మెయిన్ ఫీచర్

వీళ్లు కూడ ఇంతే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** ఇదీ అంటూ ఓ కన్‌క్లూజన్‌కు రాలేని సందిగ్ధావస్థలో, ఏంచేయాలో అర్థంగాక, సాహసాలు చేయడానికి సిద్ధపడలేక, తాము చేస్తున్న ప్రతీదీ వైవిధ్యమేనన్న భ్రమలో నలిగిపోతున్న హీరోలే -ఈ కథనానికి అసలు కోణం. నిజానికి టాలీవుడ్‌లో ఇదే అసలు ట్రెండ్. దర్శకుడు చెప్పిన కథ విని స్టన్నయ్యామంటారు. 20నిమిషాలు వినాల్సిన కథను -మొదలుపెట్టిన తరువాత లేవకుండా వినేశామంటారు. ఒక్కసారి కథ వినగానే కనెక్టైపోయి ఓకే చెప్పేశామంటారు. ఇంతవరకూ తన కెరీర్‌లో చేయనటువంటి పాత్రను చేస్తున్నాననీ ఉప్పొంగిపోతారు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోడానికి దాదాపుగా రీసెర్చ్ చేశామంటారు. ఇన్ని ప్లస్సుల కలబోతగా సినిమా స్క్రీన్‌కు ఎక్కిన తరువాత ‘తుస్’మంటే చప్పుడు చేయరు. అంతా అంతేనా అంటే -ఔనని గట్టిగా చెప్పలేం. రొటీన్ హీరోల సంగతి? అంటే ఉన్నారని చెప్పకుండా ఉండలేం. అలాంటి వాళ్లెవరన్నది ఓ ప్రేక్షకుడి కోణంలో....
=========================

తెలుగు సినిమా తీరుమారతూ....నే ఉంది. కొత్త కథలను వెతికి పట్టడంలో ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఆ కథలను తెరకెక్కించేందుకూ మేకర్లూ వాళ్ల సాహసాలు వాళ్లు చేస్తూనే ఉన్నారు. హీరోయిజాన్ని కాసేపు పక్కనపెట్టి -అలాంటి కథల్లో నటించి సత్తా చాటుకోడానికి స్టార్ల నుంచి సార్ల వరకూ డేట్లూ, కాల్షీట్లూ ఇస్తున్నారు. ఇలా పెద్ద సినిమాలొస్తున్నాయి. భారీ సినిమాలూ తెరకెక్కుతున్నాయి. ఇక చిన్న సినిమాలూ వాటి మానాన అవి వస్తూనే ఉన్నాయి. ఉనికి కాపాడుకుంటూనే ఉన్నాయి. సినిమా అంటే అప్పుడు వేరు.. ఇప్పుడు వేరు!
ఒకప్పుడు కొద్దిమంది హీరోలే కనుక.. అన్ని సినిమాలూ వాళ్లే చేయాలి కనుక.. వచ్చిన సినిమాను వదులుకోవడం ఇష్టంలేక.. దొరికిన సినిమాను దొరికినట్టు చేసుకుంటూ పోకతప్పదు కనుక.. లేదంటే వెనకబడిపోయే ప్రమాదం ఉంటుంది కనుక.. ఇలా అనే‘ఖ’ల మధ్య సినిమాలు చేసుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడలా కాదు. అవకాశం దొరికితే ప్రతీఒక్కడూ దర్శకుడే. -చాన్స్‌లు దొరుకుతున్నాయి. డబ్బుంటే చాలు నిర్మాతే. -ఎక్కడెక్కడి వాళ్లూ పరిశ్రమకు వస్తున్నారు. ఉన్న హీరోలు, అనిపించుకోడాని ప్రయత్నిస్తునోళ్లు, నిర్మాతల కొడుకులూ బంధువులు, అనుకోకుండా పరిశ్రమకు వచ్చినోళ్లు.. -సో, హీరోలూ తక్కువేం కాదు. టెక్నీషియన్ల కొరత లేదు. టెక్నాలజీకి ఇబ్బంది లేదు. పెట్టుబడికి బెంగలేదు. పెట్టింది ఏమైపోతుందన్న భయం లేదు. స్థూలంగా సినిమా రిచ్. సినిమా ఈజీ. సినిమా పాషన్. చెప్పుకోడానికి ఇదోకోణం.
