మెయిన్ ఫీచర్

అలా ముగిసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరెవర్ని ఓడించారు? ఎవరు స్టార్‌హీరోగా నిలబడ్డారు? ఏ నటి ఎక్కువ సినిమాలు చేసింది. ఏ బ్యూటీ కనుమరుగైపోయింది? ఏ దర్శకుడు దుమ్ము దులిపాడు? ఏ దర్శకుడు ఫ్లాపులిచ్చాడు? లాంటి లెక్కలు ఒకప్పుడు. ఇప్పటి చిత్ర పరిశ్రమ తీరు వేరు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులే కాదు.. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లో ఎవరి పనితనాన్ని వాళ్లు చూపించే సాహసాలు చేస్తున్నారు. వైవిధ్యాన్ని వెతుకుతున్నారు. ప్రయోగాలకు పదును పెడుతున్నారు. వినోదాన్ని వెతుక్కుంటూ థియేటర్లకు వెళ్తున్న ఆడియన్స్‌కి ఏదోక కొత్త విందు అందించాలన్న తాపత్రయం చూపిస్తున్నారు. అది ఈ ఏడాది ఒకింత ఎక్కువే కనిపించింది. ఎప్పటిలాగానే ఈ ఏడాదీ సుమారుగా 150 సినిమాలొచ్చి పదిహేను సినిమాల వరకే గుర్తుండిపోయే స్థాయిని సంపాదించాయి. కాకపోతే, ఫ్లాపైన సినిమాలు, మోస్తరు దగ్గరే ఆగిన సినిమాలను తీసిపారేయలేం. ఆడియన్స్ ఆదరణకు నోచుకోనంత మాత్రాన -ఆ సినిమాలోని ఆలోచన గొప్పది కాదనలేం. ఈ ఏడాదిలో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేని సినిమాలు ఎక్కువే అయినా, వాటిని తెరకెక్కించిన టీం ప్రయత్నం చెప్పుకోదగ్గదిగానే ఉండటం విశేషం. హిట్టందుకున్న వాళ్లు సరే.. ఫ్లాపులిచ్చిన వాళ్లూ నిరుత్సాహానికి గురికాకుండా కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ‘వైవిధ్యమైన విందు’ ఆడియన్స్‌కి అందిస్తారని ఆశిద్దాం. అయితే, ఈ ఏడాదిలో సినిమా జమా లెక్కల్ని ఒక్కసారి సమీక్షించుకుంటే..
*
కొంతకాలంగా ప్రిన్స్ సక్సెస్ రేట్ చిత్రంగా నడుస్తోంది. సీతమ్మవాకిట్లో.. తరువాత నేనొక్కడినే, ఆగడు చిత్రాల వైఫల్యాన్ని రుచి చూసిన మహేష్ మళ్లీ శ్రీమంతుడుతో ఫాంలోకి వచ్చేశాడు. తరువాత వచ్చిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు పరాజయాలు రుచి చూపిస్తే -కొరటాల శివతో చేసిన భరత్ అను నేను.. చిత్రం మళ్లీ ఫాంలోకి తీసుకొచ్చింది.
*
బృందావనం నుంచి రభస వరకూ బ్లాక్‌బస్టర్ హిట్టుని రుచిచూడని జూ.ఎన్టీఆర్ ఫేట్ టెంపర్ నుంచి మారిపోయంది. మధ్యలో జై లవకుశ చిత్రం కాస్త నిరాశపర్చినా -నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్లే అందుకున్నాడు. ఈ ఏడాది ట్రెండ్‌ను రిపీట్ చేస్తూ త్రివిక్రమ్‌తో చేసిన అరవింద సమేత.. ఎన్టీఆర్ స్థానాన్ని పదిలం చేసింది.
*
సినిమా ఫలితాన్ని కాసేపు పక్కన పెడితే -దర్శకుడు సంకల్ప్ అంతరిక్ష ప్రయోగాన్ని ఈ ఏడాది వైవిధ్య ప్రయత్నంగా గుర్తు పెట్టుకోక తప్పదు. తెలుగు స్క్రీన్‌పై ఊహకు కూడా అందని అంతరిక్ష సన్నివేశాలను ఆడియన్స్‌కు అందించటంలో విజయం సాధించాడు. ఆ పాత్రలో వరుణ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ మెచ్చదగ్గదే.
