మెయిన్ ఫీచర్

స్ట్రాటజీ.. లీకేజీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కబాలి!?
తెల్లవారితే రిలీజ్.
జనం గుండెల్లో గుబులు. అభిమానుల హృదయాల్లో అలజడి. అదీ రజనీ స్టైల్. మునుపు ‘కొచ్చాడియన్’ - ‘లింగ’ డిజాస్టర్ మూవీల తర్వాత.. - ‘కబాలి’ అంటూ 65 ఏళ్ళ హీరో.. రోబో-2ని సైతం పక్కనబెట్టి తెర మీదికి దూసుకురావటంతో ప్రజల్లో ఉత్కంఠ. టీజర్‌లో మురిపించి... వాకింగ్ స్టైల్‌తో - మాస్ హిస్టీరియాని తెప్పించి ఎప్పుడెప్పుడు కళ్ల తెరపై ‘రజనీ’ని ఆవిష్కరిస్తామా అన్న ఎదురుచూపు. సినీ చరిత్రలో ఏ సినిమాకి లభించనంత అభిమానం దొర్లి.. ఫ్లైట్‌పై పోస్టర్‌గా వెలిసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడందే జన్మ చరితార్థం కాదని.. దేశ దేశాల్నుంచీ ‘చెన్నై’కి ఫ్లైట్‌తో దూకేసి.. తెల్లవారటం కోసం నిరీక్షణ.

* * *
వాట్సప్‌ల్లోనూ.. ఫేస్‌బుక్‌ల్లోనూ.. తెరలు తెరలుగా ‘రజనీ’ పట్ల తొణికిసలాడిన అభిమానం. వేలకొద్దీ అంచనాలు. మరి కొద్దిగంటల్లో పొద్దుపొడిచి.. థియేటర్ వైపు పరుగులు పెట్టేద్దామనుకొంటున్న ఆఖరి క్షణంలో ‘నెట్’లో కబాలి సన్నివేశాలు తళుక్కున మెరిసి.. అభిమానుల గుండెల్లో శూలాల్లా దిగబడ్డాయి. ‘కబా‘లీ’క్ వార్త క్షణాల్లో మాధ్యమంలో పాకిపోయింది. కొద్ది నెలలుగా అణు మాత్రం అంచనాలకు దొరక్కుండా.. కథ తాలూకు ఆనవాళ్లు తెలీకుండా కాపాడుకొంటూ వచ్చిన ‘కథ’ లీకై.. తెరపై అస్పష్టంగా.. వొకింత స్పష్టంగా ‘కబాలి’ కనిపించటంతో సహజంగానే అంచనాలు దెబ్బతిన్నాయా? అభిమానుల మానసిక స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ.. నిర్మాతల ఆశలు కూలిపోయాయా?
* * *
సీన్ రివర్స్.
ఓ సంవత్సరం క్రితం. ‘అత్తారింటికి దారేది?’ కథ ముప్పాతిక పాళ్లు రాత్రికి రాత్రి ‘నెట్’లో ప్రత్యక్షమవటంతో - అభిమానుల మనసు చివుక్కుమంది. నిర్మాతలు భోరుమన్నారు. ఉన్నపళంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ‘పైరసీ’ భూతాన్ని మట్టుపెట్టలేక - బుర్రలు బద్దలు కొట్టుకుంటూంటే.. ఇవాళ ‘లీక్’ భూతం జనాన్ని మభ్యపెడుతోంది. క్లైమాక్స్ సీనంతా ‘నెట్’ తెరపై స్పష్టంగా కనిపించి.. కథ తాలూకు సారాంశాన్ని తెలియజేసింది.
