మెయిన్ ఫీచర్

‘కాపీ’ కళ కాబోదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

============================================================
** ‘కాపీయింగ్’ అనేది సినిమా రంగంలో తరుచూ వినిపించే మాట. సినిమా మేకింగ్ దశలోనో.. టైటిల్ ఫిక్స్ చేసిన టైమ్‌లోనో.. సినిమా విడుదలకు ముందో అయ్యాకో.. ఎవరో అన్‌నోన్ పర్సన్ టు ఫిలిం ఇండస్ట్రీ.. తన కథకీ సినిమా దగ్గరగా ఉందో, తన కానె్సప్ట్ ఇదేననో, తన పాయింట్‌కిది మక్కీకి మక్కీగా ఉందనో, తను రాసుకున్న క్లయమాక్స్ ఈ సినిమా క్లయమాక్స్ జిరాక్స్ అనో.. వంటి బోలెడు స్టేట్‌మెంట్స్ చూసాం. చూస్తున్నాం. ఇంకా చూస్తామేమో కూడా! ‘‘కాపీ రైట్ ఈజ్ ఎ ఫామ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్, అప్లికబుల్ టు సర్టెన్ క్రియేటివ్ వర్క్’ అనేది మేధావులు సెలవిచ్చిన మాట. మరి ఇన్ని ‘కాపీ’ల వివాదాలు చెలరేగుతున్నా.. సదరు అన్‌నోన్ పర్సన్ పేరు పాపులవుతన్నా.. న్యాయం జరుగుతోందా? అంటే చెప్పలేం. కొండకో కాపీ చేసిన మహానుభావుడు, న్యాయం చేయాలని అంతరాత్మ ప్రబోధిస్తే పోనీలెమ్మని.. ఎలుగెత్తి హోరెత్తిన రచయితకి అంతో ఇంతో పారితోషికం ముట్టచెప్పి సమస్య సద్దుమణిగేలా చేసుకుంటున్న సందర్భాలున్నాయి. చాలామటుకు దర్శకులు (రచయితలు) ఆ క్రెడిట్ తమకే దక్కాలనో లేక స్టార్ ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందనో లేక అపవాదు మోయలేకో ఇన్నర్ ఫీలింగ్‌తో.. అవన్నీ కాకమ్మ కబుర్లని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. ఆ కొత్త రచయిత పాడేది కోకిల రాగం కాదని.. వట్టి అరుపులని స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు. ఒకవేళ ఆ పేరు లేని అనామకుడైన రైటర్ చెప్పింది, వాదించేది వాస్తవమై అతడి ప్రతిభకి చౌర్యం జరిగినట్లయతే అంతకుమించిన దారుణమొకటి లేదని సినీ విశే్లషకులంటున్నారు.
=============================================================

ఈ మధ్యే ఫ్రెష్‌గా ఓ రెండు వార్తలు మన చుట్టూ వైఫైలా చక్కర్లు కొట్టాయి. ఒకటి ‘ఆఫీసర్’ సినిమా విషయంలో, రెండవది ‘రంగస్థలం’ గురించి. ఆఫీసర్ సినిమా కథ పక్కాగా తనదేనంటూ ఓ యువ స్క్రిప్ట్ రైటర్ జయకుమార్ మీడియా ముందు తన ఆవేదన వెళ్ళగక్కారు. బలి కాబోతున్నానని తెలియని పొట్టేలులా కొండను ఢీకొన్నాడు కానీ రాంగోపాల్ వర్మ కించిత్ చలించలేదు. బదులివ్వలేదు. తేలు కుట్టిన దొంగయ్యాడని సినీ జనం చెవులు కొరుక్కున్నారు. ఎందుకంటే ఆ జయకుమార్ అనబడే బాధితుడు గతంలో తన ‘సర్కార్ 3 ’ సినిమా కానె్సప్ట్‌ని గురువుగారైన ఆ దర్శకుడికిచ్చి పేరు కూడా సినీ టైటిల్స్‌లో వేయించుకున్నాడు గనక! ఏ రకంగానూ రియాక్టవ్వని రాంగోపాల్‌వర్మ మీది అక్కసుతో నెట్‌లో గలీజు బొమ్మలను రాము తలకాయతో అటాచ్‌చేసి.. ఈ రకంగా రాము ఆగ్రహానికి లోనై ఏకంగా రివర్స్‌లో తన పైనే కేసు పెట్టించుకున్నాడా జయకుమార్. అలా తెలియనితనంతో అభాసు పాలయ్యాడు. న్యాయం పొందలేకపోయాడు (కథ గనుక అతనిదే అయితే).
