్షిస్తున్నారు. ఒక రోజుకు ఈ సైట్‌ను చూసే వారి సంఖ్య యూకే మొత్తం జనాభాతో సమానం. ప్రపంచవ్యాప్తంగా 4.6 బిలియన్ గంటల పాటు పోర్న్‌సైట్స్‌ను వీక్షిస్తున్నారు. వీరంతా కలిసి 92 బిలియన్ల వీడియోలను చూశారు. ఈ వీడియోలు వీక్షించేవారి జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. బ్రిటన్, కెనడా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానం భారత్‌దే. సైబర్ నేరాలలోనూ భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 18 నుండి 24 ఏళ్ల ప్రాయం ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 31 శాతం మంది అశ్లీల వీడియోలను చూస్తుండగా భారత్‌లో ఆ సంఖ్య 48 శాతం. 25 నుండి 34 ఏళ్ల ప్రాయం వారిని తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మంది వీడియోలను వీక్షిస్తుండగా భారత్‌లో అది 28 శాతం. ఇక 35 నుండి 44 ఏళ్ల వారు భారత్‌లో 9 శాతం కాగా, 45 నుండి 54 ఏళ్ల వారు 6 శాతం, 55 నుండి 64 ఏళ్ల ప్రాయం వారు 5 శాతం మంది పోర్న్ వీడియోలను తిలకిస్తున్నారు. కెనడాలో 25 శాతం, యూకేలో 24 శాతం, యుఎస్‌లో 25 శాతం మంది మహిళలు ఈ వీడియోలను వీక్షిస్తుండగా, భారత్‌లో 30 శాతం మంది మహిళలు పోర్న్ వీడియోలను వీక్షిస్తున్నారు. ఒకసారి వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లిన తర్వాత అత్యధికంగా ఫిలిప్పీన్స్ వారు 9 నిమిషాల 36 సెకెన్ల పాటు సగటున కాలం గడుపుతుండగా అది భారత్‌లో 8 నిమిషాల 20 సెకెన్లుగా నమోదైంది.
అంతర్జాతీయంగా కట్టుదిట్టమైన నియమావళిని రూపొందించకపోవడం, ఇంటర్‌నెట్ సర్వీసు ప్రొవైడర్లతో కచ్చితంగా వ్యవహరించకపోవడంతో అశ్లీలం దేశంలోకి సునామీలా ముంచుకొస్తోంది. భారత భూభాగంలో 400 కోట్ల చానళ్లు అశ్లీల సాహిత్యాన్ని, చిత్రాలను,సినిమాలను, దృశ్యాలను అందిస్తున్నాయి. గత దశాబ్దంగా ఎంతో చర్చ జరిగిన మీదట సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అశ్లీల వీడియోలతో కూడిన 875 వెబ్ చానళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అశ్లీల చానళ్లపై సింగపూర్, ఫ్రాన్స్, చైనా, జపాన్ దేశాలు ఉక్కుపాదం మోపాయి. ఆయా దేశాలలో నీలిచిత్రాలను చూడటాన్ని నిషేధించాయి. అశ్లీల సాహిత్యం ప్రచురించడం, సృష్టించడం, పరస్పరం మార్పిడి చేసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం, తిలకించడాన్ని కూడా నిషేంధించాయి.
దేశంలో ఏ ఉత్పత్తిని రూపొందించినా అందుకు అనేక ఆంక్షలు, పద్ధతులూ ఉన్నాయి. వాటిని అనుసరిస్తూనే ఆ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చేలా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని పొందాల్సి ఉంటుంది. ప్రజారోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంటోంది. నీలిచిత్రాల విషయంలో ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టానుసారం వాటిని దేశం మీదకు విడిచిపెడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , పోలీసు శాఖలు తమకు పట్టనట్టు వ్యవహరించడంతో అశ్లీల చిత్రాల నిర్మాతలు దానినో అంతర్జాతీయ వ్యాపారంగా మార్చేసుకుంటున్నారు. కొన్ని చిత్రాలకు 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే వీక్షించాలనే నిబంధనను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. ‘18 యుఎస్‌సీ 2257 మరియు 28 సీఎఫ్‌ఆర్’ నిబంధనను ప్రదర్శించి తమకేమీ పట్టనట్టువ్యవహరిస్తున్నారు.