* * *
దక్షిణాది సీన్ నించీ ఉత్తరాది సీన్‌లోకి మారితే-
‘ఉడ్‌తా పంజాబ్’ లీక్ గొడవ అంతా ఇంతా కాదు. లీక్‌ల భారతమా ఇది? అని వాపోయారు నిర్మాతలు. పంజాబ్‌లో మత్తుపదార్థాల ‘మత్తు’ గురించి తీసిన ఈ సినిమాపై సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐతే బొంబాయి హైకోర్టు వాటిని తోసిపుచ్చి రిలీజ్ చేసుకోవటానికి వీలు కల్పిస్తే.. రిలీజ్‌కి ముందే సినిమా మొత్తం ‘నెట్’లో రీళ్ల కొద్దీ లభ్యమైంది. సెన్సార్ బోర్డు చైర్మన్ పంకజ్ నిహలానీ పంజాబ్ కథపై ‘కసి’తో ‘సెన్సార్ కాపీ’ని నెట్‌కి రిలీజ్ చేసి.. చోద్యం చూశాడన్నది నిర్మాతల ఆరోపణ. సెన్సార్ బోర్డుకీ.. నిర్మాతలకూ మధ్య జరిగిన వాగ్వివాదాలతో.. బొంబాయి హైకోర్టు కల్పించుకొని.. జూన్ 13న రిలీజ్ చేసుకోవచ్చని ఆర్డర్ జారీ చేసింది. 17 నాటికి రిలీజ్ చేద్దామనుకొంటున్న తరుణలో జూన్ 15న సినిమా మొత్తం కొన్ని వెబ్‌సైట్లలో తళుక్కుమంది. ఆ ప్రింట్లపై ‘్ఫర్ సెన్సార్’ అన్న వాటర్ మార్క్ స్పష్టంగా కనిపించటంతో సెన్సార్ బోర్డు వాళ్లే ‘పైరేటెడ్ వెర్షన్’ని ఆన్‌లైన్‌లో పెట్టారా? అన్న మీమాంస వెంటాడింది. దీంతో అనురాగ్ కాశ్యప్ ‘దయచేసి ఈ సినిమాని డౌన్‌లోడ్ చేసుకోకండి. శుక్రవారం రిలీజయ్యాక టాక్ ఎలాగూ బయటకు వస్తుంది. శనివారంనాటికి సినిమా టిక్కెట్ కొని చూడాలా లేదా అన్న విషయం మీకు తెలిసిపోతుంది. టిక్కెట్ కొనక్కర్లేదని మీకనిపించాకనే డౌన్‌లోడ్ చేసుకోండి.. అందుకని శనివారం వరకూ ఓపిక పట్టండి’ అంటూ పత్రికాముఖంగా వెల్లడించాడు.
* * *
మరో ‘సన్నివేశం’లోకీ.. ఓ సంవత్సరంలోకి వెళ్తే-
‘బాహుబలి’ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు. ఏదో ఓ సన్నివేశమో? ఉత్కంఠభరితంగా సాగిన క్లైమాక్స్ సీనో? ‘లీక్’లకు ‘బలి’ అయ్యింది. కథ మాటెలా ఉన్నప్పటికీ.. ‘బాహుబలి’పై ఈ ‘లీక్’ల ప్రహసనం అంచనాలను మరింత పెంచింది.
* * *
‘సైరత్’ - మరాఠీ చిత్ర చరిత్రలో సంచలనం సృష్టించి.. లొకేషన్స్ సైతం ‘టూరిస్ట్ స్పాట్’గా మారిన ఒకానొక ప్రేమ కథా చిత్రం. కేవలం 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై.. 100 కోట్ల క్లబ్‌కి చేరటం వెనుక ‘కథ’ తాలూకు అనుభూతి మాటేమైనా గానీ.. ‘సైరత్’ కూడా ‘లీక్’ సుడిగుండంలో చిక్కుకొంది. యూట్యూబ్‌లో ‘సెన్సార్ కాపీ’గా కనిపించింది. ఏకంగా సినిమా మొత్తం ఇలా ‘వాటర్ మార్క్’ మురిపిస్తూనే ఉంది.
* * *
‘కబాలి’ ఇంట్రడక్షన్ సీన్.. జైలు సన్నివేశం..
‘అత్తారింటికి దారేది?’ క్లైమాక్స్ సీన్.
‘ఉడ్‌తా పంజాబ్’ ముప్పాతిక సినిమా.
‘సైరత్’ ‘సెన్సార్ కాపీ’ సంచలనం.
లేదా మరో ‘శ్రీమంతుడు’..
* * *
ఈ ‘లీకేజీ’ అంతా ఎక్కడ జరుగుతోంది?
రీరికార్డింగ్‌లోనా? షూటింగ్ స్పాట్‌లోనేనా? ఇండస్ట్రీలో ఒకరంటే ఒకరికి పడని పరిస్థితా?
సినిమా అంటేనే కోట్ల కొద్దీ సొమ్ము. ఒక సినిమా రిలీజ్ కావటానికి వందల మంది సమిష్టి కృషి. నిర్మాత మొదలుకొని - అనేకానేక శాఖల్ని దాటుకొని.. దర్శకుడి దృష్టి కోణంలోంచీ ‘కథ’పై ఆవిష్కరణ కావటానికి ముందే ‘లీక్’ అయితే ఆ చిత్ర ‘పరిస్థితి’ ఏ విధంగా ఉంటుందో ఎవరూ ఊహించని పరిణామం.
