మెయిన్ ఫీచర్
నేలవిడిచి.. నింగికెగసి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ్రహరాశులనధిగమించి/ ఘన తారల పథమునుంచి/ గగనాంతర రోదసిలో/ గంధర్వగోళ గతులుదాటి/ చంద్రలోకమైన దేవేంద్రలోకమైన/ బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే/ మానవుడే మహనీయుడు -అన్నాడు ఆరుద్ర. ‘బాల భారతం’ చిత్రంలో అర్జునుడు బాణం మెట్లుకడితే -వాటినెక్కుతూ ఐరావతాన్ని తెచ్చేందుకు భీముడు స్వర్గానికి వెళ్తున్న సన్నివేశంలో వచ్చే పాట అది. కట్ చేస్తే -్భముడు భువిని వదిలి మరో లోకంలోకి అడుగుపెడతాడు. భూమీదే సెట్ వేసినా -సన్నివేశమంతా స్వర్గంలో ఉన్నామన్న భావన కలిగించారు. అదీ -సినిమా.
*
అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా/ ఆ అందమంత కొత్త తాళం తీస్తే/ సందె విందు సొంతం కాదా -అంటాడు క్షణక్షణం చిత్రం కోసం సిరివెనె్నల సీతారామశాస్ర్తీ. పాట అన్వయింపు వేరైనా, అంతరార్థం మాత్రం -తలచుకుంటే తారాతీరం అందుకోలేనంత దూరం కాదన్నదే. మనషి శక్తియుక్తులు, తెగువ, సాధ్యాసాధ్యాలను చాటిచెప్పే ఇలాంటి పాటలు ఏ భాషా చిత్రాల్లోనైనా కోకొల్లలు. ఈ ఉదహరింపులన్నీ ఎందుకంటే -మన సినిమా ఇక నేలవిడిచి సాము చేయబోతోంది. ఆకాశం, అంతరిక్షం, రోదశి.. కొత్త లోకాలకు కథను ముడిపెట్టి అద్భుతాలు చూపించేందుకు ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అందుకు..
*
ఆకాశం.. చందమామ.. నక్షత్రాలు.. ఇవన్నీ రోజూ కనిపిస్తున్నా -ఎప్పుడూ మనకు పజిలే. దగ్గర్నుంచి చూడాలన్న ఆసక్తి -ఎప్పుడూ కొత్తదే. అక్కడేంవుంది? ఏం జరుగుతుంది? సృష్టి ఆనుపానులేమిటి? ఇలా శూన్యావరణ సంగతులు తెలుసుకోవాలన్న కుతూహలం ఎప్పుడూ ఉంటుంది. ఎంత తెలుసుకున్నా -కొత్త విషయాల తహతహ వెంటాడుతూనే ఉంటుంది. అందుకే -చాలాకాలం క్రితం వరకూ అంతరిక్షం నేపథ్యంగా వచ్చే కథలను విరగబడి చదివేవాళ్లం. తరువాత వచ్చిన డాక్యుమెంటరీలను ఎగబడి చూసేవాళ్లం. రోదశిని మనిషి చేధించడం మొదలుపెట్టిన తరువాత -అక్కడినుంచి మోసుకొచ్చిన సంగతులకు ఊహాంశాలు కలిపి హాలీవుడ్ ఘనాపాటీలు వాస్తవ దృశ్యాలుగా స్క్రీన్‌మీదకు తెచ్చినపుడు -సాంకేతికతకు సలాం చేస్తూ కళ్లప్పగించేశాం. ఇప్పుడిక మనమూ ఆ ఒరవడి అందిపుచ్చుకుని -అంతరిక్షం నేపథ్యంగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. స్పేస్ మూవీ అంటేనే ఒక అబ్బురం. భూమ్యావరణం దాటిన తరువాత -అక్కడ కక్ష్యలో అలుపెరుగని యుద్ధ సైనికుల్లా సంచరించే గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కాపాతాలు, ఆస్టరాయిడ్లు, శక్తితో తిరిగే ఆబ్జెక్టులు.. ఇలా ఏది కనిపించినా -వింతే. అందుకే ఈ జోనర్‌లో ఏ సినిమా వచ్చినా ప్రేక్షకుడికి అపురూపం, అబ్బురం. వచ్చే రెండు మూడేళ్లలో భారతీయ స్క్రీన్‌పైనా ఇలాంటి అద్భుతాలు చూడబోతున్నాం. -అంతరిక్షం నేపథ్యంలో కనీసం ఏడెనిమిది చిత్రాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 21న ఆడియన్స్ ముందుకొస్తున్న ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ సినిమా కనుక హిట్టయ్యిందంటే -టాలీవుడ్‌లోనూ స్పేస్ బేస్‌డ్ కథలు పుంఖానుపుంఖాలు కాకపోవు.
