మెయిన్ ఫీచర్

నవయుగ కవి చక్రవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవికోకిల బిరుదాంకితులు.. కవితా విశారదులు.. విశ్వకవి సామ్రాట్.. మధుర శ్రీనాధ బిరుదాంకితులు.. కళాప్రపూర్ణులు అయన గుఱ్ఱం జాషువా పేరెన్నికగన్న పద్య సాహితీ దురంధరులు. ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో తొలి తరం కవుల్లో పలువిధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయమూర్తి. రాపిడిపడ్డ జీవితంలో గుబాళించిన కవితా ప్రతిభతో రాణించిన కవి దిగ్గజుడు. పలు ఖండికలు రచించిన కవి దిగ్గజుడు. కొందరి కవుల జీవితం వడ్డించిన విస్తరిలా వుంటే, వీరి జీవితం మాత్రం తద్భిన్నంగా వుండి, విస్తరికి-వడ్డనకు వెదుకులాడిన జీవితం జాషువా గారిది. తన జీవితంలో చేదును, తీపిని చవిచూసినవాడు. తల్లి లింగమాంబ- తండ్రి వీరయ్యల గర్భశుక్తి ముక్త్ఫాలంగా 1895 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తల్లిదండ్రుల కులాంతర వివాహం వలన దుర్భర దారిద్య్రం. కులమతాల సంగ్రామం మధ్య పోరులో జీవనయాత్ర సాగించాడు. అయినా తల్లి గారాబంగా పెంచింది. ప్రతిఫలంగా జాషువా తన మాతృమూర్తిపై మమకారంతో తనకు పద్య కవిత్వం అబ్బిందని ఆ తీరును గురించి ఒక చక్కని పద్యంద్వారా లోకానికి తెలియజేశాడు.
గీ॥ పుణ్యముల తల్లి - నీ పాల పుష్టికతన
కవన బలిక నాజిహ్వ నవతరించె॥
బాల్యంనుండి కులమతాల రుచి చూసిన కవివరేణ్యుడు. కులం వలన కల్గిన అవమానం, దారిద్య్రం వలన కలిగిన దైన్యం ఈ కవి మనసును గాయపరచినా, సామాజిక దురన్యాయమును ఎదిరించి ధైర్యంగా నిలిచిన సాహసకవి. కుల వ్యవస్థ, ఆర్థిక అసమానతలవలన గ్రామానికి వెలుపల, శ్మశానం దగ్గర నివాసం. విపరీత, విషాదకర పరిసరాలు తన జీవితంపై నైరాశ్యాన్ని కల్గింపలేదు. కాగా ఆయనలో తాత్త్విక దృష్టిని దృఢతరం చేశాయి.
స్వగ్రామంలోని నాటక ప్రదర్శనవేళ అంటరానివారికి ప్రవేశం లేదు అన్న ప్రకటన ఆయనలో ప్రతిఘటనాత్మక వైఖరినీ, ఓర్పు పెరుగుటకు తోడ్పడినది. దుస్సహమైన సందర్భాలే, సంఘటనలే, విషాద కావ్య రస బీజాలుగా పరిణమించి, ఆయన పాలిట ఆంధ్రలో వరప్రదాతలైనాయని ఓ పద్యం ద్వారా చెప్పారు.
‘‘విశ్వ సుఖములను భరింపక చేతులు సాచి పేరెమెత్తు
నాయభీప్సితముల- గాయపఱు మాయ కట్టుబాట్లకు
నంజలింపదయ్యెనాదు-లేత మనసు’’ అని ఆవేదన చెందారు. తనకు యిద్దరు గురువులంటూ ఒకరు పేదరికం, మరొకరు కులమత భేదం అన్నారు. పేదరికం సహనాన్ని నేర్పితే, మరొకటి శక్తిని పెంచిందని వివరించారు. ఆయనకు ఆరోజుల్లో గురుత్వం వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. రావడానికి సాహసించలేదు.
తానుగా చాటుగా మశీదులో గ్రుడ్డి దీపపు వెలుగులో పురాణేతిహాసాలు చదువుకొని, భాషలో నేర్పును, మెలకువలనూ గ్రహించిన సాధకులు. ఆ స్ఫూర్తితో ధృవవిజయం, హిమదమర్క పరిణయ నాటకాలు- పలు ఖండికలు రచించి యశస్సు గడించారు. తన తండ్రిని కులంనుండి వెలివేసినపుడు ఆవేదనపడ్డారు. పశుపక్ష్యాదులు- కొండకోనలు- ఆయనకు మిత్రులై, తన కవిత్వానికి, తన రచనలకూ కవితా వస్తువులైనాయి. అసమానత అన్యాయం- అమానుషత్వం తన హృదయాన్ని కదిలించగా వీటిని తన కవితల ద్వారా వ్యక్తపరిచారు.
