మెయిన్ ఫీచర్

స్వేచ్ఛ, సహజత్వాలే జీవితం (ఓషో నవజీవన మార్గదర్శకాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబట్టి, అలాంటి ప్రమాదాన్ని, అభద్రతను ఎదుర్కొనేందుకు వున్న ఏకైక మార్గమే చక్కని అవగాహనతో కూడిన ఎరుక.
మీ ముందు రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఉష్టప్రక్షిలా మరీ మూర్ఖంగా కళ్ళు మూసుకుని గుడ్డిగా అంధ విశ్వాసాలను అనుసరించడం లేదా ఏ హిందువుగానో, మహమ్మదీయునిగానో, క్రైస్తవునిగానో మారడం. కానీ, అలా చెయ్యడంవల్ల మీ జీవితం ఏ మాత్రం మారకపోగా మీరు మరింత అజ్ఞానిలా, మరీ మూర్ఖంగా తయారవుతారు. ఆ అజ్ఞానం అకారణంగా మీరు మరింత భద్రతలో వున్నట్లు భావిస్తారు. మూర్ఖులందరూ అంతే. నిజానికి, మూర్ఖులు మాత్రమే చాలా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ, వాస్తవంలో జీవించే మనిషి ఎప్పుడూ అభద్రతాభావంలోనే ఉంటాడు. ఎందుకంటే, భద్రత ఎక్కడా లేదు.
జీవితం యాంత్రికమైనది కాదు. ఊహకు ఏ మాత్రం అందని అద్భుతమైన మర్మంతో కూడుకున్నదే జీవితం. అందుకే దానికి ఎలాంటి కచ్చితత్వం లేదు. మరుక్షణం ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కేవలం మీకే కాదు, ఎక్కడో స్వర్గంలో వున్న ఆ దేవుడికి కూడా- అసలు వాడంటూ ఉంటే, మరుక్షణం ఏమవుతుందో ఏ మాత్రం తెలియదు. ఒకవేళ అది అతనికి తెలిసినట్లైతే జీవితం కేవలం బూటకమే అవుతుంది. అంటే ప్రతిదీ ముందుగా నిర్ణయించుకుని రాసుకున్నదే అవుతుంది. పైగా, భవిష్యత్తు ముందుగానే తెలిసిపోతే మరుక్షణం ఏమవుతుందో ఆ దేవుడు కొత్తగా తెలుసుకునేది మాత్రం ఏముంటుంది? ఒకవేళ మరుక్షణం ఏమవుతుందో ఆ దేవుడికి నిజంగా తెలిస్తే జీవితం నిర్జీంగా, చాలా యాంత్రికంగా తయారవుతుంది. అలాంటి జీవితానికి ఎలాంటి స్వేచ్ఛ ఉండదు.
స్వేచ్ఛ లేకుండా జీవించేదెలా? స్వేచ్ఛ లేకపోతే ఎదిగేందుకో లేదా ఎదగకుండా ఉండేందుకో ఎలాంటి అవకాశమూ ఉండదు. ఒకవేళ ప్రతిదీ ముందుగా నిర్ణయించుకున్నదే అయితే, దానికి ఎలాంటి శోభ, కీర్తి ఉండదు. అపుడు మీరు కేవలం మరమనుషుల్లా పనిచేస్తారు. అవును, దేనికీ రక్షణ లేదు. అదే నా సందేశం. ఎందుకంటే, రక్షణతో కూడుకున్న జీవితం మృత్యువు కన్నా హీనమైనది. నిశ్చయమైనది ఏదీ లేదు. అనేక అనిశ్చితులతో, ఆశ్చర్యాలతో కూడుకున్నదే జీవితం. అదే దాని అందం. ‘ఇపుడు నేను నిశ్చయం’ అని మీరు ఎప్పటికీ చెప్పలేరు. అలా చెప్పడమంటే మీరు ఆత్మహత్య చేసుకుని మీ మరణాన్ని మీరు ప్రకటించినట్లే.
జీవితం అనేక అనిశ్చితులతో కొనసాగుతూ ఉంటుంది. అదే దాని స్వేచ్ఛ. కాబట్టి, ‘జీవితానికి భద్రత లేదు’ అనకండి. స్వేచ్ఛను అభద్రతగా మనసు ఎందుకు భావిస్తుందో నాకు తెలుసు. మీరెప్పుడైనా కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు జైలులో జీవించారా? అలా జీవించినట్లైతే అందులోంచి విడుదలైన వెంటనే ఏంచెయ్యాలో మీకు తెలియదు.
ఎందుకంటే, జైలులో సమయానికి భోజనం, కట్టుకునేందుకు బట్టలు, ఉండేందుకు నీడతోపాటు ‘రేపు ఎలా?’ అనే ఆలోచన రాకుండా పూర్తి రక్షణతో అన్నీ సవ్యంగా సాగిపోతూ ఉంటాయి. కాబట్టి, అందులోంచి బయటపడిన వెంటనే ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియక మీలో వణుకు పుడుతుంది. ఎందుకంటే జైలు నుంచి బయటకు రాగానే మీకు కావలసినవన్నీ మీరే వెతుక్కోవాలి. అంటే, మీరు మళ్లీ స్వేచ్ఛలో జీవించక తప్పదు. కాబట్టి, స్వేచ్ఛ ఎప్పుడూ భయానే్న సృష్టిస్తుంది. అందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడేవారే. కానీ, అదంటే అందరికీ భయమే. కానీ, స్వేచ్ఛ గురించి భయపడేవాడు నా దృష్టిలో మనిషే కాడు. నేను మీకు స్వేచ్ఛ ఇస్తానే కానీ, ఎలాంటి రక్షణ ఇవ్వను. అలాగే నేను మీకు అవగాహన కలిగిస్తానే కానీ, ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వను.
