మెయిన్ ఫీచర్
బయోపిక్‌ల హవా...
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒక సినిమా తీయడమంటే ఆషామాషీ కాదు. 24 ఫ్రేమ్స్ ఒక్క దగ్గర చేరాలి. కథా, కథనాలు... ఇలా అన్నీ చక్కగా కుదరాలి. హీరో, హీరోయిన్- పాత్రలు, పాత్రధారులు... ఇలా ఒక సరికొత్త జీవితాన్ని సినిమాగా సృష్టించాలి. వినోదాత్మకంగా లేదా పది మంది మనసులని హత్తుకునేలా వెండితెర మీద ఆవిష్కరించాలి. అందుకే సినిమావాళ్లు ఎప్పటికప్పుడు తాజాదనం కోసం కొత్త సరుకు వెతుకులాటలో పరుగెడుతూనే ఉంటారు.
ఇపుడొక సరికొత్త ట్రెండ్‌లా... సినిమావాళ్లకు నూతనోత్సాహపు ముడిసరుకులా ‘మహానటి’ రూపంలో ‘బయోపిక్’టాపిక్ దొరికింది! మరి ఇలాంటి గడిచిన గతకాలపు కథను వెతికి... జరిగిన ‘కథ’గా మలచి... కళ్లముందు జరుగుతున్నట్లుగా తీయడమంటే మాటలు కాదు... చేతలేనని నిరూపించిన తాజా తెలుగు చిత్రం ‘మహానటి’ అశేష ప్రేక్షకుల నీరాజనాలందుకొంటూ... మరికొన్ని ‘బయోపిక్’ సినిమాలు ఊపిరికి ఊతమయ్యాయి.
ఇప్పటికే తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ మహానటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ మొదలెట్టేసాడు. ఆదిలోనే హంసపాదు... ప్రారంభంలోనే కొన్ని అడ్డంకులు (దర్శకుడి రూపంలో) ఎదురవుతున్నా... అవలీలగా వాటిని అధిగమించి... సక్సెస్‌ఫుల్‌గా ఆ సినిమా నిర్మాణం కొనసాగి... విడుదలై విజయఢంకా మోగిస్తుందని... ప్రేక్షకాభిమానులు తలపోస్తున్నారు. ఎందుకంటే సినిమా రంగానికి ఎనలేని సేవచేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటుల ‘బయోపిక్’ చిత్రాలు వాళ్లకి వెలకట్టలేని నీరాజనాలే కాదు. ప్రస్తుత ప్రేక్షకులకు, భావితరాలకు తప్పక వారి జీవిత ఒడిదుడుకులు తెలియాలి. అందరికి ఒక స్ఫూర్తిని అందించాలి.
ఎన్టీఆర్‌తోపాటు సినిమా పరిశ్రమతో నడిచి సినిమా రంగాన్ని నడిపించిన మరో మహానటుడు నట సామ్రాట్ తెలుగు మహిళా ప్రేక్షకుల ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావు (సినీ) జీవితం కూడా బయోపిక్‌కి... ఎనలేనంత కథా వస్తువునందిస్తుందని సినిమా మేథావులు, సీనియర్లు ఈ సందర్భంగా తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. వాస్తవానికి కొంతకాలం క్రితమే ఏఎన్నార్ ‘బయోపిక్’కి సంబంధించిన సమాచార సేకరణ, ఇతరత్రా రహస్యంగా ‘అక్కినేని’కుటుంబీకులు ప్రారంభించినట్టు భోగట్టా. అందులో యంగ్ అక్కినేనిగా నాగచైతన్య, తర్వాతి కాలంలో అక్కినేనిగా నాగార్జున నటించబోతున్నట్లు ఎక్కడినుంచో చిన్న క్లూ లీకయ్యింది. ఒకవేళ ఈ వార్త ఊహాగానమే అయితే ఏ దర్శక నిర్మాతలైనా ఈయన బయోపిక్ యజ్ఞానికి పూనుకుంటే