* * *
తాజాగా ఇండస్ట్రీలో కనిపిస్తున్న ‘లీక్’ మాటకి మరో అర్థాన్ని కూడా చెప్పుకొంటున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని. కారణాకారణాలేవైనప్పటికీ.. ‘లీక్’ భూతం ఇప్పుడు నిర్మాత దర్శకుల్ని పట్టి పీడిస్తోంది. ఎక్కడ ఏ లోపం వల్ల సినిమా ‘నెట్’లో ప్రత్యక్షమవుతోందన్నది అర్థంకాని ప్రశ్న. దీన్ని ‘పబ్లిసిటీ’ కింద వాడుకోవటం ఒక్కటే మార్గంగా తోస్తోంది. ఇక్కడ అన్ని సినిమాలూ ‘లీక్’ కావటం లేదు. జనం మెచ్చిన.. అభిమాన ‘తార’ల చిత్రాలు మాత్రమే ‘లీక్’ వెలుగు చూస్తున్నాయి.
దీనికి కారణం ఏమిటి?
‘కబాలి’ విషయానికొస్తే.. ‘రజనీ’ స్టైల్ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఉత్కంఠ ‘లీక్’కి దారితీసిందా? ఎవరో ఆకతాయి చేసిన దుందుడుకు ‘బలి’వల్ల కబాలి కథ అడ్డం తిరిగిందా??
‘లీక్’ల వల్ల వొనగూడిన ప్రయోజనం ఏమిటి?
ఏమీ ఉండదన్నది ఇక్కడ స్పష్టాతిస్పష్టంగా చెప్పుకోగల మాట. ‘నెట్’ తెరపై ఆయా పాత్రల కదలికలన్నీ స్పష్టంగానో అస్పష్టంగానో కనిపించినప్పటికీ.. ‘కథ’ ఏమిటన్నది అర్థంకాదు. రీరికార్డింగ్‌లో వాయిస్ గాలి దుమారంలా ఉంటుంది. అంటే ఆ ‘లీక్’లన్నీ అతుకుల బొంతలా అనిపిస్తుంది. ఇది చిత్ర విజయాన్ని ఏ విధంగానూ దెబ్బతీయదు. కాకపోతే ‘పబ్లిసిటీ’లో దీన్ని వేలెత్తి చూపిస్తేనో.. సినిమాని చూట్టానికి ఎవరూ ముందుకు రారు.
‘కబాలి’ విషయానికి వస్తే.. ‘లీక్’ మాటేమోగానీ.. ఇది హిట్టా? ఫట్టా? అన్నది కొన్ని రోజులు గడిస్తే గానీ చెప్పలేం.
‘అత్తారింటికి దారేది?’ సినిమా ‘లీక్’ వల్ల ఆడకుండా పోలేదు.
‘ఉడ్‌తా పంజాబ్’కి ఎన్ని అవరోధాలు కల్పించినా.. ఏకంగా సినిమా మొత్తాన్ని ‘నెట్’లో పెట్టినా.. వసూళ్లలో ముందంజలోనే ఉంది.
‘సైరత్’ కూడా అంతే. ‘బాహుబలి’ సాధించిన విజయాన్ని ఏ ‘లీక్’ చెరిపేయగలిగింది?!
* * *
‘లీక్’ అనేది పబ్లిసిటీలా పనికొస్తుందేమో చూద్దాం అన్నది తాజా పరిస్థితి. కాబట్టి - న ‘లీక్’ న భవిష్యత్ అంటారేమో రేపు.
................
‘సైరత్’ - మరాఠీ చిత్ర చరిత్రలో సంచలనం. లొకేషన్స్ సైతం ‘టూరిస్ట్ స్పాట్’గా మారిన ఒకానొక ప్రేమ కథా చిత్రం. 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై.. 100 కోట్ల క్లబ్‌కి చేరటం వెనుక ‘కథ’ మాటేమోగానీ.. ‘సైరత్’ కూడా ‘లీక్’ అయ్యంది. మరి లీక్ ప్రభావం సినిమాపై చూపించిందా? అంటే ఏం చెప్పాలి. సెన్సార్ కాపీ నెట్‌కి వచ్చేసినా.. థియేటర్లలో కలెక్షన్లు తగ్గలేదు.

-BNK