మెయన్ ఫీచర్

పోరుబాటలోనే ‘హోదా’ సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒక నిర్ణయం తీసుకునే ముందు, హామీ ఇచ్చేముందు, ఏదైనా పనిచేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించండి.. సమయం తీసుకున్నా ఫర్వాలేదు. ఒకసారి ఒక అంశంపై నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లవద్దు..’ అని ప్రపంచ ప్రఖ్యాత నియంత అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాయి. దీనికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి హోదాపై స్థిర నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్ష పార్టీ వైకాపా మాత్రం ప్రత్యేక హోదాపై ఒకే మాటపై ఉంది. టీడీపీ నాయకత్వం కాలానుగుణంగా తన వైఖరిని మార్చుకుంటూ వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయ కోణంలో ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలో తాజాగా చేపట్టిన నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా విషయమై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో లిఖితపూర్వకమైన హామీ ఇచ్చారు. ఢిల్లీలో టీడీపీ జరిపిన ధర్మపోరాట దీక్షకు బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ హాజరయ్యాయి. ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి జాతీయ స్థాయిలో ప్రముఖంగా ప్రస్తావించి, అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో చంద్రబాబు ఆశించిన లక్ష్యాన్ని సాధించారు. అంతకుముందు ధర్మ పోరాట దీక్షలను ప్రతి జిల్లాలోనూ నిర్వహించారు. గత ఏడాది ఎన్డీఏ కూటమి నుంచి నిష్క్రమించాక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ పార్లమెంటు లోపల, వెలుపల తెదేపా పోరును కొనసాగించింది.
ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ ఇప్పుడు మద్దతు ప్రకటించినంత మాత్రాన ప్రజలు శాంతించరు. ఏదో వంకన జనంలోకి వచ్చేందుకు టీడీపీ ద్వారా ఒక దారిని సృష్టించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన నియంతృత్వ వైఖరిని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. బీజేపీకి అనేక కారణాల వల్ల దూరమైన చంద్రబాబు తన గూటిలోకి రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కాంగ్రెస్‌కు ఈ సంతోషం ఎంత కాలం ఉంటుందనేది అనుమానమే. కాంగ్రెస్ సహా ఇతర బీజేపీ వ్యతిరేక పక్షాలను ఒక వేదికపైకి చేర్చడంలో చంద్రబాబు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని ఏడాది నుంచి తీవ్రతరం చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా, ప్యాకేజీ ఇస్తామని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు లోపల, వెలుపల అనేక వేదికలపై ప్రకటించారు. చంద్రబాబు అంగీకరించిన ఆ ప్యాకేజీని కూడా ఇంతవరకు బీజేపీ ప్రకటించలేదు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామన్న బాధ నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా అనేది ఒక అద్భుతమైన సంజీవినిగా ప్రజలు భావించారు. హోదా వస్తే తప్ప సమస్యలేవీ పరిష్కారం కావనే కచ్చితమైన నిర్ణయంతో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతకంటే మించి ఆంధ్రాకు సహాయం చేశామని బీజేపీ నేతలు చెప్పే గణాంకాలు వాస్తవం కావచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటల్లో నిజం ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం సాధారణ, ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాల మధ్య ఉన్న సున్నితమైన విభజన రేఖను రద్దు చేసింది. 2015లో బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల మధ్య అసమానతలను తొలగించేందుకు పన్నులు, గ్రాంట్లను ఎక్కువగా కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వీటి మొత్తాన్ని 32 నుంచి 42 శాతానికి పెంచారు. ఆంధ్రాకు గత ఐదేళ్లలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా ఇచ్చిన నిధులు, ప్రాజెక్టుల వివరాలను కేంద్రం పదే పదే చెబుతోంది.
