మెయిన్ ఫీచర్
దిశానిర్దేశకులు దర్శకులు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సినిమాకు బలం కథ. మూలం కథే. ఆ కథను కళ్లకుకట్టినట్టు ప్రేక్షకులకు చూపించేవాడు దర్శకుడు. పాత్రలు, పరిసరాలు, ప్రాంతీయ వాతావరణం, జీవన విధానాలు ఇవన్నీ ఒక దానితో ఒకటి కలిసి ఉండేటట్లు నిర్మిస్తేనే ఎక్కడా ఎటువంటి విమర్శలు రావు. అవి పౌరాణిక చిత్రాలు కావచ్చు. జానపద చిత్రాలు కావొచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైనవి కావొచ్చు, ప్రేమకథా చిత్రాలు కావొచ్చు, ప్రజలు చైతన్యవంతులయ్యేటటువంటి చిత్రాలు కావొచ్చు, కుటుంబ కథా చిత్రాలు కావొచ్చు. ప్రతీ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉండి తీరుతుంది. ఉండి తీరాలి కూడా. అయితే చరిత్రకు సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, గ్రంథాలు, సంబంధిత శాఖాధికారుల సలహాలు, ప్రాంతీయ పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తీయాల్సి వుంటుంది. అయితే ఒక్కొక్కసారి పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంలో కాసింత ముందుకెళ్లి, కల్పించి కూడా తీయాల్సిన అవసరాలు ఏర్పడతాయి. కానీ మరీ లేనివి ఉన్నట్లుగా చూపిస్తే చరిత్రను, ప్రేక్షకులను ప్రక్కదారి పట్టించినట్లవుతుంది. విమర్శలు వెలువెత్తే అవకాశాలుంటాయి. దర్శకులు కేవలం అభిమానులకోసమే పాత్రలను సృష్టించకుండా, ఆ సినిమాలు నిర్మించేటప్పుడు అభిమానులు, ప్రేక్షకులు, విశే్లషకులు, విమర్శకులను కూడా దృష్టిలో ఉంచుకొని చిత్రాలను తీయాల్సి వుంటుంది. లేకపోయినట్లయితే చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శలు వచ్చే అవకాశాలుంటాయి. దర్శకుడు కథను సూక్ష్మదృష్టితో, వీలయినన్ని కోణాల్లో చూస్తాడు. లేకుంటే ఏ చిన్న సమస్య ఎదురైనా కథ మొత్తం దెబ్బతింటుంది. ఆరు దశాబ్దాల చిత్ర ప్రపంచంలో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క రకమైన అంశంతో ముడిపడి వుంటుంది. మన తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం కథలు రాసేవారున్నారు. కథతోపాటు దర్శకత్వం వహించే వారున్నారు. కథ రాసినవారు ఒకరు, దానికి దర్శకత్వం వహించే వారొకరయితే స్వల్పంగా తేడా ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఆత్మసంతృప్తి అనేది ఆ ఇద్దరికీ కూడా లోటుగానే ఉంటుంది. అదే దర్శకుడే కథ అల్లినవాడైనట్లయితే తన ఊహలకు, పాత్రలకు, కథకు, సినిమా మొత్తానికి తగిన న్యాయం చేయగలడు. కథలు రాసిన వారు వేరొకరయ్యి, దర్శకత్వం వహించినవారొకరయిన చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్‌లయినవీ కూడా ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా కథను రాసి, దర్శకత్వం వహిస్తూనే, ఆ చిత్రానికి మాటలు, పాటలు, సంగీతం అందించినవారు కూడా ఎందరో ఉన్నారు. ఆ కోవలోకి వచ్చేవారు. దివంగత దాసరి నారాయణరావుగారు, ఆర్.నారాయణమూర్తి లాంటి వాళ్లు. కథలు రాసుకోవడం, మాటలు, పాటలు రాయడం, నేపథ్య సంగీతంతోపాటుగా వారి సినిమాలను వారే స్వయంగా నిర్మించుకునేటటువంటి గొప్పవారు. వీరు నటులు, కథకులు, దర్శకులు, సాహితీవేత్తలు. ఇన్నిశాఖలను నిర్వర్తించటం చాలా గొప్పవరం. ఎంత ఓపిక ఉంటే ఇన్ని బాధ్యతలు తీసుకుంటారు. వీరిద్దరి చిత్రాల్లో దర్శకరత్న దాసరి నారాయణరావుగారి సినిమాల్లో, ఆర్.