మెయిన్ ఫీచర్

ఫ్లాపుల ఊబిలో హీరోలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ సెట్టింగుల వలన సినిమా ఆడదు. విదేశీ లొకేషన్లలో షూటింగ్ చేశారనీ సినిమా ఆడదు. హీరో ఇమేజ్‌వల్ల సినిమా ఆడదు. మరి దేనివల్ల సినిమా ఆడుతుంది? కేవలం కథవల్ల.
ఈ మాటలు చెప్పింది హీరో, నిర్మాత, దర్శకుడు అయిన మనోజ్‌కుమార్. వరుస ఫ్లాపులతో వణుకుతున్నారు హీరోలు. రజనీకాంత్‌కి ఫ్లాపులు కొత్తకాదు. గతంలో బాబా పెద్ద డిజాస్టర్. బయ్యర్లకి డబ్బు తిరిగిచ్చి ఉపశమనం కలిగించాల్సి వచ్చింది. ఇప్పుడు వరుసగా రెండు పరాజయాలు కబాలి, కాలా.
మన్మథుడు, బంగార్రాజు లాంటి రొమాంటిక్ కామెడీలు నాగార్జునకు సూటబుల్ కేరెక్టర్లు. నల్లేరుమీద నడకలా సాగిపోతుంటాయి. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ‘మనం’వంటి కుటుంబ చిత్ర విజయంతో హేపీగా వున్నాడు నాగార్జున. అటువంటి హీరోకి కెరీర్‌లోనే ఘోరమైన డిజాస్టర్ అంటగట్టాడు రామ్‌గోపాల్‌వర్మ. ఆఫీసర్ చిత్రం నాగార్జునకు ఒక పీడ కలగా మిగిలిపోతుంది. శివ, అంతం లాంటి హిట్స్ ఇచ్చాడనే మొహమాటానికిపోయి ఆఫీసర్ ఒప్పుకున్నట్టుగా వుంది. మొహమాటానికి పోతే ఏదోఅయిందనే ముతక సామెత వూరికే పుట్టలేదు. సీనియర్ నటుడిగా, ఇమేజ్ వున్న హీరోగా మొహమాటానికిపోయి సినిమా ఒప్పుకోవడం తగునా? అర్థంపర్ధం లేనికథ, సూట్‌కాని కేరెక్టర్, ఫ్లాపులతో సతమతవౌతున్న డైరెక్టర్‌తో సినిమాచేస్తే ఫలితం ఎట్లా వుంటుందో ఆమాత్రం వూహించలేరా? తెలుగు సినిమా విస్తరించింది. విదేశాలలో సైతం డాలర్ల పంట పండిస్తోంది. విషయం వున్న సినిమాలు వందల కోట్ల మైలురాళ్ళు దాటుతున్నాయి. ఈ సమయంలో కేరెక్టరే, కథ విషయంలో ఎంత జాగ్రత్తగావుండాలి.
ఆచితూచి అడుగేయాల్సిన తరుణంలో తప్పటడుగులువేస్తే నష్టమే. ఇద్దరు కొడుకులు హీరోలుగా రంగంలో వున్న ఈ సమయంలో నాగార్జున కథ, కేరెక్టర్‌ల విషయంలో చాలా శ్రద్ధతీసుకోవలసి వుంటుంది. రాచపీనుగ ఒంటరిగా పోదని సామెత. రామ్‌గోపాల్‌వర్మ వరుస పరాజయాల కంపెనీ ఊబిలో చిక్కుకుపోయాడు. తోడుగా నాగార్జునను లాక్కెళ్తున్నట్టుగా వుంది. తస్మాత్ జాగ్రత్త. నాగార్జున డాడీని అనుసరించవలసి వుంటుంది. అక్కినేని మొహమాటాలకు పోయి తను ఫిట్‌కాని కేరెక్టర్లువేయడానికి ఒప్పకునేవారు కాదు. 