సినిమా ప్రేక్షకులకు అంతకుమించిన విందు భోజనం మరొకటి లేదు. అలాగే చిరకాలంలోనే ప్రేక్షక లోకాన్ని తనవైపు తిప్పుకొని, తన నటనా సౌందర్యంతో మంత్రముగ్ధుల్నిచేసి మెప్పించిన నటి ‘సౌందర్య’ బయోపిక్ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అవి వాస్తవాలా కావా అనేది పక్కనపెడితే సావిత్రి, వాణిశ్రీ, జయసుధ వంటి సహజ నటీమణుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే కాకుండా.. తోటి హీరోయినే్ల ఈర్ష్యపడేలా తన కట్టుబొట్టు సాంప్రదాయాలకి తిలోదకాలివ్వకుండా... ‘సౌందర్య’ బయోపిక్ వస్తే గనక ప్రేక్షకుల్ని తప్పక ఆకట్టుకుంటుందని సినిమా వర్గాలంటున్నాయి. సో, వేచి చూద్దాం...! నటి సౌందర్యలాగే మరో యంగ్ రొమాంటిక్ హీరో ఉదయ్‌కిరణ్ బయోపిక్ ఆలోచన చేస్తున్నారట. ఈ విషయమిపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అప్పుడే గుసగుసలు ప్లస్‌లు మైనస్‌లు ఈక్వేషన్స్ మొదలయ్యాయి. సినిమాలోకి వచ్చీరావడంతోనే ట్రిపుల్ సక్సెస్‌లతో యువతని ఉర్రూతలూగించిన నటుడు ఉదయ్‌కిరణ్... సినిమా లైఫ్ ఎంత గ్రాండ్‌గా ఆనందమయంగా వెలిగిపోయిందో... రియల్ లైఫ్ మాత్రం విషాదంతో చిన్న వయసులోనే... ఒక అగాథమై పూడుకుపోయి... అర్థాతరంగా ముగిసిపోయి... సినీ అభిమానులకు ప్రేక్షకులకు ఒక కలగా, మిస్టరీగా మిగిలిపోయింది. అలాంటి నటుడి బయోపిక్ తీయడానికి ‘తేజ’ సంకల్పించినట్లు సర్వత్రా వినిపిస్తోంది. ఇది నిజమోకాదో తేలాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే! నైరాశ్యంతో కొట్టుమిట్టాడి సమస్యని పరిష్కార దిశలో ఆలోచించకుండా పిరికితనంతో జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టాలనుకోనే ఎందరో యువతీయువకులకీ బయోపిక్ తప్పక గుణపాఠమై తీరుతుంది. ఎవరో సాధించారని ఆత్మహత్యలకి పాల్పడడం కాదు. తాను ‘సాధించి’ సక్సెస్ మెట్లెక్కి జీవనాన్ని దేదీప్యమానంగా వెలిగించుకోవడమే జీవితమని యువతకి ఇలాంటివి సందేశమివ్వాలి. గుడ్‌లక్ టు దట్ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్!
అలాగే తెలుగు సినిమా ‘బయోపిక్’లు (కేవలం నటీనటులకే ఈ వ్యాసం పరిమితం చేయబడింది) తీయదగిన నటీనటులు మరికొంత మంది ఉన్నారు. ఆణిముత్యాల్లాంటి సినిమాలు మనముందుకు రావడానికి వాళ్లవంతు పాత్ర వాళ్లు పోషించడమే కాదు.. పాత్రలకేకాదు నటనకే ప్రాణప్రతిష్ట చేసిన మహానుభావులున్నారు. రత్నాల్లాంటి నటీమణులున్నారు. వాళ్ల వాళ్ల ఒడిదొడుగులు, అనుభవాలు, విజయాలు, అపజయాలు... కెరియర్‌లలో ఇతరత్రా అనుబంధాలు అన్నీ కలుపుకొని... వారి ‘బయోపిక్’లు ప్రేక్షకుల మనసుల్ని చూరగొంటాయనడంలో సందేహం ఏమీ లేదు!
