మెయిన్ ఫీచర్

మాయమైనారమ్మా.. మహిళాభిమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగువ మనసు మార్చతరమా? అంటే కష్టమంటారు అనుభవజ్ఞులు. సొగసు ఎంత గొప్పదో, మనసు అంత మెత్తన. అందుకే మగువల -దృఢ నిర్ణయాలూ శక్తిమంతంగా ఉంటాయన్నది ఎప్పటికీ నిలిచే మాట. ఇక సూటిగా విషయానికొస్తే తెలుగు పరిశ్రమలో కుటుంబ కథా చిత్రాలకు కాలం చెల్లిపోవడానికి కారణం మగువలు ఆదరించే గొప్ప చిత్రాలు రాకపోవడమేనన్నది ఒక వాదన. వాళ్లకునచ్చే, వాళ్లు మెచ్చే రీతిలో కుటుంబ కథా చిత్రాలు స్వర్ణయుగం ముగింపులోనే ఆగిపోవడంతో -క్రమంగా సినిమాల తీరు మారిపోయిందన్నది ఒక థియరీ.
*
ఫ్యాన్ మెయల్ గురించి గొప్పలు చెప్పుకునే స్టార్ హీరోలు -వాళ్లకున్న అభిమానుల్లో మహిళాభిమానులు ఎంతమంది? అంటే నోరెళ్లబెట్టాల్సిందే. ముందుతరం హీరోలకు విపరీతమైన మహిళాభిమానులు ఉండేవారు కనుక -వాళ్లు చేసిన ప్రతి చిత్రమూ విజయం సాధించింది. కేవలం మహిళల ఆదరణ కోసమే కుటుంబ కథా చిత్రాలనూ అప్పటి హీరోలు చేశారు. నటులుగా చిరస్థాయగా నిలిచారు.
*
కుటుంబ కథా చిత్రాలపట్ల గొప్ప ఆదరణ ప్రదర్శించి తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేదీప్యంగా వెలిగేలా చేసింది నిజానికి మహిళామణులే. ముఖ్యంగా మధ్య తరగతివర్గం. మధ్యతరగతి కుటుంబ కథా చిత్రాలను ఆదరించి, నటీనటులకు గొప్ప అవకాశాలు కల్పించారు. స్క్రీన్‌మీద కనిపించే కష్టాలు, కన్నీళ్లు, బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు తమవి చేసుకుని భావోద్వేగాలకు గురై -గొప్ప చిత్రాలుగా విజయాలు అందించారు. అనాటి కథలను ఒక్కసారి తడిమి చూస్తే -ఉమ్మడి కుటుంబాల్లోని అన్నదమ్ములు, ఆడపడుచులు, పిల్లలు, అత్తమామలు తోటికోడళ్లు, వీరందరికీ సపర్యలు, వంటలు వగైరాలన్నీ కనిపిస్తాయి. ఇలాంటి చిత్రాలకు ఒకప్పుడు విపరీతమైన క్రేజ్. కాలం మారింది. సినిమా మారుతోంది. మధ్య తరగతి జీవితాలకు దగ్గరగా ఉండే కథలకు తావులేకుండా పోయింది.
