మెయిన్ ఫీచర్

హీరోలు కావలెను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**తెరపై.. వెండితెరపై హీరో కనపడగానే హరివిల్లు నేలకు వంగి సప్తవర్ణాలను ఎదపై వెదజల్లి మదిలో వసంతాలు పూయించినట్లు గాలి తెమ్మెరలు అలలు అలలుగా తెరలు తెరలుగా గుండె గూడును ఊయలలూపుతూ సరదా ఊసులు చెవిలో చెరవేసినట్లు.. ఎగిరి ఎగిరి అందిన ఆకాశాన్ని అలవోకగా తడిమి ఆనందానుభూతులమయమై తానే మైమరచిపోయినట్లు సగటు అభిమాన సినీ ప్రేక్షకుడు.. సంతోషాల కెరటాలపై కెగసి చిన్న పిల్లాడిలా కేరింతలు కొడతాడు. బయట టికెట్ చించడమే కాదు.. థియేటర్లోనూ కాగితాలు చించి తన అభిమానాన్ని పూల వర్షంలా ఆవిష్కరిస్తాడు. బయట బ్యానర్లూ కడతాడు. ఆ సందడే వేరు. ఆ సంబరమే వేరు. సినిమా విడుదలయ్యిందా ఏకంగా పండగ వాతావరణం సృష్టిస్తాడు.**
========================================