నటనకి ప్రాణప్రతిష్ట చేసి... పాత్రలో జీవితాన్ని ప్రతిష్టింపచేసి... అది ఇది అని కాదు.. ఏ పాత్రనైనా తన నట విశ్వరూప మాయాజాలంతో అవలీలగా పోషించేసి... శభాష్ తెలుగు నటుడా... అని భారతీయ సినీ రంగం కీర్తించేలా... తెలుగు ప్రేక్షక లోకం గర్వించేలా చేసిన ‘యస్వీఆర్’ జీవితాన్ని అందమైన బయోపిక్‌గా మలచి ప్రేక్షక జనం చేత అలరింపచేయవచ్చు. యాభై అయిదుకి దరిదాపుల్లో మరణించిన ‘యస్వీఆర్’ బయోపిక్ తప్పక ఓ విజయవంతమైన సినిమాగా రూపుదాలుస్తుందని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారంతా. యస్వీఆర్ గారు అనగానే గుర్తొచ్చే అంతటి, నటుడు... గుమ్మడిగారు కూడా! యన్టీఆర్, ఏఎన్నార్‌ల కంటే చిన్న వయసువాడై వుండీ... బరువైన పాత్రలెన్నింటినో రియలిస్టిక్‌గా పోషించడమేకాదు... ఆ పెద్ద హీరోల కంటే సినిమాల్లో పెద్దవాడిగాచేసి నటనలో... ‘గుమ్మడి’ అనిపించుకున్న అరుదైన నటుడు. సాత్వికుడని ఇండస్ట్రీలో పేరుండేదట. ఆ నటుడితో ఓ మంచి ‘బయోపిక్’ సినిమా చుట్టేయొచ్చు. కాకపోతే తీయడానికి ముందుకు వచ్చే దర్శక నిర్మాతల ఆసక్తి, రీసెర్చినిబట్టి ఈ సినిమా తాలూకు జయాపజయాలు ఆధారపడి ఉంటాయని సినీ విశే్లషకులంటున్నారు. అలాగే అక్కినేని అనంతరం ‘మహిళా ప్రేక్షకాభిమానుల’ హృదయాన్ని కొల్లగొట్టిన నటుడిగా, హీరోగా శోభన్‌బాబుకి మంచి ఫాలోయింగ్ ఉంది. కుటుంబ కథాచిత్రాల్లో కథానాయకుడిగా వైవిధ్యమైన గుర్తింపు క్రేజ్ ఉంది. నిజ జీవితంలో సన్నిహితులకు స్ఫూర్తిగా నిలిచి.. సహ నటీనటుల ఆర్థిక ఉన్నతికి తన సలహాలు సూచనలతో బాటలువేసిన ఆ అందాల నటుడి నట జీవితం ‘బయోపిక్’కి ఆమోదయోగ్యమే! ఎవరు ఈ ఆలోచనతో నడుం బిగించి ముందుకు సాగినా పాత తరమే కాదు యువతరమూ ఆ సినిమాపట్ల తప్పక ఆసక్తి కనబరుస్తుందని మహిళా ప్రేక్షకులు ఆనందంగా చర్చించుకుంటున్నారు.
అమ్మో! ఇనే్నసి బయోపిక్‌లా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సినిమా అంటేనే జనాలకు ఆసక్తి. సినిమా అంటేనే క్రేజీ. అందులోనూ నటీనటులకు సంబంధించిన పర్సనల్ సమాచారం తెలుసుకోవడమంటే బోలెడంత పిచ్చి. అలాంటప్పుడు వారి నిజ జీవితగాథలే తెరకెక్కి, తెలియని ఎనె్నన్నో కబుర్లతో కిక్కెస్తుంటే బయోపిక్‌లపై ఎందుకు మోజు పడరు. కాకపోతే అన్నీ ఒకేసారి మొదలై ఒకదాని వెంట ఒకటి బయోపిక్‌లు థియేటర్లలో సందడి చేయవుగా! టైమ్ పట్టుద్ది.
ఇకపోతే పాతతరం నటీనటుల్లో బయోపిక్ తీయదగిన పెంకి ఘటం, మొండి ఘటం, గడుసుదనం చిలిపిదనం కలగలిపిన ఒయ్యారం ఒలకబోసే పాత్రలతో ప్రేక్షకులను వెర్రెక్కించిన అలనాటి నటీమణి వాణిశ్రీ! సావిత్రి తర్వాత అంత త్వరగా అంత ఉన్నతంగా అభినయంతో పేరుతెచ్చుకొని అలనాటి అగ్ర హీరోలందరి సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన అభినేత్రి ఆమె. పైగా ప్రస్తుతం జీవించి ఉన్న నటి. ఈవిడపై బయోపిక్ ప్రాజెక్ట్ ప్లానేస్తే అది క్రేజీప్రాజెక్ట్ అవుతుంది. పైగా కథాకథనాలకు మార్గం సులభమవుతుంది. సినీ మేకర్స్ ఈ బహుచిత్రాల నటీమణిపై కూడా దృష్టిసారిస్తే బాగుంటుందని సినీ ప్రేక్షకవర్గం అనుకుంటోంది. కుదిరితేసరి... కుదరకపోయినా సరే...!