టెక్నాలజీ సాయంతో సౌరలోకపు సంగతులు అనుభవంలోకి రాకముందూ -సినిమా వేరే లోకాల్ని చూపించింది. మైథాలజీని బేస్ చేసుకుని భూలోకం -సురలోకం- పాతాళ లోకాలను కలుపుతూ సినిమా కథలు అల్లుకుంది. కథలోని ఊహా దృశ్యానికి -సెటప్, మేకప్ ఆపాదించి.. సన్నివేశాన్ని అల్లుకుని, పాత్రలకు రూపమిచ్చి సినిమా చూపించిన అనుభవాలు మనకు కొత్తేం కాదు. కాకపోతే -ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా సినిమా చూపించి ఉండొచ్చు. తెలుగు వరకూ చూసుకుంటే -స్క్రీన్‌కు ఎక్కిన పురాణాలు, ఐతిహాసాలు, మైథాలజీ కథల్ని ప్రస్తావించొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లెమ్స్ లేకుండా నారదుడు ముల్లోకాలు సంచరించినా, భూమీద ఉండాల్సిన మానవుడు బ్రహ్మలోకానికి వెళ్లినా.. ఈ కథలన్నీ ఆ కోవకే వస్తాయి. కాలక్రమంలో -ఆకాశంలోకి ఎగిరెళ్లాలన్న ఊహల్ని వాస్తవాలు చేసి మనిషి భూమ్యావరణం దాటడం మొదలుపెట్టాక -అక్కడ తన కళ్లతో, సాంకేతిక నేత్రంతో చూసినవాటిని కనికట్టుగా స్క్రీన్‌మీదకు తేవడమూ జరిగింది. ఆ విషయంలో పరిధి పెద్దదైన హాలీవుడ్ ముందడుగు వేస్తే -ఆధునిక సినిమాను ముందే అవగాహన చేసుకున్న అనేక దేశాల్లోనూ స్పేస్ బేస్‌డ్ కథలు సినిమాలవుతూ వచ్చాయి. టెక్నాలజీ సాయంతో తెలుసుకున్న కొద్దిపాటి రోదశి జ్ఞానానికి కల్పనలు అల్లుతూ కథలల్లడం మొదలెట్టింది హాలీవుడ్. ఆర్మ్‌డ్‌గాన్, గ్రావిటీ, మెరిడియన్‌లాంటి చిత్రాల్ని ఈ కోవలో ఉదహరించొచ్చు. అంతరిక్షంలో జీవులు (ఏలియన్స్) ఉండొచ్చన్న అంచనాలతో -ఆ తరహా కథల్నీ సినిమాలుగా చూసేశాం. కల్పనకు పరిధి లేదు కనుక- తెలుసుకున్న కొద్దిపాటి జ్ఞానంతో భిన్నమైన చిత్రాలు స్క్రీన్‌మీదకు వచ్చేశాయి. బడ్జెట్‌పరంగానూ, సాంకేతికతలోనూ హాలీవుడ్‌కు తిరుగులేకపోవడం, సైన్స్ ఫిక్షన్‌కు యూనివర్శల్ అప్పీల్ ఉండటంతో -ఈ తరహా చిత్రాల రూపకల్పనలో హాలీవుడ్ వందడుగులు ముందే ఉంది. ఆ తరహా చిత్రాలను నిర్మించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటంతో -ఇప్పుడు మనమూ అంతరిక్షం నేపథ్యంలోని చిత్రాలపై ధైర్యంగా దృష్టి పెట్టగలుగుతున్నాం.
