మెయిన్ ఫీచర్

కథలు.. కొత్త రుచులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల సీజన్ సంక్రాంతి. ఆ పండుగ కోసం ఎదురు చూసిన ప్రేక్షకుడికి మాత్రం వచ్చిన సినిమాలు సంపూర్థ సంతృప్తిని అందివ్వలేకపోయాయి. ఆరంభమే అదిరిపోతుందంటూ పెద్ద ఎత్తున సాగిన ప్రచారంకాస్తా -పండుగ సినిమాలు విడుదలైన తరువాత ఆవిరైపోయింది. తప్పదన్నట్టు థియేటర్లలో ఉన్న సినిమాలనే చూసి ఆనందించిన ప్రేక్షకుడు మాత్రం -కనీసం వచ్చే సినిమాలైన ఎంటర్‌టైన్ చేయకపోతాయా? అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏడాది ఆరంభం సినిమాలుగా వచ్చిన యన్‌టిఆర్ బయోపిక్ తొలి భాగం ‘కథానాయకుడు’ ఆడియన్స్‌కి అనుకున్నంత వినోదాన్ని పంచలేకపోయింది. మహానటుడు ఎన్టీఆర్ విశ్వరూపాన్ని బాలయ్య ప్రదర్శిస్తున్నాడన్న ప్రచారమే ఎక్కువ జరిగింది తప్ప, సినిమా మాత్రం వచ్చివెళ్లిపోయిందన్న భావనే కలిగించింది. ఇక మెగా హీరో రామ్‌చరణ్ చిత్రం సైతం అనుకున్నంత ఆనందం పంచలేకపోయిందన్న టాక్ ఫ్యాన్స్ నుంచే వినిపించడం గమనార్హం. బోయపాటి యాక్షన్ స్కెచ్‌లో రామ్‌చరణ్ అద్భుతాన్ని చూపించబోతున్నాడంటూ ప్రమోషన్స్ పరాకాష్టలో సాగినా -ఫలితంలో మాత్రం అంత సీన్ లేదు. ‘అతి’ సర్వత్రే వర్జయేత్ అన్నట్టుగానే -సినిమా బాక్సాఫీస్ వద్ద తనే్నసింది. ఇక పండుగ సినిమాగా వచ్చిన ‘ఎఫ్-2’ మాత్రం సెలవుల్లో సందడి చేసిందనే చెప్పాలి. రెండు పెద్ద సినిమాల ఫలితం తారుమారవ్వడంతో -ఉన్న సినిమానే దిక్కన్నట్టు ప్రేక్షకుడు ఎఫ్-2ను పైకి లేపేశాడు. దీనికితోడు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పండించటంలో వెంకీ మరోసారి రెచ్చిపోవడంతో -పండుగ ఆ ఒక్క సినిమాతో పూరె్తైంది. ఆరంభంలో వచ్చిన పెద్ద సినిమాలు సంతృప్తిపర్చలేకపోవడంతో -తదుపది సినిమాలను ఇప్పటినుంచే ఫ్యాన్స్, ఆడియన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. మరోపక్క గత నాలుగేళ్లుగా ఫార్ములా కథలను పక్కనపెట్టేసి -వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు పెద్ద హీరోలంతా ఆసక్తి చూపుతుండటంతో వచ్చే సినిమాల్లో ఊపు ఉండొచ్చన్న ఆసక్తి పెరుగుతోంది.
నిజానికి -సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నీ ఒక్కోటీ ఒక్కో పంథా కథతో వచ్చినవే. కథానాయకుడు చిత్రం బయోపిక్‌గా వస్తే, వినయ విధేయ రామ కమర్షియల్ అంశాలతో మురిపించాలని చూసింది. ఫక్తు కుటుంబ హస్య ప్రధానాంశంగా ఎఫ్-2 వస్తే, అనువాద చిత్రంగా వచ్చిన ‘పేట’ మాత్రం సూపర్‌స్టార్ ఇమేజ్‌ని మరోసారి రుచి చూపించే ప్రయత్నం చేసింది. సో, పండుగ సీజన్ తరువాత వచ్చే చిత్రాలు కూడా ఇదే తరహాలో కొత్త రుచులు అందిస్తాయన్న ఆసక్తి ఆడియన్స్‌లో కనిపిస్తోంది.
రాబోయే చిత్రాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో బయోపిక్ -సైరా. చారిత్రక కథగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. షూటింగ్ చివరి దశలోవున్న చిత్రం బడ్జెట్ రూ.200 కోట్లు పైచిలుకే అంటున్నారు. దీనికితోడు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చిరు ఇమేజ్‌ని పతాకస్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్మితమవుతున్న చిత్రమిది. దీంతో సైరాపై అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అదేకోవలో యన్‌టిఆర్ బయోపిక్ మలిభాగం ‘మహానాయకుడు’ రాబోతోంది. రాజకీయ జీవిత చరిత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు. తొలిభాగం ఒకింత నిరుత్సాహానికి గురి చేయటంతో -మలిభాగంపైనే చిత్రబృందం దృష్టి కేంద్రీకరించింది. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని అచ్చుగుద్దినట్టు చూపిస్తే -రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు కనుక -ఆయా భాగాలను ఎలా చిత్రీకరించారు, ఎలా చూపించబోతున్నారు? వాటిలో వాస్తవాలెంత? అన్న అంశాలపై ఇప్పటికే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన అంశాలనే సినిమాటిక్‌గా చేసేశారన్న అపవాదు ఉన్న నేపథ్యంలో, తలెత్తుతున్న ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చూపిస్తారన్నది చూడాలి. పూర్తి బయోపిక్ అనలేకపోయినా -వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రభావాన్ని చూపించేందుకు ‘యాత్ర’ వస్తోంది. పాదయాత్ర ప్రభావం, దాని తరువాత రాజకీయ పరిణామాలనే ప్రధానంగా ఈ చిత్రంలో చూపించే అవకాశం ఉంది. లీడ్ రోల్‌ను పోషిస్తున్న సీనియర్ నటుడు మమ్ముట్టి, ఇప్పటికే తన లుక్‌తో అభిమానులను కట్టిపడేశాడు. ఇవన్నీ జీవిత కథలుగా తెరకెక్కుతున్న చిత్రలే. సో, వీటి నేపథ్యంతో ఆడియన్స్‌ని అలరిస్తాయన్న అంచనాలు లేకపోలేదు.