***
ఇంకో కోణంలో..
చూసిందే చూడాలా? అంటాడు -ప్రేక్షకుడు. కాపీ సినిమాలు తప్ప మనకు మరో తావులేదా? అనీ నిలదీస్తాడు. ఒక దర్శకుడు తీసిన సినిమాను మరో దర్శకుడు మరోలా చూపిస్తుంటే చూసి చావాల్సిందేనా అంటూ ఆక్రోశిస్తాడు. అప్పుడెప్పుడో పొరబాటున ఇంగ్లీష్ చానెల్‌లో చూసిన సినిమాను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నానంటూ థియేటర్లోనే గగ్గోలు పెడతాడు. సమాచార సరఫరా సులువైపోయిన తరువాతా మనోళ్లు -అప్పుడెప్పుడో మొదలెట్టిన కాపీ పద్ధతినే పాటిస్తున్నారంటూ చులకన చేస్తాడు. ‘ఈడికి కాపీ కొట్టడం కూడా రాదురా. అదే సినిమాని ఇలా మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉండేది’ అంటూ అద్భుతమైన స్క్రీన్‌ప్లేని పాఠం చెబుతూ ఎగతాళి చేస్తాడు. స్థూలంగా -్భన్నమైన సినిమాలు తీయరా? అన్నది ప్రేక్షకుడి ప్రశ్న. భిన్నమైన సినిమాలు తీస్తే మీరు చూస్తున్నారా? తిప్పి కొడుతున్నారుగా? అన్నది మేకర్ల నుంచి ఎదురు ప్రశ్న. మీరు చూస్తే.. వాళ్లు తీస్తే.. మేం చేయడానికి సిద్ధమన్నది స్టార్ ఆర్టిస్టుల నసుగుడు. ఇంతకీ అసలు సమస్య ఎక్కడ?
కృష్ణారావుకు సినిమా పిచ్చి. దిగ్గజ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. తరువాత అక్కినేని, కృష్ణ, చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్, మహేష్, పవన్, బన్నీ... ఏ ఒక్క హీరోకో ఫ్యాన్ కాదు. సినిమా పిచ్చి కనుక -హీరోలంతా ఇతని ఫ్యాన్స్. ఏ సినిమా వచ్చినా మొదటి ఆట చూసేస్తాడు. లేదంటే తిండి సహించదు మరి. అందుకే శుక్రవారం ఎవరికీ కనిపించడు. మొదటి ఆట మొదలు విడుదలైన అన్ని సినిమాలూ ఆ రోజే చూసి ఇంటికి చేరుకుంటాడు. చేసేది సాధారణ ఉద్యోగమే అయినా, సినిమా ఓ సీరియస్ వ్యాపకం. అందుకే సినిమాలమీద చెప్పలేనంత నాలెడ్జ్. వైవిధ్యమైన సినిమాలు, రొటీన్ మసాలా చిత్రాలు, మోస్తరు చిన్న సినిమాలు, ఇలా మీ రివ్యూలకేమోగానీ సినిమా ఏదైనా నా దృష్టిలో సినిమా అనే మనస్తత్వం. ఫ్లాప్ సినిమాలనూ ఆదరించే గొప్ప మనస్కుడు కృష్ణారావు. కాకపోతే ఈమధ్య కొంతమంది హీరోల సినిమాలు నచ్చడం లేదని తెగేసి చెప్తున్నాడు. ఎందుకంటే -ఏ సినిమాలో చూసినా ఆ హీరో ఒకేలా అనిపిస్తున్నాడన్నది అతని వాదన. కథను బట్టి పాత్ర, పాత్ర స్వభావాన్ని బట్టి కథనం, కథనాన్ని బట్టి సినిమా రూపురేఖలు... ఇలా అనేక మార్పుల్ని, అనేక ఎక్స్‌ప్రెషన్స్‌నీ ఆయా హీరోలు వాళ్ల సినిమాల్లో మోసలా చూపిస్తున్నారన్నది కృష్ణారావు ఆవేదన. కొంచెమైనా మారండయ్యా బాబూ. లేదంటే మీ సినిమాలను నేను కూడా చూడలేను -అంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నాడు.
