మెయిన్ ఫీచర్

రచనలో కొత్తదనమే నా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగసూరి వేణుగోపాల్!.. ఈ పేరు వింటే పాపులర్ సైన్స్ రచనలు, టి.వి. ముచ్చట్లు, ఛానళ్ళ హోరుపై విశే్లషణలు, పర్యావరణ సమస్యలపై చైతన్యపూరిత రచనలు గుర్తొస్తాయి. ఆకాశవాణిలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నుండి తిరుపతి ఆకాశవాణి కేంద్రం స్టేషన్ డైరెక్టర్ స్థాయి వరకు అంచలంచెలుగా ఎదుగుతూ, ఒదుగుతూ... నేడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుండి ‘తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కారం’ అందుకున్న సందర్భంగా ఆంధ్రభూమి ‘సాహితి’ జరిపిన ఇష్టాగోష్టి ఇది.
ఒ రచయితగా.. సమకాలీన సమస్యలను ఎత్తిచూపే కాలమిస్టుగా ప్రఖ్యాతి పొందిన మీరు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం స్టేషన్ డైరెక్టర్ నుండి పదోన్నతి పొందిన సందర్భంలోనే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంనుండి ‘తెలుగు భాషా పురస్కారం’ లభించడంపై మీ స్పందన?
గిడుగు రామ్మూర్తి పంతులు పేరున ఇచ్చిన ఈ ‘తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కారం’ నా కృషికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తాను. ఇది నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇంతవరకు వివిధ అంశాలపై నేను విశే్లషించి రాసిన వ్యాసాలకుగాను, ప్రచురించిన పుస్తకాలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. నా రచనలు ముఖ్యంగా విజ్ఞానవంతంగా సాగడం.. అలాగే టెలివిజన్ మాథ్యమంపై, పర్యావరణంపై ప్రజల్ని చైతన్యపరిచే రీతిలో నా రచనలు సాగడం, ఇంకా సాహిత్య సంబంధమైనవి, భాషా సంబంధమైన నా రచనలు తెలుగు ప్రజల్ని మెప్పించాయని నేను భావిస్తున్నాను. ఆ కృషి ఫలితమే నాకీ గుర్తింపు లభించిందని నా భావన.
ఒ మీ సైన్స్, పర్యావరణ రచనలు ప్రస్తుత సమాజంపై ఏ విధమైన ప్రభావం చూపించాయి?
వస్తువు కొత్తది. వస్తువుతోపాటు ఇక్కడ వాడే పదజాలం కూడా కొత్తది. అప్పటికప్పుడు వార్తా పత్రికలలో వినబడే విషయాలపై అర్థం చేసుకోవాలంటే, ఆయా విభాగాల నుండి కొన్ని వౌలిక విషయాలు చదివి అర్థం చేసుకొని, వాటిని వర్తమాన సంఘటనలకి అనువర్తించి తెలుగు ప్రజలకి అర్థమయ్యే పద్ధతిలో చెప్పాలి. విదేశీ పత్రికల నుండి లభించే విషయ సేకరణలో మూల భాషను స్వీకరించి దానిని తెలుగులో వ్యాస రూపంలో అందించడంలో నేను సఫలీకృతుడ్ని అయ్యానని భావిస్తున్నాను. ఉదాహరణకి టీవీ ఛానళ్ళు వచ్చిన కొత్తలో డి.టి.హెచ్. అంటే ఏమిటో.. అది ఎలా పనిచేస్తుందో వివరించడం, ఎల్.ఇ.డి అంటే, కేబుల్ టివి అంటే ఏమిటో ప్రజలకు వివరించే సందర్భంగా నా రచనా కృషి స్పష్టంగా కనిపించిందని అందరూ మెచ్చుకున్నారు. 1997 నుండి ఆంధ్రభూమి దినపత్రికలో మొట్టమొదటిగా తెలుగులో మీడియాపై, టెలివిజన్‌పై ధారావాహికంగా నేను రాసిన వ్యాసాలు చాలా పాపులర్ అయ్యాయి. అవి 7 పుస్తకాలుగా వెలువడి ఎందరో యూనివర్సిటీ విద్యార్థుల పరిశోధనలకు ఎంతో ఉపకరించాయి. సమకాలీన సంఘటనలపై పరిశోధన చేసి ప్రజలకి అందించడమంటే నాకు చాలా సరదా అయిన, ఆసక్తి కలిగించే విషయం. నలుగురూ నడిచే బాటలో కాకుండా కొత్తదనం అందించే రచనలు చేయడమే నా లక్ష్యం.
