మెయిన్ ఫీచర్

మూఢాచారాలు ఇంకానా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పితృస్వామ్య సమాజంలో మహిళలకు సంబంధించి అనేక మూఢనమ్మకాలు, దుష్టసంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళలు అంతరిక్షంలోకి దూసుకుపోతున్నా.. మూఢనమ్మకాలు, ఆచారాలు మాత్రం వారిని అంటిపెట్టుకునే ఉంటున్నాయి. వదలడం లేదు. ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల్లోని వెనుకబాటుతనం ఆచారాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఈ ఆచారాలకే ఇటీవల తమిళనాడులోని తంజావూరు జిల్లా, పుదుక్కొట్టయి ఊరులోని పన్నెండేళ్ల విజయ కన్నుమూసింది. అయినా ఆ ఊర్లో ఏమాత్రం కదలికలేదు. ఆయుష్షు తీరిపోయింది అనుకుంటున్నారు కానీ వింత ఆచారాలు, మూఢనమ్మకాల వల్ల అని తెలుసుకోలేకపోతున్నారు.. రాయలసీమలోని అనంతపురం జిల్లా, గంతగొల్లహట్టి గ్రామంలో కూడా కొన్ని వింత సంప్రదాయాలను ఇంకా ఆచరిస్తున్నారు అక్కడి మహిళలు. దాదాపు 120 నివాసాలు ఉన్న ఆ గ్రామంలో ఊరుగొల్ల, కాడుగొల్ల అనే రెండు కులాలున్నాయి. అందులో కాడుగొల్ల కులంలో ఉన్న ఆచారాలు మహిళలను మానసికంగా, శారీరకంగా తీవ్రక్షోభకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఆ ఊరిలో ఆడవాళ్లు నెలసరి సమయంలో ఇంటి బయటే ఉండాలి. అదే బాలింతలైతే దాదాపు మూడు నెలల పాటు ఊరి బయట పొరిమేరలో గుడిసెను నిర్మించుకుని అక్కడే జీవనం సాగించాలి. చదువుకుంటున్న ఆడపిల్లలను కూడా నెలసరి సమయంలో ఆ ఐదు రోజులూ ఊరి బయట వున్న గుడిసెల్లో ఉంచుతారు. ఇందుకోసం ఊరి బయట గుడిసెలను ఏర్పాటుచేశారు. ఆ సమయంలో వంటతో సహా అన్ని పనులూ వాళ్లే చేసుకోవాలి. ఊరిలోనుంచి వెళితే బడికి వెళ్లడానికి మూడుకిలోమీటర్లు నడవాలి. కానీ నెలసరి సమయంలో ఆడపిల్లలు ఊర్లోకి వెళ్లకూడదు కాబట్టి ఊరి చుట్టూ తిరిగి పొలిమేర మీదుగా 11 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లాల్సి వస్తుంది. నెలసరి వచ్చిన వారితో గ్రామస్థులెవరూ మాట్లాడకూడదు. ఒకవేళ వారితో ఎవరైనా మాట్లాడినా, తాకినా వాళ్లు కూడా ఊరిలోకి రాకూడదు. వాళ్లుండే గుడిసెలో కనీస సౌకర్యాలు కూడా ఉండవు. విద్యుత్ సదుపాయం ఉండదు. ఆ చీకట్లోనే వాళ్లు కాలం గడపాలి.
బాలింతల పరిస్థితి అయితే మరీ దారుణం. ఆడపిల్లకు నెలలు నిండుతున్నాయనగానే ఆ ఇంటివాళ్లు ఊరి బయట వెదురు బొంగులతో ఒక గుడిసెనో, గుడారాన్నో తయారుచేస్తారు. ప్రసవం తరువాత ఆ తల్లీబిడ్డలను గుడారంలో వదిలేస్తారు. పసిబిడ్డతో కలిసి ఆ తల్లి గుడిసెలోనే మూడు నెలలు గడపాలి. వాళ్లని ఎవరూ తాకకూడదు. ఆ తల్లికి పనిలో ఎవరూ సాయం చేయకూడదు. ఆ బాలింతరాలే వండుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి. బిడ్డను చూసుకోవాలి. వారికి తోడుగా కూడా ఎవరూ ఉండకూడదు. మూడు నెలల తరువాత గుడికి వెళ్లి పూజచేశాకే ఆ తల్లీబిడ్డ గ్రామంలో అడుగుపెట్టాలి. గతంలో అయితే ఐదు నెలలు గడిపేవారట. ఇప్పుడు మూడునెలలు ఉంటున్నారు. ఈ ఆచారాన్ని దైవాజ్ఞగా అక్కడి మహిళలు భావిస్తారు. కారణం వారి పెద్దలు వారికి అలా చెప్పారట.. వారి మాటల్ని ఎదిరించలేక ఎంత కష్టమైనా భరించి వారు అలా ఊరి బయట బతుకుతున్నారు.