నారాయణమూర్తి సినిమాల్లో సమాజానికి సంబంధించిన సమస్యలకు నివారణలు, చైతన్యవంతులను చేసేటటువంటి విప్లవభావజాలం కల్గిన సినిమాలు ఎన్నో వచ్చాయి. అవన్నీకూడా ఒక దశలో సంఘంలో చాలావరకు మార్పులు తీసుకొచ్చినవే. వారి మీద, వారి దర్శకత్వం, సాహిత్యం మీద ఉన్న నమ్మకంతోనే వారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలను నిర్మించడం జరిగింది. అయినప్పటికీ వారు నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రాల్లో పెద్దపెద్ద హీరోలు నటించినవి కావు. వారి యొక్క దర్శకత్వంలో చిన్న చిన్న హీరోలు నటించినవే. ఇంకా చెప్పాలంటే వారి దర్శకత్వంలో వారు నటించినవే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సినిమాలన్నీ వారికి కోట్ల రూపాయల సంపాదనను తెచ్చిపెట్టక పోయినా
మంచి పేరును, కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు. జీవితంలో మనిషన్నవాడు ఏదో ఒక పనిచేసుకుంటూ బతకాల్సిందే. అయితే ఆ బతకటమనేది చెమటోడ్చి పొద్దంతా కష్టపడటమా? చదువుకొని ఉద్యోగం చేయటమా? చదువురాని వారు, అక్షర జ్ఞానం లేనివారు కూలీ పనులు, వ్యవసాయం చేసుకొని బతుకుతారు. చదువుకున్నవారు ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు. ఒకరకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన డిగ్రీలు ఉండాలనే నియమం ఉంది. క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్, ఆఫీసర్ ఉద్యోగానికి డిగ్రీ, అదే కలెక్టర్లు కావాలంటే డిగ్రీతో నూటికి నూరు శాతం సామాజిక స్పృహ తప్పక ఉండాలి. కానీ దర్శకులు కావడానికి ఇలాంటి అర్హతలు, డిగ్రీలు ఏవీ అవసరం లేదు. కానీ ఏ విషయం మీదనయినా లోతుగా ఆలోచించే శక్తి, పరిజ్ఞానం తప్పక ఉండాలి. అనుకున్న విషయాన్ని అనుకున్నట్లుగా తీసే అవగాహన, పరిజ్ఞానం తప్పనిసరి. సూక్ష్మదృష్టితో చూడాలి. ఒక్క సినిమాకు దర్శకత్వం వహించాలంటే ఆ కథకు సంబంధించిన పరిజ్ఞానం పూర్తిగా ఉండాలి. ఎన్నో తర్జనభర్జనలు పడాల్సి వుంటుంది. ఓవైపు షూటింగ్ జరుగుతుంటే అప్పటికప్పుడు ఆ కథలో వేరియేషన్ చేయాలి. మార్పుచేర్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కథ నడుస్తూ ఉన్నప్పుడే అంటే షూటింగ్ పార్ట్ జరుగుతుంటే కొన్ని కొన్ని టాపిక్స్ మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రతీ సీన్‌లోనూ ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ కనబడుతుండాలి. అంటే ఆ సీన్ అంతా పండాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఒక్క సీన్ కాస్త అటు, ఇటు అయినా సినిమా మీద నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. ప్రేక్షకుల్లో విమర్శలు వస్తాయి. అభిమానుల్లో నిరుత్సాసం కనబడుతుంది. హీరో, హీరోయిన్లను దృష్టిలో ఉంచుకొని కూడా కథల్లో మార్పుచేర్పులు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. కానీ దర్శకుడికి చిన్న హీరో, పెద్ద హీరో అనే వ్యత్యాసాలుండవు. కేవలం తాను కథకు తగ్గట్లు దర్శకత్వం చేసానా? లేదా? అనేదే ముఖ్యం. అలాంటి సినిమాలకు, అవార్డులకు కొదువేలేదు.
