మెయిన్ ఫీచర్

....హౌస్ ఫుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు లోగిళ్లు కొత్త హంగామాతో పండగకు సిద్ధమవుతున్నాయి. తెలుగువారికి ఇష్టమైన పండగ సంక్రాంతి. తెలుగు జనాలకే కాదు.. సినిమాకూ సంక్రాంతి అంటే ఎంతిష్టమో ఆయా పండగ రోజున వచ్చే సినిమాలే చెబుతాయి. తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సంక్రాంతి సంబరాలు.. భారీ సినిమాలమధ్య పోటీ.. ఈ సీజన్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు స్టార్ హీరోలు ముందునుంచే సిద్ధమవ్వడం పరిపాటిగా వస్తున్నదే. తెలుగు పండగల్లో పెద్ద
పండుగగా భావించే సంక్రాంతికి ఏటా మూడు నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది. కలెక్షన్లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. సంక్రాంతికి రిలీజైన సినిమా యావరేజ్
అనిపించుకుంటే చాలు కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక హిట్ టాక్ వస్తే బ్లాక్‌బస్టర్ రేంజ్ వసూళ్లు పక్కా.. అందుకే సంక్రాంతి సీజన్‌పై ఎప్పుడూ కొందరు హీరోలు స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ
సినిమాలు సిద్ధం చేస్తుంటారు. కాలగమనంలో మరో ఏడాది గడిచిపోయింది. మళ్లీ సంక్రాంతి రానే వచ్చింది. మరి ఈ సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది? రానున్న
సినిమాలు జనాలను ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తాయో చూడాలి.
*
తెలుగువాళ్లకు సంక్రాంతి పండుగంటే పిండివంటలు.. కోడిపందాలు.. కొత్త సినిమాలే. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు (అజ్ఞాతవాసి, జైసింహా) ఆడియన్స్‌ని నిరాశపర్చాయ. ఈసారి మూడు (కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్-2) ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చూడాలి.
*
అనువాదమే అయనా స్ట్రెయట్ తెలుగు చిత్రాలతో పోటీ పడేందుకు
ఉవ్విళ్లూరుతున్నాయ రెండు సినిమాలు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేటతో సూపర్‌స్టార్ రజనీకాంత్, శివ దర్శకత్వంలో విశ్వాసం చూపించేందుకు అజిత్‌లు పండుగ సినిమాల రేస్‌లోకి దిగడం ఆసక్తికరమే.
*
సంక్రాంతి సినిమా కోసం ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ ఏడాది మూడే స్ట్రెయట్ సినిమాలు వస్తున్నాయి. అవీ స్టార్ హీరోల చిత్రాలు. మూడూ భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో చిన్న సినిమాలు పండుగ రేస్‌నుంచి పక్కకు తప్పుకున్నాయి. పండుగ సినిమా లిస్ట్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది యన్‌టిఆర్ బయోపిక్. లిస్ట్‌లో తరువాతి సినిమా -వినయ విధేయ రామ. ఈ రెండు చిత్రాలూ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రెండూ భారీ విజయాలు దక్కించుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు నందమూరి, మెగా ఫ్యాన్స్. అటు సినిమారంగంలో, ఇటు రాజకీయ రంగంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి యన్‌టిఆర్. తండ్రి జీవితంలోని సినిమా, రాజకీయ ముఖ్య ఘట్టాలను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు సీనియర్ హీరో బాలకృష్ణ. అలా రెండు భాగాలుగా తెరకెక్కిన చిత్రమే యన్‌టిఆర్. సంక్రాంతి సినిమాగా మొదటి భాగమైన యన్‌టిఆర్ సినిమా చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ‘కథానాయకుడు’గా తెరకెక్కించారు. రాజకీయ ప్రస్తానంలోని ముఖ్య ఘట్టాలను ‘మహానాయకుడు’గా తెరకెక్కించారు. ఈ రెండు భాగాలూ బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు దక్కించుకుంటాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