ఒకప్పుడు -కుటుంబ కథలతో వచ్చే చిత్రాలను ఆదరించి అక్కున చేర్చుకుని విజయావకాశాలు కల్పించింది మహిళాభిమానులే. అందుకే అలనాటితరం నటులుగా చెప్పుకునే ఎస్వీయార్, ఎన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, గుమ్మడి, కాంతారావులాంటి నటులు మహిళాభిమానులను ఆకట్టుకునే కథలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. ఇంటి పెద్దగా బాధ్యతలు మోస్తూ కుటుంబ కథాచిత్రాల ద్వారా మంచి మెసేజ్ ఇచ్చేవారు. నటులే కాదు, నటీమణులూ కుటుంబ కథల్లో మెప్పించినవారు లేకపోలేదు. అణకువైన చెల్లిగా, ఉత్తమ ఇల్లాలిగా, ప్రేమచూపే తల్లిగా.. గొప్ప పాత్రలు పోషించేవారు. అలాంటివారిలో సావిత్రి, జమున, కృష్ణకుమారి, భానుమతి, దేవిక, కన్నాంబలాంటి గొప్ప నటులను ఉదహరించుకోవచ్చు. తరువాతి జనరేషన్స్‌లో కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, మురళీమోహన్, మోహన్‌బాబు, చంద్రమోహన్ లాంటి నటులూ మధ్య తరగతి కథలు, కుటుంబ చిత్రాలకే ప్రాధాన్యతనిచ్చారు. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. అందుకే వీరికీ మహిళాదరణ తక్కువేం కాదు. వీరిలో ఆంధ్రుల అందగాడిగా శోభన్‌బాబు మహిళా ప్రేక్షకుల మనసుల్లో గొప్పస్థానాన్ని సంపాదించాడు. శోభన్‌బాబు సరసన శారద, వాణిశ్రీలు కనిపిస్తే -సినిమా కాదు జీవితమనేంత ఉదాత్తమైన భావన కలిగేది. ప్రేమకథా చిత్రాల్లోనూ శోభన్‌బాబు తన నట కౌశలాన్ని ప్రదర్శించి మహిళాభిమానులను ఆకట్టుకోగలిగాడు. ‘గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం’ అన్న పాటలో ప్రేమవేదనలోని భావోద్వేగాన్ని ఆయన ప్రదర్శించిన తీరుకు -కంటతడిపెట్టని మహిళలు లేరంటే అతిశయోక్తి కాదు. రెండో తరంలోని హీరోలంతా -డాక్టర్లుగా, లాయర్లుగా, పోలీస్ అధికార్లుగా, న్యాయమూర్తులుగా.. చిరుద్యోగి భర్తగా.. ఇలా ఏ పాత్రలో నటించినా మహిళల నుంచి ఆదరణ పొందని వారు లేరు. ఇక కృష్ణ, మురళీమోహన్, కృష్ణంరాజు, చంద్రమోహన్, మోహన్‌బాబు.. ఇలా ఆ తరంలోనూ నటులుగా చెప్పుకోడానికి కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు. వైవిధ్యమైన నటన, హావభావాలు, మేనరిజమ్స్.. ఇలా చేసిన ప్రతి సినిమాలోనూ ఓ వెరైటీ. అందుకే -ఆ తరం నటులు చేసిన సినిమాల్లో ఫ్లాపులు తక్కువ, విజయాలు ఎక్కువ. ఇన్ని చేసినా -ఎక్కువ శాతం చిత్రాలు ఉమ్మడి కుటుంబ కథలో, ఫ్యామిలీ స్టోరీలో ఉండేవి.
క్రమంగా కుటుంబ కథలు కనుమరుగైన తరువాతా -రాజేంద్రప్రసాద్, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, సుమన్, శ్రీకాంత్, సురేష్, వినోద్‌కుమార్‌లాంటి హీరోలు రెండుతరాల నటులను మించి మహిళాభిమానులను సంపాదించుకున్నారు. రాజేంద్రప్రసాద్ సినిమాల్లో హాస్యానికే ప్రాధాన్యం. అలాంటిది ‘ఆ నలుగురు’ సినిమా ఆసాంతం బంధాలు, బాధ్యతలు, బ్రతుకుదెరువు, కుటుంబం, ఆర్థిక బాధలు, చివరకు కన్నబిడ్డలే ‘అప్పులు మాకు సంబంధంలేదు’ అని వదిలివేయడం లాంటి జీవిత సన్నివేశాలు ప్రేక్షకులను కంట తడిపెట్టించాయి. కారణం కథ జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండటమే. మేడమ్ సినిమాలో మహిళగా, ఏప్రిల్ ఒకటో తారీఖులో మధ్యతరగతి కుర్రాడిగా, ‘రాజేంద్రుడు- గజేంద్రుడు’లో తినడానికి తిండిలేకున్నా, గజరాజును సాకుతూ అవస్థలుపడే హీరోగా మహిళా ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు మంత్రముగ్ధుల్ని చేశాడు. ఆ సినిమా మచ్చుకే. అలాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో ఎన్నో. అందుకే అతని ఫ్యాన్ మెయిల్‌లో మహిళాభిమానులే ఎక్కువ. ఇక ‘విక్టరీ వెంకటేష్’ కెరీర్ మొదటినుంచీ ఫ్యామిలీ స్టోరీలకే ప్రాధాన్యత ఇచ్చాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూనే, మహిళాభిమానులను మెప్పించే కథలను ఎంపిక చేసుకోవడంలో వెంకటేష్ తన స్టయిల్‌ను కంటిన్యూ చేశాడు. ‘సుందరకాండ’ ‘ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు’ లాంటి చిత్రాలు మచ్చుతునకలు. అలాగే సుమన్, జగపతిబాబు, శ్రీకాంత్‌లాంటి హీరోలూ మహిళా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూనే ఎన్నో సినిమాలు చేశారు. ఫ్యామిలీ టైప్ చిత్రాలు చేయాలంటే -ఆప్షన్స్‌లేని హీరోలు ఎవరంటే జగపతిబాబు, శ్రీకాంత్ అన్నంతగా పేరు తెచ్చుకున్న సందర్భాలూ లేకపోలేదు.
**
మగువ మనసు లోతు కనుగొనడం కష్టం. అలాంటిది మహిళలను, మహిళాభిమానుల ఆదారాభిమానాలు సాధించడం అంత ఈజీ కాదు. ఆ మధ్య మీనా, వెంకటేష్ జంటగా వచ్చిన ‘దృశ్యం’ చిత్రానే్న తీసుకుందాం. మధ్యతరగతి కుటుంబాలను అమాంతం ఆకాశానికి ఎత్తింది. మధ్య తరగతి సౌమ్యుడికి కష్టమొచ్చి నిస్సహాయ స్థితిలో ఎలా రియాక్ట్ అవుతాడు, కుటుంబాన్ని నవ్వులపాలు కాకుండా ఎలా కాపాడుకుంటాడన్న కథతో వచ్చిన చిత్రం. ఫ్యామిలీ స్టోరీగా వచ్చిన ఆ చిత్రాన్ని మధ్యతరగతి వర్గాలు, మహిళలే ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. ఘన విజయాన్ని అందించారు. జీవితాన్ని ప్రతిబింబించే కథలతో వచ్చే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు విఫలమైన దాఖలాలు బహుతక్కువ. ఆ చిత్రాల్లో నటించే నటీనటులకూ ‘స్టార్ల’తో సమానంగా అభిమానులు లేకపోలేదు. కాకపోతే, స్టార్ చిత్రాలు విడుదలైనపుడు కనిపించే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్‌లు వీళ్లకు ఉండకపోవచ్చు. కానీ కథను, నటీనటులను ఆదరించి ఆశీర్వదించే ప్రేక్షకులు లేకపోలేదు. అభిమాన హీరో కొత్త సినిమా విడుదలైనపుడు తొలి రోజు షో కోసం బ్లాక్‌లో టిక్కెట్లు కొనిమరీ చూస్తారు. అంతటి అభిమానం ఉంటుంది. వీరాభిమానమూ ఉంటుంది. కానీ ఇదే కుటుంబ కథా చిత్రాలు విడుదలైనపుడు అలాంటి దృశ్యాలు కనిపించకపోవచ్చు. కాకపోతే, నాలుగురోజులు ఆగి అయినా కుటుంబమంతా సినిమాను ఆదరించి ఆస్వాదిస్తారు. మధ్యతరగతి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మహిళా ప్రేక్షకుల అభిమానం, ఆదరణ సాధించిన నటులు గొప్పవాళ్లు. ఇప్పుడైతే అలాంటి కథలూ లేవు. నటీనటులూ కనిపించడం లేదు. అందుకే -తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక వెలుగునిచ్చిన మహిళాభిమానులు ఇప్పుడు కూంబింగ్ చేసినా కనిపించరు. పెద్ద దర్శకులు, భారీ బ్యానర్లు ఇప్పటికీ కుటుంబ కథా చిత్రాలతో అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తున్నా డ్రామా ఎక్కువై విఫలమవుతున్నాయి. అదీ గొప్పింటి జీవితాల్లోని కథలనే సినిమాగా మలుస్తుండటంతో -మధ్యతరగతి నుంచి సరైన ఆదరణ లభించడం లేదనే చెప్పాలి. ఒకటో అరో చిత్రాలు మంచి ఫలితాన్ని రాబట్టినా -వాటి రుచి అప్పటికప్పుడే తప్పించి పదికాలాలు గుర్తుంచుకునే పరిస్థితి లేదన్నది కాదనిలేని వాస్తవం. తెలుగు పరిశ్రమ -మళ్లీ అలాంటి కథలు, జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలపై దృష్టి పెట్టక తప్పదు. మహిళలను మెప్పించగలిగితే -పరిశ్రమ పదికాలాలపాటు వర్థిల్లుతుందని అనడం కాదనలేని నిజం.

-శ్రీనివాస్ పర్వతాల