*
ఈ ఏడాది బ్యూటీ ఆఫ్ ది స్టార్ అంటే కీర్తిసురేష్‌నే చూపించాలి. దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ఆమె చేసిన సావిత్రి పోట్రెయట్ -కెరీర్‌లో ఓ అద్భుతం. మహానటిని మరోసారి చూస్తున్నామన్న భావన కలిగించింది.
తెలుగు సినిమాకు కొత్త ఫార్మాట్ క్రియేట్ చేశాడు కుర్ర దర్శకుడు వెంకటేష్ మహా. పడిగటు సినిమాను పక్కనపెట్టి మదికి తోచింది మనసుకు హత్తకునేలా చూపించడమే సినిమా అనే కొత్త నిర్వచనాన్ని కేరాఫ్ కంచరపాలెంతో రుచి చూపించాడు. ఈ ఏడాదిలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే ఇదే. వెంకటేష్‌ను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే ఏడాది కోసం ఎన్నో ఇలాంటి సినిమాలు తయారవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
*
ఈ ఏడాది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ వీళ్లిద్దరే. పెళ్లి చూపులు చిత్రంలో చాలా అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ సెలెక్టెడ్ చిత్రాలతో స్టార్ హీరోల రేంజ్‌కు చేరిపోయాడు. గతేడాది అర్జున్‌రెడ్డితో సెనే్సషన్ క్రియేట్ చేస్తే, ఈ ఏడాది గీత గోవిందం చిత్రంతో దాన్ని నిలబెట్టుకున్నాడు. వర్సటైల్ ఆర్టిస్ టగా యూత్‌లో పిచ్చి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఇమేజ్‌ను చిన్నాచితకా ఫ్లాపులు ఏమీ చేయలేకపోయాయ. ఇక రష్మిక మండన యూత్‌కు ఓ ఫాంటసీ ఫాన్. ఒకట్రెండ్ చిత్రాలతోనే తనకంటూ ట్రెండ్ సెట్ చేసుకున్న రష్మిక కొత్త ఏడాదిలో చేసే సినిమాలతో స్టార్ హీరోయన్ రేంజ్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
*
ఏప్రిల్ నెల వస్తే ఫైనాన్షియల్ ఇయర్. జూన్ మాసమొస్తే అకాడమిక్ ఇయర్. మరి జనవరి నెలవస్తే -చలన చిత్ర పరిశ్రమలో పందెంకోళ్లు బరిలోకి దిగుతాయి. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలతోపాటు తక్కువలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలూ భారీ భారీ అంచనాలతోనే సంక్రాంతి బరిలో నిలుస్తాయి. ఒకవిధంగా చెప్పాలంటే విడుదల చేయ్యడానికి థియేటర్లు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దొరకవు. వందల కోట్లతో పెద్ద పెద్ద నిర్మాతలు, పేరున్న దర్శకులు, మల్టీస్టారర్ సినిమాలు నిర్మించిన వారు ముందుగానే కావలసినన్ని థియేటర్లు తమ చేతిలో పెట్టుకుంటారు. చిన్న సినిమాలు తీసిన నిర్మాతలు కనీసం తమ సినిమాలోని కథేంటో, మెసేజేంటో ప్రేక్షకులకు తెలియాలని, అందులోని విషయం అర్ధంకావాలని ఎంతో తాపత్రయంతో కనీసం పదుల సంఖ్యలోనైనా విడుదల చేయాలని భావించడం తప్పు కాదుకదా. అయినప్పటికీ అన్ని థియేటర్లు కూడా దొరకని పరస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. మల్టీస్టారర్ సినిమాలు ప్రపంచమంతటా విడదలై కోట్లు వసూలు చేస్తుంటే, చిన్ని సినిమాలు పెట్టిన పెట్టుబడి కూడా వసూలు చేయలేక పోవడం విధితమే. ప్రతి ఏటా కొత్త సంవత్సరం వస్తుందే చాలు హడావిడిగా సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దర్శక నిర్మాత సమయానికి మించి కష్టపడుతుంటాడు. నటీనటులు కఃడా అందుకు తగినట్టే సహకరిస్తారు. ఎందుకంటే వాళ్లకు కూడా తాము నటించిన చిత్రం సంక్రాంతి బరిలో నిలవాలని, గెలవాలని ఉంటుంది కదా. అయితే ఇక 2018 సంవత్సరం విషయానికొస్తే ఏడాది మొత్తంమీద విడుదలైన చిత్రాలు దాదాపు నూటికి పైమాటే. కానీ అందులో సక్సెస్ సాధించినవి మాత్రం పదుల్లోనే ఉన్నాయి. సినిమాలంటేనే జయాపజయాలుంటాయి. కానీ ఈ 2018లో మాదిరిగా ఎన్నడూ జరగలేదని చెప్పవచ్చు. దాదాపు ఒకే నెలలో పది సినిమాలు విడుదలైతే, అందులో ఒకటో రెండో ప్రేక్షకులకు దగ్గరయ్యాయని చెప్పవచ్చు. అంతకుమించి అన్నీ సంతృప్తినిచ్చాయని చెబితే కనుక తప్పులో కాలేసినట్టే.
జనవరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం పాలైతే, బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘జై సింహా’ అదే బాట పట్టింది. ఇదే వరుసలో చిలుకూరు బాలాజీ, రంగుల రాట్నం, 3ముఖి, ఇగోలాంటి చిత్రాలు ప్రేక్షకులకు తెలియకుండానే వెళ్లిపోయాయి. నెల చివర్లో వచ్చిన అనుష్క ‘భాగమతి’, నాగశౌర్య ‘చలో’ చిత్రాలు మాత్రమే ఒకింత ఫలితాన్ని అందించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకున్నాయి.
ఫిబ్రవరిలో పదిహేను వరకూ చిత్రాలు విడుదలైనా, వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ తప్ప -పధ్నాలుగు చిత్రాలూ పరాజయాల బాటపట్టాయి. రవితేజ ‘టచ్ చేసి చూడు’, మోహన్‌బాబు ‘గాయత్రి’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’.. అదే క్రమంలో హౌరాబ్రిడ్జి, ఇదే నా లవ్ స్టోరీ,
మనసుకు నచ్చింది, రచయిత, సోడా గోలీసోడా, చల్తే చల్తే, హైదరాబాద్ లవ్ స్టోరీ, జువ్వ, రారా చిత్రాలన్నీ తుస్సుమన్నాయి.
మార్చిలోనూ 13 చిత్రాల వరకూ థియేటర్లలో సందడి చేసేందుకు ప్రయత్నించినా ఫలం దక్కలేదు. సుకుమార్ -రామ్‌చరణ్ క్రేజీ ప్రాజెక్టుగా వచ్చిన రంగస్థలం ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే -మిగిలిన పనె్నండూ (ఏం మంత్రం వేశావే, ఐతే 2.0, కిర్రాక్ పార్టీ, నెల్లూరి పెద్దారెడ్డి, వదిన, మనసైనోడు, అనగనగా ఒక ఊళ్లో, ఎమ్మెల్యే, నీదీ నాదీ ఒకే కథ, రాజరథమ్) సోదిలో లేకుండా పోయాయి.
ఏప్రిల్ నెలలోనూ ఇబ్బదిముబ్బడిగానే చిత్రాలొచ్చాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మహేష్‌ను చూపిస్తూ కొరటాల తెరకెక్కించిన ‘భరత్ అను నేను..’ చిత్రం తప్ప, మిగిలినవన్నీ తీవ్ర నిరాశ మిగిల్చాయి. వీటిలో త్రివిక్రమ్, పవన్‌కళ్యాణ్ నిర్మాణ సారథ్యంలో కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చల్‌మోహన్ రంగ’ నుంచి, సత్యగ్యాంగ్, అమీర్‌పేట 2 అమెరికా, నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం, ప్రభుదేవా ‘మెర్క్యురీ’, మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’, సాయిపల్లవి ‘కణం’, ఎందరో మహానుభావులు, జంక్షన్‌లో జయమాలిని చిత్రాలు ఆడియన్స్‌ను ఏమాత్రం మెప్పించలేక చతికిలపడ్డాయి.
సమ్మర్ వెకేషన్ సీజన్ మేనెలలో తెలుగు సినీ పరిశ్రమ చాలా విశేషాలే చూసింది. మాటల రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం చేపట్టి అల్లు అర్జున్‌తో నిర్మించిన ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ను ఆడియన్స్ తిప్పికొడితే, కీర్తి సురేష్ లీడ్‌రోల్‌లో తొలిసారి నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి జీవిత ఘట్టం ‘మహానటి’ అద్భుతాలు సృష్టించింది. ఇక ఎన్నో హిట్టు చిత్రాలను తీసిన అనుభవజ్ఞుడు పూరి జగన్నాథ్ కొడుకును హీరోగా నిలబెట్టేందుకు చేసిన ‘మెహబూబా’ డిజాస్టర్‌గా మిగిలింది. రవితేజ ‘నేలటిక్కెట్టు’, నాగశౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రాలనూ ఆడియన్స్ తిప్పికొట్టడం ఇంకో విశేషం. ఇక అన్నదాతా సుఖీభవ, శీనుగాడి ప్రేమకథలాంటి చిత్రాలూ ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్లాయో తెలీకుండా పోయింది.
