మెయిన్ ఫీచర్

పబ్లిసిటీ అంటే ఇదే మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ సినిమాపై కక్షకట్టే అవకాశాలున్నాయి. పనిగట్టుకొని డివైడ్ టాక్ సృష్టిస్తారు. విమర్శలు చేస్తారు. ఆ ప్రయత్నాన్ని ప్రేక్షకులే దాటించాలి...’’అంటూ స్వయంగా ఓ ప్రముఖ సినిమా గురించి... మరో ప్రముఖ నిర్మాత.. ఆ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఉద్వేగంతో వెలువరించిన సంచలనాత్మక వ్యాఖ్యలు.. ప్రస్తుతం సినిమా రంగంలో అన్నివర్గాల వారిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి! ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి!
ఈ వ్యాఖ్యలకు కాస్త ముందుకు వెళితే..పలువురు సినిమా ప్రముఖులు (హీరో, దర్శక, నిర్మాతలు) సమీక్షకులపై విరుచుకుపడ్డారు. ‘ఇంత కష్టపడి కోట్లు కుమ్మరించి సినిమాలు రూపొందిస్తే.. బూడిదలో పోసిన పన్నీరులా.. మీ కలం పలుకులు ‘అబ్బే! బాగోలేదు...’తో సినిమాలు ఫట్‌మంటున్నాయి.. అనేది వారి నింద్యారోపణ. ఈ సందర్భంగా.. సినిమా రంగానికి సంబంధంలేని, చిన్న విషయమే అయినా దాని వెనకాలున్న లాజిక్ చెప్పాలిక్కడ! మా బ్రదర్ లక్షన్నర జనాభాగల నగరంలో స్కూలొకటి ఎస్టాబ్లిష్ చేసాడు. జస్ట్ సెవెంత్ స్టాండర్డ్ వరకు! ఎక్కడా ఆ స్కూల్ తాలూకు బ్యానర్, గోడ మీద రాతలు లాంటివి నగరంలో కనబడవు. పబ్లిసిటీకోసం ఇతరత్రా దారులు వెతుక్కోలేదు. పేరెంట్స్ వౌత్‌టాక్‌తో స్కూల్ బ్రహ్మాండమైన స్ట్రెంత్‌తో ‘మంచి పాఠశాల’గా విజయవంతంగా రన్‌అవుతోంది. అలా అని కాంపిటీషన్ లేదనికాదు.. దరిదాపుల్లోనే బోలెడు స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలపైన బురదచల్లే వారున్నారు. ఈ పాఠశాల యాజమాన్యం అంటే పడని మిగతా స్కూల్స్ యాజమాన్యాలున్నాయి.
అయినా ఆ స్కూల్ అప్పర్‌ప్రైమరీ లెవెల్‌లో టాప్ పొజిషన్‌లో ఉండి మరి దమ్మున్న సినిమాకు ఎవరెంత నెగెటివ్‌గా ప్రచారంచేస్తే పడిపోయేది ఏముంది? మా సినిమా ‘సూపరహో...’ అంటూ ఎన్ని మీటింగులుపెట్టి, ‘ఎంత మైకు వాయిస్తే’ మాత్రం జనం క్యూకడతారా ఏంటి? ఆమధ్య ప్రముఖ హీరో ‘తన తనయుడి సినిమా బ్లాక్‌బస్టర్’ అంటూ ప్రి రిలీజ్ వేడుకలో ఓవరాక్షన్ చేసాడు. నిజం చెప్పాలంటే సమీక్షకులు సైతం ఆ సినిమాకు మంచి రేటింగులిచ్చారు. ఏమైందబ్బా? ప్రేక్షకులు మొహం చాటేసారు. ఆ సినిమా కాస్తా ‘వైట్ క్లస్టర్’అయ్యింది. ఆ సినిమా టైమ్‌లోనే విమర్శకులు పెదవ్విరిచిన మరో సినిమాని ప్రేక్షకులు కనువిందు చేసుకున్నారు. బాక్సాఫీస్‌ని (ఆ హీరో స్థాయికి తగ్గ కలెక్షన్స్) బాగా ఊదేసి దాని కమర్షియల్ రేంజ్ పెంచేసారు. అందుకే పెద్దలు అంటుంటారు.. ‘ఎవరి చేతిలో ఏమీ ఉండదండీ!’ అని.