ఆడవాళ్లు బాధపడుతున్నా తరాల నుంచి కొనసాగుతున్న ఆచారాలపై నమ్మకంతో ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఆ గ్రామంలోని పురుషులు. ఈ కాడుగొల్ల కులస్థుల్లోనే కాదు.. ఇలాంటి ఆచారం ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉంది. తమిళనాడు, తంజావూరు జిల్లా, పుదుక్కొట్టయి అనే ఊర్లో ఓ కొట్టం కూలిపోయి అందులో పడుకుని ఉన్న ఓ అమ్మాయి మరణించింది. ఆమె పక్కనే పడుకుని ఉన్న తల్లి తీవ్రంగా గాయపడింది. ఆ మధ్య విరుచుకుపడిన గజ తుఫాను కారణంగా కొబ్బరిచెట్లు విరిగి కొట్టంపై పడటంతో అది కూలిపోయింది. ఆ పాప పేరు విజయం. ఆమె ఏడో తరగతి చదివేది. వయసు 12 సంవత్సరాలు. మరి ఆ పాప కొట్టంలో ఎందుకు ఉంది? అంటే కారణం బహిష్టు.
సహజంగా శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఆమె రజస్వల అయ్యింది. ఈ సమయంలో ఆ ప్రాంత మూఢ కట్టుబాట్ల ప్రకారం ఇంటికి దూరంగా ఉండాలనే ఆచారం వల్ల తల్లిదండ్రులు ఆ పాపను ఇంటి పక్కనే ఉన్న పెంకుల కొట్టంలో కూర్చోబెట్టారు. ఇవేవీ తెలియని ఆ చిన్నారి స్కూలుకు వెళతానని మారాం చేసినా భయపెట్టి, నచ్చజెప్పి మూలన ఉంచేశారు. తుఫాను వచ్చింది. బలమైన గాలులు వీచాయి. ఆ గాలులకు ఆమె ఇంట్లో ఉంటే బతికి పోయేది. కానీ ఆ బలహీనమైన కొట్టంలో ఉండేటప్పటికి అది కూలి విజయను బలితీసుకుంది. ఇలా.. వేల గ్రామాల్లో మూఢాచారాలు ఆడపిల్లలను, మహిళలను బలితీసుకుంటున్నాయి. రుతుస్రావ కారణంగా ఊరి బయట గుడిసెల్లో, కొట్టాల్లో ఉంటున్న కారణంగా చాలామంది మహిళలు పాముకాట్లకు గురవుతున్నారు. ఒంటరితనం, ఒత్తిడితో మానసిక రుగ్మతలూ ఎక్కువవుతున్నారు. గర్భకోశం ఎదిగే క్రమంలో రుతుక్రమం మొదలవడం మొదటి దశ మాత్రమే.. ఆ తర్వాత రెండేళ్లపాటు అండాశయాలు, గర్భకోశం పూర్తి రూపాన్ని సంతరించుకుంటాయి. అంతమాత్రాన ఆమె పిల్లల్ని కనడానికి సిద్ధమైందని కాదు. శారీరక ఎదుగుదల 19 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. వివాహానికి, తల్లికావడానికి కావలసిన మానసిక ఎదుగుదల 21 సంవత్సరాల తరువాతే వస్తుంది. సైన్స్ అస్సలు అభివృద్ధి చెందని కాలంలో ఏర్పడిన ఈ మూఢనమ్మకాలు.. మహిళలు రోదసీలో అడుగుపెడుతున్నా మారడం లేదు. ఇలాంటి గ్రామాల్లోని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇలాంటి మూఢాచారాల నుండి మహిళలను రక్షిస్తే కొంతమేరకైనా సమస్య పరిష్కారమవుతుంది.