మెయిన్ ఫీచర్

ఆ ఒక్కటీ ఎందుకూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పబ్లిసిటీలో వింత ధోరణి.. * టైటిల్ మాత్రమే తెలుగులో...
ఈమధ్యకాలంలో తెలుగు సినిమాల పేపర్ పబ్లిసిటీలో వింత ధోరణి మొదలైంది. సినిమా టైటిల్ మాత్రమే తెలుగులో వుంటుంది. సాంకేతిక నిపుణుల, నిర్మాత, దర్శకుల వివరాలన్నీ ఇంగ్లీషులో వుంటాయి. ఆ ఒక్కటి మాత్రం ఎందుకు? సినిమా టైటిల్ కూడా ఇంగ్లీషులోనే ప్రచురిస్తే, ఆ భాషకు న్యాయం చేకూర్చిన వారవుతారు. తెలుగు న్యూస్ పేపర్లు చదివే పాఠకులందరికీ ఇంగ్లీషు వచ్చి వుంటుందని వారి నమ్మకమేమో? పేరు తెలుగులో వుంది. హీరో ఒక్కడి బొమ్మ మాత్రమే పబ్లిసిటీలో వుంటే చాలు అనుకుంటున్నారా? హీరో ముఖం చూసి ప్రేక్షకులు ఎగబడి థియేటర్లకి వస్తారని ఐడియానా? ఇప్పుడు వారానికి ఒక కొత్త హీరో రంగుల తెరకు పరిచయమవుతున్నాడు. ఆ హీరో ఎవరో? పేరేమిటో కూడా సామాన్య ప్రేక్షకుడికి తెలీదు. కనీసం నిర్మాత, దర్శకుల పేర్లు చూసైనా వస్తారనడానికి అవకాశం లేదు. ఆ పేర్లు ఇంగ్లీషులో వుంటాయి. సినిమాకు హీరో ఇమేజ్ వుంటే చాలు, అదే సక్సెస్ మంత్రం అనుకుంటున్నారులా వుంది.
ఇంగ్లీషు పేపర్లలో పబ్లిసిటీకి ఈ ధోరణి వుండేది. అది సమంజసం కూడా. తెలుగుపేపర్లకి ఇంగ్లీషులో సాంకేతిక నిపుణుల పేర్లు ఎందుకు?
కేవలం హీరోలకే కాదు నిర్మాత, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ప్రేక్షకులలో ఇమేజ్ వుంటుంది. వారిని అభిమానించే వారుంటారు. వారి పేరుచూసి సినిమాకు వచ్చేవారు కూడా వుంటారు. నాగిరెడ్డి-చక్రపాణి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి పేర్లు తెలుగువారి ఆవకాయ, గోంగూర, పులిహోర అంతటి సహజమైనవిగా భావిస్తారు.
చదువురాని వర్కింగ్ క్లాస్‌వారు కూడా పబ్లిసిటీలో విజయావారి బేనర్, హనుమంతుడి జెండా, అన్నపూర్ణావారి లోగో, జెమినీవారి బూరలు వూదే ఇద్దరు బాలురు, ఎ.వి.ఎమ్. అక్షరాలు చూసి ఫలానా కంపెనీ బేనర్ అని గుర్తుపట్టి సినిమాకు వచ్చేవారు. వారి అంచనాలకు తగ్గట్టే సినిమాలో వినోదం వుండేది. మబ్బుల్లో దాసరి నారాయణరావు పేరు, ఫిలిం ముక్కమీద బాలచందర్ అనే అక్షరాలు తెలుగువారు మరిచిపోలేని తీపి గుర్తులు.
సినిమా డైలాగుల్లో ఎటూ సగానికి సగం ఇంగ్లీషు భాషనే వాడుతున్నారు. పేరుకి తెలుగు సినిమానే గాని పాత్రల వేషభాషలు ఇతర ప్రాంతాలకి చెందినవే. భాష మారిస్తే తప్ప తెలుగు, తమిళం, హిందీ సినిమాలకు తేడా లేదు. అచ్చమైన తెలుగు సినిమాలకు ప్రేక్షకులు ముఖాలు వాచిపోయి వున్నారు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చే తెలుగుదనం నిండుగావున్న సినిమాలు ఫిదా, రంగస్థలం వంటి వాటిని విజయవంతం చేస్తున్నారు.
