మెయిన్ ఫీచర్

ఈ ముద్దు.. ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో ట్రెండ్ -ముదిరి ఊసరివెల్లి అవుతోంది. ఆ ట్రెండ్ మొన్నొచ్చిన -అర్జున్‌రెడ్డి. సింపుల్‌గా -‘ఏ-ఆర్’. ఆ హ్యాంగోవర్ నుంచి తెలుగు సినిమా ఇంకా బయటపడ లేదు. ఆ ట్రెండ్‌నే కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యాంగిల్స్ వెతుకుతోంది. అడ్వాంటేజ్ తీసుకుని వ్యాపారం చేసే ప్రయత్నాలకు
పదును పెడుతోంది.
***
ఏదైనా కొత్త ఒరవడిని అందిపుచ్చుకోవడంలో -తెలుగు పరిశ్రమలో తిరుగులేదు. ఫలానా సినిమాకి ఆడియన్స్ కనెక్టయ్యారూ అంటే చాలు -అదే ఒరవడిలో పుంఖాను పుంఖాలుగా కథలు పుట్టుకొస్తాయి. అదే పంథాలో కథనాలూ నడుస్తాయి. సినిమాలు రూపుదిద్దుకుని థియేటర్లకు వస్తాయి. హిట్టు-్ఫట్టు అన్నది పట్టించుకోకుండా కొన్నాళ్లు ట్రెండ్ నడుస్తుంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన ‘ఏ-ఆర్’ హిట్టు కొట్టడంతో -ఆ ఊపులో.. ఆ ప్రభావంతో చాలా సినిమాలే సెట్స్ ఎక్కేశాయి. అలా అర్జున్‌రెడ్డి ఎఫెక్ట్‌తో మొదలైన సినిమాలు -కాస్త ఆలస్యంగా పూరె్తై ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నాయి. రావాల్సిన చిత్రాలూ చాలానే ఉన్నాయి. వాటిని చూస్తుంటే -హ్యాంగోవర్ దారి తప్పిందన్న అనుమానాలు బలపడకపోవు. ఇదెంతకాలమో
చివరి సినిమా వచ్చే వరకూ చూడాలి.
***
అర్జున్ రెడ్డికి ముందు -తరువాత..
తెలుగు సినిమాకు ప్రేమ అనే ముడి పదార్థం అనాదినుంచీ వ్యాపార వస్తువే. ప్రేమను సంప్రదాయకంగా చూపించిన దర్శకులున్నారు. సంస్కారవంతంగా ప్రదర్శించిన హీరోలున్నారు. సున్నితంగా వ్యక్తీకరించిన రచయితలున్నారు. హృదయం నుంచి పుట్టుకొచ్చే ఓ అందమైన అనుభూతిని స్క్రీన్‌మీద రుచి చూపించేందుకు చాలామంది చాలాచాలా కసరత్తులే చేశారు. చేస్తున్నారు. చేస్తారు కూడా. ఎందుకంటే -ఆ అందమైన భావోద్వేగం సినిమాకు ఎప్పుడూ ముడి వస్తువే కనుక. ప్రేమలోని ఆనందం.. ఉత్సాహం.. ఉద్వేగం.. కంగారు.. భయం.. వేదన.. ఇలా ఒకటేమిటి ‘ప్రేమ’ పదార్థం చుట్టూ అల్లుకున్న సవాలక్ష హృదయ భావనలు, గుండె చప్పుళ్లను స్క్రీన్‌పై చూపించేందుకు తెలుగు సినిమా చేయని ప్రయత్నాలు లేవు. చేసిన ప్రయత్నాలనూ తక్కువ చేసి చెప్పలేం. అయితే -ఇదంతా అర్జున్ రెడ్డికి ముందొకలా. ఇప్పుడు మరోలా అనాల్సి వస్తుంది. లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం ఇలానే ఉండాలన్న రూలేమీ లేదు కనుక -ఒక్కొక్కరు ఒక్కొలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అర్జున్ రెడ్డి (సినిమా లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనిపై ఇప్పటికే చర్చోపచర్చలు జరిగాయి. ఎవరి ఎక్స్‌ప్రెషన్స్ వాళ్లు వ్యక్తం చేశారు. యాక్సెప్ట్ చేసినోళ్లు ఒకలా? విపరీత పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న విమర్శకులు మరోలా?. సో, సినిమాలో ఏముందన్నది మరోసారి చర్చించాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఇంపాక్ట్ మాత్రమే ఈ కథనానికి అవసరం) క్యారెక్టరైజేషన్ అదో తరహా కనుక -ఆ పాత్రధారి తన ధోరణిలో లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం చూశాం. రఫ్ అప్పియరెన్స్, యాంగ్రీ ఆటిట్యూడ్.. కంట్రోల్‌లెస్ డైలాగ్స్.. -ఇవన్నీ క్యారెక్టరైజేషన్‌కు ప్రాణం పోశాయి. అయితే వాటి ప్రభావమే -ఇప్పుడు చాలా సినిమాల ప్రాణం తీస్తుంది. అర్జున్‌రెడ్డి విడుదల తరువాత ఆ ప్రభావంతో మొదలై ఇప్పుడు విడుదలకు వస్తున్న సినిమాలు కొన్నింటిని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ అని ఆయా బృందాలు ఒప్పుకోకపోవచ్చు. కానీ, అలాంటి చిత్రంగా భావించి ఆడియన్స్ థియేటర్లకు రావాలని
ఆశిస్తుండటం మాత్రం కనిపిస్తోంది.