1950వరకు ఆయన జానపద చిత్రాలలో సూపర్ స్టార్. ఫ్లోక్‌రోల్ కింగ్. పాతాళభైరవి సినిమాతో ఎన్టీఆర్ రంగప్రవేశం చేశాక తను ఇక జానపదాలలో సాహసవీరుడి పాత్రలకు స్వస్తిచెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆజానుబాహుడు, అందగాడైన రామారావుతో పోటీగా తను జానపదాలలో నటిస్తే ప్రేక్షకులకు రుచించదని ఆయన అవగాహన. అదే ప్రాప్తకాలజ్ఞత. తనేమిటో తను తెలుసుకోవడమే విజ్ఞుల లక్షణం. అదే ఆయనను జీవితాంతం నటుడిగా విజయపథంలో నిలబెట్టింది. అప్పటివరకు జానపదాలలో హీరోగా వున్న అక్కినేని సాంఘిక చిత్రాలలో నటిస్తే ప్రేక్షకులు ఒప్పుకుంటారా? అనే సందేహం నిర్మాత, దర్శకులది. నేరుగా హీరోగా సాంఘిక చిత్రంలో వేషం వేయించడానికి సాహసించలేకపోయారు. సంసారం సినిమాలో రామారావు తమ్ముడిగా సహనటుడి పాత్రలో నటించి సాంఘిక చిత్రాలలోకి అరంగేట్రం చేశారు అక్కినేని. అప్పట్లో తను తీసుకునే పారితోషికంలో నాలుగోవంతు తీసుకున్నట్టు చెప్పుకున్నారు. ఈరోజుల్లో స్టార్ హీరోలు ఒక మెట్టుదిగి, తమకంటే జూనియర్ నటుడితో సహాయ పాత్రలు వేయడానికి ఒప్పుకుంటారా? ‘అభిమానులు ఒప్పుకోరండీ’అంటూ ఎంత మంచి కేరెక్టరయినా చేయరు. సినిమాలు అభిమానులకోసమేనా? మిస్సియమ్మ తమిళ చిత్రంలో జెమినీ గణేషన్ హీరో. తంగవేలు కమేడియన్. మిస్సమ్మ తెలుగులో ఎన్టీరామారావు హీరో. మరి కమేడియన్‌గా ఎవరు నటించాలి. రేలంగి కదా! కాని కమేడియన్‌గా అక్కినేని నటించి హాస్యంకూడా పండించగలనని నిరూపించి సత్తాచాటుకున్నారు.
ఆ విధంగా సాంఘిక చిత్రాలలోకూడా నటించి మెప్పించగలగడానికి తిప్పలు పడ్డాడు. కాబట్టే లెజెండ్ అయ్యారు. సాంఘిక చిత్రాలలో తిరుగులేని నటుడిగా స్థిరపడ్డారు. అయినా కొన్ని సాంఘిక చిత్రాలలోని పాత్రలకు తగనని నమ్మినప్పుడు ‘సారీ’ అని తిరస్కరించేవారు.
తెలుగు, తమిళ భాషలలో సూపర్ డూపర్ హిట్ తీసి అక్కినేని కెరీర్‌నే మలుపుతిప్పిన దేవదాసు నిర్మాత డి.ఎల్. ఆయన తదుపరి గురజాడ ప్రసిద్ధ నాటకం ‘కన్యాశుల్కం’ స్క్రిప్ట్ తయారుచేయించి గిరీశం పాత్రను అక్కినేనికి ఆఫర్‌చేశారు. కథనుబట్టి చిత్రం జయాపజయాలను అంచనావేయగల సామర్థ్యం ఆయనకు వున్నట్టే వుంది. కన్యాశుల్కం బ్రాహ్మణ కుటుంబాలలో దురాచారాలను ఎండగట్టిన నాటకం. అది సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకోలేదని అంచనావేశారు. కష్టపడి గిరీశం పాత్రలో నటించినా ఫలితం దక్కదని వూహించి ‘సారీ’ చెప్పారు డి.ఎల్.కి తనకు సూపర్‌హిట్ సినిమా యిచ్చాడని మొహమాటానికి పోలేదు. తర్వాత గిరీశం పాత్ర ఎన్టీరామారావు వేశారు. ఊహించినట్లే పరాజయం పాలైంది. పాతికేళ్ళ తర్వాత కన్యాశుల్కం అనే సినిమా వుందనే సంగతే ప్రేక్షకులు మర్చిపోయిన రోజుల్లో కొత్త ప్రింట్లుతీసి రిలీజ్‌చేస్తే వంద రోజులు ఆడడం విచిత్రం. చరిత్ర.