భారతీయ తొలి అంతరిక్ష చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం -టిక్ టిక్ టిక్. తమిళంలో జయం రవి, నివేదా పేతురాజ్‌లు హీరో హీరోయిన్లుగా శక్తి సౌందర రాజన్ తెరకెక్కించిన సినిమా తెలుగులోనూ విడుదలైంది. హాలీవుడ్‌లో వచ్చిన ‘ఆర్మెగడాన్’ సినిమా స్ఫూర్తితో వచ్చిన ప్రాంతీయ భాషా చిత్రంలా ఉంటుంది. ఒక గ్రహశకలంతో భారత్‌కు పెనుముప్పు తప్పదని శాస్తజ్ఞ్రులు తెలుసుకుంటారు. ఆ గ్రహశకలాన్ని విచ్ఛిన్నం చేయగల అణుశక్తి మరో దేశపు అంతరిక్ష కేంద్రంలో ఉంటుంది. దాన్ని దొంగిలించి ప్రయోగించడానికి -్భమీద దొంగతనాలు చేసుకునే హీరో (జయం రవి)ని ఎలా ప్రయోగించారు? అక్కడ ఎదురైన సవాళ్లేంటి? భూమికివున్న ముప్పుని హీరో తప్పించాడా? లేదా? ఇదీ మిగతా కథ. ఒక తరహా మూసకు అలవాటుపడిన ప్రాంతీయ భాషా చిత్రం కనుక - అంతరిక్షంలోనూ ఊర మాస్ కథనే చూపించినట్టు ఉంటుంది. అందుకే -కథలో సంక్లిష్టత, ఉత్కంఠ, ఏం జరుగుతుందనే ఆసక్తిలేకుండానే సినిమా అయిపోతుంది. కథకోసం అంతరిక్షాన్ని టచ్ చేశారే తప్ప, పూర్తి అంతరిక్ష నేపథ్యంతో వచ్చిన కథగా దీన్ని భావించలేం. అయితే -అంతరిక్ష నేపథ్యంలో సాగిన సుదీర్ఘ సన్నివేశాల కోసం పడిన విజువల్ ఎఫెక్ట్స్ శ్రమ ఫలించి ఒకింత అనుభూతిని అందిస్తుంది. ఇక -వచ్చే రెండేళ్లలో అంతో ఇంతో అంతరిక్షాన్ని టచ్ చేస్తూ రాబోతున్న చిత్రాలను పరికిద్దాం.
టాలీవుడ్‌లో మొట్టమొదటి అంతరిక్ష నేపథ్యమున్న చిత్రంగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది -అంతరిక్షం 9000 కెఎంపిహెచ్. యంగ్ హీరో వరుణ్ తేజ్, బాలీవుడ్ హీరోయిన్ ఆదితిరావు హైదరి వ్యోమగాముల పాత్ర పోషిస్తుంటే -మరో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి కనిపించనుంది. ఘాజీ చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించే ప్రయత్నం చేశారు. మిహీరా శాటిలైట్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి పని చేయడం అమేజింగ్‌గా ఉందంటూ ఇప్పటికే వరుణ్ తేజ్ ట్వీట్లు పెడుతున్నాడు. థ్రిల్లింగ్ విజువల్స్‌తో తెరకెక్కిన సినిమా -తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడం ఖాయమని చిత్ర బృందం సైతం ఊరిస్తోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రం యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మళ్లీ హాలీవుడ్ నిపుణులే ఆధారమయ్యారు. ప్రశాంత్ విహారి సంగీతం, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న చిత్రాన్ని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. స్పేస్ బేస్‌డ్ హాలీవుడ్ చిత్రాలు తెలుగు అనువాదంలోనూ రావడంతో, అవే దృశ్యాలతో విడుదలైన అంతరిక్షం టీజర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. జీరో గ్రావిటీలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెటప్‌లో అంతరిక్షం చిత్రీకరించినట్టు చెబుతున్నా -టీజర్‌లో అద్భుతం చూస్తున్నామన్న భావన లేదు. హాలీవుడ్‌లో వచ్చిన గ్రావిటీ, మార్చియన్, మిషన్ టు మార్స్‌లాంటి హాలీవుడ్ చిత్రాల దృశ్యాలు చూస్తున్న భావన కలిగింది. విడుదల తరువాత సినిమాకు ఎలాంటి క్రెడిబిలిటీ దక్కుతుందన్నది చూడాలి.
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న మరో చిత్రం -రాకెట్రీ.. ది నంబీ ఎఫెక్ట్. ఇస్రో శాస్తవ్రేత్త నంబి నారాయణ్ గూఢచర్యం గుట్టును తెరకెక్కించే ఘట్టంలో నంబి పాత్రను నటుడు మాధవన్ పోషిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్ మహాదేవన్ తెరకెక్కిస్తున్నాడు. ఇస్రో శాస్తవ్రేత్త నంబి నారాయణ్ గూఢచర్యానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొన్న సమయంలో -50 రోజులపాటు జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత ఆయన తప్పులేదని తెలిసి నిర్దోషిగా బయటకు వచ్చారు. అయితే, ఆ 50 రోజుల కాలంలో దేశం ఏంకొల్పోయిందో చెప్పే ఉద్దేశంతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సో, ఇదీ పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కాదు. నంబి జైల్లోవున్నపుడు సాగిన -మిషన్ టు మార్స్ ఎపిసోడ్‌ని ఆసక్తికరంగా చూపించబోతున్నార్ట. ఆసక్తికరమైన నంబి వ్యాఖ్యలతో ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో -సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మార్స్ ప్రయోగం కోసం నాసా, రష్యాలు ఎన్నిసార్లు ఎంత ఖర్చుపెట్టి ప్రయత్నించాయో చర్చిస్తూనే, మార్స్ మిషన్‌ను తొలి ప్రయత్నంలోనే తక్కువ బడ్జెట్‌తో సక్సెస్ చేసిన ఇస్రో ఘనతను విజ్ఞానదాయకంగా సినిమాలో చూపించనున్నారట.