వాస్తవానికి లైంగిక విజ్ఞానం పేరిట, హర్రర్ సినిమాల పేరిట, యువత మధ్య ఆకర్షణ పేరిట నీలిచిత్రాలు నిర్మాణమవుతున్నాయి. ఈ చిత్రాలను వ్యాపారులు భిన్నమైన లాభాపేక్షతో ఉపయోగించుకుంటున్నారు. వేరే దేశాల్లో కంప్యూటర్ వ్యవస్థలను విధ్వంసం చేయడం, రాన్సమ్‌వేర్ పంపడం, హ్యాకింగ్, వైరస్‌లు పంపడం, ట్రోజన్లు, లాజికల్ బాంబ్‌లను పంపించడం, ఫిషింగ్, బ్యాంకింగ్ మోసాలు, స్కామ్‌లు, సైబర్ టెర్రరిజం, సైబర్ స్టాకింగ్ ద్వారా డాటా చౌర్యం జరుగుతోంది. స్మార్ట్ఫోన్లలోనో, ట్యాబ్‌లోనో కేవలం వీడియోలు మాత్రమే చూస్తున్నామని భావిస్తున్న వారికి షాకింగ్ న్యూస్ వచ్చే వరకూ తామేం చేస్తున్నామనేది అర్థం కాదు. నీలిచిత్రాల వెబ్ సైట్లను వీక్షించేందుకు చాలామంది సెర్చి ఇంజన్లలో గాలిస్తుంటారు. ఈ బ్రౌజింగ్‌లో పలు అశ్లీల వెబ్‌సైట్ల ఆచూకీ లభిస్తుంది. వెబ్‌సైట్లు వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, వయసు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వంటి వివరాలు అడుగుతాయి. ఆ సమయంలో వీడియో చూడాలనే తొందర్లో అన్ని వివరాలు ఇచ్చి ఉత్సాహవంతులు ‘లాగిన్’ అవుతుంటారు. అంతే ఆ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తుంటాయి. మొబైల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూస్తున్నపుడు ఆ యా వెబ్‌సైట్లను ఓపెన్ చేయాలంటే ‘పాపప్’లు వస్తాయి. వాటిని ఓపెన్ చేయగానే స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్‌ను అది తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఒక దశలో వ్యిక్తిగత డేటా గల్లంతవుతుంది లేదా బెదిరింపులకు లోను కావల్సి వస్తుంది, ఫోన్‌లో డేటా హ్యాక్ కావడం, తద్వారా బ్యాంకు నెంబర్లు, పాస్‌వర్టులు, పిన్ నెంబర్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వివరాలు చౌర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
2010లో భారత్ నుండి వచ్చే ‘డెస్క్‌టాప్ ట్రాఫిక్’ 88 శాతం కాగా, 2015 నాటికి అది 35 శాతానికి పడిపోయింది. దాదాపు 65 శాతం మంది ట్రాఫిక్ మొబైల్ ఫోన్ల ద్వారానే నడుస్తోంది. 12 శాతం అండ్రాయిడ్ ఫోన్లు, 31 శాతం ఐఓఎస్ ఆధారిత ఫోన్ల నుండి ఈ ట్రాఫిక్ వస్తోంది. 2019 నాటికి భారత్‌లో డెస్క్‌టాప్ ట్రాఫిక్ 21 శాతానికి పడిపోయింది. మిగిలిన 79 శాతం ట్రాఫిక్ సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారానే నడుస్తోంది. సెల్‌ఫోన్లలో అశ్లీలాన్ని వీక్షిస్తున్న వారు 45 శాతానికి పెరిగారు. రాజ్యాంగంలోని అధికరణం-19 మనకు భావప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తోంది. దీంతో పాటు ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం జరుపుకునే స్వేచ్ఛ, అసోసియేషన్లు,యూనియన్లను ఏర్పాటుచేసుకునే హక్కు, దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఎక్కడైనా నివసించే హక్కును, ఏ విధమైన వృత్తి, వ్యాపారాన్ని చేసుకునే హక్కును కల్పిస్తోంది. ఈ స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోందనేది సుస్పష్టం.
ఇదేదో వీడియోలు చూసుకోవడమే కదా! అని వౌ నంగా ఉంటే అదే సైబర్ టెర్రిరిజానికి, నకిలీ వార్తలతో పెనుముప్పు తెచ్చేందుకు, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు, వ్యక్తిగత గోప్యత పేరుతో సమస్త సమాచారం కోల్పోయేందుకు దారితీస్తుంది. వాస్తవానికి ఐటీ చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరించే వారిపై రూ.10 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలుశిక్ష విధించేలా నిబంధనలున్నాయి. సెన్సార్ బోర్డు సహా ఎవరికీ ఇవేవీ పట్టడం లేదు. ఐటీ చట్టం సెక్షన్ -67, ఐపీసీ 354ఎ, 354 బీ, 354 సీ, 354 డీ, 355, 359 సెక్షన్లలో దౌర్జన్యం, మహిళలకు అవమానించడం, రహస్య, వ్యక్తిగత చర్యలను చూడటం, ఫొటోలు తీయడం, వెంబడించడం, చనువుగా ఉండేందుకు ప్రయత్నించడం, అగౌరవ పరచాలనే సంకల్పం, అక్రమ నిర్బంధం వంటి చర్యలకు పాల్పడటం ,366(ఎ),370 సెక్షన్లలో మహిళలతో అక్రమ వ్యాపారం, 370(ఎ)లో లైంగిక దోపిడీ, 372లో మైనర్ల అమ్మకం, 374లో బలవంతంగా శ్రమ చేయించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 66ఎ, 66సీ, 67, 67 ఏ కింద కేసులు నమోదు చేసేందుకు వీలుంది. చట్టాలు ఘనంగా ఉన్నా వాటి అమలులో మాత్రం వ్యవహారం ఘోరంగా ఉంటోంది. పోలీసు యంత్రాంగం ఎక్కువగా బ్యాంకుల్లో అక్రమాలపైనే దృష్టిసారిస్తున్నారే తప్ప ఇంటర్నెట్ అశ్లీలతపై ఎక్కువ దృష్టిసారించకపోవడం, సామాజిక సంస్థలు, వ్యక్తులు సైతం వౌనం వహించడం చూస్తుంటే వీరందరికీ అసలు బాధ్యత ఉందా? అనిపిస్తుంది. నీలిచిత్రాలు నైతికతను దిగజార్చడమేగాక, హింసాత్మక ప్రవృత్తిని నరనరాన జీర్ణించుకునేలా చేస్తాయనేందుకు ఇటీవలి సంఘటనలే చాలు. ఇంటర్నెట్ మాధ్యమంగా సాగుతున్న నీలిచిత్రాల వ్యాపారానికి ఇప్పటికైనా ముగింపు పలకాల్సి ఉంది.

-బీవీ ప్రసాద్ 98499 98090