మెయిన్ ఫీచర్
సినిమాల్లో రిజర్వేషన్లా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సినిమాల్లో రిజర్వేషన్లు?
ఈ డిమాండ్ కొత్తదేం కాదు. హైదరాబాద్‌లో సినిమా నిర్మాణం పెరుగుతున్న రోజుల్లో ఫైటర్స్ విషయంలో బైటకి వచ్చింది. మద్రాసు నుంచి ఫైటర్స్‌ని తీసుకొస్తున్నారనీ, స్థానికులకు అవకాశాలు ఇవ్వాలనీ గొడవ జరిగింది. తర్వాతి కొన్ని క్రాఫ్టుల్లో స్థానికులకు రిజర్వేషన్ వుండాలనీ డిమాండ్లు వచ్చాయి. తర్వాత నెమ్మదిగా ఆ సమస్యలు సద్దుమణిగాయి. తెలంగాణా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో నటీనటులకు స్థానికంగా వున్న వారికి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్స్ వచ్చాయి.
ఈ సందర్భంలో డార్విన్ సిద్ధాంతం గుర్తుకు తెచ్చుకోవాలి. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ప్రపంచంలో బలమైన జీవి బతుకుతుంది.
సినిమా ప్రపంచంలో బలమైన అంటే, బలమైన ఆకాంక్షతో ప్రయత్నం చేసేవారని అర్థం చేసుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ అని అంటుంటారు. నిజానికి ఇదొక పరిశ్రమ కాదు. ఇందులోకి ఎవరైనా రావొచ్చు. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమీలేదు. సినిమాల్లో రాణించాలనుకునేవారు తమతమ వ్యూహాలతో ప్రవేశించి ఓపికగా వుంటూ, క్రమశిక్షణతో మెలిగితే విజయావకాశాలు వుంటాయి.
తెలంగాణ 1948 వరకు నైజాం అనే ప్రత్యేక దేశం. నవాబు మాతృభాష ఉర్దూ. ఆ భాషలోనే స్కూల్స్. తెలుగు భాష నేర్చుకోవడానికి అవకాశాలు తక్కువే. కొన్ని పండిత కుటుంబాలు స్వచ్ఛందంగా తెలుగు నేర్పేవి. అటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసు నాటకాలు రాశాడు. సినిమా పరిశ్రమ మొదలైన తొలినాళ్లలో మద్రాసు వెళ్లాడు. సినిమాల్లో పాటలు రాశాడు.
సినిమాల్లో పాటలు రాసిన తొలి కవిగా ప్రసిద్ధుడయ్యాడు. మద్రాసులోనే ఎందరో తెలుగు కవులు వుండగా నైజాం దేశం నుంచి వెళ్లిన చందాల కేశవదాసుకు తొలి సినీ కవిగా అవకాశం ఎలా వచ్చింది. అదే బలమైన ఆకాంక్ష. దానితోనే విజయం సాధించాడు.
ఇక పైడి జైరాములనాయుడు హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లాడు. హిందీలో పెద్ద హీరో అయ్యాడు. దాదాఫాల్కే అవార్డు సాధించాడు. ఎలా సాధ్యం? అదే సర్వవైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ సూత్రం.
మనిషి కొండ ఎక్కాలంటే కొండ దగ్గరకు వెళ్లి కిందనుంచి ఎక్కడం మొదలుపెట్టాలి. అంతేగాని కొండ మన దగ్గరకు రాదు.
ఇప్పుడు కొత్తగా తెలుగు అమ్మాయిలకు 75శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. అది కూడా కేరెక్టర్ రోల్స్ అయిన అక్క చెల్లెలు, అత్త, వదిన, మరదలు వంటి వాటికి కాదు. హీరోయిన్ వేషాల్లో రిజర్వేషన్ కావాలట.
పాత రోజుల్లోకి వెళితే... డైరెక్ట్‌గా హీరోయిన్లు అయింది ఎందరు? అంజలీదేవి నాట్యతారగా, వ్యాంప్ వేషాలు వేస్తూ కథానాయికగా ఎదిగింది. వైజయంతిమాల సైతం బాలచందర్ అనే హాస్య నటుడి సరసన నటించింది. మహానటి సావిత్రి పాతాళభైరవి, సంసారం వంటి చిత్రాల్లో చిన్న పాత్రలతో నట జీవితం మొదలుపెట్టింది. పెళ్ళిచేసి చూడులో జోగారావు అనే హాస్య నటుడికి జోడీగా నటించి ఆ తర్వాతే హీరోయిన్ అయింది. మరొక మహానటి వాణిశ్రీ చెలికత్తెల వంటి సహాయ పాత్రల్లో రాణించి ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే కథానాయికయి అగ్రనటి అనిపించుకుంది. జయసుధ, జయప్రదలైనా తొలినాళ్లల్లో చిన్న వేషాలే వేసి కథానాయికలుగా ఎదిగారు.