‘పాశమలార్’ తమిళంలో శివాజీ గణేషన్, సావిత్రి కాంబినేషన్‌లో సూపర్ హిట్ సినిమా. తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని చిత్రించిన కథ. అక్కినేని, సావిత్రి హీరోహీరోయిన్లుగా తిరుగులేని కాంబినేషన్‌గా నడుస్తున్న కాలం.
ఎన్నో సినిమాలలో తనకు ప్రేయసిగా నటించిన, ఇంకా నటిస్తున్న సావిత్రి తనకు చెల్లెలుగా నటిస్తే ప్రేక్షకులు హర్షించరని అన్న పాత్ర ఒప్పుకోలేదు. అదే రక్తసంబంధం. రామారావు, సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించగా హిట్టయిన చిత్రం.
అక్కినేని అన్న పాత్ర ఒప్పుకోకపోవడానికి గతంలో ఒక చేదు అనుభవం వుంది. ‘పరివర్తన’సినిమాలో సావిత్రి అక్కినేని చెల్లెలుగా నటించింది. ఆ చిత్రం పరాజయం పాలైంది. ‘వదిన’చిత్రంలో అక్కినేని పక్కన పండరీబాయి నాయికగా నటించగా, సావిత్రి వ్యాంప్ పాత్ర వేసింది. ఆ చిత్రంగూడా హిట్టవలేదు. సావిత్రి తనపక్కన ప్రేయసిగా తప్ప వేరే పాత్రలలో ప్రేక్షకులు చూడరని అక్కినేని డిసైడైపోయారు.
కథ, కేరెక్టర్ విషయంలో నాగార్జున డాడీని మార్గదర్శిగా అనుసరించవలసి వుంటుంది. ఇప్పుడు తను సీనియర్ హీరో అని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు హీరోలు ప్లాఫులతో వణుకుతున్నారు. వెటకారం పాత్రలో ప్రవేశపెట్టి దర్శకుడు పూరీ జగన్నాథ్, రవితేజతో కొన్ని సినిమాలను విజయవంతం చేశారు. వెటకారమే తారకమంత్రంలా పఠిస్తూ సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఎటువంటి పాత్రకైనా మొనాటనీ వస్తుంది. రవితేజకు అదే వచ్చింది. టచ్ చేసిచూడు, నేల టికెట్టుతో చతికిలపడ్డాడు. గురువు పూరీ పైసావసూల్ కాక, మెహబూబా పరాజయంతో వెనుకబడ్డాడు. ఇప్పుడు గురు, శిష్యులు ఏ కారం కనిపెట్టి ప్రేక్షకుల మీద చల్లుతారో చూడాలి.
వరుస విజయాలతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన నాని శ్రీకృష్ణార్జున యుద్ధంతో నేలమీదకు దిగివచ్చాడు. డి.జె., నాపేరు సూర్య పరాజయాలతో ‘నెక్స్ట్ ఏంటి?’ తెలియక అయోమయంలో వున్నాడు అల్లుఅర్జున్. గబ్బర్‌సింగ్ పవన్‌కళ్యాణ్ సినిమాలకు దూరంగా అజ్ఞాతవాసంలో వున్నాడు. 2019 ఎలక్షన్ల తర్వాత గాని ఫ్యూచర్ ఏంటో తేలదు. పాలిటిక్స్‌లో కెరీర్ ఏంటో డిసైడ్ కాదు.
మరొక సీనియర్ హీరో బాలకృష్ణకు కూడా హిట్లులేవు. గౌతమీపుత్ర శాతకర్ణికి కీర్తివచ్చింది కాని కాసులు కురవలేదు. గతంలో ‘సింహ’ సినిమాలు ఆడాయి కనుక, సెంటిమెంట్‌తో ‘జైసింహ’చేస్తే వర్కవుట్ కాలేదు. పైసావసూల్‌కి పైసలురాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలు ఎక్కలేదు.