ఒ టీవీ ఛానళ్ళపై కూడా మీ విశే్లషణా బాణాలు ఎక్కుపెట్టినట్లున్నారు కదా?
ఈ కాలంలో పత్రికలు ఉన్న యాజమాన్యాలు టి.వి.చానళ్ళు, టి.వి. ఛానళ్ళు ఉన్నవాళ్ళు పత్రికలు కలిగుంటున్నారు. ఆ కారణంగా వార్తని సమాచారంగానే చెబుతున్నారు గాని వాటిపై లోతైన విశే్లషణ కొరవడుతోంది. అటువంటి తరుణంలో నేను ఈ ఛానళ్ళ పోటీతత్వంపై కొన్ని వ్యాసాలు 14 సంవత్సరాల పాటు రాసాను. విమర్శలను ఎక్కుపెట్టడానికి మీడియా సిద్ధపడుతున్నది గాని తమ గురించి వచ్చిన విమర్శలను స్వీకరించే పరిస్థితులలో లేదు. అయితే నేడు సోషల్ మీడియా వచ్చిన తరువాత విమర్శ అన్నది ప్రజలనుండి ఎక్కువగా ఫేస్‌బుక్, వాట్సప్‌ల నుండి ముక్కుసూటిగా వస్తున్నది. మేం రాయలేని విషయాలపై ప్రజలు చాలా చక్కగా విమర్శనాత్మకంగా చెప్పడంలో వెనుకాడటం లేదు. దానికి ప్రతిస్పందనల రూపంలో కూడా తక్షణం లైక్‌ల ద్వారా ప్రజలు స్పందిస్తున్నారు.
ఒటీవీ మీడియా కారణంగా వాడుకలో తెలుగు తగ్గుముఖం పడుతోందంటున్నారు..? ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు?
కొంతవరకు నిజమే. పత్రికలలో వ్యావహారిక భాష పెంపొందింపబడుతున్నది అన్నది సత్యం. టీవీ ఛానళ్ళ కారణంగా వాడుకలో ఆంగ్ల పదాల సంఖ్య పెరుగుతున్నమాట వాస్తవమే గాని పూర్తిగా దానిని నిందించలేం. అంతర్జాతీయ ఛానళ్ళ కారణంగా మన తెలుగు ఛానళ్ళలో కూడా ఆ ప్రభావం పడుతున్నమాట వాస్తవమే. కాని తెలుగుకు పెద్దపీట వేసే ఛానళ్ళూ ఉన్నాయి. నిజానికి పత్రికలకంటే నేడు టీవీ ఛానళ్ళ భాషా వినియోగం ఎక్కువగా ఉన్నది. అది ప్రజలపై ప్రభావం చూపుతోంది. నిజానికి తెలుగు భాష చాలాచోట్ల నష్టపోయింది. మొదట సంస్కృతం కారణంగా నష్టపోతే తర్వాత ఆంగ్లం కారణంగా దెబ్బతిన్నది. ఇప్పటికే ప్రజలలో చొచ్చుకుపోయిన పదాల్ని మార్పుచేసి కొత్త తెలుగు పదాలను సృష్టించడంవల్ల వాళ్ళని మరింత ఇబ్బందికి గురిచెయ్యడం తప్పించి మరొకటి కాదని నా ఉద్దేశం. అయితే భాషని బ్రతికించుకోవాలంటే ఎప్పుడూ ముందుగా భాషా పండితుల సేవ అత్యవసరం. కాలానుగుణంగా ఇతర భాషలనుండి వచ్చే కొత్త పదాలపై కొత్త నిఘంటువులు సృష్టించుకోవాలి. వ్యాకరణాలలో మార్పులు చేసుకోవాలి. ఇతర భాషలలో వచ్చే వాక్యాలకు సరైన కొత్త పదాలు ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాలి. అలాగే పత్రికలు, ఛానళ్ళు ఒక సామాజిక బాధ్యతగా ముందుచూపుతో వ్యవహరిస్తూ, వాటిని ప్రజల మధ్యకు తీసుకుపోవడంలో ప్రధాన పాత్ర వహించాలి.
ఒ ఒకే పేరును లేదా ఒకే పదాన్ని ఒక్కొక్క పత్రిక లేదా ఛానల్ ఒక్కో రకంగా వాడటంపై మీరేమంటారు?