చంద్రబాబు ముందు నుంచే హోదాపై మాట మార్చకుండా అదే పట్టుదలతో ఉంటే మరో రకంగా ఉండేది. 2014లో అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకునే వరకు హోదా అంటే సంజీవిని కాదని, ప్యాకేజీ కూడా మంచిదని వాదించారు. వైకాపా హోదాకే కట్టుబడి ఉండడం, బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాక ప్యాకేజీ నుంచి హోదా డిమాండ్‌కు చంద్రబాబు వెనక్కు వచ్చారు. దీని వల్ల చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు. హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, మహాద్భుతాలు జరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. విధానపరమైన అంశంపై చంద్రబాబులో స్పష్టత కొరవడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై తెదేపా వైఖరి చెప్పమంటే చంద్రబాబు ఎటూ చెప్పలేకపోయారు. విభజన సమయంలో ఢిల్లీలో దీక్ష చేస్తున్నప్పుడు కూడా స్పష్టమైన వైఖరిని చెప్పలేకపోయారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా అంతే. పరిపాలనాదక్షుడైన చంద్రబాబులో కొన్ని కీలకమైన అంశాల్లో ఊగిసలాడే ధోరణి ఒక లోపంగా భావించవచ్చు.
ఇక బీజేపీ హోదాను ఇవ్వలేమని చెప్పేసింది. ప్యాకేజీ ఇచ్చిందా? అంటే అదీ లేదు. ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది బీజేపీనే. ప్రస్తుత ఉప రాష్టప్రతి, ఆనాటి ఎంపీ ఎం వెంకయ్యనాయుడు, ప్రస్తుత ఆర్థిక మంత్రి, ఆ నాటి ఎంపీ అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. దీనికి అనుగుణంగానే ప్రధాని మన్మోహన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన పత్రంలో హామీ ఇచ్చారు. పార్లమెంటులో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే, ప్రజలు ఏ వ్యవస్థను విశ్వసించాలి? గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీడీపీ-బీజేపీ కూటమికి ఓట్లు వేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 2015లో ప్రణాళిక సంఘం రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదాను ఇవ్వలేమని, ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. బీజేపీ ఆరవ బడ్జెట్‌కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టినా హోదా బదులు ప్యాకేజీని ఇవ్వలేకపోయింది. చివరకు విశాఖ రైల్వే జోన్ ఊసు కూడా లేదు. కొంత కాలం పాటు బీజేపీ విభజన చట్టంలో హోదాను చేర్చి ఉంటే సులువుగా ఉండేదని వాదించింది. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పిందని, పన్నుల ఆదాయం, గ్రాంట్లను ఆర్థిక రుగ్మతలతో సతమతమవుతున్న రాష్ట్రాలకు ఇస్తే సరిపోతుందని సిఫార్సు చేసినట్లు ప్రచారం చేశారు. హోదా లేదా ప్యాకేజీ గురించి అడిగితే, గత ఐదేళ్లలో ఆంధ్రాకు ఇచ్చిన నిధులపై గణాంకాలను బీజేపీ నేతలు చెబుతుంటారు. ఇచ్చిన సొమ్ముకు లెక్కా పత్రం లేవని కూడా వారు ఆరోపిస్తుంటారు. ఐదేళ్ల తర్వాత పరిస్థితిని విశే్లషిస్తే- హోదా లేదు, ప్యాకేజీ లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు పన్నుల ఆదాయం, గ్రాంట్లు ఎక్కువగా ఇచ్చి ఉండవచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన తీరును అర్థం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు విఫలమయ్యాయి.
హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలను ఆంధ్ర ప్రజలు పట్టించుకోరు. ఈ అంశంపై చర్చ అర్థరహితం. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడి ప్రజల ఆలోచన తీరు, జీవన విధానం లగ్జరీగా ఉండవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియాలో ఆంధ్రావాళ్లే ఎక్కువ. మీకెందుకు హోదా? అనే వాళ్లున్నారు. ఈ ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనిలేదు. రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడే పార్లమెంటు ఆడిన మాట తప్పిందనే భావనతో ప్రజలు ఉన్నారు. హోదా కంటే గొప్పగా ఉపయోగపడే ప్యాకేజీని ఇచ్చినా ప్రజలు సంతృప్తి చెందరు.