సారే జహాసె అచ్చా: ఇక ప్రముఖ భారత వ్యోమగామి రాకేశ్ శర్మ జీవితాధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ -సారే జహాసె అచ్చా. రీల్ లైఫ్ రాకేశ్ శర్మగా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ కనిపించనున్న చిత్రం షూటింగ్ వచ్చే ఫిబ్రవరి లేదా మార్చి నుంచి మొదలుకానుంది. ‘శాల్యూట్’ టైటిల్‌తో సినిమా చేయాలనుకున్నప్పటికీ, అమీర్ సలహా మేరకు తాత్కాలికంగా ‘సారే జహాసె అచ్చా’ను ఖరారు చేశారు. మహేశ్ మథాయ్ దర్శకత్వం వహించనున్న చిత్రానికి సహ నిర్మాతగా రోన్నీ స్క్రూవాలా వ్యవహరిస్తున్నారు. షారుక్‌కు జోడీగా భూమి ఫడ్నేకర్‌ను అనుకుంటున్నా -్ఫమేల్ లీడ్‌ను ఇంతవరకూ ఖరారు చేయలేదన్నది రొన్నీ మాట. షారుక్ ప్రస్తుతం ‘జీరో’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. వచ్చే డిసెంబర్‌కు ‘జీరో’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వచ్చే మార్చినుంచి ‘సారే జహాసె అచ్చా’ ప్రాజెక్టులో ఎస్సార్కే పాల్గొంటాడు. అయితే -డిసెంబర్‌లో రాబోతున్న ‘జీరో’ చిత్రంలోనూ అంతరిక్షాన్ని టచ్ చేశారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ‘జీరో’లో షారుక్‌ది మరుగుజ్జు పాత్ర. కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లు. తన ప్రేమను గెలిపించుకోడానికి షారుక్ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లే సన్నివేశాన్ని ‘జీరో’లో చిత్రీకరించారు. అందుకు నాసా అనుమతి తీసుకోవడం మరో విషయం.
చందమామ్ దూర్ కే: నటుడు మాధవన్ నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం చందమామ్ దూర్ కే. తొలుత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించాల్సి ఉండటంతో, నాసాలో శిక్షణ కూడా తీసుకున్నాడు. చివరి క్షణాల్లో సుశాంత్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో, షూటింగ్‌కు వెళ్లాల్సిన చిత్రం ఆగింది. సుశాంత్ పాత్రకు కొత్త హీరోను తీసుకోవాల్సి ఉంది. సొంత బ్యానర్‌పై అంతరిక్ష నేపథ్యంలో మాధవన్ చేస్తున్న చిత్రాన్ని సంజయ్ పురన్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. చిత్రంలో మాధవన్‌తోపాటు నవాజుద్దీన్ సిద్దిఖి కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా కూడా 2019లో విడుదల కానుంది.
మిషన్ మంగళ్: బాలీవుడ్‌లో ఆసక్తిరేకెత్తిస్తున్న చిత్రం -మిషన్ మంగళ్. వైవిధ్యమైన కథలు చేస్తూ వరుస హిట్లతో దూసుకుపోతున్న అక్షయ్‌కుమార్ -్భరత మార్స్ మిషన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. జగన్ శక్తి ఈ సినిమాకు దర్శకుడు. త్వరలో చిత్రీకరణ మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విద్యాబాలన్, తాప్సీ, సొనాక్షి సిన్హా, నిత్యమీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా కూడా 2019లోనే విడుదల కానుంది.
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ సినిమా మొదలెట్టాడంటే -దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తడం పరిపాటి. అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించే శంకర్ తెరకెక్కించిన 2.0 (రోబో సీక్వెల్) కోసం ఇప్పటికే అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన జాతీయ నటుడు కమల్‌హాసన్‌తో భారతీయుడు-2 చిత్రం ప్లాన్ చేశారు. ఇవి పూర్తయ్యేలోగా ఊహకందని భారీ ప్రాజెక్టు ఒకటి శంకర్ చేపట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సినిమా ఉంటుందనీ టాక్ లేకపోలేదు. హలీవుడ్ రేంజ్‌లో స్పేస్ ఫిక్షన్ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. అలాగే సునీతా విలియమ్స్ బయోపిక్‌నూ తెరకెక్కించే ఆలోచనలు బాలీవుడ్ నుంచి వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రాలు షూటింగ్‌కు వచ్చేసరికి అంతరిక్షం నేపథ్యంలో మరికొన్ని చిత్రాలు ప్రకటనకు వచ్చే అవకాశాలు లేకపోలేదు.
*