ఎందుకంటే, జ్ఞానం మిమ్మల్ని కచ్చితత్వమున్న ఏదో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా తయారుచేస్తుంది. ఒకవేళ నేను మీకు దేవుడు, దేవుని ఏకైక కుమారుడు జీసస్, పవిత్ర పిశాచి, పాపాలు, పుణ్యలు, స్వర్గం, నరకం, పుణ్యాలు చేస్తే స్వర్గానికి, పాపాలు చేస్తే నరకానికి వెళ్తారనే సూత్రాలను ఇవ్వగలిగితే చాలు. వెంటనే మీరు వాటిని కచ్చితంగా ఆచరిస్తారు. అందుకే చాలామంది క్రైస్తవులుగా, హిందువులుగా, మహమ్మదీయులుగా, జైనులుగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే, వారికి స్థిరమైన సూత్రాలు కావాలికానీ, స్వేచ్ఛతో పనిలేదు.
రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి మరణించబోతున్నాడు. అతడు యూదుడని ఎవరికీ తెలియదు. అందువల్ల ఒక కేథలిక్ మతాచార్యుడిని పిలిపించారు. అతడు మరణించబోతున్న వ్యక్తితో ‘‘త్రిమూర్తులైన దేవుడు, దేవుని ఏకైక కుమారుడైన జీసస్, పవిత్ర పిశాచిలపై మీకు నమ్మకముందా?’’ అన్నాడు. చనిపోబోతున్న అతడు మెల్లగా కళ్ళు తెరిచి ‘‘మరణించబోతున్న నన్ను ఇతడు ఎలా అడుగుతున్నాడో చూడండి’’ అన్నాడు చుట్టూ ఉన్నవారితో.
మృత్యువు మీ తలుపు తట్టినప్పుడు మీరు నిశ్చయించుకున్నవన్నీ కేవలం మూర్ఖమైనవిగా అనిపిస్తాయి. కాబట్టి, వాటిని పట్టుకుని వేలాడకండి. ఎందుకంటే, జీవితం అనిశ్చయమైనది. అదే దాని సహజత్వం. కాబట్టి, తెలివైన వ్యక్తి ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటాడు. అలా ఎప్పుడూ అనిశ్చితిలో ఉండేందుకు సిద్ధంగా ఉండడమే ధైర్యమంటే. ఎలాంటి పరిస్థితిలోనైనా అప్రమత్తతో హృదయ పూర్వకంగా స్పందించేవాడే తెలివైనవాడు. అంతమాత్రాన జరగబోయేది అతనికి తెలుసని, ‘‘అలా జరిగితే ఇలా చెయ్యాలని’’ అతనికి తెలిసినట్లు కాదు. ఎందుకంటే, జీవితం విజ్ఞాన శాస్త్రం కాదు, ‘కార్యకారణ శృంఖలం’కాదు. నీటిని వంద డిగ్రీలు వేడి చేస్తే అది కచ్చితంగా ఆవిరవుతుంది. కానీ, వాస్తవ జీవితంలో అలా ఏదీ జరగదు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛకు ప్రతిరూపం. ఆ విషయం అతనికి తెలియదు. ఎందుకంటే, అది ఊహకు అందని విషయం. కాబట్టి, దానిని ముందుగా తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి, ఎవరైనా అవగాహనతో కూడిన ఎరుకలో జీవించక తప్పదు. మీరు పట్టుకుని వేలాడడానికి వీలుగా ఉండే జ్ఞాన సూత్రాలు కోరుకుంటూ నా దగ్గరకు వస్తారు. కానీ, నేను మీకు అలాంటివి ఇవ్వను. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ మీదగ్గర అలాంటివి ఉంటే వాటిని కూడా మీకు లేకుండా చేసి మీ నిశ్చితత్వాన్ని నాశనం చేస్తాను. అలా మెల్లమెల్లగా నేను మిమ్మల్ని అనిశ్చితిలోకి నెట్టేసి మీకు ఎలాంటి రక్షణ లేకుండా చేస్తాను. ముఖ్యంగా గురువులు చెయ్యవలసిన పని అదే. ఏ గురువైనా మీకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే అన్ని అవకాశాలు తెరుచుకుంటాయి. స్థిరమైనది ఏదీ లేదు. కాబట్టి, మీరు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. లేకపోతే, మీకు ఏదీ సాధ్యంకాదు. దీనినే నేను అవగాహన అంటాను. అది మీకు ఉంటే, జీవితానికి భద్రత లేకపోవడం సహజమని, జీవితంలో అది ఒక భాగమని, అయినా అది మంచిదే అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, అది మీకు స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు, మీ జీవితాన్ని నిరంతర ఆశ్చర్యాలకు గురిచేస్తూనే ఉంటుంది. జరగబోయేది ఎవరికీ తెలియదు. అందుకే అది ఎప్పుడూ మిమ్మల్ని ఆశ్చర్యంలోనే ఉంచుతుంది. కాబట్టి, జీవితాన్ని అద్భుతమనండి, స్వేచ్ఛ అనండి. అంతేకానీ, అది అనిశ్చయమైనదనో, భద్రత లేనిదనో అనకండి.
ధైర్యం లేకపోతే మీరు నిజాయితీగా ఉండలేరు, దేనినీ నమ్మలేరు, దేనినీ ప్రేమించలేరు. వాస్తవాన్ని తెలుసుకోలేరు. కాబట్టి, ముందు మీకు ధైర్యమనేది ఉండాలి. అప్పుడే తక్కినవన్నీ దానిని అనుసరిస్తాయి.
**
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.
ఇంకావుంది...