మెయిన్ ఫీచర్

సినిమా పరిశ్రమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ఇండస్ట్రీ కానే కాదు. ఇండస్ట్రీ అంటే దానికి ప్రభుత్వం లైసెన్స్ కావాలి. ఉద్యోగులకు, కార్మికులకు పండుగ సెలవులు, నెలజీతాలు, ఇంక్రిమెంట్లు, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడం వంటి నిబంధనలు వుంటాయి. ఉద్యోగ భద్రత వుంటుంది. మరి పరిశ్రమ అని పిలుచుకుంటున్న సినిమా నిర్మాణానికి ఇవి ఏమైనా వున్నాయా? లేవుకదా? మరి పరిశ్రమ అంటారేంటి?
‘రాజకీయాల తర్వాత అంతటి గందరగోళం సినిమాలే!’అన్నాడు ముళ్ళపూడి వెంకటరమణ.
సినిమా నిర్మాణం 24క్రాఫ్టుల సమాహారం. వీరందరికీ విడివిడిగా రిజిష్టర్డ్ సంఘాలున్నాయి. వారిలో వారికి పేచీ వచ్చినప్పుడో, ఇతర శాఖల సభ్యులతో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడో, అగ్రిమెంట్ ప్రకారం నిర్మాత పారితోషికం చెల్లించనప్పుడో తమతమ సంఘం నడిపే ప్రెసిడెంట్‌నో, సెక్రటరీనో కలిసి ఫిర్యాదుచేస్తారు. పరిష్కారాలు జరుగుతూ వుంటాయి. సంఘాలుగూడా పరిష్కరించలేని చిక్కుసమస్యలు వున్నప్పుడు కోర్టులకు వెళ్తుంటారు. ఐతే సినిమా నిర్మించడానికి వచ్చే నిర్మాతకి ఇక్కడ ఎవరి లైసెన్స్ అక్కరలేదు. ఆఫీసు ఓపెన్ చేసి, నిర్మాతల మండలిలో సభ్యత్వం తీసుకుంటే చాలు. దశాబ్దాల క్రితం సినిమాలు తీయడం మానేసిన నిర్మాతలు అయినా పరిచయ పత్రంమీద సంతకంచేసి ఇస్తేచాలు సభ్యుడు అయిపోయినట్లే.

ఆయనకు అసలు ఆఫీసు వుందా? అప్లికేషన్‌లో యిచ్చిన అడ్రసులో ఆయన వుంటున్నాడా? సినిమా తీయడానికి ఆయనకి లోగడ ఏదైనా అనుభవం వుందా? ఏ శాఖలోనైనా పనిచేశాడా? అంత డబ్బు వున్నవాడేనా? ఇటువంటివి ఎవరూ అడగరు.
సరే! ఇదంతా ఎందుకు అంటే సినిమాలు తియ్యడానికి ఏ అర్హతా అవసరం లేదు. ప్రభుత్వం లైసెన్స్ అక్కర్లేదు అని చెప్పడానికే.
సినిమా నిర్మాణం గ్లామర్ ప్రపంచం కాబట్టి దీపం పురుగుల్ని ఆకర్షించినట్టు ఆకర్షిస్తుంది. దాని ఆకర్షణలో పడి ఎన్నో జీవులు నాశనమవుతూ వుంటాయి. సినిమా నిర్మాతల లిస్ట్‌లోవున్న వాళ్ళలో ఐదోవంతువాళ్ళు మాత్రమే రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తూ వుంటారు. కొన్ని సినిమాలు ఫెయిలైనా, మరికొన్ని హిట్టవుతూ వుంటాయి కాబట్టి ఇబ్బందిలేకుండా కంపెనీలు నడుపుతుంటారు. కొత్త నిర్మాతకు అట్టా లేదు. తొలి సినిమాలో నష్టపోతే మూటాముల్లె, పెట్టెబెడా సర్దుకొని పోవాల్సిందే. ప్రతి ఏడూ పాతికమంది నిర్మాతలు నష్టపోయి వెళ్ళిపోతూ వుంటే, కొత్తగా మరొక పాతికమంది వచ్చి చేరుతూ వుంటారు. అందుకే సినిమా నిర్మాణం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా కళకళలాడుతూ వుంటుంది.