సినిమాలన్నా, హీరోలన్నా ప్రేక్షకుడికి అంత అభిమానం. ఇంట్లో గోడకి సైతం సినిమా పోస్టర్ అతికేస్తాడు. అంత వెర్రి. అంత పూనకం. అంత ఊపు. ఒక దశలో.. ఉద్వేగభరిత దశలో హీరోలా తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. ఏకంగా తానే హీరోలా ఫీలవుతాడు. హీరో (పదం)లో అంత మత్తు ఉంది. మహత్తు ఉంది. ఏదో తెలియని మాయ ఉంది. ఒకానొక సందర్భంలో తన అభిమాన హీరో ఎవరైనా పల్లెత్తు మాట అన్నా, తననే తిట్టినంత వాపోతాడు, ఊగిపోతాడు. మరి ప్రేక్షకాభిమానుల గుండె పుటలపై ఆరాధ్య సువర్ణాక్షరంగా అలంకృతమై అలరారుతున్న ఆ హీరోల సంఖ్య టాలీవుడ్ విషయానికి వచ్చేసరికి మరీ తక్కువైపోయిందని సినీ పండితుల ఉవాచ. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎంత పెట్టుబడి పెట్టినా సినిమాలు నిర్మించడానికి వెనుకాడని నిర్మాతలెందరో ఉన్నారని.. సినీ పరిజ్ఞానం కలిగిన ఏ సామాన్య ప్రేక్షకుడైనా ఇట్టే చెప్పేయొచ్చు. ఏకకాలంలో నాలుగైదేసి భారీ ప్లస్ ఓ మోస్తరు తరహా సినిమాలు తీయగల సత్తా వున్న నిర్మాణ సంస్థలూ (సంసిద్ధంగా) ఉన్నాయని సినీ వర్గాల భోగట్టా. అరడజను, డజను కథలు పట్టుకుని లేదా పూర్తి స్క్రిప్ట్ బైండింగ్‌తో రెడీగా వున్న దర్శక దిగ్గజాలు ఉన్నట్లు వార్తలు, ఇంటర్వ్యూల ద్వారా తెలియనైనది. అందుకు ఉదాహరణ దర్శకుడు కొరటాల వివ. తన దగ్గర ఓ పదిదాకా కథలున్నాయని పలు ఇంటర్వ్యూలలో సెలవిచ్చారు. మరి వీళ్ళంతా హిట్లూ, సూపర్‌హిట్లూ, బంపర్ హిట్లూ సినిమా పరిశ్రమకిచ్చిన దర్శక నిర్దేశకులే!
మరేంటి చిక్కు అంటారా? హీరోల ప్రాబ్లమ్.. కొరత! అవును దొరకడం లేదు. హీరోల కాల్షీట్లు దొరకడంలేదు. విడ్డూరంగా ఉందా? మరంతే కదండీ! మహా అయితే వారసులైన హీరోలు.. వెటరన్ హీరోలైన చిరు, నాగ్, బాలయ్య, వెంకీలను మినహాయిస్తే.. వారసులైన హీరోలు మహేష్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ప్రభాస్‌లను కలుపుకొని.. ఇంకా వారసులైన నాగచైతన్య, అఖిల్, తారకరత్న, వరుణ్, విష్ణు, మనోజ్, అల్లు శిరీష్, సుమంత్, సుశాంత్ వగైరాలు.. అలాగే కాస్తో కూస్తో హిట్ పేరున్న బయటి హీరోలు నాని, శర్వానంద్, నితిన్, నిఖిల్, రామ్, దేవరకొండ, బెల్లంకొండ, ఇపుడిపుడే పాగావేస్తున్న నాగశౌర్య లాంటి అందర్నీ లెక్కేస్తే మహా అయితే ఓ ఇరవై లేదా పాతిక తెలుగు హీరోలు.
ఇందులో ఎంతమంది కథానాయకులు సక్సెస్‌లతో హీరోలా వెలిగిపోతున్నారో.. ఎవరు ఫ్లాపులిస్తూ సతమతమైపోతున్నారో దర్శక నిర్మాతలకు తెలుసు. కాబట్టి ఈ క్రేజ్ లేని హీరోలను మైనస్ చేస్తే.. నిలబడే హీరోలను, సినిమాను నిలబెట్టే హీరోలను సునాయాసంగా కాళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఇదండీ దర్శకుల నిట్టూర్పుకి కారణం. నిర్మాతల లేదా (్భరీ) నిర్మాణ సంస్థల పెదవివిరుపుల నేపథ్యం. ఇక పారే నీరులా.. తామరతంపరలా కొత్త కొత్త హీరోలు అలా వచ్చి ఇలా వెళుతున్నారు. అతడి పేరు ప్రేక్షకులకు తెలిసేలోగానే బొమ్మ మాయమైపోతోంది. కాబట్టి అలాంటి వారి వంక తొంగి చూసే స్క్రిప్టుల దమ్ము, కాసుల ధైర్యం ఏ పేరున్న దర్శక నిర్మాతలకుండడం లేదని సినీ విశే్లషకులంటున్నారు. అందుకే ఆ సాహసం కనపడడంలేదు. ఎవరెవరో కొత్త కొత్త దర్శక నిర్మతలే ఆ బాధ్యతల్ని తమపై మోపుకొని ఆయా కొంగ్రొత్త హీరోల చిత్ర నిర్మాణానికి పూనుకుంటున్నారు.
ఇక ఉన్న ఆ తక్కువ మంది ఫేమస్ లేదా మినిమం గ్యారంటీ హీరోలు ఒక సినిమా పూర్తయ్యాక కానీ.. మరో సినిమాకి డేట్స్ ఇవ్వని సరికొత్త పరిస్థితి నేడు టాలీవుడ్‌లో నెలకొని ఉంది. కాబట్టి ఏమవుతోంది? దర్శక మహాశయులు స్క్రిప్టు మడిచి చేతులు ముడుచుకొని ఖాళీగా కూచుంటున్నారు. నిర్మాతలు సినిమా వెంట సినిమా ఇస్తూ బిజీ బిజీగా ఉండే పరిస్థితులూ మచ్చుకైనా కనబడడంలేదు. ఇంకా తెలియందేముంది? పాపం 24 ఫ్రేముల సినిమా సిబ్బందికీ చేతినిండా పనీ ఉండడంలేదు. అరకొర అవకాశాలతో సర్దుకుపోతూ కాలం గడిపేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకేగా హీరోలు కావాలంటున్నది, వారసుల సంఖ్యే ఇబ్బడిముబ్బడిగా ఉంది. ఎంతమంది తమ స్టామినాతో బాక్సాఫీసు సక్సెస్ రేటు పెంచుతూ సినిమా పరిశ్రమ నిలబాటుకి కారకులవుతున్నారో మనం ఎరుగని రహస్యమేమీ కాదు. అందుకే నటనని ఎన్టీఆర్, ఏఎన్నార్‌లా వెంటబెట్టుకొని.. చిరంజీవిలా సినిమా సక్సెస్ జెండాని రెపరెపలాడించగల.. హీరోలు కావలెను! సినిమా పరిశ్రమ ఒక వ్యాపార ప్రహేళిక. పెట్టుబడి- రాబడి వ్యాపార ఈక్వేషన్‌కి కుడి ఎడమలు! లేదా ఇప్పటి హీరోలే ఒకటి తర్వాత ఒకటి అనే మాటని పక్కన పెట్టి నాటి కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి హీరోల్లా ఏడాదికి నాలుగైదేసి (రెండు మూడైనా) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని నేల టికెట్ ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. సినిమా పరిశ్రమ కళకళలాడుతుందని.. తమ కుటుంబాలు బాగుపడతాయని లైట్ బాయ్ నుండి ఎక్స్‌ట్రాల కళాకారులతోపాటు ఎందరెందరో అసిస్టెంట్స్ వేడుకుంటున్నారు. తథాస్తు! అలాగే జరుగుగాక!

--ఎనుగంటి వేణుగోపాల్