సవర్ణ హిందువుల నిరసన-స్వమతస్థుల తిరస్కారాలనూ చవిచూశారు. తనకంటబడ్డ పద్యకావ్యంబు సాధించి చదువకుండ వదలలేదు. కవిత్వం చెప్పువారు ఎవరైనా కనిపిస్తే, వారివలన కవిత్వం వినిపించకుండా వారిని వదలలేదు. ఆనాటి సమాజ పరిస్థితులే ఆయనను కవిగా రూపొందించినాయి. తన తమ్మునితో కలిసి నేత్రావధానం నేర్చుకొని, కనుల సౌంజ్ఞలనుబట్టి ఆ పద్యాన్ని పాద భంగంలేకుండా వ్రాయడం నేర్చారు. గ్రామంలో నేత్రావధానం చేస్తే భాగవత పద్యాన్ని ఆసామీ పేరువచ్చురీతిగా ఆశువుగా చెప్పి మెప్పుపొందారు. జూపూడి హనుమచ్ఛాస్ర్తీగారి కరుణకు పాత్రుడై కష్టపడి అష్టావధానాన్ని సాధనచేశారు. కందుకూరివారు వారిని ఆశీర్వదిస్తూ
‘‘కుల భేద శాకినుల్ మెదలెడు దేశమిద్ది
నిను మెచ్చరు- మెచ్చిన మెచ్చకున్న శారద నినుమెచ్చె
మానకు ముప్రాప్త కవిత్వ పరిశ్రమంబులున్’’ అని ఊతమిచ్చారు. 1933-34 సం.లో రైల్లో వెంకటగిరికి ప్రయాణంలో జాషువా కవిత్వాన్ని మెచ్చుకున్న వ్యక్తియే చివరకు నీదేకులమని ప్రశ్నించి, చివాలున లేచిపోయాడు. ఈ విషయం రాజుగారి సమక్షంలో జాషువాగారు పడిన ఆవేదన యిలా వుంది.
ఉ॥ నా కవితా వధూటి- వదనంబు నెగాదిగజూచి రూపురే
ఖా కమనీయ వైఖరులుగాంచి- -్భళీభళియన్నవాడె, మీ
దే కులమన్న, ప్రశ్న వెలయించి- చివాలున లేచి పోవుచో
బాకున గ్రుమ్మినట్లగును- పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్‌॥ అంటూ గుణములకు వంగడంబు కారణంబుగాదు- కాజాలదన్నారు. మరొక పద్యంలో -
గీ॥ కులమతాలు గీచుకొన్న గీతలు జొచ్చి
పంజరాన కట్టు బడను నేను
నిఖిల లోకమెట్లు- నిర్ణయించిన నాకు
తిరుగులేదు- విశ్వనరుడ నేను’’ అని ధీమాగా పల్కినారు.
నాటకమండలి నిర్వాహకులు ‘సత్యవోలు గునే్నశ్వరరావు గారిని దర్శించి, ‘నాటక కర్త’గా రూపొందారు. వారిని గురువుగా భావించి ‘రుక్మిణీ కల్యాణం’ నాటకం వ్రాశారు. 1919లో వినుకొండకు చేరి మిత్రుని సాయంతో గుంటూరు వచ్చి మిషన్ పాఠశాలలో తెలుగు పండిట్‌గా చేరారు. ఎనిమిదేండ్లు పనిచేశారు. ఆ కాలంలోని సాహిత్య పత్రిక ‘్భరతి’వారి సాహిత్య కృషిని వెల్గులోనికి తెచ్చింది. వీరి రచనలు కావ్య ఖండికలు రసజ్ఞుల దృష్టినాకర్షించాయి.
ఒకమారు గుజరాత్‌లోని వార్ధాలో గాంధీజీ దర్శనంకోసం వెళ్ళినపుడు అక్కడున్న ఓ జర్మన్ పండితునికి, ఒక రాజకీయ నాయకుడు వారిని చూచి, ‘‘హి ఈజ్ ఏ క్రిష్టియన్ పొయెట్’’ అని పరిచయం చేశారట. ఆ ఆవేదనను సహించి, విమర్శలకు లెక్కచేయనన్నారు. నవ్యాంధ్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తానని పలికారు. ఆ సందర్భంలో తన భావాలు ఒక పద్యంలో తెలిపారు.
భారతీయ మహిళాభ్యుదయానికి అవరోధమైన కట్టుబాట్లను గర్హించారు. తన రచనలో భారతీయ మహిళకు నీరాజనం పట్టారు. తన జీవితంలో సుఖ దుఃఖాలను సమానంగా తూచి చూచుకొనే తత్త్వంగలవారు.
‘‘సిరి నిజమ్ముగ వట్టి టక్కరిది సుమ్ము’ అన్నారు. జంతుబలులను కొలువులను వ్యతిరేకించేవారు. సంఘంలో సాంఘిక విలువల్లో మార్పురావాలని నమ్మారు. కళలు మానవుని సర్వతోముఖ వికాసానికి తోడ్పడాలనే భావించారు. విశ్వనరునిగా సంస్కరణభావాలు- సంకుచిత తత్త్వం మీద తిరుగుబాటు చేశారు. విశ్వమానవత వైపు వ్యక్తిగా, కవిగా ఆయనను నడిపించాయి. పలు గ్రంథ రచయితగా మార్గనిర్దేశనం చేశాయి. తన కవిత్వం సమాజంలోని ఏ అంశాన్ని విడిచిపెట్టని ధీశాలి ప్రజ్ఞావంతుడు. కవి ఒక్కడే శాశ్వతుడని నొక్కివక్కాణించారు. మధుర శ్రీనాథునిగా విశ్వకవిగా వెలుగొందిన గుఱ్ఱం జాషువాగారు 124వ జయంతి సందర్భంగా నవయుగ కవి చక్రవర్తిగా స్మరించుకోవడం తెలుగువారి అదృష్టం.
- పి.వి. సీతారామమూర్తి,
9490386015
*
చిత్రకారుడు :
ఎస్. శంకరనారాయణ