ఇంకా చెప్పాలంటే సీనియర్ దర్శకులు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌గారు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టయిల్. రాఘవేంద్రరావుగారి సినిమాల్లో ప్రతీ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్టే. ఇక విశ్వనాథ్‌గారు నటునిగా కూడా సినిమాల్లో గొప్ప నటనను ప్రదర్శిస్తారు. వీరు నిర్మించినటువంటి ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కేవలం హీరో, హీరోయిన్లకు, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులకు, విలన్‌లకు మాత్రమే అభిమానులుండరు. దర్శకులకు అంతకంటే ఎక్కువ అభిమానులుంటారు. కొత్త సినిమా విడుదలయితే సినిమా థియేటర్లలో అభిమాన హీరో, హీరోయిన్లకే ఫ్లెక్సీలు, బ్యానర్స్ కడతారు. కానీ ఆ సినిమాలకు కథ అందించినవారికి గాని, దర్శకులకు గానీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టరు. కేవలం నటీనటుల మీదనే వారి అభిమానాన్ని ప్రదర్శిస్తారు. దర్శకులకు ఫ్లెక్సీలు, బ్యానర్‌లు కట్టనంత మాత్రాన అభిమానులు లేరని కాదు, అభిమానం లేదని కాదు. దర్శకులు లేనిదే ఆ చిత్రం అంత సక్సెస్ ఎలా అవుతుంది? ఒక్కొక్క దర్శకుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు తీస్తే, ఇంకా కొందరు దర్శకులు 5, 10 సంవత్సరాలకు ఒక గొప్ప సూపర్ హిట్ సినిమాను తీస్తారు. అంటే ఏడాదికి 2,3 సినిమాలకు దర్శకత్వం వహించేవారి సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొడుతున్నాయి. అదే విధంగా 5,10 ఏళ్లకు ఒక్క సినిమా తీసేవారు వారు తీయబోతున్న సినిమాకు కథను రాసుకొని దానిని ఎన్నో కోణాల్లో సూక్ష్మదృష్టితో చూసి కథను ఫైనల్ చేసుకోవడానికే ఒకట్రెండు సంవత్సరాలు పడుతుంది. ఇక అలాంటి సినిమాలు షూటింగ్ మొదలయ్యాక రెండు, మూడు నెలల్లో పూర్తికావొచ్చు, రెండు మూడు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక సినిమాలో కథ హైలెట్ అవుతుంది. ఒకరి సినిమాలో పాటలు, స్టెంట్స్, నటీనటుల నటన, పరిసరాల ప్రభావం, జీవన విధానం, కామెడీ ఇవన్నీ ఒక్కొక్క దర్శకునిలో ఒక్కొక్క కోణం ఉంటుంది. ఇవన్నీ వేటికవే సాటి. రాజవౌళి విషయానికొస్తే ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి-2లో భారీ సెట్టింగ్స్ సినిమాను అందలమెక్కించాయని చెప్పవచ్చు. దానికి తోడు ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణల నటన సూపర్ డూప్ హిట్ చేసాయి ఆ సినిమాను. వంశీ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా మంచి ఆహ్లాదాన్నిచ్చేదనే చెప్పాలి. వంశీ దర్శకత్వం సామాన్య మానవుడి జీవితానికి, మధ్యతరగతి కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ప్రేమకథల మంచి హిట్‌లనే ఇచ్చాయి. ప్రేమకథా చిత్రాలకు మారుపేరు పూరీ జగన్నాథ్. ఇక రాంగోపాల్‌వర్మది ఒక రకమైన స్టయిల్. జరిగిన నిజాల్ని, జరుగుతున్న పరిణామాల్ని ఇంకాస్త అడ్వాన్స్‌గా చూపిస్తూ విమర్శలకు గురవుతాడు. ఇటీవలనే జిఎస్‌టి (ద్జిడఉతిగశ్రీ్హ) విషయంలో పలువురిచేత విమర్శలతోపాటు, స్ర్తిలతో ఛీవాట్లు కూడా తిన్నట్లు వాట్సాప్, ఫేస్‌బుక్‌లాంటి వాటిల్లో రావడం అంతా చూసారని చెప్పవచ్చు.