ఇది కల్పితం కాదు. అదృష్టం కొద్దీ టాలీవుడ్‌కు ఇలాంటి పిచ్చి ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. సినిమాకు తీర్పునిచ్చే విషయంలో చాలా క్లారిటీతో ఉంటున్నారు. వాళ్లందరి ముక్తకంఠమే -కృష్ణారావు.
సినిమా జోనర్ ఏదైనా కావొచ్చు. ఆ సినిమాలో హీరో ఎవ్వరైనా ఉండొచ్చు. మొత్తంగా సినిమాలో మెప్పించే కంటెంట్ లేకపోతే మాత్రం నిర్మొహమాటంగా తిప్పికొడుతున్న అనుభవాలే ఎక్కువ ఎదురవుతున్నాయి. చిన్న హీరోలు మొదలుకుని స్టార్ హీరోల వరకూ కథ విషయంలో నిర్లక్ష్యాన్ని కనికరించడం లేదు. కాదని ముందుకెళ్తే -పరాభవాలే రుచి చూపిస్తున్నారు. రొటీనిటీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరోలను ప్రేక్షకుడు పట్టించుకునే పరిస్థితిలో లేడు. యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు సినిమాలు తగ్గిపోడానికి ఇదో కారణం. మొన్నొచ్చిన ‘లవర్’ దెబ్బ రాజ్‌తరుణ్‌కు కాస్త గట్టిగానే తగిలింది. ఈ ఏడాదిలో రంగులరాట్నం, రాజుగాడు, లవర్ -మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా మెప్పుపొందిన అవకాశం దక్కలేదు. అంటే ప్లాప్‌లు తప్ప హిట్టు పడలేదు. ఏకాఎకిన వచ్చిన బ్యాడ్ ఇమేజ్‌ను రాజ్‌తరుణ్ భారంగానే నెత్తిన మోస్తున్నాడు. వరుస ఫ్లాపుల దెబ్బతో ఇంతవరకూ కొత్త సినిమాకు కమిట్ కాలేదు. హిట్టుకోసం పరితపిస్తున్న జాబితాలో మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్‌తేజ్‌నూ పక్కన పెట్టలేం. పాతిక కోట్ల మార్కెట్ స్టామినా కలిగిన హీరో రేంజ్ నుంచి -కొత్తగా మార్కెట్ వెతుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసినట్టే కనిపిస్తోంది. ఆరు సూపర్ ఫ్లాపులతో అభిమానులకు విసుగు తెప్పించిన హీరోగా నిలబడ్డాడు తేజ్. తాజాగా ‘చిత్రలహరి’ మొదలైనా -మార్కెట్ డల్ అయిన కారణంగా క్రేజీ హీరోయిన్లు ఎవరూ తేజ్‌వైపు చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. తగిన కథను ఎంచుకోకపోవడం, కథ దొరికినా రొటీన్ పెర్ఫార్మెన్స్, మెగా సీనియర్లను అనుకరించడం, సొంత ఇమేజ్ కోసం బలంగా ప్రయత్నించకపోవడమే తేజ్ ఫ్లాపులకు కారణమన్న చర్చ ఆడియన్స్ నుంచి బలంగా వినిపిస్తోంది. మరో హీరో నితిన్ పరిస్థితీ ఇంతకంటే మెరుగ్గా ఉన్నట్టేమీ కనిపించడం లేదు. ఒక లవ్‌స్టోరీ, ఒక ఫ్యామిలీ సినిమా చేసినా -సాధించిన రిజల్ట్ మాత్రం సేమ్. పెర్ఫార్మెన్స్, మేకోవర్ విషయంలో సూటయ్యే స్టయిల్‌ను నితిన్ ఇంకా ఆఫ్ట్ చేసుకోలేకపోయాడు. పాతిక సినిమాల చేసిన సీనియారిటీ వున్న మరో స్టార్ గోపీచంద్ గురించీ ప్రత్యేకంగా చెప్పడానికేమీ లేదు. ఏపాత్రలోనైనా గోపీచంద్‌ని చూడటమే తప్ప, రివర్స్ ఒక్కసారీ రుచి చూడలేకపోయామన్నది ఆడియన్స్ నుంచి వినిపించే మాట. ఏ సినిమా చూసినా ఇదివరకు చూసిన గోపీచంద్ సినిమాలాగే ఉంటుంది తప్ప కొత్తదనమెక్కడ? అన్న ఆడియన్స్ ప్రశ్నలకు జవాబినిచ్చే సినిమా ఒక్కటీ గోపీచంద్‌కు పడలేదు. గోపీచంద్‌లో సరైన నటుడిని బయటకి తేవడంలో ఆయన విఫలమవుతూనే ఉన్నాడు. మాస్ యాక్షన్ మూవీస్‌తోనే కాలక్షేపం చేస్తూ, అలాంటి కథలనే ఎంపిక చేసుకుంటూ పోవడం కూడా మొనాటినీ బలపడిపోయింది. మాస్ మహారాజాగా మినిమమ్ గ్యారెంటీ స్థాయికి ఎదిగిన రవితేజ, బయర్లు సినిమా కొనాలంటే భయపడే రేంజ్‌కి దిగిపోయాడు. ఏకంగా మూడు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. గ్యాప్ తరువాత ఎన్నో ఆశలతో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ -ఈ టెన్షన్‌ను మరింత పెంచింది. మొనాటినీతో డేంజర్ జోన్‌కు చేరుకున్న ఈ తరహా హీరోలంతా -ఒక్క హిట్‌తో వెనక్కివచ్చే పరిస్థితేమీ లేదు. కథల ఎంపికలో జాగ్రత్త వహించి, మూస పెర్ఫార్మెన్స్ నుంచి బయటికొచ్చి సూటయ్యే ప్రయోగాలతో వరుస ప్రాజెక్టులు ప్రూవ్ చేసుకుంటే తప్ప మార్కెట్‌లో నిలబడగలిగే పరిస్థితి లేదనే చెప్పాలి. విజయ్ దేవరకొండ, నానిలాంటి హీరోలు సబ్జెక్టు ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ 60కోట్ల మార్కెట్‌కు చేరుకుంటే, అనుభవమున్న హీరోలు మాత్రం పోయిన మార్కెట్‌ను పట్టుకోడానికి కిందామీదా పడాల్సి వస్తుంది. స్టార్ హీరోల కోణంలో చూసినా -నా పేరు సూర్యతో అల్లు అర్జున్ కొత్తదనం, మేకోవర్‌కు పెద్దపీట వేశాడు. సరైన కథ దొరకకపోవడంతో చాలాకాలంగా సినిమా చేయకుండా ఆగిపోయాడు. రామ్‌చరణ్ రంగస్థలంతో మరో భిన్నమైన పాత్రతో ఔరా అనిపించాడు. ప్రభాస్ తన మార్కెట్‌ను ఎప్పుడో పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఆదిలోపడిన కష్టంతో అందివచ్చిన ఓ రేంజ్‌ను నిలబెట్టుకోడానికి ఇకనైనా అనేక విధాల కృషి సాగించకుంటే -సుదీర్ఘంగా కెరీర్ పరిగెత్తడం అంత సులువు కాదు. *

-- శ్రీనివాస్