ప్రతి సంక్రాంతికీ ఏదోక సినిమాతో ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేయడం బాలయ్య స్టయిల్. గడచిన ఏడాది ‘జైసింహా’తో వచ్చినా సరైన ఫలితాన్ని అదుకోలేకపోయాడు. ఈసారి ‘కథానాయకుడు’ నిరాశపర్చదన్న నమ్మకంతో మాత్రం ఉన్నాడు. యన్‌టిఆర్ -కథానాయకుడు జనవరి 9న, మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదలవుతున్నాయి. విఖ్యాత నటుడు, రాజకీయ నేత నందమూరి తారక రామారావు జీవిత కథలోని ముఖ్య ఘట్టాలు కావటంతో ఇప్పటికే సినిమా కోసం ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. పైగా ఈ సినిమాలో నటిస్తున్న తారాగణం కూడా ఆసక్తి రేకెత్తించేదే. ఎన్టీఆర్ స్క్రీన్‌లైఫ్‌లోని ముఖ్యమైన సహా పాత్రలను స్టార్లు, సీనియర్లు పోషిస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కెవి రెడ్డి పాత్రను పోషిస్తుంటే, ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్ పోషిస్తుండటం తెలిసిందే. అక్కినేని మనవడు సుమంత్ ఏయన్నార్‌గా, ప్రకాష్‌రాజ్- నాగిరెడ్డి, బ్రహ్మానందం -రేలంగి, సత్యనారాయణ -హెచ్‌ఎం రెడ్డి, శుభలేక సుధాకర్ -పి పుల్లయ్య, ఎస్‌వి కృష్ణారెడ్డి -కమలాకర కామేశ్వర రావు, చంద్రసిద్ధార్థ -దాసరి నారాయణ రావు, ఎన్ శంకర్ -విఠలాచార్య, శ్రీనివాస్ అవసరాల -డివి నరసరాజు, రామజోగయ్య శాస్ర్తీ -సి నారాయణ రెడ్డి, శివశంకర్ మాస్టర్ -వెంపటి చినసత్యం, కమెడియన్ భద్రం -పేకేటి శివరామ్ కనిపించనున్నారు. ఎన్టీఆర్‌తో జోడీకట్టి సెనే్సషన్ సృష్టించిన ఆనాటి హీరోయిన్ల జాబితాలో సావిత్రిగా నిత్యమీనన్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, కృష్ణకుమారిగా ప్రణీతా సుభాష్, ప్రభగా శ్రీయ, జయప్రదగా హన్సిక, షావుకారు జానకిగా షాలినీ పాండే, జయసుధగా పాయల్ రాజ్‌పుత్.. ఇలా ఒకరేమిటి ఎన్టీఆర్ హీరోయిన్లను వరుసపెట్టి చూసే అవకాశం కలగడం విశేషం.
ఇక రంగస్థలం చిత్రం తర్వాత చరణ్ స్ట్రేచర్ బాగా మారింది. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ చిత్రం కావడం ఒకటైతే -అందులో చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్‌చరణ్ విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. నటుడిగా నైపుణ్యాన్ని, పరిపూర్ణతను చూపించటంలో కృతకృత్యుడయ్యాడు. అలాంటి సినిమా తరువాత మరో క్లాసిక్ టైటిల్‌తో వస్తున్నాడు రామ్‌చరణ్.
అదే -వినయ విధేయ రామ. దీంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు పేరుకున్నాయి. మాస్ సినిమాల దర్శకుడిగా పేరుబడిన బోయపాటి -క్లాసిక్ టైటిల్ ఫిక్స్ చేయడం ఒకరకమైన ఆసక్తి అయితే.. పోస్టర్లు, ప్రమోషన్ టీజర్లు, ట్రైలర్లలో లోడెడ్ యాక్షన్ సీన్లు చూపిస్తుండటం మరోరకమైన ఆసక్తి. ఈ కాంట్రాస్ట్ కిక్కు సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించనుందోనన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతుంది. మరోపక్క గడ ఏడాది మహేష్ చేసిన భరత్ అను నేను చిత్రంలో తెలుగు ఆడియన్స్‌ని మురిపించిన కైరా అద్వానీ -ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది. డ్యాన్స్‌ల్లో చరణ్‌ను మెప్పించిన కైరా -అమాయక సీత పాత్రతో కుర్రకారుని కట్టిపడేస్తుందనే అంటున్నారు. మరో ముఖ్యపాత్ర చేస్తున్న వివేక్ ఓబెరాయ్ కూడా చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. వినయ విధేయ రామ సినిమా జనవరి 11న విడుదలవుతోంది. పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం భారీగా విడుదలకు సన్నాహాలు చేసేశారు. ఇక అచ్చమైన సంక్రాంతి సినిమా వస్తున్న చిత్రం -ఎఫ్2. మల్టీస్టారర్ చిత్రంగా పండుగ వినోదాన్ని పంచే కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఎఫ్-2వైపూ ఆడియన్స్ ఆశగా చూస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను ఎప్పుడూ వదిలిపెట్టని నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్‌ల కాంబోలో అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్-2 జనవరి 12న థియేటర్లకు వస్తుంది. పెళ్లికి ముందు -పెళ్లి తర్వాత మగాడి లైఫ్‌పై సెటైరిక్ కానె్సప్ట్‌తో ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించినట్టు చిత్రబృందం చెబుతోంది. సంక్రాంతి పండుగకు అల్లుళ్లు
వస్తున్నారంటూ ఇప్పటికే ప్రచార దుమారం లేపింది. ట్రైలర్‌కూ అనూహ్య రెస్పాన్స్ రావడంతో, పండగ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తంమీద సంక్రాంతి సీజన్‌లో ఈ మూడు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలూ ఎలాంటి ఆనందాన్ని పంచుతాయో చూడాలి.
భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో -ప్రమోషన్ విషయంలో ఎవరి దుమ్ము వాళ్లు దులిపేశారు. పండుగ ఆనందాన్ని పంచి, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడంలో ఎవరు ముందు నిలుస్తారో చూడాలి. సంక్రాంతి సినిమాలు థియేటర్లనుంచి కదలగానే, బరిని బర్తీ చేయడానికి మరికొన్ని సినిమాలు క్యూలో ఉన్నాయి.
తొలి రెండు ప్రాజెక్టులు నిరాశపర్చడంతో కొంత గ్యాప్ తరువాత జనవరి సీజన్‌లో వస్తున్నాడు అక్కినేని చిన్నోడు అఖిల్. మిస్టర్ మజ్నుగా ఆడియన్స్‌ని పలకరించేందుకు వస్తున్న అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులూ ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా హిట్టు కొట్టేందుకు అఖిల్ తనవంతు కష్టపడ్డాడని చిత్ర బృందం చెబుతోంది. అలాగే హీరో నిఖిల్ సైతం బాక్సాఫీస్ వద్ద తనదైన ‘ముద్ర’ వేయడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి గత ఏడాది చివరి చిత్రంగా ‘ముద్ర’ రావాల్సి ఉన్నప్పటికీ, పెద్ద చిత్రాల అడ్డుతో దారి తప్పుకోవడం తెలిసిందే. సో, కొత్త ఏడాదిలో నిఖిల్ తన అదృష్టంపై ఎలాంటి ‘ముద్ర’ వేస్తాడో చూడాలి. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జీవిత కథతో తెరకెక్కిన ‘యాత్ర’ కూడా ప్రేక్షకులను, అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి టైటిల్ పాత్రలో నటించడంతో ట్రేడ్‌వర్గాల్లో ఓ రేంజ్ బుజ్ క్రియేటైంది. వీటితోపాటు అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ చిత్రం కూడా లైన్‌లో ఉంది.
ఇక అనువాద చిత్రాలుగా సంక్రాంతి రేసులో రెండు పెద్ద చిత్రాలు నిలిచాయి. స్ట్రెయిల్ తెలుగు చిత్రాల హీరోలను మించి క్రేజ్ తెచ్చుకున్న అనువాద హీరోలిద్దరూ పండుగపై ఎలాంటి ప్రభావం చూపిస్తారోనన్న ఆసక్తి లేకపోలేదు. అందులో ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘పేట’. ఈనెల 10న రజనీ థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాడు. దాదాపు 24ఏళ్ల తరువాత తెలుగు సంక్రాంతికి వస్తున్న రజనీ సినిమా ఇది. అప్పట్లో బాషా చిత్రంతో సంక్రాంతి బరిలోకి వచ్చిన రజనీ -తరువాత వరుస హిట్లు అందుకుని తన రేంజ్‌ని ప్రదర్శించాడు. అరుణాచలం, చంద్రముఖి, రోబోలాంటి హిట్లతో తన స్టయిల్ ప్రతాపం చూపించాడు. అదే ఊపుతో తరువాత వచ్చిన చిత్రాలు కొచ్చాడయాన్, కబాలి, కాలాలాంటి చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాయి. అందుకే సెంటిమెంట్‌గా మరోసారి తన సత్తా చాటేందుకు ఇప్పుడు సంక్రాంతి రేసులోకి దిగాడు రజనీ. ఇక శివ దర్శకత్వంలోని ప్రాజెక్టుతో తెలుగు ప్రజల అభిమానంపై తన ‘విశ్వాసాన్ని’ చూపించడానికి వస్తున్నాడు స్టార్ హీరో అజిత్. దాదాపు ఆరేళ్ల తరువాత అజిత్‌తో జోడీకట్టింది స్టార్ హీరోయిన్ నయనతార. 2013లో ఆరంభం తరువాత -వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఇది కాకుండా పండుగ రేస్‌లోకి బాలీవుడ్‌నుంచీ ఓ సినిమా వస్తోంది. అది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న బయోపిక్ -ది యాక్సిడెంటల్ మన్మోహన్. జనవరి 11 ఈ సినిమా థియేటర్లకు రానుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాల సమాహారంగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదల తరువాత చిత్రం వివాదాస్పదం కావడంతో విడుదలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మన్మోహన్ ప్రతిష్టకు మచ్చతెచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. న్యాయబద్ధంగా సినిమాను అడ్డుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. విడుదలకు సిద్ధమైన క్షణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్’ చిత్రంలో ఏం చూపించబోతున్నారోనన్న ఆసక్తి ఆడియన్స్‌లో మొదలైంది. ఇక జనవరి సీజన్‌లోనే బాలీవుడ్ నుంచి వస్తోన్న మరో చారిత్రక బయోపిక్ మణికర్ణిక. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించి, కొంత భాగానికి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టువైపూ ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

-శ్రీనివాస్ ఆర్ రావ్