***
గుండె లోతుల్లోని సున్నితమైన భావాన్ని గుండీలువిప్పి ఎంత రఫ్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తే-అదే ఇప్పటి ట్రెండీ లవ్. నిజానికి అర్జున్‌రెడ్డి ఉద్దేశం ఇది కాకపోవచ్చు. కానీ, చాలావరకూ అర్థమైందిదే, దానికే ఆడియన్స్ కనెక్టయ్యారన్న భావనలో ఇప్పుడొస్తున్న సినిమాలు కనిపిస్తున్నాయి. లవ్ అనేది మెంటల్ ఫీలింగ్ ఒక్కటే కాదు, ఫిజికల్ ఫీలింగ్ కూడా అన్న ధోరణిని బలపర్చేలా సినిమాలు వస్తున్నాయి. ఈమధ్యే ఓ చిత్రం టీజర్ విడుదలలో ఓ సీనియర్ ఆర్టిస్టు మాట్లాడుతూ ‘శారీరక స్పర్శలోని ఆనందం నుంచే అసలైన ప్రేమ పుడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. ఓషోలను మించిన ఫిలాసఫీలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయ. పాజిటివ్‌గా తీసుకుంటే తప్పనిపించక పోవచ్చు కూడా. కానీ, నెగెటివ్ ఎక్స్‌ప్రెషన్‌కు వెళ్తేనే -బూతు చూస్తాం. ఇప్పుడు తెలుగు సినిమాల్లో అలాంటిదే చూపించి వ్యాపారం చేసుకోడానికి కొన్ని చిత్రాలు తయారవుతున్నాయి.
కళ్లతో చూసుకోవడం. బహిరంగంగా పంచులేసుకోవడం. లవ్ కోసం లక్ష ట్రాప్‌లు. కట్‌చేస్తే -ఇద్దరూ ప్రేమ మైకంలో.. సారీ మరో మైకంలో తేలిపోవడం. ఫిజికల్ ఫీలింగ్స్‌ని ఎంజాయ్ చేయడం. ఇలా చెప్పుకుంటూపోతే.. శ్రుతితప్పిన భావన కలుగుతోంది కదూ! కొన్ని తెలుగు చిత్రాలు ఇస్తోన్న షాకులివే. టాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి లేపిన సంచలనం ఎఫెక్టే ఇదంతా. ఆ ఫార్ములాను ఎన్నిరకాలుగా చూపించి వ్యాపారం చేసుకోవచ్చో ఆలోచిస్తున్న వాళ్ల సంఖ్య ఇంకా ఏమీ తగ్గలేదు. దీన్ని క్వొశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే -ఇది క్రియేటివ్ ఫీల్డ్ కనుక.