భారీ బడ్జెట్ చిత్రంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న మరో ప్రాజెక్టు -ప్రభాస్ సాహో. ఐదేళ్లు కష్టపడిన బాహుబలి ప్రాజెక్టుతో అందుకున్న విజయం తరువాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 300 కోట్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రంలో ప్రభాస్ స్టామినాను ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లు తేటతెల్లం చేస్తున్నాయి. లోడెడ్ యాక్షన్‌తో సాగే ఈ సినిమా అభిమానులకు కొత్త ఊపునిస్తుందనే అంటున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రాల్లో మరొకటి -మహర్షి. భరత్ అను నేను.. చిత్రంతో రాజకీయ నేపథ్యాన్ని టచ్ చేసిన మహేష్‌బాబు, కొత్త ప్రాజెక్టు టైటిల్‌తోనే ఆకట్టుకుంటున్నాడు. కొంతకాలంగా సామాజికాంశాలతో కూడిన కథల్నే ఎంచుకుంటున్న మహేష్, ఈ సినిమాలో ఎలాంటి అంశాన్ని స్పృశించబోతున్నాడోనన్న ఆసక్తి కూడా లేకపోలేదు. దర్శకుడి రేస్‌లో దూసుకుపోతున్న త్రివిక్రమ్‌తో బన్నీ మళ్లీ సినిమా చేస్తున్నాడన్నది ఈ ఏడాది ఇండస్ట్రీకి పెద్ద టాక్. వీళ్లిద్దరి కాంబినేషన్ ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో, బన్నీని త్రివిక్రమ్ ఎలాంటి కథలో చూపించబోతున్నాడన్న ఆసక్తి లేకపోలేదు. ఇక పండుగ ఎఫ్-2తో వచ్చి బలమైన ఎంటర్‌టైన్‌మెంట్ ముద్ర వేసిన వెంకీ, సీరియస్ కథలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడా? అనిపిస్తోంది. ఎందుకంటే -ఎఫ్2 తరువాత వెంకీ ‘వెంకీ మామ’గా వస్తున్నాడు. ఇందులోనూ ఆడియన్స్ ఆశించే అంశాలు, నవ్వులుపువ్వులు పుష్కలంగానే ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.
ఇక కుర్ర కథానాయకలూ ఏమీ తీసిపోలేదు. స్పోర్ట్స్ బేస్‌డ్ కంటెంట్‌తో వస్తున్న నానికి చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఏడాది నాని ‘జెర్సీ’తో వస్తున్నాడు. ప్రేక్షకుల ఆనందాన్ని తీర్చేదే కాదు, నటుడిగా నా స్టామినాను, గౌరవాన్ని పెంచే చిత్రమేనని నమ్మకంగా చెబుతున్నాడు కూడా. ఆరంభం నుంచీ సరైన బ్రేక్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ సైతం -ఈ ఏడాదితో దాన్నుంచి బయటపడతాననే చెబుతున్నాడు. అఖిల్ చేస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఓ అందమైన ప్రేమ కథ చెబుతానంటూ వస్తున్న అఖిల్‌కు ఎలాంటి ఫలితాన్ని ఆడియన్స్ ఇవ్వబోతున్నారో చూడాలి. ఇక నాగ చైతన్య నుంచి ‘మజిలీ’ వస్తోంది. సమంతను పెళ్లి చేసుకున్న తరువాత -ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రంగా దీనిపై ఆసక్తి చూపుతున్నారు ఆడియన్స్. భార్యాభర్తలిద్దరూ పెళ్లయిన ప్రేమజంట అనుభూతిని ఆడియన్స్‌కి అందించేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ దేవరకొడ డియర్ కామ్రేడ్, థ్రిల్లర్ కథగా కల్యాణ్‌రామ్ ‘118’తో ఈ ఏడాదే వస్తున్నారు. ఇవికాకుండా స్టార్ హీరోయిన్ల సత్తాను చూపుతున్న సమంతా, కీర్తిసురేష్, అనుష్క తదితరులూ కథనాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో మెప్పించబోతున్నారు. వేటికవే ఎన్నదగిన చిత్రాలుగా వస్తున్న వీటిలో ఎవరు మెప్పిస్తారు, ఎవరు అసంతృప్తికి గురి చేశారన్నది ఏడాది చివరిలో సమీక్షించుకుందాం.

-ఉత్తమ్