సినిమా నిర్మాణం ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందనీ, వారికొక కోడ్ ఆఫ్ కాండక్ట్ వుంటుందనీ, ప్రతిభావంతులకు మాత్రమే అవకాశం వుంటుందనీ, నమ్మి ఎవరూ రారు. అలా వచ్చారంటే
వాళ్ళు అమాయకులనీ, జీవితానుభవం లేనివారనీ లేదా ఓవర్‌కాన్ఫిడెంట్ వున్న వాళ్ళయినా అయివుండాలనీ అనుకోవచ్చు. నటీ, నటులుగా కెరీర్ మలుచుకోవాలనుకునే యువతీ, యువకులకు శిక్షణ ఇవ్వడానికి పూనా ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్, మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రభుత్వ శాఖలు, కొన్ని యూనివర్సిటీలలో థియేటర్ ఆర్ట్ కోర్సులు, మరికొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు వున్నాయి. ఇవన్నీ కాకుండా చాలా పట్టణాలలో, నగరాలలో నాటక సమాజాలు వున్నాయి. తొలి తరం నటీనటులు దాదాపుగా అంతా నాటకాలలో నటించి సినిమా రంగానికి వచ్చినవాళ్ళే. నాగయ్య, నారాయణరావు, నాగేశ్వరరావు, రంగారావు, రామారావు, కృష్ణ, శోభన్‌బాబు, మోహన్‌బాబు వంటి హీరోలంతా నాటకాలలో రాణించినవారే. రజనీకాంత్, చిరంజీవి తరంనుంచి ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్‌లలో నటన నేర్చుకుని సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. అంజలి, సావిత్రి, జమున, శారద వంటి నటీమణులు నాటకాలలో రాణించినవారే. సినిమా నేపథ్యంలో తెలుగులోనే ఎన్నో నవలలు ప్రచురితమయ్యాయి. రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్ళు’ కృష్ణాపత్రికలో, ఎన్.ఆర్.నంది ‘సినీ జనారణ్యం’ ఆంధ్రజ్యోతి వీక్లీలో, ఈ వ్యాస రచయిత నవల ‘స్టార్‌డస్ట్’ స్వాతి వీక్లీలో, ఊర్వశి చతుర మాస పత్రికలో, ఇటీవలే ప్రభాకర్ జైనీ, సినీవాలీ, నవ్య వీక్లీలో వచ్చాయి. ఇంకెన్నో నవలలు, కథలు సినిమా రంగం గురించి పత్రికలలో వచ్చాయి. అందులోని మంచి చెడ్డలు, మాయలు, మోసాలు విశే్లషించాయి.
ఎటువంటి ప్రతిభ, సినీ రంగంలో సహాయం చేసేవాళ్ళు లేకుండా కేవలం అందంగా వున్నావని ఎవడో మోసగాడు పొగిడితే ఇంట్లో చెప్పకుండా వచ్చి అమ్మాయిలు, సినిమా గ్లామర్‌తో ఇంట్లో పెద్దలకు ఇష్టంలేకపోయినా వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకునే యువతులకు కొదవలేదు. వీరికి అనుభవమైతే గాని తత్వం బోధపడదు. చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ, ఇక్కడ గొప్ప కెరీర్ లేదని తెలిసినా, ఇంటికి పోవడానికి మొహంచెల్లక మనుగడ సాగించే జూనియర్ ఆర్టిస్ట్‌లు ఎందరో. అవకాశం ఇస్తామని బ్రోకర్లు వంచిస్తుంటారు. గతిలేక లొంగిపోవాల్సిన దీనమైన పరిస్థితి ఎదురై మనుగడ సాగిస్తుంటారు. వీరే దీపం పురుగులు. ఇక్కడకు వచ్చే వేలాది మందికి అందరికీ సక్రమంగా అవకాశాలు రావడం అసంభవం.