***
నిజానికి మామూలుగా రాసుకున్న కథల్ని కూడా -రా, కల్ట్ కంటెంట్ దట్టించి సరికొత్త క్రియేటివిటీని ఎగ్జిబిట్ చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. మొదట అర్జున్‌రెడ్డి హిట్టనిపించుకుంది. తరువాత ఆర్‌ఎక్స్ 100 క్యాష్ చేసింది. ఆ రెండింటి విజయానికి అసలు కారణాలు వేరే ఉండొచ్చు. వాటిలోని కోర్ కంటెంట్ ఉద్దేశం మరొకటి కావొచ్చు. కాని, బాహ్య స్వరూపం మాత్రం -రా రొమాన్స్. దీనికే ఆడియన్స్ బాగా కనెక్టయ్యారన్నది ప్రచారం జరిగింది. ఈ ప్రచారమే నమ్మకంగా బలపడింది. ఆ నమ్మకాలే -ఇప్పుడు సినిమాలుగా వచ్చేస్తున్నాయి. ఓ తాజా చిత్రాన్ని చర్చిద్దాం. ‘కేవలం ముద్దుల సన్నివేశాలనే భిన్నంగా ట్రై చేశాం. ముద్దులోని మధురానుభూతి మాటల్లో చెప్పలేం. కానీ, స్క్రీన్‌మీద చూపించే మా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం’ అంటూ ప్రకటించుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్‌లోనే ‘ముద్దు’ ప్రత్యేకతలను ఆడియన్స్‌కి కనెక్ట్ చేసే ప్రయత్నాలూ చేశారు. మరో రాబోతున్న చిత్రాన్ని పరిశీలిస్తే -శారీరక భంగిమల్లో లవ్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చన్న కంటెంట్‌తో రూపుదిద్దుకుంది. ఏ భంగిమలో ప్రేమెంత మధురంగా ఉంటుందో చెప్పాలన్నది ఆ చిత్రం తాపత్రయం. ఇంతకంటే భయంకరమైన కంటెంట్‌తోనే సినిమాలు తయారవుతున్నాయి. నిజానికి వీటిని ఎవరు మాత్రం కాదంటారు. ఇదంతా క్రియేటివిటీనే. అసభ్యత లేకుండా అలాంటి ఆలోచనలకు తావు కలిగించే సన్నివేశాలను సెన్సార్ కూడా ఏమీ చేయలేకపోవచ్చు. కానీ, అది మంచి వ్యాపార వస్తువు కావొచ్చు. దాంతో ఆ తరహా సినిమాలు మరిన్ని వస్తాయి. మరింత లోతుల్లోకి కసరత్తు చేయడం మొదలయ్యే
ప్రమాదాలు లేకపోలేదు.
**
నిజానికి ఆడియన్స్‌ని సినిమాకు కనెక్ట్ చేయడానికి అర్జున్‌రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 చిత్రాలూ ఇలాంటి ప్రయోగాలే చేశాయి. రియల్ లైఫ్‌లో బహిరంగంగా చేయడానికి అవకాశం లేని అంశాలనే ఎక్స్‌పోజ్ చేసి చూపించాయి. నిజానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యిందే అక్కడ. అలా మొదలైన ధోరణిని -కొత్తగా వస్తున్న చిత్రాలూ అనుసరిస్తున్నాయి. ఈమధ్య ప్రతి సినిమా ట్రైలర్‌లోనూ హీరో హీరోయిన్ల మధ్య ఓ ముద్దు కామన్. ఇప్పుడిక లిప్‌లాక్‌ల మీదే సినిమా రాబోతోంది కనుక -ఈ ప్రక్రియ కంటిన్యూ అయిపోవచ్చు. భవిష్యత్ ట్రైలర్లతో మాత్రమేకాదు, సినిమాల్లోనూ ముద్దులు తప్ప మరేమీ ఉండని పరిస్థితి వస్తుందేమో. ఈమధ్య తెలుగు సినిమాలను కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాం అన్న విమర్శలపై ఈమధ్యే నటుడు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కాస్త లోతుగా అర్థం చేసుకోవాలి. ‘కుటుంబంతో కలసి చూడలేమని అనుకునే సినిమాలకు పిల్లలను తీసుకెళ్లకుంటేనే మంచిది. మంచి సినిమాలు వచ్చినప్పుడే థియేటర్‌కు వెళ్లండి’ అన్నది ఆయన మాట. ఈ వ్యాఖ్యలను ఎవరెలా అర్థం చేసుకుంటే -అలా అర్థమవుతాయి.
ఇటీవలి కాలంలో కొత్త హీరోలను పరిచయం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఒక్కసారి పరిశీలిస్తే -అర్జున్‌రెడ్డి ఎఫెక్ట్ అర్థంకాకపోదు. ఆకారం, ఆహార్యం, అభినయం, దృక్ఫథం.. ఇలా వీటిలోని రా మెటీరియల్‌ని ఎగ్జిబిట్ చేస్తే హిట్ అందుకోవచ్చన్న అంతఃసూత్రాలే అందులో కనిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్ చేతులు కాల్చుకునే సినిమాలూ వస్తున్నాయి, అది వేరే విషయం. సినిమాలో విషయం ఉండాలి. కథలో సత్తాఉండాలి. కేవలం ఫార్ములాలనో, భయానక భంగిమలతో, కల్ట్ కంటెంట్‌నో వాడుకుని క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తే మాత్రం చేతులు కాలడం ఖాయం.

-శ్రీనివాస్