ఇంకా.. ఇంకా... ఇంకా... మూడు ‘ఇంకా’ల తర్వాత... బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి అంటే బ్యాక్‌లోకి అలాఅలా వెళితే.. ఎవరు చెప్పారండీ ‘లవకుశ’ని బండ్లు కట్టుకుని వెళ్ళి చూడమని? ఎవరు పని వదిలేసుకొని ప్రచారం చేసారండీ ‘దేవదాసు’కి క్యూకట్టి చూడమని? ఎవరు నడుము బిగించి కదిలారండి ‘మాయాబజార్’ని మళ్ళీమళ్ళీ చూడమని?.. లేదా చూడొద్దని! ఎవరూ ఎవరికి ఆనాడు ఏమీచెప్పలేదు. ప్రేక్షకుడే... మరొక ప్రేక్షకుడికి వౌత్‌టాక్ అందించాడు. అదేకదా నాటి నేటి మేటి పబ్లిసిటీ? ప్రేక్షకుడే జడ్జి... అతడిదే తీర్పు...! అంతే తప్ప ఆయా హీరోల ‘యాంటీ బ్యాచెస్ నెగెటివ్ టాక్ ఎంతెంత ప్రచారం చేస్తేనేం... ‘బాహుబలి’ రికార్డుల మోతకు వాత వేయగలిగారా? ‘రంగస్థలం’ ప్రేక్షకుల వరదకు ఆనకట్ట కట్టకలిగారా? ‘్భరత్ అనే నేను’ విజయోత్సాహ కలెక్షన్‌ల గ్రాఫ్‌ని దించేయగలిగారా? అపనింద అలజడుల హేతువు! అపనింద అలవికాని అగాధానికి సేతువు! అంతా... అపోహ!!
ఆమధ్య ఓ క్రేజీ హీరో సినిమా విడుదలైన రోజున అభిమానుల హంగామా అంతాఇంతా కాదు! కానీ, ఆ సినిమా మొదటి ఆటకీ.. ప్రేక్షకుల మాట దేవుడెరుగు, సాక్షాత్ అభిమాన ధీరులే తలలు పట్టుకున్నారు అభిమాన సమూహమంతా ఆ దర్శక మహాశయున్ని నెట్‌ద్వారా చీల్చిచెండాడారు. అలా ఆ భారీ (హీరో) పిక్చర్ తెరపై బీభత్సంగా ఆడకుండానే ‘అజ్ఞాతం’లోకి వెళ్ళిపోయింది. అభిమానుల బాధ వర్ణనాతీతం, ‘ఇలా కూడా సినిమాని చెడగొట్టగలవా మహాశయా’అంటూ కోటి కోటి దండాలు పెట్టారా దర్శక దిగ్గజానికి. మరి దీని మాటేమిటంటారు? అదన్నమాట మ్యాటరు! మ్యాటరుండాలండీ సినిమాలో! హీరోయే కాదు హీరోయిజమూ ఉండాలి. కథతోపాటు కథనమూ పసందుగా ఉండాలి.
‘సినిమా చూడూ.. సినిమా దమ్మూ చూడూ...’అనే పాటేస్కుంటే ... ఆ దమ్ముకే ప్రేక్షకుడు ‘బాక్సాఫీసు దుమ్ము’దులిపేస్తాడు. లేదంటే ‘ఆ సినిమా దుమ్ముకు’ ఉతికి ఆరేస్తాడు.
ఇది సినిమా రంగం, వినోద సాధనం. ప్రేక్షకలోకం మెచ్చాలి. మనసు గెలవాలి. గుండె నిండాలి. హృదయం ఉప్పొంగాలి. ఎన్ని ఉంటాయి? టికెట్టుకి సరిపడా గిట్టుబాటు అవ్వాలంటే, అప్పుడే సినిమా నిలబడుతుంది. లేదంటే ప్రేక్షకుడు కలబడతాడు. సోల్ లేని రీల్‌ని గోలగోలగా గోల్‌మాల్ చేసేస్తాడు.
కాబట్టి, సినిమా పెద్దలారా.. ఎవరు కసితీరా కక్షకట్టినా, పనిగట్టుకొని.. చూడకండి మొర్రో అని మైకునొక్కినా.. వెళ్ళకుండా సినిమా వైపని విమర్శలు వెదజల్లినా... ప్రేక్షకుడికి పట్టింపు ఉండదని నా మనవి! అందుకని సినిమా ఒక వర్గం కోసమోకాదని, ప్రేక్షకులను ఉద్దేశించి మాత్రమే తీయబడిందని గుర్తెరిగి మసలితే బాగుంటుందని విజ్ఞప్తి!! మీకూ-మీకూ ఏమైనా కుమ్ములాటలుంటే మీరే చూసుకోండి. అంతేగాని, ప్రేక్షకుడిని పోకచెక్కలా ఇరికించే ప్రకటనలు మాత్రం గుప్పించకండి మహాశయులారా! ‘మైకు’లు మాట్లాడినంత మాత్రాన ప్రేక్షకుడి ‘మైండ్ సెట్’మార్చబోరు. నిజానికి ప్రేక్షకుడు మంచి మనసుతోనే థియేటర్లోకి అడుగిడుతాడు. పిచ్చెక్కిందా సినిమాచూసి ‘బావోలేదని’ అమాయకంగా కక్కేస్తాడు! కిక్కిచ్చిందా ‘సూపరహో’అంటూ మరోసారి థియేటర్‌కి వచ్చేస్తాడు.
‘ఆ గట్టునుంటావా ప్రేక్షకన్న... ఈ గట్టుకొస్తావా...’ అనంటే, ఎవరి వైపూ ఉండడు! వినోదం వెంటే వెళతాడు. వినోదం కోసమే టికెట్ చించుతాడు. అందుకే ఇది ప్రేక్షకుడిని ఉద్దేశించి మాత్రమే రాసినదని మనవి!

-ఎనుగంటి వేణుగోపాల్