నందమూరి మూడోతరం వారసుడు మాస్ హీరోగా ఎమ్.ఎల్.ఏ. చేస్తే ప్రేక్షకులు ఓట్లువేయలేదు. డిపాజిట్ దక్కలేదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా సెటిలయ్యాడు గనుక తను క్లాస్ కథానాయకుడిగా రూట్ మారిస్తే బెటర్ అనుకున్నాడు. డెస్టినీ అనీ, విధి ఆడించే నాటకమనే విచిత్రమైన కానె్సప్ట్ అనీ జయేంద్ర చెప్పింది నమ్మి గెటప్ మార్చి రొమాంటిక్ లుక్‌తోమిల్కీ బ్యూటీ తమన్నాతో డ్యూయట్లు పాడినా ‘నానువ్వే’ విజయానికి ఆమడ దూరంలో నిలబడింది.
‘్ఛలో’తో హిట్ అందుకున్న నాగశౌర్య, తర్వాత వచ్చిన కణం, అమ్మమ్మగారిల్లు చిత్రాలు జనం మెచ్చలేదు. వెరైటీ కథలు ఎన్నుకుంటూ వరుస విజయాలతో వున్న నిఖిల్‌కి కిరాక్ పార్టీ షాక్ ఇచ్చింది. ‘చల్ మోహనరంగా’ అంటూ అమెరికాలో షూటింగ్ చేసినా నితిన్‌కి హిట్ దక్కలేదు. ఇంటలిజెంట్‌గా సాయిధర్మతేజ్‌కి మార్కులు పడలేదు. మోహన్‌బాబు సోలో హీరోగా చాలాకాలం తర్వాత చేసిన ‘గాయత్రి’ మంత్రం మహిమ చూపలేదు. విష్ణు, బ్రహ్మానందంతో కలిసి ‘ఆచారి అమెరికా యాత్ర’కు బయల్దేరితే, మేమెందుకు చూడాలి? అని ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు.
రంగస్థలం సంచలన విజయంతో రామ్‌చరణ్, భరత్ అనునేను హిట్టుతో మహేష్‌బాబు, ఫిదా, తొలిప్రేమ విజయాలతో వరుణ్‌తేజ్, తదుపరి చిత్రాల షూటింగులు చేసుకుంటూ హేపీగా వున్నారు. అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బనుంచి తేరుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేతంగా రంగం మీదకు వస్తున్నారు. దసరా పండుగ హీరోలతో పోటీకి సిద్ధపడుతున్నారు.
మన హీరోలకు కథల మీద దృష్టిలేదు. హీరోయిన్ల గ్లామర్, భారీ సెట్టింగులు, విదేశీ షూటింగుల మీదనే కాన్‌సెన్‌ట్రేషన్. కథల కొరత అంటారు. పాతిక మందిపైనే వున్న హీరోలకు కథలు ఎక్కడ్నుంచి వస్తాయి? మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన.
స్టార్ హీరోలకయినా వరుస విజయాలు సాధ్యంకాదని మారిన పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఎవరూ సూపర్ స్టారులు కాదు. ఎవరి సినిమా హిట్టయితే వాళ్ళే సూపర్ స్టార్. సెంచరీ కొట్టిన సచిన్ నెక్స్ట్ మ్యాచ్‌లో పది పరుగులకే ఔటయినట్టు, ఈరోజు హిట్ కొట్టిన హీరోకి రేపు డిజాస్టర్ ఎదరుకావొచ్చు.
వెటరన్ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ మనోజ్‌కుమార్ చెప్పినట్టు కేవలం కథవల్లనే సినిమా విజయవంతమవుతుందని హీరోలు గ్రహించాలి.
ప్రథమ తాంబూలం కథకులకే ఇచ్చారు ఆనాటి నిర్మాత, దర్శకులు. ఎప్పుడైనా చూడొచ్చు. పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మకథ, దేవదాసు వంటి సినిమాలలో మొదటి టైటిల్ కార్డు కథకుడిదే వుంటుంది.
‘కథ, మాటలు, పాటలు పింగళి’. అనే టైటిల్ కార్డుతో సినిమా మొదలవడం చరిత్ర. రచయిత తర్వాతే హీరో, హీరోయిన్, నటీనటులకు, నిర్మాత దర్శకులకు ప్రాధాన్యం. ఇప్పటి తరం హీరోలకు అదంతా చాదస్తంగా, విచిత్రంగా వుంటుందేమో?

-వాణిశ్రీ