జూన్ ఆరంభంలోనే ‘ఆఫీసర్’తో ఇండస్ట్రీకి బౌన్సర్ పడిది. రామ్‌గోపాల్‌వర్మ -నాగార్జున కాంబోగా వచ్చిన చిత్రం దారుణ పరజయాన్ని చవిచూస్తే, రాజ్‌తరుణ్ ‘రాజుగాడు’, కళ్యాణ్‌రామ్ ‘నానువ్వే’ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడిపంబ’, బెస్ట్‌లవర్స్, సంజీవిని, శంభోశంకర చిత్రాలు ఠపాకట్టేశాయి. తరుణ్‌భాస్కర్ ‘ఈనగరానికేమైంది’ ఒకింత ఆలోచించాల్సిన చిత్రంగా నిలిస్తే, ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆదితీరావ్ హైదరి జంటగా వచ్చిన ‘సమ్మోహనం’ ఓకే అనిపించుకుంది.
ఆరు నెలల కాలంలో అరవై సినిమాలు థియేటర్లకు వస్తే -హిట్టనిపించుకున్నవి మాడో నాలుగో. ఫరవాలేదనిపించుకున్న చిత్రాలూ ఐదో ఆరో. అంటే 85శాతం సినిమాల కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.
జూలై మాసం మొత్తంమీద కార్తికేయ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్‌ఎక్స్ 100 బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిస్తే -గోపీచంద్ ‘పంతం’, సాయిధరమ్ ‘తేజ్ ఐ లవ్ యూ’, చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ ‘విజేత’ సహా అఘోరా, దివ్యమణి, ఆటగదరా శివ, లవర్, వైఫ్ ఆఫ్ రామ్, బెల్లంకొండ ‘సాక్ష్యం’, హ్యాపీవెడ్డింగ్ చిత్రాలన్నీ పులుసులో కలిసిపోయాయి.
ఆగస్టు మాసంలో తక్కువ చిత్రాలే థియేటర్లకు వచ్చినా -కథ అందించిన అడవి శేష్ హీరోగా శశికిరణ్ తెరకెక్కించిన ‘గూఢచారి’ మాత్రమే డిటెక్టివ్ చిత్రంగా మంచి ఫలితం రాబట్టింది. బ్రాండ్‌బాబు, దేవీ విగ్రహం, శివకాశీపురం, తరువత ఎవరు? చిత్రాలు ఢమాల్‌మంటే, హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చి.ల.సౌ ఓకే అనిపించుకుంది.
ఆగస్టు మాసంలో నితిన్ రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా భారీ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించిన ‘శ్రీనివాస కళ్యాణం’ అనూహ్య పరాజయం అందిస్తే, విజయ్ దేవరకొండ -రష్మిక మండన్న జోడీగా పరిశురామ్ తెరకెక్కించిన ‘గీత గోవిందం’ సెనే్సషనల్ హిట్టయ్యింది. ఇక ఆటగాళ్లు, అంతకుముందు, నీవెవరో, సూపర్ స్కెచ్, అట్ నర్తనశాల, పేపర్‌బోయ్, సమీరంలాంటి చిత్రాలు థియేటర్ల వద్ద బొక్కబోర్లాపడ్డాయి.
సెప్టెంబర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అద్భుతానికి బీజం పడింది. కంచరపాలెం అనే ఊరిని తీసుకుని, జనానే్న ఆర్టిస్టులను చేసి యధార్థ ప్రేమ కథలకు ఒకింత డ్రామా మేళవించి కొత్త దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ప్రయోగం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సినిమాయే కేరాఫ్ కంచరపాలెం. ఈ ఏడాది ఈ ప్రయోగం హిట్టవ్వడంతో, కొత్త దర్శకులు అతి తక్కువ బడ్జెట్‌తో మరిన్ని ప్రయోగాలకు సాహసం చేయడానికి ఉపక్రమించారు. ఈనెల్లోనూ పదిహేను వరకూ చిత్రాలు థియేటర్లకు వచ్చినా -చప్పుడు చేయకుండా తిరిగి వెళ్లిపోయిన చిత్రాలే ఎక్కువ. అనువంశికత, మను, ప్రేమకు రెయిన్‌చెక్, సిల్లీఫెలోస్, ఎందుకో ఏమో, మసక్కలి, శైలజారెడ్డి అల్లుడు, యు-టర్న్, ఈ మాయ పేరేమిటో, అంతర్వేదం, నన్నుదోచుకుందువటె, దేవదాస్, నాటకం చిత్రాలు సెప్టెంబర్‌లో వచ్చినవే. అయితే ఒకటి రెండు చిత్రాలు ఫరవాలేదనిపిస్తే, ఒకటి రెండు చిత్రాలు ఆలోచింపచేసే చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. మిగిలిన చిత్రాలు మాత్రం ఊసే లేకుండా పోయాయి.
అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ వసూళ్లు రాబట్టినా ప్రేక్షకాదరణ దక్కలేదు. దసరాను టార్గెట్ చేస్తూ జూ.ఎన్టీఆర్, పూజాహెగ్దె హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ చేసిన ఫ్యాక్షన్ మాయ ‘అరవింద సమేత వీర రాఘవ’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. తమన్ సంగీతం సినిమాను ఓ రేంజ్‌కి తీసుకెళ్లి కలెక్షన్లు కురిపించింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో హీరో రామ్‌తో దిల్‌రాజు నిర్మించిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం కూడా బాగానే వసూలు చేసింది. దేశంలో దొంగలుపడ్డారు, భలేమంచి చౌకబేరమ్, మూడుపువ్వులు ఆరుకాయలు, 2ఫ్రెండ్స్, బంగారి బాలరాజు, రథమ్, వీరభోగ వసంతరాయులు చిత్రాలు తేలిపోయాయి.
నవంబర్‌లో మైత్రీమూవీస్ నిర్మించిన ‘సవ్యసాచి’తో నాగచైతన్య ఓ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రవిబాబు ‘పందిపిల్ల’తో ఎవరికీ అర్థంకాని ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు. ఫ్లాపుల కసినుంచి కొత్త ఎనర్జీతో రవితేజ చేసిన అమర్-అక్బర్-ఆంటోనీ చిత్రాన్నీ ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఈ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని చూసిన ఇలియానాకు ఆదరణ దక్కలేదు. విజయ్ దేవరకొండను సక్సెస్‌ఫుల్ హీరోగా ‘టాక్సీవాలా’ నిలిబెడితే -దేశదిమ్మరి, కథానాయకులు, కర్త కర్మ క్రియ, శరభ, 24 కిసెస్, లా, రంగు, రూల్‌లాంటి చిత్రాలు ఆడియన్స్ వెక్కిరింతకు గురికాక తప్పలేదు.
ఏడాది పూర్తవుతుండటంతో డిసెంబర్ మాసంలోనూ ఎన్నో చిత్రాలు థియేటర్ల వద్ద క్యూగట్టాయి కానీ ఫలితాన్ని కూడబెట్టలేకపోయాయి. ప్రయోగాత్మక చిత్రాలు, సైంటిఫిక్ చిత్రాలు, చిత్రమైన సినిమాలుగా వచ్చినా ఆడియన్స్ మెప్పు వాటికి దక్కలేదు. ఈ మాసంలో ఆపరేషన్ 2019, కవచం, నెక్ట్స్ ఏంటి?, శుభలేఖ+లు, భైరవగీత, హుషారు, బ్లఫ్‌మాస్టర్, మంచుకురిసే వేళలో చిత్రాలకు ఆడియన్స్ మెప్పు లభించలేదు. ఘాజీ ఫేమ్ సంకల్ప్ తీసిన రోదసి బ్యాక్‌డ్రాప్ చిత్రం అంతరిక్షం ఫరవాలేదనిపించుకుంటే, సుమంత్ చేసిన థ్రిల్లర్ సుబ్రహ్మణ్యపురం పెదవి విరుపులకు గురైంది. లవ్ స్టోరీస్ స్పెషలిస్టు అనిపించుకున్న హను రాఘవపూడి హీరో శర్వానంద్‌తో తెరకెక్కించిన పడిపడి లేచె మనసు కూడా అసంతృప్తినే మిగిల్చింది. ఇక అనువాద చిత్రాలుగా వచ్చిన మారి-2, కెజీఎఫ్ చిత్రాలకూ ఆదరణ దక్కలేదు. కొత్త ఏడాదిలోనైనా ఆడియన్స్ ఆదరణ చూరగొనే చిత్రాలు ఎక్కువ వస్తాయని ఆశిద్దాం. *

-శ్రీనివాస్ పర్వతాల