ఇక యం.గాంధీ అనబడే రచయిత రంగస్థలం విడుదలైన చాలా రోజులకు తన ‘ఉక్కుపాదం’ రచన నుండి సుకుమార్ క్లయమాక్స్‌ని.. విలన్‌ని చావు బతుకుల్లోంచి హీరో కాపాడి తిరిగి అతడినే చంపడమనే కానె్సప్ట్.. ఎత్తేసాడని వాదన! రైటర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు కూడా చేసాట్ట. సుకుమార్ అందుకు బదులిస్తూ 1979లో వచ్చిన రజనీకాంత్ ‘్ధర్మయుద్ధం’ అనే సినిమా నుండి ఈ కానె్సప్ట్‌ని ప్రేరణ పొంది రంగస్థలంను రాసుకున్నానని వివరణ ఇచ్చాడు. మరి సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత ఆలస్యంగా ఈ కాపీ విషయాన్ని ఆ రచయిత తెరమీదికి ఎందుకు తెచ్చాడో కారణమేంటో అతడికే తెలియాలని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రంగస్థలం సినిమా టీమ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని.. ఇందులో ఎవరిదైనా హస్తముందేమోననని చాటుగా గుసగుసలాడుకున్నారు. నిజానిజాలు దేవుడెరుగు? సినిమా మాత్రం ప్రేక్షకుడెరుగు! ఏవంటారు?
దర్శక రచయిత కొరటాల శివ తీసిన శ్రీమంతుడు విషయంలో ఇలాగే జరిగింది. ఆ కథకి తన రచనకి దగ్గరి పోలికలున్నాయంటూ ఒకాయన ముందుకొచ్చాడు. వెనకాల పెద్దలు ఎంతో కొంత ఆయనకి ముట్టచెప్పి సర్దిచెప్పి సందడి సద్దుమణిగేలా చేశారని వినికిడి. అంతెందుకు, అదే డైరెక్టర్‌తో మహేష్ లేటెస్టు సినిమా ‘్భరత్ అనే నేను’ కథని దర్శకుడు శివ ఎవరో అసిస్టెంట్ నుండి పెద్ద మొత్తంతో కొనేసాడని కృష్ణానగర్ కోడైకూసింది. నిజంగా ఇది నిజమైతే ఆ డైరెక్టర్‌ని గొప్పోడనవచ్చు. కానీ ఇదంతా అవాస్తవమని కథ తనదేనని తేల్చేస్తూ కొరటాల శివ ఆమధ్య స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.
సరే, నీతి నియమాల కోసం సినిమాలు కాకపోయినా... అంతర్లీనంగా హీరో పాత్ర చేత మంచి పనులు చేయిస్తూ.. ఎంతో కొంత చెడుని తరిమేసే మంచివాడుగా చూపిస్తున్నారు. అలాంటి సినిమాలు తీస్తున్న దర్శక రచయితలు ‘కాపీ’ బాట పట్టడం ఏమంత శోచనీయం కాదని... ఈ కాపీ వివాదం తలెత్తినప్పుడల్లా సాధారణ ప్రేక్షకులు బుగ్గనొక్కుకుంటున్నారు. మరి ప్రేక్షకుడి డబ్బులు కోట్లలో ఆశించడమే కాదు, అతని సూచనో, సలహానో కూడా కాస్త ఆలకించండి సినీరంగ మహాశయులారా!