తెలుగు వేషభాషలు తగ్గించడంలో టి.వీ. చానల్స్ కూడా యధోచితంగా పాటుపడుతున్నాయి. ఏదైనా పండుగనాడు మాత్రమే వారిని చీరల్లో చూడగలం. యువ యాంకర్లేగాక, ఆంటీ యాంకర్లు కూడా టాప్స్‌లోనే కనిపిస్తారు. స్టూడియోలలోనే గాక వీధుల్లో ప్రజల సమస్యల మీద కథనాలు షూట్ చేస్తున్నప్పుడు కూడా అదే వేషం. మాట్లాడేది ఎటూ సగం తెలుగే.
దేశ భాషలందు తెలుగు లెస్స, ఎందుకంటే దేశం తెలుగే అన్నాడు శ్రీకృష్ణ దేవరాయలు. ఒరిస్సానుంచి కేరళ వరకు ఆయన సామ్రాజ్యం. అక్కడ పర్యటించాడు కాబట్టి ప్రజలు మాట్లాడేది తెలుగు అని అనుభవ పూర్వకంగా తెలుసుకుని ఆ సుభాషితం చెప్పాడు.
మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేసి 1953లో ఆంధ్ర రాష్ట్రం సాధించుకున్నారు తెలుగువారు. అప్పుడే తెలుగు భాష పతనం మొదలైంది. తెలుగు ప్రజలు అత్యధికంగా వున్న పర్లాకిమిడి, కోరాపుట్, రాయగఢ్, గంజాం, బరంపురం వంటి ప్రాంతాలన్నీ ఒరిస్సాలో కలిసిపోయాయి. తను పుట్టిపెరిగిన వూరు పర్లాకిమిడి ఒరిస్సాలో కలిసిపోవడంతో కలత చెందిన గిడుగు ఇక అక్కడ వుండలేనని ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేశాడు. అటువంటి క్షోభ అనుభవించినవారు ఎందరో?
ఇప్పుడు తంజావూరు తమిళనాడులో వుంది. రాజుల పరిపాలనా కాలంలో అది తెలుగు ప్రాంతం. ఇప్పటికీ వేల సంఖ్యలో తెలుగు మాట్లడేవారి పల్లెలు అక్కడ వున్నాయి. హోసూరు, క్రిష్ణగిరి వంటి తెలుగు ప్రాంతాలు తమిళనాడులో కలిసిపోయాయి. అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అప్పుడప్పుడు తెలుగులో మాట్లాడుతూ వుండడం చూస్తున్నాం. చెన్నయ్ పేరే తెలుగు. చెన్నప్పనాయుడి పేరుమీద వున్న నగరం. ఇప్పటికే నలభై శాతం ప్రజలు తెలుగువారే నివాసం వున్నారు. ఇక కర్ణాటకలో రాయచూరు, బళ్ళారి వంటి జిల్లాలే కలిసిపోయాయి. బెంగళూరులో సగం మంది మాట్లాడేది తెలుగే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాట్లాడేవారు మాత్రమే తెలుగువారు అని లెక్కలేసి దేశంలో తెలుగు మాట్లాడేవారు నాలుగో స్థానంలో వున్నారని సర్కారీవారు లెక్కలు ప్రకటించడం శోచనీయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, ఒడిస్సా, కర్ణాటకల్లో తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా వున్నారని సర్కారువారు గ్రహించాలి. బ్రిటిష్‌వారు పరిపాలించే కాలంలో నాణాలమీద ఇంగ్లీషు, హిందీ తర్వాత ముద్రించిన భాష తెలుగు అని గుర్తించాలి. నాణాలమీద వారు బెంగాలీ, మరాఠీ భాషలు ముద్రించలేదు. భాషారాష్ట్రాల పేరుతో ఇతర రాష్ట్రాలలో వుండిపోయిన తెలుగువారి గురించి, వారి పిల్లలకు తెలుగు నేర్చుకునే అవకాశం రెండు రాష్ట్రాల పాలకులు పట్టించుకోవాలి.
ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలుగు మాధ్యమం పాఠశాలలు మాయమై, ఇంగ్లీష్ మీడియంతో కార్పొరేట్ స్కూళ్ళు చెలరేగిపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమా, టీ.వీలు కూడా తెలుగు భాషను చిన్నచూపు చూడడం విచారకరం.

- వాణిశ్రీ