తీయబోయే బయోపిక్‌లన్నీ సావిత్రి, సౌందర్య, ఉదయ్‌కిరణ్‌ల లాగ విషాదాంతాలే కానక్కరలేదు. ‘విషయాం’ తారైతే చాలు మరి. చకచకా సినిమా సాగిపోద్ది. అలాంటప్పుడు సినీ నట గ్రంథాలనదగ్గ సూపర్ స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజుల జీవితాలూ తరచి చూడదగిన బయోపిక్‌లే. వారివారి వారసులు మహేష్, ప్రభాస్‌లు సినిమా కదనరంగంలో విజయదుందుభి మోగిస్తూ అగ్ర తారలుగా ఊపుమీదున్నవారే! మరి అలాంటప్పుడు తండ్రి కృష్ణ, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజులపై బయోపిక్‌లు తీస్తే ఎవరికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు. నోడౌట్... బాక్సాఫీస్‌కు మోత మోగిపోద్ది. సో, ప్రొసీడ్! ఇక్కడ ఈ నటుడి ప్రస్తావన తేకపోతే ఈ వ్యాసానికి వంద మార్కులు పడబోవు. స్వయంకృషి విత్తుతో మొలకెత్తి... ఈయన నటనా వైవిధ్య విన్యాసాలతో మెలమెల్లగా శిరసెత్తి... డాన్సింగ్ తోడుగా విలక్షణంగా ఎదిగి... శిఖరంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి. ఆయన కృషి... నటుడిగా అంచెలంచెలుగా ఎదిగిన వైనం... ఒక పూల వనంలా విస్తరించిన సంవిధానం... అన్నీఅన్నీ యువతకు పాఠమే! ఎంచుకున్న రంగం పట్ల ఫ్యాషన్‌తో పట్టుదలతో ముందుకు ఒక అడుగేస్తే అది వంద అడుగుల అందనంత ఎత్తుకు తీసుకుపోతుందనే నగ్నసత్యాన్ని ప్రాక్టికల్‌గా నిరూపించిన వారిలో మెగా నటసింహం చిరంజీవి మనముందే మెదులుతున్నారు. తప్పక ఈ మెగా హీరో బయోపిక్ బ్లాక్‌బస్టర్‌కి బాపులా తయారై తీరుందని అభిమానులు తలపోస్తున్నారు. చూద్దాం... రేపేం జరుగుతుందో...? ఒక ‘జోనర్’లో సినిమా హిట్టయితే వరసగా అదే జోనర్‌లో అలాంటి సినిమాలపై సినీమేకర్స్ మోజు చూపడం.. ఆ దిశగా నిర్మాణపరమైన పనులు చేపట్టడం సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమే! కానీ, ఈ ‘బయోపిక్’ కానె్సప్ట్ చిత్రాల విషయానికివస్తే మాత్రం... పైన పేర్కొనబడిన ప్రసిద్ధ తారాగణంతో సినిమాలు తీస్తే... ప్రేక్షకాదరణకేం ఢోకా ఉండదు. బాక్సాఫీస్ ‘గలగల’లాడిపోద్ది! ఎటొచ్చీ ప్లానింగ్ పక్కాగా, ప్లాన్డ్‌గా ఉండాలి. కథాకథనాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే మరిన్ని సక్సెస్‌లకి శ్రీకారం చుట్టొచ్చు. మరందుకే సినిమా తయారీదారులారా బయోపిక్‌లకు జీవంపోయండి. వారుచేసిన నట సేవలకు.. ఈ బయోపిక్స్‌లనే అవార్డులుగా చేసి... నిత్య నీరాజనాలుగా సహృదయంతో సమర్పించండి!
*