ఇక ఎన్టీఆర్ కామెడీ హిట్ అదుర్స్ సమయంలో కూడా ఓ రైటర్ ఆ సినిమా కథ తనదేనని, ఆ దర్శకుడు వినాయక్‌ని కలిసి స్వయంగా లైన్ వినిపించానని మీడియా ముందుకు వచ్చి టీవీల్లో హల్‌చల్ చేశాడు. ఏమైందో ఎవరికీ తెలియదు గానీ గొడవ కనుమరుగైంది. రోబో సినిమా విషయంలో సేమ్ టు సేమ్ రచ్చ జరిగింది. తన బహుమతి రచనకిది దగ్గరగా ఉదంటూ ఓ రైటర్ తెరమీదికి వచ్చాడు. నచ్చచెప్పారా, ముట్టచెప్పారా తెలీదు. అక్కడితో ఆగిపోయిందా కాపీ వివాదం. అంతెందుకు ఆంధ్రభూమిలో ప్రచురించిన తన సీరియల్ థీమ్‌కి కార్బన్‌లా ఉందంటూ మగధీర సినిమా టైంలో ఆ రైటర్ మొరపెట్టుకున్నాడు. వ్యవహారం అల్లు అరవింద్ చక్కదిద్దాడని చెప్పుకున్నారా టైమ్‌లో. ఈ మగధీర విషయంలో మరొక వివాదం చెలరేగింది. తన అనుమతి లేకుండా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాటలోని కించిత్ పార్ట్ వాడుకున్నారని వంగపండుగారు మీడియా మద్దతుతో ఆవేదన వెలిబుచ్చితే, ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా గౌరవ వేతనం సమర్పింపబడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అంతెందుకు నిన్నటి ఖైదీ నెం 150కీ వివాదపు వేడి సెగలు తప్పలేదు. (తమిళంలో జరిగిన తప్పిదానికి) విడుదలకిది సమస్య కాకూడదని నైతిక తలంపుతో మెగాస్టార్ ఆ వ్యక్తికి దక్షిణ ముట్టచెప్పడంతో వేడి చల్లారందని తెలిసింది.
‘కాపీ’ నిజంగా నిజమే అయితే ‘రైట్స్’ విషయం పక్కన పెడితే.. సృజనాత్మకత విత్తు సాక్షిగా తన రచనలతో మొలకెత్తుతున్న ఆయా కొత్త రచయితల చిరు ఆశలను మొదలంతా పీకేసి.. మర్రి చెట్టులా మీకు మీరై విస్తరించకండి. ఆక్సిజన్ అందరిదీ.. అందరం తలా చిటికెడు శ్వాసిస్తున్నాం, కాదనరెవరు. కానీ తదైన ఆక్సిజన్ సిలిండర్ (కథని వండుకొని) పెట్టుకొని భవిష్యత్‌పై ఆశలు పెట్టుకున్న సాటి మనిషి (రచయిత) దగ్గర నుండి చాకచాక్యంగా దాన్ని లాగేసుకుంటే.. మన పరంగా హాపీగా బతికేయొచ్చు. కానీ ఆ వ్యక్తిని చంపేసినట్టేగా! (తెరమరుగు చేసినట్టేగా) చెరువన్నాక అన్ని చేపలూ బతకాలి. కొత్తది కొట్టుకొచ్చిందనీ తరిమేయడం భావ్యం కాదని సద్విమర్శకులంటున్నారు. మీది కాని సృజనాత్మకత సరుకని కాపీ ముసుగుతో మభ్యపెట్టేయడం కన్నా.. దాన్ని కన్న ఆ రైట్‌ర్‌కి గౌరవం ఆపాదించి ఎంతో కొంత రెమ్యూనరేషన్ వారికిచ్చే ప్రయత్నం చేస్తే బావుంటుందని సినీ పెద్దల ఉవాచ.
ఒక దృశ్యాన్ని అందంగా చూపెట్టడం.. ఒక సన్నివేశాన్ని అద్భుతంగా రాయగలగడం.. కళాత్మకమవుతుందేమో కానీ, కాపీ మాత్రం కళ కాబోదు. ఒరిజినల్ రైటర్ కలని కల్లలు చేయడమే అవుతుంది. అందుకే కలలో కూడా కాపీ ఎప్పటికీ రైట్ కాదు. ఇది గుర్తెరిగి మసలుకుంటే మానవత్వం పరిమళించినట్లవుతుంది. దీనికి కాపీ రైట్ లాంటి ఎలాంటి నామమాత్రపు చట్టాలు అక్కర్లేదు. అంతరంగమే జడ్జి! అంతర్లీన పాజిటివ్ దృక్పథమే ‘జడ్జిమెంట్’ బస్! ‘కాపీ’ మాటని సినిమా పరిశ్రమ కనుచూపు మేరల్లో కానరాకుండా చేయొచ్చు. దీనికేమంత పెద్దగా భారీగా నడుం బిగించాల్సిన పనేం లేదు. అలాంటి కొందరు సరైన నడక నడిస్తే చాలు!

-ఎనుగంటి వేణుగోపాల్