ఒకప్పుడు అంటే నాలుగైదు దశాబ్దాల క్రితం పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు అంతకుముందున్న చరిత్రను దృష్టిలో ఉంచుకొని చిత్రాల నిర్మాణం జరిగింది. తర్వాత కాలంలో పౌరాణిక చిత్రాలతోపాటు ఆధ్యాత్మిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎన్నో వచ్చాయి. అదే విధంగా ఇప్పుడు కూడా గత ఒకట్రెండు దశాబ్దాలుగా పౌరాణిక, ఆధ్యాత్మిక చిత్రాలు ఇప్పటి దర్శకులు తీస్తున్నారు. అయినప్పటికీ ప్రేక్షకులు, అభిమానులు అలాంటి చిత్రాలను ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు రామాయణానికి సంబంధించిన చిత్రాలు, ఇప్పటి లవకుశ సినిమాలకు టెక్నాలజీ డెవలప్ అయ్యిందే తప్ప కథలో మార్పులేదు. అది యదార్థ గాథ కాబట్టి మాడిఫికేషన్స్ చేయటానికి వీలులేదు. కాకపోతే కాలానుగుణంగా దర్శకులు మారారు అంతే. కానీ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగానే చూపించారు. అందులో నటించిన నటులు మారారు కానీ పరిసరాలను, పరిస్థితులను అలాగే చూపించారు. ఒకప్పటి చరిత్రను ఇప్పుడు సినిమాల ద్వారా చూపించినప్పటికీ ప్రేక్షకులు ఆదరించటానికి గల కారణం అందులోని విషయాన్ని, చరిత్రను తెలుసుకోవాలనే. ఇప్పటికీ అలాంటి కథలతో సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న దర్శకులను అభిమానులు, ప్రేక్షకులు వారి చల్లని దీవెనలతో ఆశీర్వదిస్తూనే ఉన్నారు. కథ ఏ కాలంనాటికి సంబంధించినదయినా ఫర్వాలేదు. కానీ అందులో ఒక మెసేజ్‌ను వెతుకుతున్నారు ప్రేక్షకులు. అందుకే దర్శకులు కూడా ఆ కథకు తగ్గట్లే వారి స్టయిల్‌లో వారు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల అభిమానాన్ని, ఆప్యాయతల్ని మూటకట్టుకుంటున్నారు. చరిత్రలో గొప్ప దర్శకులుగా నిలిచిపోతున్నారు. ఒక సినిమా తీయాలంటే ఆ సినిమాకు సంబంధించిన కథలో ఎన్నో లూప్‌హోల్స్ వెతికి మరీ తీయాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టాపిక్‌తో, ఒక్కొక్క పాయింట్‌తో ఇమిడి ఉంటుంది. కాబట్టి ఏ సినిమా అయినా సరే తీసేముందు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతకుముందెన్నడూ, ఏ దర్శకుడూ తీయని పాయింట్ అయి వుండాలి. గతంలో వచ్చిన ఏ చిత్రానితో పోల్చి చూసినా కూడా ఎక్కడా సింక్ కాకూడదు. అంతే కేవలం టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఎక్కడా కూడా ఆ సబ్జెక్టుతో చిత్రాలు వచ్చినట్లు దాఖలాలు ఉండకూడదు. ఒకవేళ గనుక ఉన్నట్లయితే ఆ సినిమా ఫెయిలవడంతో నిర్మాతకు అప్పులు మిగల్చడంతోపాటు నటీనటుల ఇమేజ్‌కు దెబ్బపడుతుంది. అంతటితో ఆగకుండా ప్రేక్షకుల, అభిమానుల, విశే్లషకుల, విమర్శకుల దృష్టిలో సినిమా రంగమే అభాసుపాలవుతుంది. ఒక్కొక్క దర్శకుడు అతని సినిమాలో పల్లెటూరి వాతావరణం ఇష్టపడతాడు. కొందరేమో ఫ్యాక్షనిజాన్ని చూపిస్తారు. ఇంకొందరు హాస్యాన్ని ఇష్టపడతారు. మరికొందరు తమ సినిమాల్లో భారీ సెట్టింగ్స్ వేయడం ద్వారా తృప్తిపడుతారు. కొందరేమో మధ్యతరగతి మనుష్యుల జీవితాలను ఆవిష్కరిస్తారు. కొందరు ప్రేమకథను ప్రోత్సహిస్తారు. కొందరు సాంకేతిక (అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఆదిత్య 369, రోబో లాంటివి) పరిజ్ఞానాన్ని, పౌరాణిక కథలను, సామాజిక స్పృహ ఉన్న వాటిని, రాజకీయాలను, విప్లవభావాలున్న సినిమాలను ఇష్టపడుతారు. ఇంకొందరు దర్శకులు తమ సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్, క్లబ్ డాన్సులు, మాస్ సాంగ్‌లు ఇష్టపడుతారు. ఒక్కొక్క దర్శకునిది ఒక్కొక్క స్టయిల్. ఏదేమయినా వారు అనుకున్న విధంగా ఆ చిత్రం విడుదలయ్యి, ప్రేక్షకుల మన్ననలు పొందేవరకు టెన్షన్, టెన్షన్‌గానే ఉంటుంది. అది భారీ బడ్జెట్‌తో తీసేటటువంటి పెద్ద హీరోల చిత్రాలకయితే ఒక రకమైన ఉద్వేగం తప్పనిసరి. ఎందుకంటే ఆ చిత్రం కనుక సక్సెస్ కాకుంటే నిర్మాతలు నష్టపోవడంతోపాటు నటీనటుల ఇమేజ్ కూడా చాలా దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి పెద్ద హీరోలు నటించిన సినిమాలు కనుక ఫెయిలయితే ఆ దర్శకులకు అవకాశాలు రావడం కూడా అరుదే. పెద్ద బడ్జెట్‌తో, పెద్ద హీరో హీరోయిన్లతో, పెద్ద పెద్ద నిర్మాతలతో తీసినటువంటి చిత్రాలు సర్వసాధారణంగా ఫెయిల్ కావు. వాటికి కథాబలంతోపాటు, దర్శకుని పేరు బలం, సాహిత్యం, సంగీతం అన్నీ తోడవుతాయి. అందువల్ల పెద్ద హీరోల సినిమాలు, దర్శకుల- నిర్మాతలు బాక్సాఫీస్ రికార్డులను మారు మోగిస్తాయి. అదే మాదిరిగా చిన్న నటీనటులతో సినిమాలు తీస్తున్నటువంటి దర్శకులు కూడా వారి సినిమాలు వంద రోజుల ఫంక్షన్స్ చేసుకునేలా కథలు ఎంచుకొని మరీ నిర్మించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. చిన్న దర్శకుల దర్శకత్వంతో కూడా పెద్ద హీరోలు నటించిన సందర్భాలున్నాయి. అవి కూడా పెద్దఎత్తున నిర్మాతలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టాయని చెప్పవచ్చు.
ఇప్పుడు మన ముందున్న దర్శకులు గొప్ప గొప్ప సినిమాలు తీసి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నవారే. ఇక మార్చి 30న విడుదలైన ‘రంగస్థలం’ సినిమా వైజాగ్‌లో ప్రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత ఒక పల్లెటూరు వాతావరణంలో నటించిన సినిమా అది. ఈ సినిమాను పల్లెటూర్లో తీయడానికి గల కారణం దర్శకులు సుకుమార్‌ది పుట్టి పెరిగిన వాతావరణం పల్లెటూరు వాతావరణమే కాబోలు. సుకుమార్ ఏడాదికి రెండేండ్లకు ఒక్క సినిమా కూడా తీయడు. ఒక కథను ఎంచుకోవడానికి చాలాకాలం సమయం తీసుకోవడమే కారణం. ఆయన ఒక సినిమాను తీయాలంటే, అలాంటి సినిమాకు దర్శకత్వం వహించాలంటే ముఖ్యంగా కథను, నటించనున్న నటీనటులను దృష్టిలో ఉంచుకొని ఆ కథకు తగిన న్యాయం చేయాలని తాపత్రయపడతాడు. ఎక్కడా టెన్షన్ పడకుండా తాననుకున్నది అనుకున్నట్లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గొప్పగా, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా తన దర్శకత్వంలోని ప్రతిభను, మాధుర్యాన్ని అందిస్తాడు. అంత మధురంగా, మరపురాని విధంగా, మరచిపోలేని విధంగా ఉంటాయి అతని సినిమాలు. రంగస్థలంలో ఎక్కడా నటీనటులు మేకప్ వేసుకున్నట్లు కనబడదు. అంతా నేచురల్‌గా ఉంటారు. పల్లెటూరి వాతావరణంలో మధ్యతరగతి మనుషుల మధ్య ఒక విలక్షణమైన సబ్జెక్టుతో, మాసిన గెడ్డం, లుంగీ, గళ్ల చొక్కాతో రాంచరణ్, లంగా-వోణిలో సమంత నటించిన చిత్రంలోని పాటలు ప్రేక్షకులను సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమా ఆడియోకు ఊపిరిపోసాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదని చెప్పవచ్చు. ఇందులోని ప్రతి పాట అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ‘మంగమ్మ’ అనే పాట అందరినోటా నానిపోతోంది. అనుకున్నట్లుగానే చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఇలా ఒక్కొక్క దర్శకులు ఒక్కొక్క స్టయిల్‌తో, కానె్సప్ట్‌తో తమ దర్శకత్వంలోని ప్రతిభను కనబరుస్తారు. కథలో ఒక మేజిక్, దర్శకత్వంలో ఒక మైమ్ ఉండే ఆ సినిమాలు ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు ఎక్కడికో కదలనివ్వవు. అలాంటి దర్శకులు చాలామందే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.