మనదగ్గర ప్రతిభ వుండొచ్చు. అంతమాత్రాన పిలిచి ఎవరు అవకాశాలు ఇస్తారు? సినిమా నిర్మాణంలో గుర్తింపు పొందాలని దశాబ్దాల తరబడి పరిశ్రమిస్తూ ఎందరో రచయితలు, సహాయ దర్శకులు, నటులు, ఇతర క్రాఫ్టులవాళ్లు ఎదురుచూస్తుంటారు. కొందరికే అవకాశాలు వస్తాయి. ప్రతిభ వున్నవాళ్లు రాణిస్తారు. అందలం ఎక్కుతారు.
ప్రస్తుత డిమాండ్ తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ వేషాల్లో రిజర్వేషన్ గురించి. మన దేశంలో వెనుకబడిన కులాలకు రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. తెలుగు ఒక భాష. భాషకు రిజర్వేషన్లు వుంటాయా?
అప్పట్లో వైజయంతిమాల, వహీదారెహమాన్, పద్మినీ, బి.సరోజ, శ్రీదేవి, జయప్రదలు, హేమామాలిని బాలీవుడ్‌ని ఏలారని చెప్పొచ్చు. హిందీ హీరోయిన్లు వీళ్లని బాయికాట్ చేశారా? దక్షిణాది హీరోయిన్లకేనా అవకాశాలు? మా సంగతేంటి? మాకు రిజర్వేషన్ వుండాలని డిమాండ్ చేశారా?
సినిమా నిర్మాణం పక్కా వ్యాపారం. నిర్మాత, దర్శకులు ఎవరికి డిమాండ్ వుంటుందో, ఎవరివల్ల వ్యాపారం జరుగుతుందో, ఏ నటీనటులుంటే ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూస్తారో వారికే అవకాశం ఇస్తారు. కోట్లు కుమ్మరిస్తారు. అంద చందాలు వున్న హీరోయిన్స్‌నే తీసుకుంటారు. వాళ్లు పంజాబీ వాళ్లయినా, మరాఠీ భామలైనా, మలయాళ కుట్టీలైనా, అరవ అమ్మాయిలైనా, తెలుగువాళ్లయినా ఎవరైనా కావొచ్చు. సినిమాల్లో రాణించాలంటే అంద చందాలతోపాటు అదృష్టం కూడా కావాలేమో? నటీనటులు కావాలంటే నటన నేర్చుకోవాలిగా. చాలా నటన నేర్పే శిక్షణ ఇచ్చే సంస్థలున్నాయి. థియేటర్ ఆర్ట్స్ కోర్సులున్నాయి. పూనా, మద్రాస్ ఇన్‌స్టిట్యూషన్స్ వున్నాయి. ఇవన్నీ లేనప్పుడు స్టేజీ నాటకాలు వేసి కదా సినీ నటీనటులయ్యారు. నాగయ్య, నాగేశ్వరరావు, రామారావు, రంగారావు, జగ్గయ్య వంటి మహానటులు రంగస్థలం నుంచి సినిమాల్లోకి వచ్చారు. చిరంజీవి, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ ఫిలిం ఇన్‌స్టిట్యూషన్స్‌లో నటన నేర్చినవారే. యస్వీ రంగారావు, సావిత్రి, జానకి, కన్నాంబలు ఒక దశలో తమిళ సినిమాలో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగినవారే. ఎయన్నార్ 30 తమిళ సినిమాల్లో హీరో అని చాలామందికి తెలియదు. తమిళ దేవదాసు మధురై చింతామణి థియేటర్‌లో 66 వారాలు ప్రదర్శించబడిందని ఎందరికి తెలుసు?
కళకు భాషాభేదాలు సృష్టించడం మూర్ఖత్వం. సినిమా అవకాశాలు ప్రతిభను నిరూపించుకుంటే వస్తాయి గాని పడక గదులు సోపానాలు ఎంతమాత్రం కావు.