2014 ఫిబ్రవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. కాని ఎక్కడా ఆంధ్రులకు ఉపశమనం కలిగించే వరాలేవీ కాంగ్రెస్ ప్రకటించలేదు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఇద్దరు బీజేపీ ఎంపీలు వెంకయ్య, జైట్లీ అడిగిన ప్రశ్నలకు బదులుగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. చరిత్రలో చాలా అరుదుగా కొన్ని ఘటనలు చూస్తుంటాం. ఇవీ పునరావృతం కావు. ఆంధ్రాలో ఐదుకోట్ల మంది ప్రజల్లో ఒక రకమైన ఉద్వేగానికి లోనై ఉన్నారు. ఇచ్ఛాపురం నుంచి తిరుపతి వరకు 13 జిల్లాల్లో ఎక్కడ చూసినా ఒక రకమైన మానసిక అలజడి నెలకొని ఉన్న సమయం. ఆ సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇవ్వడం నిజంగా పెద్ద ఊరట నిచ్చింది. ప్రత్యేక హోదా అనే అంశం కోట్లాది మంది ప్రజల మనస్సుల్లో అప్పటికి ఉపశమనాన్ని ఇచ్చింది.
ప్రాచీన కాలం నుంచి కూడా ఆంధ్రుల చరిత్ర మిగతా ప్రాంతాలతో చూస్తే భిన్నమైంది. అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి సంపదను సృష్టించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటు. విలాసంగా జీవించాలనే ద్పక్పథం కలిగి ఉంటారు. వినూత్న వాణిజ్య ధోరణులు, సంస్కృతిని కలిగి ఉంటారు. పారిశ్రామిక, వ్యాపార, వినోదాత్మక రంగాల్లో సాహసపేతమైన అడుగులు వేస్తుంటారు. సినిమా సంస్కృతి ప్రభావం ఎక్కువ. విద్యారంగం గురించి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనేది ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? మనకు ఎందుకు ఇవ్వరు ? ఎక్కడా లేని నిబంధనలు మనకెందుకు ? ఈబీసీ కోటా బిల్లు గురించి కలలో కూడా ఆలోచించేందుకు వెనకాడే పరిస్థితుల్లో సులువుగా చట్టం చేసిన బీజేపీ ప్రభుత్వం- హోదాపై ఇచ్చే వివరణ ఆంధ్ర ప్రజలను సంతృప్తిపరచలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు ఆలస్యంగా గ్రహించి బీజేపీకి దూరం జరిగారు.
ప్రత్యేక హోదా వల్ల ఆంధ్ర తీరాన్ని ప్రతి ఏడాది తాకే తుపానులు రాకుండా పోవు. రతనాల సీమ రాయలసీమ కరవు ఎటూ తీరదు. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రాలో మంచి అభివృద్ధి జరుగుతుందనే నిశ్చితాభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. అంతకంటే పెద్ద ప్యాకేజీ ప్రకటించి, అద్భుతమైన వౌలిక సదుపాయాలను కల్పించినా ప్రజలను ఏ రాజకీయ పార్టీ కూడా సంతృప్తి పరచలేదు. ప్రత్యేక హోదా అనేది బడబాగ్నిలా రగులుతున్న ఒక కోరిక. ఆ కోరికను తీర్చడంలో 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ విఫలమయ్యాయి. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించాలన్న స్పృహ కాంగ్రెస్‌కు లేదు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది- చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షలు, ఎంపీల రాజీనామాలు, వామపక్ష పార్టీల ఆందోళనల వల్ల రాదని తేలిపోయింది. ఇక బంతి ప్రజల కోర్టులో ఉంది. 1972 కాలం నాటి ‘జై ఆంధ్రా’ తరహా ఉద్యమం లాంటిది వస్తే తప్ప హోదా అనేది రాదు. ఆ ఓపిక, తీరిక ప్రజలకు ఉందా? ప్రజల గురించి ఆలోచించే వామపక్ష పార్టీలు చేపట్టే ధర్నాలకే పట్టుమని 50 మందిని సమీకరించడం ఇపుడు సంక్లిష్టంగా తయారైంది. విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా హామీ అమలు కావాలంటే అనేక నష్టాలకు సిద్ధమై చేసే పోరాటమే శరణ్యం. ఇందుకు సిద్ధమయ్యే నాయకులు నేడు కనపడడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే ప్రజలు నమ్మే పరిస్థితి కనబడడం లేదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097