మెయిన్ ఫీచర్

ప్రత్యామ్నాయ వంటతో పోషకాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పప్పులు, కూరలు, పండ్లు, నూనెలు, ఉల్లిపాయలు, బియ్యం... ఇలా నిత్యావసర సరకుల ధరలన్నీ ఇపుడు కొండెక్కి కూర్చోవడంతో పేద, మధ్య తరగతి వారు కడుపునిండా తృప్తిగా భోజనం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. బతుకుబండికి అవసరమైన తిండి విషయంలో నేడు ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికధరలకు జడిసి అరకొరగా కొంటు న్న ఆహార పదార్థాలతో శరీరానికి అవసరమైన పోషకాలు లభించని దుస్థితి నేడు నెలకొంది. ప్రతి రోజూ భోజనంలోకి పప్పు లేనిదే చాలామందికి ముద్ద దిగదు. వందలకు వందలు వెచ్చించి కొనే పరిస్థితి లేకపోవడంతో కందిపప్పు, పెసరపప్పు అంటేనే జనం జడుసుకుంటూ వాటి జోలికి వెళ్లడం లేదు. పప్పులు అందుబాటులో లేకపోయినా చింతపండో, టమాటాలో కొనుక్కుని కాస్త చారో, పులుసో చేసుకుందామన్నా వీలు కావడం లేదు. కూలీనాలీ చేసుకునే వారే కాదు, ఒక మోస్తరుగా జీతాలు తెచ్చుకునే ఉద్యోగస్తులు సైతం నిత్యావసర సరకుల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ధరలు పెరిగాయని దిగాలు పడడం కన్నా, మంచి పోషకాలు లభించే ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలపై మాత్రం ఎవరూ దృష్టి సారించడం లేదు. ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న’ట్లు చౌకగా లభించే కొన్ని ఆహార పదార్థాలపై చాలామంది దృష్టి సారించడం లేదు. విదేశాల నుంచి మనకు దిగుమతైన ఓట్స్, ఆలివ్ ఆయిల్, ఆపిల్స్, ఫాస్ట్ఫుడ్ వంటి వాటిలోనే పోషకాలున్నాయని భావిస్తూ మనవైన పంటలను చిన్నచూపు చూస్తున్నారు.
మన ప్రాంతంలో పండే రాగులు, జొన్నలు, కొర్రలు వంటి ఆహార ధాన్యాల్లోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయన్న వాస్తవాన్ని నేడు చాలామంది మరచిపోతున్నారు. వీటిని తింటూ ఒకప్పుడు పాత తరం వారు ఎంతో ఆరోగ్యంగా, రోగాలకు దూరంగా ఉండేవారు. పప్పులు, బియ్యం, టమాటా, చింతపండు వంటి వాటికి ప్రత్యామ్నాయంగా వండుకునే వీలున్నా ఆ విషయం పట్టించుకోవడం లేదు. అధికధరలకు కళ్లెం వేసే పరిస్థితి ఎలాగూ లేదు గనుక తక్కువ ధరకు లభించే ప్రత్యామ్నాయ ఆహార పంటలపై ఆసక్తి పెంచుకోవాలని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు. సబ్సిడీ ధరలకు కందిపప్పు, ఉల్లిపాయలు కొనుక్కోవాలని రైతుబజార్లలో, చౌకడిపోల వద్ద గంటలకొద్దీ ‘క్యూ’లో నిలబడి సమయాన్ని వృథా చేసుకునే బదులు ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలపై దృష్టి సారించడం ఉత్తమం. అందుబాటు ధరల్లో, అవే పోషకాలు లభించే జొన్నలు, రాగులు, కొర్రలు కొనుగోలు చేసుకుంటే ఆర్థిక భారం అంతగా పడదు. సమతుల ఆహారం కూడా అందే అవకాశం ఉంటుంది.
పప్పులకు బదులు..
ఖరీదైన కందిపప్పు, పెసరపప్పుకు బదులు వంటల్లో శెనగలు, బొబ్బర్లు, చిక్కుడు, ఉలవలు వంటివి వాడొచ్చు. వంటల్లో పులుపు కోసం టమాటాలు, చింతపండుకు బదులు నిమ్మకాయ రసం వాడితే అదే రుచిని ఆస్వాదించే వీలుంది. పులుపు కోసం ఉసిరి, నారింజ, దబ్బకాయలు వాడితే ఖర్చు బాగా తగ్గుతుంది. బియ్యం, గోధుమలకు బదులు జొన్నలు, కొర్రలు వంటి వాటితో అన్నం, రొట్టెలు, దోశలు చేసుకుంటే విలువైన పోషకాలు అందుతాయి. కందిపప్పుకు బదులు చిక్కుడు గింజలు, సోయాబీన్స్ వాడితే బాగుంటుంది. ఉల్లిపాయలకు బదులు క్యాబేజీ తొక్కును వాడవచ్చు. వంటల్లో గ్రేవీ కోసం ఆనపకాయను వినియోగించవచ్చు. అధిక ధరలకు లభించే కూరగాయలకు బదులు ముల్లంగి, కంద, కర్ర పెండలం వాడితే అన్నివిధాలా కలిసివస్తుంది. మధుమేహానికి ప్రధాన కారణమైన వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా జొన్న అన్నం, రాగి జావ వంటివి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ఉత్తమం. హార్లిక్స్, బోర్నవిటా అంటూ ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా సజ్జలు, రాగులు, సగ్గుబియ్యంతో చేసే జావలను తాగడం మంచిది. పిల్లలకు పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ వంటి ఫాస్ట్ఫుడ్ తినిపించే బదులు తృణధాన్యాలతో చేసిన జావలు, వంటకాలను అలవాటు చేస్తుండాలి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాలు, ఇతర పోషకాలు సజ్జలు, కొర్రలు, జొన్నల్లో పుష్కలంగా లభిస్తాయి. అధిక బరువును తగ్గించేందుకు రాగులు, రక్తపోటును నివారించే సజ్జలు, మధుమేహాన్ని అరికట్టే కొర్రలను తీసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. జొన్నలతో చేసే వంటకాలు తినేవారు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. గుండెజబ్బులు, కొవ్వు, మధుమేహం, మలబద్ధకం వంటివి మన దరిచేరకుండా ఉంటాయి. మొలకెత్తిన రాగులు, సజ్జలు, సోయాబీన్, బొబ్బర్లు, వేరుశెనగ, బఠానీలను కాస్త నూనెలో వేయించి తింటే అల్పాహారం పేరిట టిఫిన్ల కోసం చేసే అనవసర ఖర్చును నియంత్రించుకోవచ్చు. మనవైన తృణధాన్యాల పట్ల చిన్నచూపు చూడడం మానేసి, వాటిని వినియోగించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇన్నాళ్లూ జనం ఒకే రకమైన ఆహార పదార్థాలకే అలవాటు పడి వాటివైపే మొగ్గు చూపడంతో వ్యాపారులు,దళారులు కృత్రిమ కొరత సృష్టించి ఊహించని రీతిలో ధరలు పెంచేస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ తగ్గితే ధరలు కూడా దిగివచ్చే పరిస్థితులూ తప్పవు. ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలపై వినియోగదారులు దృష్టి సారిస్తే మార్కెట్‌లో ధరలు కొంతలో కొంతయినా తగ్గే అవకాశాలూ ఉంటాయి.
*