దీనిలో దార్శనికత ఉండాలి. ఉదాహరణకి నేడు ఒక నగరం పేరో, లేదా ఒక వ్యక్తి పేరో ఏది సరైనదో నిర్ణయించి, పరిశోధించి దానిని అందరూ వాడుకలోకి తీసుకువస్తే ప్రజలకు, తద్వారా భాషకు మేలు జరుగుతుంది. కాని నేడు ఒక్కొక్క పత్రికవారు ఒకే పదాన్ని వేర్వేరుగా రాసి ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని విధంగా ప్రజల్ని తికమక పెడుతున్నారు. అలాకాకుండా భాషవల్ల ఉత్పన్నమైన పదాన్ని ఏకాభిప్రాయానికొచ్చి వాడుకలోకి తీసుకువస్తే భాషకు మేలు జరుగుతుంది. చిన్నయసూరి లాంటివాడే అవసరమైనప్పడు మాట్లాడే విధానాన్నిబట్టి వ్యాకరణ సూత్రాన్ని మార్పుచేసుకోవాలన్నారు. అలాగే ప్రజలకు భావం అర్థంకావటమన్నదే ప్రధానం కనుక తికమకపెట్టే అస్పష్ట భావజాలాన్ని సృష్టించడం కాకుండా నిజనిర్ధారణ తదుపరే కొత్త వాక్యం మన భాషలోకి తీసుకురావాలి. చాలామంది ఆంగ్ల పదాలకి సరిపోయే పదాలు తెలుగులో సృష్టించలేం అంటారు. కాని 1970లోనే అప్పటి కథలలో ‘రివాల్వింగ్ ఛైర్’ అనే ఆంగ్ల పదానికి సరిసమానమైన తెలుగు పదం ‘తిరుగాడే కుర్చీ’ అనే వాక్యాన్ని సృష్టించి వాడడం కనిపిస్తుంది. అంటే మనం గుర్తించలేకపోతున్నాం గాని ఆనాటినుండే ఆంగ్లానికి సరైన తెలుగు పదాల సృష్టి జరుగుతున్నదని గ్రహించలేకపోతున్నాం. కాకపోతే నేటి పండితులలో, విమర్శకులలో కాసింత ఆలసత్వం ఉంది. దానిని కొంత వదిలించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తెలుగు వెలుగుకు ఎంతో తోడ్పడుతుంది.
ఒ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి తెలుగు ఎలా ఉంది? తెలుగు భాషను వెలుగొందించేందుకు ప్రభుత్వపరంగా చేపట్టవలసిన కర్తవ్యం ఏమిటని మీరు భావిస్తున్నారు?
ఆంగ్ల మాధ్యమం చదవడం ద్వారా ఉపాధి కలుగుతుందన్న భావన ప్రజలలో బలీయంగా ఉంది. అది పోగొట్టాలంటే తెలుగు మాథ్యమంలో చదివినా ఉపాధి కలుగుతుందన్న భావన ప్రజలలో కలిగించే స్థాయిని ప్రభుత్వం చేపట్టే చర్యలవల్ల కలిగించాలి. అప్పుడు తెలుగు నిజంగా వెలగడం ఖాయం. అలాగే ప్రాథమిక స్థాయినుండి ఇంటర్ వరకు తెలుగు మాథ్యమంలో చదవాలనే నిర్బంధ విద్య తప్పనిసరి చేయడం కూడా ప్రభుత్వం చేపట్టవలసిన తక్షణ కర్తవ్యంలో ఓ భాగంగా చెప్పాలి.
ఒ తెలుగుకు ఆదరణ లేదంటున్నారు అందరూ. కాని నేడు తెలుగులో గతంలోకంటే పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వెలువడుతున్నాయి కదా..?
అదే ఆశ్చర్యం. ప్రజలు తెలుగు భాష విడవటం లేదు. కాకపోతే ఉపాధి కొరకు పరభాష వ్యామోహంలో ఉన్నారంతే. లేకపోతే ‘పెద్దబాలశిక్ష’ ఇన్నిసార్లు పునర్ముద్రణ అయ్యేది కాదు కదా!
ఒభవిష్యత్‌లో మీ రచనలు...?
భవిష్యత్ తరానికి మన సాహిత్య సంపదను తెలియచేసే బృహత్తర కార్యక్రమంలో తలమునకలై ఉన్నాను. నిరంతరం తెలుగు భాషా పరివ్యాప్తికి నా వంతు కృషిచేస్తూనే ఉంటాను.

- చలపాక ప్రకాష్, 9247475975