ఇప్పుడు అమ్మాయిలు చదువుకుని అన్నిరంగాలలో ఉద్యోగాలు సంపాదించుకుని గౌరవంగా జీవించే అవకాశాలు ఎన్నో వున్నాయి. అలాగే ఎందరో యువతులు వ్యాపారాలలోకి ప్రవేశించి, పరిశ్రమలు స్థాపించి విజయవంతంగా వేలమంది ఉపాధి చూపిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అవకాశాలు వుండగా ఏ ప్రతిభా, బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా గ్లామర్‌కి ఆకర్షింపబడి, మాయగాళ్ళ మోసాల బారినపడి, ఇక్కడికొచ్చి అష్టకష్టాలుపడడం ఎందుకు? సినిమాల్లోకి రావాలనుకుంటున్న యువతులు బాగా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరూ రెడ్‌కార్పెట్ పరిచి స్వాగతం పలకరు.
ఇరవైనాలుగు క్రాఫ్ట్‌లలో సభ్యులైనవారికి వివాదాలు మోసాలు ఎదురైనప్పుడు తమతమ సంఘ ప్రతినిధులను కలిసి వివరించాలి. పరిష్కరించుకోవాలి. అదే సరైన దారి. అక్కడ కుదరనప్పుడు కోర్టులు వున్నాయి న్యాయం చెప్పడానికి. అంతేగాని రాజకీయ నాయకుల దగ్గరికో, సామాజిక సేవకుల దగ్గరికో వెళ్ళి మొరపెట్టుకుంటే ఒరిగేదేమీ వుండదు. వాళ్ళేం చేస్తారు? టి.వీ. చానల్స్‌లో తెలుగు సినిమా భ్రష్టుపట్టిపోయిందనీ, అందరూ మోసగాళ్ళు, దొంగలు అని ఆవేశపూరితమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. చానల్స్‌కి ఫుటేజ్ వస్తుంది తప్ప బాధితులకు ఏం ఉపయోగం?
సినిమాకు సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు కొన్ని చానల్స్‌వాళ్ళు విశే్లషకులని కొందర్ని రప్పించి, దశాబ్దాల క్రితం సినిమాలు తియ్యడం మానేసినవాళ్ళనో కూర్చోబెట్టి చర్చలు సాగిస్తున్నారు. ‘సినిమా ముసుగు తీస్తానంటాడు’ ఒకాయన. సినిమా రంగం ముసుగులో లేదు. అంతా బహిరంగమే. అందులో వున్నవారికి అది తెలుస్తుంది. ఒడ్డునున్నవారికి లోతు తెలుస్తుందా?
కొందరు విశే్లషకులు ‘సినిమా పెద్దలు ఎందుకు ముందుకు రారు?’ అని డిమాండ్ చేస్తూ కేకలేస్తున్నారు. వీళ్ళెవరు డిమాండ్ చేయడానికి? సినిమా వారికి 24క్రాఫ్టులున్నాయి. అందులో సభ్యులు వారివారి ప్రతినిధుల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారు. సినిమా వ్యాపారం. ప్రభుత్వ ఆధీనంలో శాఖ కాదు. సినిమా పెద్దలనేవారు వ్యాపారస్తులు. వాళ్ళు వాళ్ళవాళ్ళ వ్యాపారాలలో బిజీగా వుంటారు. వాళ్ళకి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడే ముందుకు వస్తారు. సినిమా రంగంలో జరిగే చెత్త వ్యవహారాలన్నీ వాళ్ళెందుకు పట్టించుకుంటారు? ఒకవేళ పట్టించుకున్నా వాళ్ళ సలహాలు వింటారా? మీరెవరు మాకు చెప్పడానికి అంటే పరిస్థితి ఏంటి? పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లు వుంటుంది.
టి.వీ ఛానల్స్ వాళ్ళుగూడా ఏ శాఖలో వివాదం వుంటుందో ఆయా శాఖల ప్రెసిడెంట్, సెక్రటరీ వంటి బాధ్యులను చర్చలకు పిలవాలి. ఖాళీగా వుండే దివాలా ఎత్తిన నిర్మాతలను, ఏ పనీ లేని ఒడ్డున కూర్చుని రాళ్ళేసే వాళ్ళను కాదు.

- వాణిశ్రీ